కోవిడ్ మహమ్మారి సృష్టించే కల్లోలం మనందరికీ తెలుసు కానీ, చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ ‘నిశ్శబ్ద మహమ్మారి’ గురించి తెలిసింది చాలా కొద్ది మందికి మాత్రమే. ఏటా 70 లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ మహమ్మారి పేరు ‘యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)’. బాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు వంటి వివిధ వ్యాధికారక సూక్ష్మక్రిములను సంహరించే బ్రహ్మాస్త్రాల వంటివి యాంటీమైక్రోబియల్ ఔషధాలు. యాంటీబయోటిక్స్ వంటి అతిముఖ్యమైన ఈ ఔషధాలను తొలుత కనుగొని 80 ఏళ్లు దాటింది.
సాంక్రమిక వ్యాధుల నుంచి, తీవ్ర ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని, జంతువులను, మొక్కలను కాపాడటంలో ఈ ఔషధాలు అద్భుత పాత్రను పోషిస్తున్నాయి. ముఖ్యంగా శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, కేన్సర్ చికిత్సలను ఇవి కీలక మలుపు తిప్పాయి. అయితే, కాలక్రమంలో ఈ ఔషధాలకు కూడా కొన్ని సూక్ష్మక్రిములు లొంగకుండా మొండికేస్తున్నాయి. రోగుల ప్రాణరక్షణలో చివరి ప్రయత్నంగా చేసే చికిత్సల్లో అవకాశాలు కుంచించుకు పోతున్నాయి. దీన్నే ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)’ బెడద అని పిలుస్తున్నాం. ఎ.ఎం.ఆర్. వల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అభాగ్యుల్లో 90% మంది ఆసియా, ఆఫ్రికా దేశాల వాసులే. ఈ మహమ్మారిని కట్టడి చేయకపోతే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి కోటి మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
ముఖ్య కారణాలు
బ్రహ్మాస్త్రాల్లాంటి యాంటీమైక్రోబియల్ ఔషధాలను దుర్వినియోగం చేయటం, మోతాదులకు మించి వాడటం వల్ల ఎ.ఎం.ఆర్. మహమ్మారి విజృంభిస్తోంది. మనుషులకు, పశువులకు అందించే వైద్య చికిత్సల్లో.. పాడి పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు, రొయ్యలు, చేపలు వంటి ఆహారోత్పత్తులను అందించే పశుపక్ష్యాదుల పెంపకంలో.. పంటలు, పండ్ల తోటల సాగులో యాంటీమైక్రోబియల్ రసాయనిక మందులను విచ్చలవిడిగా వాడటం ఎ.ఎం.ఆర్. విజృంభణకు ముఖ్య కారణాలు. అంతేకాదు.. కర్మాగారాలు, వ్యవసాయ/ పశుపోషణ క్షేత్రాలు, జనావాసాలు, ఆసుపత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, వ్యర్థ జలాలతో ఏర్పడుతున్న కాలుష్యం కూడా ఎ.ఎం.ఆర్. మహమ్మారి పెరుగుదలకు కారణమవుతోంది. కోవిడ్ కాలంలో యాంటీ బయోటిక్స్ దుర్వినియోగం పెచ్చుమీరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది.
చైతన్య వారోత్సవాలు
ఎ.ఎం.ఆర్. సమస్యపై ప్రచారోద్యమం ద్వారా ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, పశువైద్య నిపుణులు, విధాన నిర్ణేతలకు ఈ సమస్యపై చైతన్యం కలిగించడానికి నవంబర్ 18–24 వరకు ప్రతి ఏటా ‘వరల్డ్ యాంటీమైక్రోబియల్ అవేర్‌నెస్ వీక్’ పేరిట వారోత్సవాలు జరుపుకొంటున్నాం. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు భారత్ ఎ.ఎం.ఆర్. నియంత్రణ కోసం పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక (2017–21) చేపట్టింది.
మూలికా వైద్యంతో సత్ఫలితాలు
పశుపోషణలో సంప్రదాయ మూలికా చికిత్సలను ప్రాచుర్యంలోకి తేవటం ద్వారా 80% యాంటీబయోటిక్స్ వాడకాన్ని జాతీయ పాడి అభివృద్ధి సంస్థ తగ్గించగలిగింది. రైతులు తమ ఇంటి పరసరాల్లో దొరికే ఔషధ మొక్కలతోనే పొదుగు వాపు వంటి తీవ్ర జబ్బుల్ని కూడా పూర్తిగా అరికట్టవచ్చని రుజువైందని ఎన్.డి.డి.బి. చైర్మన్ మీనెష్ షా అంటున్నారు. దక్షిణ కొరియా శాస్త్రవేత్త డా. చౌహన్ క్యు పద్ధతులు అనుసరిస్తే రసాయన రహిత, దుర్గంధ రహిత కోళ్ల పెంపకం చేపట్టవచ్చు. ఆక్వా సాగులోనూ యాంటీ బయోటిక్స్ తదితర రసాయనాల వాడకాన్ని తగ్గించటం అవశ్యం. ఆహార పంటలు, ఉద్యాన తోటల సాగులో రసాయనాల అవసరాన్ని దశలవారీగా తగ్గించుకునే మార్గాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ చైతన్యంతో క్షేత్రస్థాయిలో కార్యాచరణకు ప్రజలు, ప్రభుత్వాలు కలిసి పూనుకోవాలి.
– పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు
(ఈ నెల 24 వరకు ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్‌నెస్ వీక్’ సందర్భంగా..)
Comments
Please login to add a commentAdd a comment