పాప  ఎక్కువగా నిద్ర పోతోంది?  | Family health counseling special | Sakshi
Sakshi News home page

పాప  ఎక్కువగా నిద్ర పోతోంది? 

Published Wed, Oct 31 2018 12:33 AM | Last Updated on Wed, Oct 31 2018 12:33 AM

Family health counseling special - Sakshi

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌
మా పాప వయసు ఐదేళ్లు. ఈమధ్య ఎక్కువగా నిద్రపోతోంది. రోజుకు దాదాపు 17 గంటలు పడుకునే ఉంటోంది. తినడానికి కూడా లేవడం లేదు. డాక్టర్‌ను సంప్రదించాం. మందులు ఇచ్చారు. వాటితో ఎలాంటి గుణం కనిపించలేదు. పాప ఇలా నిద్రపోవడానికి కారణాలు ఏమిటి? మాకు తగిన సలహా ఇవ్వండి.  – ఆర్‌. ఉజ్వల, కొత్తగూడెం 
పెద్దలతో పోలిస్తే పిల్లల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు తక్కువే. పెద్దల్లోనైనా, పిల్లల్లోనైనా నిద్రపోవడానికి తగినంత వ్యవధి, నిద్రలో తగినంత నాణ్యత ఉండటం చాలా ముఖ్యం. ఇక తగినంత నిద్రలేకపోయినా, చాలా ఎక్కువగా నిద్రపోతున్నా మనం ఆ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.  సాధారణంగా పగటిపూట ఎక్కువసేపు పడుకునే పిల్లలను సోమరులుగా, ప్రవర్తనల్లో తేడాలు ఉన్నవారుగా చిత్రీకరిస్తుంటారు. కానీ ఇది సరికాదు.  పిల్లలకు ఎంత నిద్ర అవసరం అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో పిల్లల్లో ఎక్కువసేపు నిద్రపోతూ ఉండే సమస్యను డయాగ్నోజ్‌ చేయడం కూడా ఒకింత  కష్టమే. 
అతి నిద్రకు కారణాలు: పిల్లలు అతిగా నిద్రపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిద్రలో తగినంత నాణ్యత లేకపోవడం ఒక కారణం కావచ్చు. దానితో పాటు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు కూడా మరొకి కారణం కావచ్చు. రాత్రి సరైన వేళకు నిద్రపట్టేలా, వేకువజామున వెలుగు రాగానే నిద్రలేచేలా నియంత్రించేందుకు మెదడులో ఒక బయలాజికల్‌ క్లాక్‌ ఉంటుంది. అది ఇలా క్రమబద్ధంగా నిద్రపుచ్చుతూ, నిద్రలేపుతూ ఉంటుంది. దీన్ని  సర్కాడియన్‌ రిథమ్‌ అంటారు. ఈ రిథమ్‌లో వచ్చిన మార్పులు కూడా నిద్ర సమస్యలకు దారి తీస్తాయి. ఇక అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే నార్కోలెప్సీ అనే జబ్బు వల్ల కూడా సమస్యలు రావచ్చు. దీనికి తోడు మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. అవి...  ∙మన వ్యాధి నిరోధక శక్తి మనపైనే ప్రతికూలంగా పనిచేసే ఆటోఇమ్యూన్‌ డిజార్డర్స్‌ ∙నరాలకు సంబంధించిన సమస్యలు ∙స్థూలకాయం ∙థైరాయిడ్‌ సమస్యలు ∙ఇన్‌ఫ్లుయెంజా ∙మోనోన్యూక్లియాసిస్‌ ∙ఫైబ్రోమయాల్జియా ∙సీలియాక్‌ డిసీజ్‌ వంటివి కూడా నిద్రకు సంబంధించిన రుగ్మతలకు కారణాలని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం వాడే మందుల వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవచ్చు, దానితో రోజంతా నిద్రమత్తుగా అనిపించే అవకాశం ఉంది.  ఇక మీరు మీ లేఖలో మీ పాపకు పైన పేర్కొన్న లక్షణాలేమీ వివరించలేదు. మీరు లేఖలో చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ పాపకు తగినంత నాణ్యత లేని నిద్ర (పూర్‌ క్వాలిటీ ఆఫ్‌ స్వీప్‌) లేదా పూర్‌ స్లీప్‌ హైజీన్‌ వంటి సాధారణ సమస్య మాత్రమే ఉందని అనిపిస్తోంది. అయినప్పటికీ మీరు మీ పాపకు ఒకసారి థైరాయిడ్‌ ఇవాల్యుయేషన్, డీటెయిల్‌డ్‌ స్లీప్‌ ఇవాల్యుయేషన్‌ వంటి పరీక్షలు చేయించడం ముఖ్యం. ఈ రోజుల్లో నార్కోలెప్సీ వంటి అరుదైన, తీవ్రమైన నిద్రసంబంధమైన జబ్బులకూ  ప్రభావపూర్వకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా న్యూరోఫిజీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోగలరు. 

బాబుకు  ఉన్న కళ్ల సమస్య ఏమిటి?
మా బాబుకి పదకొండేళ్లు. చాలా ఆరోగ్యంగా, మంచి చురుగ్గా ఉంటాడు. అయితే బాబుకి రెండు కళ్లలోని కనుగుడ్లు గబగబా కదులుతుంటాయి. ఇతరత్రా ఇబ్బంది లేకపోయినా చదవడంలో కాస్త సమస్యగానే ఉంది. వాడి విషయంలో తగిన సలహా ఇవ్వండి.  – డి. సూర్యారావు, టెక్కలి 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకి కళ్ల పొజిషన్, కదలికలో తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. వీటిలో చాలా రకాలుంటాయి. మీ ఉత్తరంలో బాబు సమస్యకి సంబంధించి చాలా వివరాలు తెలపలేదు. అందుకే ఖచ్చితమైన కారణం నిర్ధారణ చేయడం సాధ్యం కావడం లేదు. మీరు చెబుతున్న కొద్దిపాటి సమాచారాన్ని  బట్టి చూస్తే మీ వాడికి నిస్టాగ్మస్‌ లేదా ఆప్సోక్లోనస్‌ అనే సమస్యలు ఉండి ఉండవచ్చుననిపిస్తోంది. ముందుగా నిస్టాగ్మస్‌కు సంబంధించిన వివరాలలోకి వెళ్తే... ఇదొక వ్యాధి కాదు. బాబులోని రుగ్మతకు సంకేతం మాత్రమే. నిస్టాగ్మస్‌ ఉన్న వారి కళ్లు రిథమిక్‌గా కదులుతూ (రిథమిక్‌ ఆసిలేషన్‌ మూవ్‌మెంట్స్‌) ఉంటాయి. ఇది ఒకటి లేదా రెండు కళ్లకు ఉండవచ్చు. ఈ సమస్య పుట్టుక నుంచీ ఉండవచ్చు లేదా మధ్యలోనైనా ఇది  రావచ్చు. ఈ పరిస్థితికి అనేక కారణాలుంటాయి. ఉదా. కంటి సమస్యలు, చెవి సమస్యలు (లాబ్రెంతైౖటిస్‌), ఆల్బెనిజం, మెదడు సమస్యలు, కొన్ని సార్లు కొన్ని మందుల వల్ల కూడా ఈ విధమైన లోపాలు ఏర్పడుతుంటాయి. 

ఇక ఆప్సోక్లోనస్‌ విషయానికి వస్తే...  కళ్లు నాన్‌ రిథమిక్‌గా, అనేక డైరెక్షన్స్‌లో తిరుగుతుంటాయి. కళ్లను చూస్తే ఏదో కలవరంతోనో, కోపంతో (ఆజిటేటెడ్‌గా) ఉన్నట్లు అనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ స్థితి న్యూరోబ్లాస్టోమా అనే తీవ్రమైన మెదడు జబ్బుకి మొదటి సూచిక అయిండవచ్చు. మీ అబ్బాయి విషయంలో సమస్య పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు చేయించడంతో పాటు ఒకసారి బ్రెయిన్‌ స్కాన్‌ కూడా చేయించడం మంచిది. ఒకవేళ కంటి సమస్య ఉన్నట్లు నిర్థారణ అయితే (అది ముఖ్యంగా కంటి కండరాలకు సంబంధించిన సమస్య అయినప్పుడు) కొన్ని రకాల శస్త్ర చికిత్సల ద్వారా సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చు.  మీవాడి సమస్యకు కారణం ఏమిటనేది తెలుసుకుంటేనే ఇదమిత్థంగా పరిష్కారం చెప్పడం వీలవుతుంది. కాబట్టి మీరు ఒకసారి మీ కంటి వైద్య నిపుణులని కలిసి తగు సలహా, చికిత్స తీసుకోండి. 

బాబుకు  మాటిమాటికీ జ్వరం...  ఎందుకిలా?
మా బాబు వయసు రెండేళ్లు. వాడికి ఈమధ్య మాటిమాటికీ జ్వరం వస్తోంది. తగ్గినా మళ్లీ తిరగబెడుతోంది. మందులు వాడినంత సేపే గుణం కనిపించి ఆ తర్వాత మళ్లీ ఒళ్లు వెచ్చబడుతోంది. వాడికి ఇలా మాటిమాటికీ జ్వరం రావడంతో మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి.  – వి. రంగారావు, ఒంగోలు 
పిల్లలు నిత్యం సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్‌పోజ్‌ అవుతుండటం వల్ల ఇలా జ్వరం వస్తుండటం మామూలే. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్‌ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్‌ ఫీవర్‌ సిండ్రోమ్‌ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన సమస్యల వరకు ఇలా జ్వరం అనే లక్షణం కనిపించవచ్చు. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాకపోయినా... యూరినరీ ట్రాక్ట్‌కు సంబంధించిన సమస్య ఉందేమో చూడాలి. కాబట్టి ఒకసారి యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన పరీక్షలు చేయించండి. అందులో ఏమీ కనిపించకపోతే దీర్ఘకాలికమైన జబ్బులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు – మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్‌ వాడటం హానికరం. కాబట్టి మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి. 
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్,
రోహన్‌ హాస్పిటల్స్, విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement