మధ్యాహ్న భోజనంలో తేలు
సోమందేపల్లి : మధ్యా హ్న భోజనంలో తేలు ప్రత్యక్షమయిన సంఘటన శుక్రవారం మండలంలోని మండ్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దాదాపు 30 మంది విద్యార్థులకు భోజన ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం వడ్డించడం జరిగింది. విద్యార్థులు తినే సమయంలో ప్లేటులో తేలు కనిపించడంతో భయభ్రాంతులకు గురై ఈ విషయాన్ని వారు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. అక్కడికి చేరుకున్న సర్పంచ్ బైల ఆంజనేయులు విద్యార్థులను వైద్య పరీక్షల నిమిత్తం సోమందేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించారు. విద్యార్థులు క్షేమంగా ఉన్నారని తెలియడంతో అందరూ శాంతించారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని తల్లిదండ్రులు చెబుతున్నారు.
చర్యలు చేపడతాం
ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి చర్యలు చేపడతాం. భోజన ఏజెన్సీ నిర్వాహకుడు హనుమంతప్పను విచారించాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే కఠిన చర్యలు ఉంటాయని మండలంలోని అన్ని ఏజెన్సీల నిర్వాహకులకు హెచ్చరించాం. - ఆంజనేయులు నాయక్, ఎంఈఓ