వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
* హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో అమలుకు సర్కారు నిర్ణయం
* మండల, నియోజకవర్గ కేంద్రాల్లోనే గురుకుల పాఠశాలల ఏర్పాటు
* జూన్ నుంచే రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించేలా చర్యలు
* విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం కడియం
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని సర్కారు నిర్ణయించింది. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాల్లో ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు.
మధ్యాహ్న భోజన పథకం అమలు, రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు అంశాలపై సచివాలయంలో శనివారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం సమీక్ష వివరాలను కడియం వివరించారు. కరువు పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని మరో 42 రోజుల పాటు కొనసాగించాలని కేంద్రం సూచించినట్లు చెప్పారు. అయితే ప్రకటించిన 231 కరువు మండలాలతో అన్ని ప్రాంతాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని, 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలిపారు.
సెలవు రోజుల్లో ఈ పథకం అమలు, బాధ్యతల అప్పగింతపై ఈ నెల 18న అన్ని జిల్లాల కలెక్టర్లతో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్ణయిస్తామన్నారు. సెలవు రోజుల్లో ఉదయం 9 గంటలకు విద్యార్థులు బడికి వస్తే గంట పాటు ఆటపాటలు గానీ, తరగతులు గానీ నిర్వహించి, 10 గంటలకు భోజనం పెట్టి 11 గంటల్లోపు ఇళ్లకు పంపేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.
మండల కేంద్రాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు
కేజీ టు పీజీ ఉచిత విద్య అమల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం రాష్ట్రంలో 250 గురుకుల (రెసిడెన్షియల్) పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని కడియం శ్రీహరి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రెసిడెన్షియల్ స్కూల్స్ మండల లేదా నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం పాఠశాలలు ఉన్న ప్రాంతంలో కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ నెల 20న ఆయా శాఖల అధికారులతో జరిగే సమావేశంలో పాఠశాలలు ఏర్పాటు చేసే ప్రాంతాలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒక్కో గురుకుల పాఠశాలకు రూ.22కోట్లు వెచ్చించనున్నామని, ఏ ప్రాంతంలోనైనా ప్రభుత్వ స్థలం లేకపోయినట్లయితే పాఠశాల కోసం ఐదెకరాల భూమిని కొనుగోలు చేస్తామన్నారు. ఒక్కో పాఠశాలకు 640 మంది చొప్పున మొత్తం 1.60 లక్షల మంది విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకునే అవకాశం లభిస్తుందన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలను 2016-17 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామన్నారు.
తొలి ఏడాది 5 నుంచి 8 తరగతులు, రెండో సంవత్సరం 9, 10, మూడో సంవత్సరంలో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న డిగ్రీ కాలేజీల్లోనూ తొలి ఏడాది ఫస్టియర్‌ను ప్రారంభించి మూడేళ్లలో పూర్తిస్థాయిలో నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు.