వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
♦ పేద విద్యార్థుల సంతోషం
♦ వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
♦ కరువు వేళ సర్కారు నిర్ణయంతో పేద పిల్లల సంతోషం
♦ జిల్లాలో 1.99 లక్షల విద్యార్థులకు ప్రయోజనం
పాపన్నపేట/సిద్దిపేట: విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు చదువు నేర్చే పిల్లల ఆకలిదప్పులు తీర్చే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భుజానకెత్తుకున్నాయి. కరువు మండలాల్లో వలసల నివారించేందుకు, ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించడం పేదల ఇంట ఆనందాన్ని నింపనున్నది. ఈ నిర్ణయం దరిమిలా మెదక్ జిల్లాలోని 2,365 ప్రభుత్వ పాఠశాలల్లో 1,99,570 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
ఆ భోజనమే కడుపు నింపుతోంది..
సర్కార్ బడుల్లో డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించేందుకు, పౌష్టికాహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖరరెడ్డి కాలంలో 2008లో అన్ని తరగతులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఈ లక్ష్య సాధన దిశగా ఈ పథకం సత్ఫలితాలనిచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా ఘోరమైన కరువు పరిస్థితులు కమ్ముకొన్నందున పల్లె జనాలు బతుకు దెరువు కోసం వలస బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో చిన్న పిల్లలను, ముసలి వాళ్లను ఇళ్ల వద్ద వదిలి జవసత్వాలు ఉన్న వాళ్లంతా వలస బాట పట్టారు. దీంతో పిల్లలు కలో..గంజో తాగుతూ పాఠశాలల కు వస్తున్నారు. మధ్యాహ్న భోజనం కొంత వరకు వారి ఆకలి తీరుస్తుంది.
సెలవుల్లోనూ అన్నం. సంతోషమే!
ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్న నేపథ్యంలో పిల్లలు తల్లిదండ్రుల వెంట వలస వెళ్లే ప్రమాదముందని భావించిన సర్కార్ వేసవి సెలవుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని తాజాగా నిర్ణయించింది. చదువు చెప్పడంతో పాటే బాధ్యత తీరిపోదని, పిల్లలకు ఆనందాన్ని, విజ్ఞానాన్ని పంచుతూనే పాఠశాలలను వేసవి విడుదుల్లా తయారు చేయాలని, ఈ దిశగా మధ్యాహ్న భోజనంతో పిల్లల కడుపు నింపాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసింది. కరువు మండలాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నందున మెదక్ జిల్లాలోని 46 మండలాల్లో ఈ పథకం ద్వారా 1,99,570 మంది విద్యార్థులకు లబ్ధి కలగనుంది.
42 రోజుల పాటు లబ్ధి
ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి. అంటే 42 రోజుల పాటు ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తారు. అయితే వంట బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై ఇంకా స్పష్టత ఏర్పడలేదు. వేసవి సెలవుల్లో టీచర్లు బడికి వచ్చే అవకాశం లేనందున విద్యా వలంటీర్లు లేదా అంగన్‌వాడీలకు నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం వంట చేస్తున్న సిబ్బందికే వంటలు వండే బాధ్యతలు అప్పగిస్తారని కూడా వినవస్తోంది. పర్యవేక్షణ బాధ్యత మాత్రం ప్రధానోపాధ్యాయులకు అప్పగించే అవకాశం ఉంది. ఈ విషయమై జిల్లా ఉపవిద్యాధికారి శ్యాంప్రసాద్‌రెడ్డిని సంప్రదించగా సాధారణంగా విద్యా సంవత్సరంలో పది నెలల పాటు వంట సిబ్బందికి వేతనాలు చెల్లిస్తుంటామని, సెలవుల్లో వంటచేస్తే అదనంగా చెల్లిస్తామన్నారు.
నానమ్మ వద్దే ఉంటున్నా..
నాన్న రాములు చిన్నప్పుడే చనిపోయాడు. ఉన్న కుంటల పాటి భూమి కడుపు నింపడం లేదు. దీంతో అమ్మ సుజాత బతుకు దెరువుకు పట్నం వెళ్లింది. నానమ్మ కిష్టమ్మ వద్దే ఉండి చదువుకుంటున్నా. స్కూల్లో పెట్టే అన్నమే తిని ఆకలి తీర్చుకుంటున్నాను.
- సురేష్, 9వ తరగతి, కొడుపాక
వలసబాటలో అమ్మానాన్న..
పంటలు పండక బతుకుదెరువు కష్టమైంది. అమ్మనాన్నలు బాలమ్మ, కనకయ్య పట్నం వలస వెళ్లారు. అక్క వీణ, నేను కలిసి అమ్మమ్మ శ్యామమ్మ వద్ద ఉంటున్నాం. సెలవుల్లో అన్నం పెడితే మాకు ఆకలి సమస్య తీరినట్టే. - ప్రవీణ్, 9వ తరగతి, కొడుపాక
సెలవుల్లో భోజనం సంతోషమే..
సెలవుల్లో భోజనం పెడితే మంచిదే. ఇక్కడ బతుకుదెరువు లేక మా అమ్మానాన్న వలసపోయారు. పిన్ని వంట చేసి పెడితే నేను, అక్క ధరణి ఇక్కడ ఉంటూ చదువుకుంటున్నాం. సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం వల్ల మా పిన్ని మా పోషణ భారం తగ్గుతుంది.
- సాయిబాబ, 9వ తరగతి, కొడుపాక
వలస తప్పింది..
అమ్మ పోచమ్మ, నాన్న మాణయ్య పట్నం వలస వెళ్లారు. తమ్ముడు దివాకర్, నేను కొడుపాక స్కూళ్లో చదువుకుంటున్నాం. నానమ్మ లక్ష్మికి చేతగాదు. ఒక పూట వంట జేస్తే మరో పూట కష్టం. అందుకే సెలవుల్లో పట్నం వెళ్దామనుకుంటున్నం. సెలవుల్లోనూ బడిలో భోజనం పెడతారని తెలిసింది. చాలా సంతోషం. - గూడెం శైలజ, 9వ తరగతి, గాజులగూడెం