వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే డెంగీ, మలేరియా జ్వరాలు సోకుతుండగా తాజాగా కళ్ల కలక.. కలవరం రేపుతోంది. దీనిని పింక్ ‘ఐ’ అని కూడా అంటున్నారు. సాధారణ బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. జలుబు కారకమైన వైరస్‌తో కూడా కలక వస్తుందని వారు తెలుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలా మందే ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలుస్తోంది. వర్షాకాలం కావడంతో వాతావరణ పరిస్థితుల కారణంగా ఇన్‌ఫెక్షన్ సోకి కలక వస్తోందని, గాలిలో ఎక్కువగా ఉండే తేమ బ్యాక్టీరియాకు కారణమవుతోందని, ఇది కళ్లను ప్రభావితం చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.
ఎలా వస్తుంది?
బ్యాక్టీరియా, కెమికల్స్, వైరస్ ద్వారా వస్తుంది. ఒకరిద్వారా ఒకరికి విస్తరిస్తుంది.
లక్షణాలు..
♦ కన్ను ఎర్రగా మారుతుంది
♦ కంటి నుంచి నీరు కారుతుంది
♦ కంటి రెప్పలు వాపు, ఉబ్బుతాయి.
♦ నిద్రించినప్పుడు కంటి రెప్పలు అంటుకుంటాయి.
♦ కంటి నుంచి పూసి రావడం
♦ కంటి నొప్పి దురద, మంట వస్తుంది.
చికిత్స...
యాంటీ బయోటిక్ ‘ఐ’ డ్రాప్స్, లుబ్రికాటింగ్ ‘ఐ’ డ్రాప్స్ వేసుకోవాలి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మన పరిసరాలలో (ఆఫీస్‌లు, స్కూళ్లు, కళాశాలలు, ఆస్పత్రులు, ఇంటిలో) ఎవరికైనా కండ్ల కలక ఉండే వారికి దూరంగా ఉండాలి. వాళ్లు వాడిన వస్తువులు (టవల్స్, సబ్బులు ఇతర వస్తువులు) తాకడం, వాడడం చేయొద్దు. తప్పని పరిస్థితుల్లో తాకితే తరచూ చేతులను నీటితో శుభ్రం చేసుకోవాలి. కళ్ల కలక వస్తే తప్పని సరిగా కళ్లద్దాలు ఉపయోగించాలి.
♦ కండ్ల కలక చాలా సాధారణ కంటి జబ్బు. అయినా మొదట్లోనే దీనిని నివారించుకోవాలి. పెద్దగా ఆందోళన చెందాలి్సన అవసరం లేదు. అయినా జాగ్రత్తలు పాటించాలి.
♦ కళ్లను మంచి నీటితో శుభ్రం చేస్తే అరికట్టొచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి కంటి వైద్యులను సంప్రదించాలి.
జాగ్రత్తలు తీసుకోవడంతో తగ్గింది..
వారం క్రితం చాలా మంది విద్యార్థినులకు కండ్ల కలక వచ్చింది. కంటి వైద్యుల సలహా మేరకు ‘ఐ‘ డ్రాప్స్ వేశాం. పిల్లలను దూరంగా ఉంచాం. దాదాపుగా అందరికీ తగ్గుతోంది.
జ్యోతి, స్పెషల్ ఆఫీసర్, కసూ్తర్బా
ఆందోళన చెందొద్దు
కంటి కలక వచ్చిన వారు ఆందోళన చెందొద్దు. పరిశుభ్రత పాటించాలి. సొంత వైద్యం చేయకుండా కంటి వైద్యులను సంప్రదించాలి. కంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.
ప్రతాపగిరి ప్రసాద్, ఆఫ్తాల్‌మిక్ ఆఫీసర్
జాగ్రత్తలు పాటించాలి
గాలి ద్వారా సోకే ఈ బ్యాక్టీరియా వర్షాకాలంలో వాతావరణంలో మురుగు, కాలుష్య కారకాలు పెరిగిపోవడం వల్ల వస్తుంది. ప్రస్తుతం అనేక జిల్లాలలో ప్రజలు కండ్ల కలకతో బాధపడుతున్నారు. కండ్లకలక సమస్యకు మందులు వాడకపోయినా కొందరికి తగ్గుతుంది. అయితే ఇది ఇతరులకు వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
– డాక్టర్ చీర్ల శ్రీకాంత్, పీహెచ్‌సీ వెంకటాపురం
100 మందికి పైగా ప్రజలకు కండ్ల కలక ..
వెంకటాపురం(ఎం) మండలంలోని 9 సబ్‌సెంటర్ల పరిధిలో సుమారు 100 మందికి పైగా ప్రజలు కండ్ల కలక లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిసింది. వైద్య సిబ్బంది కూడా ఎప్పటికపుడు గ్రామాల్లో పర్యటిస్తూ కండ్ల కలక వచ్చిన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment