విజ్ఞానంతోనే వికాసం
• దేశ పురోగమనానికి, యువత వికాసానికి విజ్ఞానమే మూలం
• ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ పునరుద్ఘాటన...
• ముగిసిన 104వ ప్లీనరీ
• 5 ప్రధాన, 30 ఉపభేటీలు..105వ ఇస్కా వేదిక భువనేశ్వర్
• సైన్స్, టెక్నాలజీ ప్రాధాన్యతతో పలు అంశాలపై చర్చలు
తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఐదు రోజు ల పాటు జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 104వ సదస్సు శనివారంతో ముగిసింది. యువత వికాసానికి, దేశ పురోగమనానికి విజ్ఞానాభివృద్ధే మూలమని సదస్సు పునరుద్ఘా టించింది. ఈనెల 3న ప్రధాని నరేంద్రమోదీ సదస్సును ప్రారంభించారు. ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు హర్షవర్దన్, సుజనాచౌదరి, ముగింపు సభలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు తదితరు లు పాల్గొన్నారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా 6వ మహిళా సైన్స్ కాంగ్రెస్, బాలల సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు కూడా జరిగాయి.
మైసూర్‌లో జరిగిన 103వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో ప్రతిపాదించిన 2035 విజన్ డాక్యుమెంటు ఆధారంగా దేశపురోభివృద్ధికి 12 రంగాలను నీతి ఆయోగ్ గుర్తించిందని, ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించిందని ప్రధాని మోదీ తన ప్రారంభోపన్యాసంలో చెప్పారు. కాగా, ‘సైన్స్ అండ్ టెక్నాలజీ– దేశ పురోభి వృద్ధి’ భావన(థీమ్)తో సాగిన ఈ ప్లీనరీ సమావేశాల్లో రోజుకు 5 ప్రధాన సమావేశాలు, 30 వరకు ఉప భేటీలు జరిగాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక ఆవిష్కరణల గురించి శాస్త్రవేత్తలు వివరించారు. వినూత్న సాంకేతిక పరిజ్ఞానం పోకడలను ప్రతిబింబించడంలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నూటికి నూరుపాళ్లు విజయవంతమైందనే చెప్పాలి. వచ్చే ఏడాది నిర్వహించాల్సిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల వేదికగా భువనేశ్వర్‌ను ఎంపికచేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 2017–18 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను, కార్యవర్గాన్ని ఎంపిక చేశారు.
పరిశోధనలకు నిధుల కొరత..
భారత్‌లో పరిశోధనలకు లేబొరేటరీలు, ఇతర వనరులతో పాటు నిధుల కొరత తీవ్రంగా ఉందనే అభిప్రాయం ఇస్కా 104 సమా వేశాల్లో వ్యక్తమైంది. రక్షణ, అంతరిక్ష పరిశోధనా రంగాల్లో దేశం సాధిస్తున్న ప్రగతి గురించి తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చలు జరిగా యి. ఇంధన, పారిశ్రామిక రంగాల్లో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలూ ప్రస్తావనకు వచ్చాయి. ఈ రంగాల్లో భారత్ ఇతర దేశాల కన్నా భిన్నమైన పరిశోధనలు ఏమీ తెరమీదకు రాలేదు. సోలార్ ఎనర్జీలో స్విట్జర్లాండ్, దుబాయ్ వంటి దేశాలు చౌకగా విద్యుత్ ఇచ్చే టెక్నాలజీని సెమినార్‌లో పరిచయం చేశాయి. కానీ మన దేశంలో మాత్రం ఇంకా సోలార్ సమస్యలే ఉన్నాయని, వీటిపై క్షేత్రస్థాయి పరిశోధనలు జరగాలని మన శాస్త్రవేత్తలు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధీకరణలో పలు దేశాలు నాణ్యమైన టెక్నాలజీని ఈ సదస్సు ద్వారా పరిచయం చేసే ప్రయత్నం చేశాయి. మన దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలనే అభి వృద్ధి చేసుకోలేదని ఒప్పుకోవాల్సి వచ్చింది. అణుథార్మికతపై జరిగిన సెమినార్‌లో చాలా మంది విదేశీ టెక్నాలజీని భారత్ ఎలా దిగుమతి చేసుకుంటోంది, వాటివల్ల ప్రయోజ నాలు ఏమిటి అనేది చెప్పారు.
జన్యు ఎడిటింగ్ చేరువవుతోంది...
ఆహారం నుంచి ఆరోగ్యం వరకూ మానవజాతి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కా రంగా భావిస్తున్న జన్యు ఎడిటింగ్ టెక్నాలజీ ఈ సైన్స్ కాంగ్రెస్ ద్వారా భారతీయులకు ఒకింత చేరువైంది. జన్యువుల్లో అతిసులువుగా మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం కల్పించే క్రిస్పర్ క్యాస్–9 టెక్నాలజీపై కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల్లో ఓ ముసాయిదా విధానాన్ని సిద్ధం చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సలహాదారు ఎస్.ఆర్.రావు శుక్రవారం ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిభను, నైపుణ్యతను మరోసారి చాటే భారత న్యూట్రినో అబ్జర్వేటరీపై ఈ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. భవిష్యత్తు అవసరాలకు పవన విద్యుత్తే ఆధారం కానుందని, భౌగోళిక సానుకూలత దృష్ట్యా పవన విద్యుత్తు ఉత్పత్తికి దేశంలో అనేక సానుకూలతలున్నాయని ఆ రంగంలోని శాస్త్రవేత్తలు వివరించారు. శాస్త్ర సాంకేతిక అంశాలతో పాటు ఉన్నత విద్యారంగం ఉన్నతికి తీసుకోవలసిన చర్యలపై యూజీసీ, న్యాక్ అధిపతులు, పలు యూనివర్సిటీల వీసీలు చర్చించారు.
పాత తీర్మానాల అమలు ఎక్కడ?
ప్రతి ఏటా సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరగడం సంతోషించదగ్గ విషయమే అయినా గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాల అమలు ఎంత అనేది ప్రశ్నార్థకం. సమస్యల్ని ఏకరవు పెడితే సరిపోదని ఏడాది కాలంలో ఏమి సాధించారో తెలియజేయాలని పలువురు కోరారు. కాగా సదస్సులో ఆరుగురు నోబెల్ బహుమతి గ్రహీతలు, పలువురు దేశ, విదేశీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. విలియమ్ ఎస్కో(అమెరికా), టకాకి కజిత(జపాన్), సెర్జి హరోష్ (ఫ్రాన్స్), అడాయి యోనత్ (ఇజ్రాయెల్), మహ్మద్ యూనస్(బంగ్లాదేశ్), జీన్ టిరోలే(ప్రాన్స్), డాక్టర్ స్వామినాథన్, రక్షణ సలహాదారు సతీష్‌రెడ్డితో సహా దేశ, విదేశీ శాస్త్రవేత్తలు, కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, పలు విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు ఇతర ముఖ్యులు హాజరయ్యారు.
వ్యవసాయానికి పెద్దపీట..
2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలంటే సుస్థిర వ్యవసా యాభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నందునేమో గానీ 104వ భారతీయ సైన్స్ కాంగ్రెస్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. పోషకాహారం, పర్యావరణ మార్పుల ప్రభావం, పంట మార్పిడి వంటి పలు అంశాలపై పెద్దఎత్తున చర్చ జరిగింది. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలపై ఏకంగా ఓ ప్లీనరీయే జరిగింది. మిగతా అన్ని అంశాలపై ఉప సద స్సులు జరిగాయి.
నోబెల్‌కు రూ. 100 కోట్లపై విమర్శలు
కాగా తెలుగు శాస్త్రవేత్తలు నోబెల్ బహుమతి సాధిస్తే రూ. 100 కోట్ల నగదు పురస్కారాన్ని అందిస్తామనడం, నోబెల్ ను సాధించడానికి చిట్కాలు చెప్పాలం టూ సీఎం చంద్రబాబు నోబెల్ గ్రహీత టకాకి కజితను అడగడం విమర్శలకు తావిచ్చింది. భట్రాగర్ అవార్డు గ్రహీత, ఇక్రిశాట్ శాస్త్రవేత్త రాజీవ్ కుమార్ వర్షి ఒకింత తీవ్రంగానే స్పందిస్తూ.. ఏపీలో నోబెల్ బహుమతులు గెలవడానికి అనువైన పరిస్థితులున్నాయో లేవో ముందు చూడాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ఆలోచనలు చేయాలని చురకలంటించారు.
పర్స్‌తో మొబైల్ చార్జింగ్!
చూడ్డానికి పర్స్‌లా ఉన్నా దీనికో ప్రత్యేకత ఉంది. మీ మొబైల్ ఫోన్‌ను ఇం దులో పెట్టుకుని, జేబులో ఉంచితే చాలు బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. దీన్ని శక్తివంతమైన మైక్రాన్స్ తో తయారు చేశారు. థిన్‌ఫిల్మ్ టెక్నాలజీని జోడించారు. ఇందులోని మాడ్యుల్స్ రేడియేషన్ ద్వారా సూర్యరశ్మిని విద్యుత్‌గా మారుస్తాయి. దీంతో గంటసేపట్లోనే మీ మొబైల్ రీచార్జ్ అవుతుంది. ఇప్పుడే దీన్ని కొనేయాలనే ఆసక్తిగా ఉందా? అయితే మీరు కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది మార్కెట్లోకి రావడానికి మరింత సమయం పడుతుందని సైన్స్ కాంగ్రెస్‌కు వచ్చిన స్విట్జర్లాండ్ శాస్త్రవేత్త తెలిపారు.
– తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
డాక్టర్ రోబో
యూనివర్సిటీ క్యాంపస్: ఇప్పటివరకూ వైద్యులు శస్త్రచికిత్సలు చేస్తుంటే అవసర మైన సందర్భాల్లో రోబోలు సాయం చేస్తుండేవి. కానీ మున్ముందు రోబోలే శస్త్రచికిత్సలు చేస్తుంటే వైద్యులు వాటికి సహకరించే రోజులు రాబోతున్నాయని ఢిల్లీ ఐఐటీకి చెందిన మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ సుభీర్ కుమార్ సాహా పేర్కొన్నారు. సైన్స్ కాంగ్రెస్‌లో శనివారం ‘రోబోటిక్స్’ అంశంపై నిర్వహించిన సదస్సులో సాహా ప్రసంగించారు. మన దేశంలోకి ఇప్పటికే రోబోలు ప్రవేశించాయని, పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని చెప్పారు. రాబోయే రోజుల్లో వీటి వినియోగం పెరగనుందన్నారు. శస్త్రచికిత్సలు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో వైద్యుల చేతులు వణికే అవకాశం ఉందని, రోబోటిక్ శస్త్ర చికిత్సల్లో ఈ పరిస్థితి ఉండదని చెప్పారు.
అలాగే ఇప్పటివరకు శరీర భాగాలను కోసి ఆపరేషన్ చేయాల్సి వచ్చేదని, కానీ రోబోటిక్ విధానంలో సన్నని పరికరాన్ని శరీరంలోకి పంపి సులువుగా ఆపరేషన్ చేయొచ్చని వివరించారు. ముఖ్యంగా కేన్సర్ శస్త్రచికిత్సల్లో రోబోటిక్ విధానం మంచి ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నారు. అలాగే డ్రోన్ల వినియోగం ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుందని చెప్పారు. మరికొన్ని రోజుల్లో భారత్‌లో కూడా డ్రోన్లను విస్తృతంగా వినియోగించే అవకాశం ఉందన్నారు. రోబోల కృత్రిమ మేధస్సు వల్ల ఎలాంటి నష్టముండదన్నారు. రోబోల వల్ల మానవ వనరుల వినియోగం తగ్గిపోతుందని, ఉపాధికి ప్రమాదం ఉంటుందన్న అనుమానాలున్నాయని, అయితే అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం లేదని చెప్పారు.