
నేడు సత్యార్థి, మలాలాకు నోబెల్
స్టాక్‌హోం(స్వీడన్): భారత్, పాకిస్తాన్‌లకు చెందిన ప్రముఖ బాలల హక్కుల కార్యకర్తలు కైలాస్ సత్యార్థి(60), మలాలా యూసఫ్‌జాయ్ (17)లు బుధవారం ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోనున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో జరిగే కార్యక్రమంలో వీరికి సంయుక్తంగా బహుమతిని ప్రదానం చేయనున్నారు. బహుమతి కింద వీరికి నోబెల్ పతకం, ప్రశంసాపత్రం, 1.1 మిలియన్ డాలర్ల (రూ.6.1 కోట్లు) నగదు చెరిసగం అందజేస్తారు. అవార్డును స్వీకరించడానికి సత్యార్థి తన భార్య సుమేధ, కుమారుడు, కోడలు, కూతురుతో సహా సోమవారమే ఓస్లోకు చేరుకున్నారు. ఆయన ‘పీటీఐ’తో మాట్లాడుతూ.. ‘ఈ అవార్డును భారత్‌లోని బాలలకు అంకితమిస్తున్నా.
ఈ బహుమతి వారి కోసమే. దేశ ప్రజల కోసం కూడా’ అని సంతోషం వ్యక్తం చేశారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య శాంతి కొనసాగడానికి విశ్వాసం, స్నేహమే ముఖ్యమని ఓస్లోలో జరిగిన ఓ కార్యక్రమంలో సత్యార్థి, మలాలా అభిప్రాయపడ్డారు. ఇరుదేశాల ప్రధానుల చర్చల కన్నా ప్రజల మధ్య సంబంధాలు మరింత ముఖ్యమని సత్యార్థి అన్నారు. కాగా, భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలు, సాహిత్యం విభాగాల్లో విజేతలుగా నిలిచిన మరో 11 మందికి స్వీడన్‌లోని స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో నోబెల్ బహుమతులను అందజేయనున్నారు. నోబెల్ బహుమతిని నెలకొల్పిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఆయన వర్ధంతి రోజైన డిసెంబరు 10న 1901 నుంచి ఏటా ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు.