
నానో స్థాయి రోబోలతో రక్తంలో పేరుకుపోయిన విషపదార్థాలను తొలగించేందుకు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (శాండియాగో) శాస్త్రవేత్తలు ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. అల్ట్రాసౌండ్ ధ్వనులతో నియంత్రించగల ఈ నానోరోబోలు అతిసూక్ష్మమైన బంగారు తీగలతో చేస్తారు. రక్తంలోని ప్లేట్‌లెట్లు, రక్తకణాల త్వచాలకు వీటిని జోడించినప్పుడు అవి విషపదార్థాలను నిర్వీర్యం చేసేస్తాయి.
అంతేకాకుండా ఈ నానోరోబోలతో ఎంఆర్‌ఎస్‌ఏ వంటి బ్యాక్టీరియాలను కూడా నాశనం చేయవచ్చునని.. కేవలం అల్ట్రాసౌండ్స్‌తో నియంత్రించే అవకాశం ఉండటం అదనపు ప్రయోజనమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలు జోసెఫ్ వాంగ్, లియాంగ్‌ఫాంగ్ ఝాంగ్‌లు తెలిపారు. ఒకే రకమైన నానోబోట్లతో రకరకాల పనులు చేయించే లక్ష్యంతో తాము ఈ ప్రాజెక్టు చేపట్టామని, ప్లేట్‌లెట్లు బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకుంటే.. ఎర్ర రక్త కణాలు విషపదార్థాలను నాశనం చేస్తాయని వారు వివరించారు.
మనిషి వెంట్రుక కంటే దాదాపు 25 రెట్లు తక్కువ వెడల్పు ఉండే ఈ నానో రోబోట్లు రక్తంలో సెకనుకు 35 మైక్రో మీటర్ల దూరం ప్రయాణించగలవని, కేవలం అయిదు నిమిషాల్లో రక్త నమూనాల్లోని బ్యాక్టీరియా మూడు రెట్లు తక్కువైనట్లు తాము ప్రయోగాల ద్వారా గుర్తించామని వివరించారు. ప్రస్తుతం తమ ప్రయోగాలు ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని... జంతువుల్లో నేరుగా పరీక్షించిన తరువాత రక్తశుద్ధి కోసం నానోబోట్లను మనుషుల్లోనూ వాడే అవకాశం ఉంటుందని చెప్పారు.
నిద్ర తక్కువైతే... తిండి యావ పెరుగుతుంది!
ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నా ఇది నిజమంటున్నారు శాస్త్రవేత్తలు. రాత్రిళ్లు సకాలంలో నిద్రపోకపోకపోయినా.. సరైన నిద్ర లేకపోయినా అది కాస్తా తిండియావ పెంచేస్తుందని అరిజోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాత్రిళ్లు చిరుతిళ్లు, జంక్ ఫుడ్‌కు అలవాటు పడటం వల్ల కొంత కాలం తరువాత ఊబయకాం, మధుమేహం వంటి వ్యాధులొచ్చే అవకాశాలు ఎక్కువవుతాయని తాము అధ్యయన పూర్వకంగా తెలసుకున్నట్లు మైకేల్ ఎ.గ్రాండ్‌నర్ తెలిపారు.
అమెరికా మొత్తమ్మీద కొంతమందిని ఎంపిక చేసుకుని తాము ఫోన్ ద్వారా కొన్ని వివరాలు సేకరించామని చెప్పారు. ఎంత కాలం నిద్రపోతున్నారు? సుఖ నిద్ర పడుతోందా? వేళకాని వేళలో ఆహారం తీసుకుంటూ ఉంటే ఎలాంటి తిండి తింటున్నారు? వంటి వివరాలను పరిశీలించినప్పుడు 60 శాతం మంది రాత్రి తిండికి అలవాటు పడ్డామని చెబితే... మూడింట రెండు వంతుల మంది రాత్రిళ్లు సక్రమంగా నిద్ర పట్టడం లేదని చెప్పారని వివరించారు.
నిద్ర తక్కువ కావడం జీవక్రియలపై ప్రభావం చూపుతుందని.. ఫలితంగా జంక్‌ఫుడ్ కావాలన్న కోరిక పెరిగేందుకు అవకాశముందని చెప్పారు. ఆరోగ్యానికి పౌష్టికాహారంతోపాటు సుఖమైన నిద్ర కూడా అవసరమని గుర్తిస్తున్న ఈ తరుణంలో ఈ అధ్యయనం ఎంతైనా అవసరమని.. రాత్రిపూట పనిచేసేవారు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించేందుకూ దోహదపడుతుందని వివరించారు.
త్రిఫల చూర్ణంతో ఆయుష్ణు పెరుగుతుందా?
ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ప్రముఖ స్థానముంది. జీర్ణసంబంధిత సమస్యలను తీర్చడంతోపాటు శరీరంలోని మాలిన్యాలను బయటకు పంపేందుకు ఎంతో ఉపయోగపడుతుందని మనకు తెలుసు. అయితే ఈ ఆయుర్వేద మందుకు కొన్ని రకాల బ్యాక్టీరియాను జోడిస్తే ఆయుష్షు కూడా పెరిగే అవకాశముందని అంటున్నారు మెక్‌గిల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు.
మనిషితో ఎన్నో సారూప్యాలున్న జీవజాతి ఈగలపై తాము ప్రయోగాలు చేశామని, త్రిఫలతోపాటు ల్యాక్టోబాసిల్లస్ ప్లాంటారమ్, లాక్టోబాసిల్లస్ ఫెర్మెంటమ్, బైఫైడోబ్యాక్టీరియా లాంగమ్ అనే మూడు బ్యాక్టీరియాను చేర్చి ఈగలకు అందించినప్పుడు వాటి జీవితకాలం దాదాపు 60 శాతం ఎక్కువైందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అంటున్నారు.
ఈగలు సాధారణంగా 40 రోజుల పాటు బతికి ఉంటాయని, బ్యాక్టీరియాతో కూడిన తిఫల ఇచ్చినప్పుడు మాత్రం ఇవి 26 రోజులు ఎక్కువగా జీవించాయని సూసన్ వెస్ట్‌ఫాల్ అనే శాస్త్రవేత్త వివరించారు. వయసు మళ్లిన మనుషుల పేవుల్లో ఈ మూడు బ్యాక్టీరియా సంతతి తక్కువగా ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారని వివరించారు. త్రిఫలతోపాటు పేవుల్లోకి చేరే బ్యాక్టీరియా అక్కడ మనకు మేలు చేసే సూక్ష్మజీవుల సంతతిని పెరిగేందుకు దోహదపడుతూండవచ్చునని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment