అధ్వాన భోజనం | No Eggs Supply in Midday Meals Prakasam | Sakshi
Sakshi News home page

అధ్వాన భోజనం

Published Fri, Dec 14 2018 1:14 PM | Last Updated on Thu, Jul 11 2019 5:40 PM

No Eggs Supply in Midday Meals Prakasam - Sakshi

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేస్తున్న ఫుడ్‌ కమిషన్‌ సభ్యులు

ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ : మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఎందుకు వడ్డించలేదు?
ప్రధానోపాధ్యాయుడు: నిజం చెప్పమంటారా.. అబద్దం చెప్పమంటారా సార్‌?
ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ : నిజమే చెప్పు.. గుడ్లు ఎలా ఉంటున్నాయి?
ప్రధానోపాధ్యాయుడు: ప్రభుత్వం సరఫరా చేసే గుడ్లు మానవమాత్రులు తినేవి కాదు సార్‌. అధ్వానంగా ఉంటున్నాయి.
ఉలవపాడు మండలం రామాయపట్నం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోగురువారం మధ్యాహ్న భోజన సమయంలో రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి మధ్య జరిగిన సంభాషణ ఇది.

ఉలవపాడు:  ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సక్రమంగా లేదనే అంశంపై ఇటీవల హైకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో గురువారం రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ జేఆర్‌ పుష్పరాజ్‌తో పాటు కమిషన్‌ సభ్యులు ఉలవపాడు మండలం రామాయపట్నం గ్రామానికి వచ్చారు. మధ్యాహ్న భోజన సమయంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని తనిఖీ చేశారు. దీంతోపాటు   రెడ్డిపాలెం ప్రాథమిక పాఠశాల, మరో రెండు అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా సభ్యులు తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా రామాయపట్నం పాఠశాల హెచ్‌ఎం ఆదిశేషును విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, మెనూపై కమిషన్‌ చైర్మన్‌ ప్రశ్నించారు. గుడ్లు ఎందుకు పెట్టలేదని అడగగా ఏజన్సీ వారు ఇవ్వడం లేదని హెచ్‌ఎం బదులిచ్చారు. కొద్ది రోజుల క్రితమే అయిపోయాయని తెలిపారు. నాసిరకం భోజనం గురించి ప్రశ్నించగా ఇక్కడి రాజకీయ పరమైన కుకింగ్‌ ఏజన్సీ కారణంగా ఈ పరిస్థితులు వచ్చాయని తెలిపారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను అటెండరుగా అయినా వెళ్తానని సమాధానమిచ్చారు. భోజన నాణ్యతపై ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు ఇక్కడ లేరని చెప్పారు. బియ్యం కూడా దారుణంగా ఉన్నాయని రామాయపట్నం డీలర్‌ వచ్చి తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు అంటున్నారని, స్టాక్‌ పాయింట్‌ కూడా తీసుకురావడం లేదని తెలిపారు. అనంతరం పాఠశాల రికార్డులు పరిశీలించిన సభ్యులు ఇద్దరు ఉపాధ్యాయులు గైర్హాజరు కావడం.. వారి సెలవు చీటీలో తేదీ వేయకుండా కేవలం సంతకాలు పెట్టి ఉండటం గమనించారు. బ్రహ్మయ్య అనే ఉపాధ్యాయుడు మెటర్నటీ లీవు అని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉపాధ్యాయులు రెడీమేడ్‌ లెటర్లు రాసిపెడుతున్నట్లు గుర్తించారు.

అంతటా అధ్వాన భోజనం
పల్లెపాలెం పాఠశాల తనిఖీ చేయగా కందిపప్పు అ«ధ్వానంగా ఉందని గుర్తించారు. వీటిని తనిఖీ చేయాలని లీగల్‌ మెట్రాలజీ అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజనం వండే గదులు కూడా పరిశుభ్రంగా లేవని గుర్తించారు. ఇక అంగన్‌వాడీల్లో సైతం పౌష్ఠికాహారం సక్రమంగా లేదని గుర్తించారు. గుడ్లులేని విషయాన్ని తెలియచేశారు. ఇక గర్భవతులు తిని ఇంటికి వెళ్లారని వారు తెలపడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భవతుల, బాలింతల కార్డులు సక్రమంగా నిర్వహించడం లేదని గుర్తించారు. అన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు గుడ్లు ఈ మధ్య దాకా వచ్చాయని చెప్పడంతో ఎందుకు అబద్దాలు చెపుతారు.. పైనుంచి రాకపోతే మీరు ఈ మధ్య వరకు పెట్టామని అబద్దాలు చెపితే పిల్లలు కూడా అదే నేర్చుకోరూ..? అంటూ చైర్మన్‌ ప్రధానోపాధ్యాయులను మందలించారు. నోడల్‌ ఆఫీసర్‌గా ఉన్న ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలు ఎక్కడ ఉన్నాయో కూడా ఆయనకు తెలియదన్నారు. ఇక నాసిరకంగా గుడ్లు పంపిణీ జరగడం గురించి, తెలిపిన ప్రధానోపాధ్యాయురాలి నుంచి పంచనామా రిపోర్టు రాయాలని తహశీల్దార్‌ పద్మావతికి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఫుడ్‌ కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీ రవిబాబు, కమిషన్‌ సభ్యులు కృష్ణమ్మ, డాక్టర్‌ గీత, ఎల్‌వీ వెంకటరావు, ఎం.శ్రీనివాసరావు, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, డీఈఓ సుబ్బారావు, ఐసీడీఎస్‌ పీడీ విశాలాక్షి, డీడీలు లక్ష్మీదుర్గ, లక్ష్మీసుధ, డీఎం లక్ష్మీపార్వతితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement