పేదల బియ్యం స్వాహా
భారీగా అమ్ముకున్న వైనం
మిల్లర్లు, డీలర్లు, అధికారులు కుమ్మక్కై సొమ్ముచేసుకున్నారు
విజిలెన్స్ తనిఖీల్లో రూ.8.19 కోట్ల బియ్యం మాయం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యమో... ధనార్జనో తెలియదు. పేదల ఆకలి తీర్చే బియ్యాన్ని పెద్దల పరం చేస్తున్నారు. ఆ పెద్దల్లో ప్రభుత్వ ప్రతినిధులు కూడా పాలుపంచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రేషన్ దుకాణాలు, వసతిగృహాలు, మధ్యాహ్న భోజనం కోసం కేటాయించిన బియ్యాన్ని అమ్మి జేబులు నింపుకున్నారు. అందుకు తాజా సంఘటనలే నిదర్శనం. గత ఎడాది ప్రభుత్వం 100కుపైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాల ద్వారా 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. అలా సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించి నిల్వచేశారు. మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని బియ్యంగా చేసి (సీఎంఆర్) ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది. ధాన్యాన్ని బియ్యంగా మార్చి గత ఎడాది నవంబర్‌లోపు ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంది. 1.25 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యానికి సంబంధించి 84,400 మెట్రిక్ టన్నులు బియ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 79 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రం సరఫరా చేశారు.
మిగిలిన 5,100 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వటంలో మిల్లర్లు కాలయాపన చేశారు. కావలి, నెల్లూరు ప్రాంతాల్లో సుమారు 10 మంది మిల్లర్లు తీసుకున్న ధాన్యం బయటమార్కెట్‌లో విక్రయించారు. పౌరసరఫరాలశాఖ అధికారులు సరఫరా చేసిన ధాన్యాన్ని మిల్లర్లు బయట విక్రయించుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసినా అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకుని నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపించాయి. అధికారులు మిల్లర్ల నుంచి కమీషన్ పుచ్చుకుని సామర్థ్యంలేని రైస్‌మిల్లులకు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సరఫరా చేశారు. మిల్లర్లకు ఇచ్చిన సమయం పూర్తయి రెండు నెలలు దాటినా ఎటువంటి సమాచారం లేకపోవటంతో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. ఆ మేరకు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. నాలుగేళ్ల కిందట మిల్లులకు ధాన్యం సరఫరా చేశారు.
బియ్యాన్ని బొక్కేశారు
జిల్లాలో రూ.8.19 కోట్లు విలువ చేసే 3,413 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. జిల్లాలో సోమవారం విజిలెన్స్ అధికారులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు రూరల్ మండల పరిధి అల్లీపురంలోని శ్రీదేవి ఎంటర్‌ప్రైజెస్, వెంకటలక్ష్మి రైస్‌మిల్, లక్ష్మీవాసవి వెంకటసత్యసాయి రైస్‌మిల్, కావలిలోని శ్రీమాలతి మోడ్రన్ రైస్‌మిల్, పొదలకూరులోని మరో రైస్‌మిల్లులో తనిఖీలు నిర్వించారు. రైస్‌మిల్లుల్లో ఉండాల్సిన బియ్యం మాయమైనట్లు గుర్తించారు. రేషన్‌దుకాణాలు, వసతిగృహాలు, పాఠశాలలకు తరలించకుండా కొందరు మిల్లర్లు, అధికారులు, డీలర్లు కలిసి విక్రయించుకున్నట్లు గుర్తించారు. ఆమేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ వెంకటనాథరెడ్డి వెల్లడించారు