కరువు.. భోజనం!
వారం ఆగాల్సిందే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వేసవిలోనూ మధ్యాహ్న భోజనం పెడతామని, జిల్లాలోని 22 కరువు మండలాల్లో దీన్ని అమలు చేస్తామని సర్కారు గతంలోనే ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలూ వచ్చాయి. అయితే.. విపరీతమైన ఎండలు, వడగాలుల నేపథ్యంలో షెడ్యూల్ కన్నా వారం రోజుల ముందే అన్ని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. వచ్చే జూన్ 13న పాఠశాలలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో ముందస్తు సెలవులు వచ్చినా సాధారణ షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 23 నుంచి కరువు భోజనం పెడతామని, ఈ వారం రోజులపాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఉండదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడమే కారణంగా తెలుస్తోంది. వారం రోజుల సెలవులు అదనంగా ప్రకటించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు మధ్యాహ్న భోజనం ఎప్పటి నుంచి పెట్టాలనే దానిపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో ఈనెల 23 నుంచే అమలు చేయాలనే ఆలోచనలో జిల్లా విద్యాశాఖ అధికారులున్నారు.
ఎంపీడీఓలు, ఎమ్మార్వోలు, ఆర్డీఓల పర్యవేక్షణలో...
వేసవి సెలవుల్లో కరువు మండలాల్లో పెట్టే మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించే బాధ్యతలు జిల్లా రెవెన్యూ వర్గాలకు అప్పగించారు. వాస్తవానికి జిల్లాలోని 22 కరువు మండలాల్లో మొత్తం 970 పాఠశాలల్లో ఉన్న దాదాపు 80వేల మంది విద్యార్థులకు వేసవి సెలవుల్లో భోజనం పెట్టాల్సి ఉంది. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు అందుబాటులో ఉండరు. ఈ నేపథ్యంలో ఈ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న దానిపై సందేహం నెలకొంది. టీచర్లకే అప్పగించి వారికి అదనపు సౌకర్యాలు ఇప్పించాలా.. లేక.. ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి స్వచ్ఛందంగా భోజనాన్ని పెట్టించాలా అనే అంశాలపై చర్చ జరిగింది.
చివరకు విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన నిర్ణయం మేరకు వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో అంగన్‌వాడీ వర్కర్లను బాధ్యులుగా చేసి వారి చేత మధ్యాహ్న భోజనం పెట్టించాలని నిర్ణయించారు. వంట వండేది మాత్రం ఆయా పాఠశాలల్లో ఇప్పటివరకు వండుతున్న ఏజెన్సీలే. వారికే వంట బాధ్యతలు అప్పగించారు. వేసవి సెలవుల్లో వండినందుకు గాను కూడా ఆయా ఏజెన్సీలకు ఎప్పుడు చెల్లించే చార్జీలే చెల్లించాలని, ఎలాంటి అదనపు భత్యం ఇచ్చేది లేదని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది.
ఈ మేరకు ఆయా ఏజెన్సీల చేత వంట వండించాలని, బియ్యం బాధ్యతలు అంగన్‌వాడీ వర్కర్లకు అప్పగించాలని, మొత్తంగా పర్యవేక్షించే బాధ్యతలను రెవెన్యూ శాఖలకు అప్పగించాలని నిర్ణయించారు. ఆయా పాఠశాలల్లో వంట వండే ందుకు, పిల్లలు తాగేందుకు, ప్లేట్లు కడుక్కునేందుకు అవసరమైన నీటిని (నీటి సౌకర్యం లేని పాఠశాలల్లో) కూడా సరఫరా చేసే బాధ్యత వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులకే అప్పగించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
మేం సిద్ధం...
కరువు మండలాల్లోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. కలెక్టర్‌తో మాట్లాడి అన్నీ సిద్ధం చేసుకున్నాం. ముందస్తు సెలవుల్లో ఏం చేయాలన్న దానిపై మాకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నాం.
- చంద్రమోహన్, జిల్లా విద్యాశాఖాధికారి
వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం అమలయ్యే మండలాలు
యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, బీబీనగర్, తిప్పర్తి, మునుగోడు, చండూరు, మేళ్లచెరువు, చింతపల్లి, దేవరకొండ, కనగల్, బొమ్మలరామారం, భువనగిరి, భూదాన్ పోచంపల్లి, నకిరేకల్, మోతె, సంస్థాన్ నారాయణపురం, డిండి, చందంపేట, చౌటుప్పల్, మఠంపల్లి, తుర్కపల్లి.