antibiotic
-
నిశ్శబ్ద మహమ్మారి
కోవిడ్ మహమ్మారి సృష్టించే కల్లోలం మనందరికీ తెలుసు కానీ, చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ ‘నిశ్శబ్ద మహమ్మారి’ గురించి తెలిసింది చాలా కొద్ది మందికి మాత్రమే. ఏటా 70 లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న ఈ మహమ్మారి పేరు ‘యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)’. బాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు వంటి వివిధ వ్యాధికారక సూక్ష్మక్రిములను సంహరించే బ్రహ్మాస్త్రాల వంటివి యాంటీమైక్రోబియల్ ఔషధాలు. యాంటీబయోటిక్స్ వంటి అతిముఖ్యమైన ఈ ఔషధాలను తొలుత కనుగొని 80 ఏళ్లు దాటింది. సాంక్రమిక వ్యాధుల నుంచి, తీవ్ర ఇన్ఫెక్షన్ల నుంచి మానవాళిని, జంతువులను, మొక్కలను కాపాడటంలో ఈ ఔషధాలు అద్భుత పాత్రను పోషిస్తున్నాయి. ముఖ్యంగా శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడి, కేన్సర్ చికిత్సలను ఇవి కీలక మలుపు తిప్పాయి. అయితే, కాలక్రమంలో ఈ ఔషధాలకు కూడా కొన్ని సూక్ష్మక్రిములు లొంగకుండా మొండికేస్తున్నాయి. రోగుల ప్రాణరక్షణలో చివరి ప్రయత్నంగా చేసే చికిత్సల్లో అవకాశాలు కుంచించుకు పోతున్నాయి. దీన్నే ‘యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.)’ బెడద అని పిలుస్తున్నాం. ఎ.ఎం.ఆర్. వల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అభాగ్యుల్లో 90% మంది ఆసియా, ఆఫ్రికా దేశాల వాసులే. ఈ మహమ్మారిని కట్టడి చేయకపోతే 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి కోటి మంది చనిపోతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ముఖ్య కారణాలు బ్రహ్మాస్త్రాల్లాంటి యాంటీమైక్రోబియల్ ఔషధాలను దుర్వినియోగం చేయటం, మోతాదులకు మించి వాడటం వల్ల ఎ.ఎం.ఆర్. మహమ్మారి విజృంభిస్తోంది. మనుషులకు, పశువులకు అందించే వైద్య చికిత్సల్లో.. పాడి పశువులు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు, రొయ్యలు, చేపలు వంటి ఆహారోత్పత్తులను అందించే పశుపక్ష్యాదుల పెంపకంలో.. పంటలు, పండ్ల తోటల సాగులో యాంటీమైక్రోబియల్ రసాయనిక మందులను విచ్చలవిడిగా వాడటం ఎ.ఎం.ఆర్. విజృంభణకు ముఖ్య కారణాలు. అంతేకాదు.. కర్మాగారాలు, వ్యవసాయ/ పశుపోషణ క్షేత్రాలు, జనావాసాలు, ఆసుపత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, వ్యర్థ జలాలతో ఏర్పడుతున్న కాలుష్యం కూడా ఎ.ఎం.ఆర్. మహమ్మారి పెరుగుదలకు కారణమవుతోంది. కోవిడ్ కాలంలో యాంటీ బయోటిక్స్ దుర్వినియోగం పెచ్చుమీరిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. చైతన్య వారోత్సవాలు ఎ.ఎం.ఆర్. సమస్యపై ప్రచారోద్యమం ద్వారా ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలు, రైతులు, పశువైద్య నిపుణులు, విధాన నిర్ణేతలకు ఈ సమస్యపై చైతన్యం కలిగించడానికి నవంబర్ 18–24 వరకు ప్రతి ఏటా ‘వరల్డ్ యాంటీమైక్రోబియల్ అవేర్నెస్ వీక్’ పేరిట వారోత్సవాలు జరుపుకొంటున్నాం. ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు భారత్ ఎ.ఎం.ఆర్. నియంత్రణ కోసం పంచవర్ష కార్యాచరణ ప్రణాళిక (2017–21) చేపట్టింది. మూలికా వైద్యంతో సత్ఫలితాలు పశుపోషణలో సంప్రదాయ మూలికా చికిత్సలను ప్రాచుర్యంలోకి తేవటం ద్వారా 80% యాంటీబయోటిక్స్ వాడకాన్ని జాతీయ పాడి అభివృద్ధి సంస్థ తగ్గించగలిగింది. రైతులు తమ ఇంటి పరసరాల్లో దొరికే ఔషధ మొక్కలతోనే పొదుగు వాపు వంటి తీవ్ర జబ్బుల్ని కూడా పూర్తిగా అరికట్టవచ్చని రుజువైందని ఎన్.డి.డి.బి. చైర్మన్ మీనెష్ షా అంటున్నారు. దక్షిణ కొరియా శాస్త్రవేత్త డా. చౌహన్ క్యు పద్ధతులు అనుసరిస్తే రసాయన రహిత, దుర్గంధ రహిత కోళ్ల పెంపకం చేపట్టవచ్చు. ఆక్వా సాగులోనూ యాంటీ బయోటిక్స్ తదితర రసాయనాల వాడకాన్ని తగ్గించటం అవశ్యం. ఆహార పంటలు, ఉద్యాన తోటల సాగులో రసాయనాల అవసరాన్ని దశలవారీగా తగ్గించుకునే మార్గాలు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ చైతన్యంతో క్షేత్రస్థాయిలో కార్యాచరణకు ప్రజలు, ప్రభుత్వాలు కలిసి పూనుకోవాలి. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (ఈ నెల 24 వరకు ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్’ సందర్భంగా..) -
అన్ని ఫ్లూ వైరస్‌లకు ఒకే మందు!
వాషింగ్టన్: అన్ని రకాల ఫ్లూ వైరస్‌లను నిరోధించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త యాంటీ బయాటిక్‌ను కనుగొన్నారు. దాని పేరు 1జీ01. 2017లో ఫ్లూ జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఒక రోగి శరీరంలో దీనిని గుర్తించారు. ఎలుకలపై పరిశోధనలు నిర్వహించగా ఈ యాంటీ బయాటిక్ మనుషుల్లో సోకే ఫ్లూ వైరస్లు సహా 12 రకాల వైరస్‌లను నిరోధించింది. మొదట ఎలుకలకు ఫ్లూ వైరస్లు ఎక్కించి 3 రోజుల తర్వాత యాంటీ బయాటిక్ ఇవ్వగా అది సమర్థంగా పని చేసింది. తాజా పరిశోధనల దృష్ట్యా భవిష్యత్తులో అన్ని రకాల ఫ్లూ వైరస్‌లకు ఒకే మందు తయారు చేస్తామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
యాంటీబయాటిక్ మోతాదును లెక్కించే గాడ్జెట్...
యాంటీబయాటిక్ మందులతో జబ్బులు నయం కావచ్చునేమోగానీ.. దుష్ప్రభావాలు కొన్ని ఉండనే ఉంటాయి. అయితే మందు ఏ స్థాయిలో వాడితే దుష్ప్రభావాలు తక్కువ అవుతాయో తెలుసుకుంటే ఆ ఇబ్బందులను అధిగమించవచ్చు. మిగిలిన వాటి మాటెలా ఉన్నా వాన్కోమైసిన్ అనే యాంటీబయాటిక్ మోతాదును రక్తంలో సులువుగా గుర్తించేందుకు ఈపీఎఫ్‌ఎల్ విద్యార్థులు కొందరు ఓ విన్నూతమైన పరికరాన్ని అభివృద్ధి చేశారు. సెన్స్ యూ పేరుతో నిర్వహహిస్తున్న అంతర్జాతీయ బయోసెన్సర్ల పోటీ కోసం తయారుచేసిన ఈ వినూత్నమైన పరికరం భవిష్యత్తులో ఇతర యాంటీబయాటిక్‌లకూ ఉపయోగపడుతుందని ఈ విద్యార్థులు తెలిపారు. వాన్కోమైసిన్ వాడకం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయని, బధిరత్వం వచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిసినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు దీన్ని ఉపయోగిస్తూంటారు. రక్తంలో యాంటీబయాటిక్ ఎంత మోతాదులో ఉందో తెలిస్తే.. అందుకు తగ్గట్టుగా తదుపరి డోస్‌లను నిర్ణయించుకోవచ్చునని, తద్వారా సైడ్ ఎఫెక్ట్స్‌ను తక్కువ చేయవచ్చునని విద్యార్థులు తెలిపారు. వాన్కోమైసిన్ తో జట్టుకట్టగల ఒక పెప్టైడ్‌ను సృష్టించి, ప్రతిదీప్తి లక్షణమున్న పదార్థాన్ని జోడించడం ద్వారా తాము ఈ సెన్సర్‌ను తయారు చేసినట్లు వివరించారు. -
కృత్రిమ యాంటీబయాటిక్ సక్సెస్...
బ్యాక్టీరియా, వైరస్లు మనం వాడే మందులకు అలవాటు పడిపోతున్న తరుణంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి కృత్రిమ యాంటీబయాటిక్‌తో వాటికి చెక్ పెట్టేశారు. మూడేళ్ల క్రితం శాస్త్రవేత్తలు టెక్సోబ్యాక్టిన్ అనే ఓ రసాయనాన్ని గుర్తించారు. యాంటీబయాటిక్ నిరోధకతకు ఇదో మేలి విరుగుడని శాస్త్రవేత్తలు అంచనా కట్టినా దాన్ని కృత్రిమంగా తయారు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫలితంగా ఈ మందు కేవలం పరిశోధనలకు మాత్రమే పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ లింకన్ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు చేపట్టి విజయం సాధించారు. టెక్సోబ్యాక్టిన్ తయారీ సమయాన్ని కూడా గణనీయంగా తగ్గించగలిగారు. ఈ కృత్రిమ మందుతో ఎలుకలపై పరిశోధనలు జరిపినప్పుడు అది సాధారణ బ్యాక్టీరియాతోపాటు సాధారణ మందులను తట్టుకోగల సూపర్బగ్లనూ సమర్థంగా ఎదుర్కోగలదని తెలిసింది. అంతేకాకుండా ఈ మందు ద్వారా ఇన్ఫెక్షన్ సమస్య కూడా తక్కువగా ఉంటుందని తెలిసింది. టెక్సోబ్యాక్టిన్ కృత్రిమ తయారీ సాధ్యమైన నేపథ్యంలో కొత్తరకం యాంటీబయాటిక్ మందులను అభివృద్ధి చేయడం చాలా సులువు కానుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఈశ్వర్‌సింగ్ తెలిపారు. అయితే అన్ని పరిశోధనలు పూర్తి చేసుకుని టెక్సోబ్యాక్టిన్ మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకా కొన్నేళ్లు పట్టవచ్చునని ఆయన అంటున్నారు. -
పరి పరిశోధన
తాగుడును దూరం చేసే జన్యుమార్పులు! తాగుడు అలవాటును అధిగమించేలా మనిషి పరిణమిస్తున్నాడా? అవునంటున్నారు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. మానవుల్లో ఏ రకమైన మార్పులు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం జరిపారు. ఇప్పటికే పూర్తయిన దాదాపు వెయ్యి జన్యుక్రమ ప్రాజెక్టుల సమాచారాన్ని ఇందుకోసం విశ్లేషించారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన 2500 మంది డీఎన్ఏ వివరాలను పరిశీలించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. ఆఫ్రికా సంతతి వ్యక్తుల్లో మలేరియా వ్యాధికి నిరోధకత పెరుగుతూండగా, యూరోపియన్లలో ఒక అమినో యాసిడ్‌లో మార్పులు నమోదయ్యాయి. అలాగే నియాండెర్తల్ జాతికి సంబంధించిన మానవులతో కలవడం వల్ల వచ్చిన రెండు డీఎన్ఏ ముక్కలు అలాగే ఉన్నట్లు తెలిసింది. చివరగా ఏడీహెచ్ అనే జన్యువులో వచ్చిన మార్పు. ఈ జన్యువు శరీరంలో ఆల్కహాల్ డీహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ తయారీకి ఉపయోగపడుతుంది. ఇది మద్యాన్ని విడగొట్టి అసిటాల్డీహైడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ జన్యువులో వచ్చిన మార్పులు భవిష్యత్తులో శరీరాన్ని మద్యం ప్రభావం నుంచి రక్షించేదిగా ఉందని శాస్త్రవేత్తల అంచనా. మద్యాన్ని వేగంగా విడగొట్టడం ద్వారా తాగుబోతులకు జబ్బు పడిన అనుభూతిని ఇవ్వడం ద్వారా ఈ జన్యువు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. యాంటీబయాటిక్‌ల ప్రభావాన్ని పెంచే కార్బన్ మోనాక్సైడ్! కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు కారణంగా యాంటీబయాటిక్ మందుల ప్రభావం గణనీయంగా వృద్ధి చెందుతుందని జార్జియా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా చెబుతున్నారు. మెట్రోనైడజాల్ అనే యాంటీబయాటిక్‌కు కార్బన్ మోనాక్సైడ్‌ను జోడించి ప్రయోగించినప్పుడు హెచ్.పైలోరీ రకం బ్యాక్టీరియా వేగంగా నాశనమైందని వీరు జరిపిన ప్రయోగాల ద్వారా స్పష్టమైంది. కడుపులో పుండ్లు అయ్యేందుకు ఈ హెచ్.పైలోరీ కారణమవుతుందన్నది తెలిసిన విషయమే. కార్బన్ మోనాక్సైడ్‌తో కలిపి ఇచ్చినప్పుడు యాంటీబయాటిక్ ప్రభావం 25 రెట్ల వరకూ ఎక్కువగా ఉందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ బింగే వాంగ్ తెలిపారు. బ్యాక్టీరియా యాంటీబయాటిక్‌కు స్పందించకపోవడం నిరోధకత కాదని, చాలా సందర్భాల్లో అవి మందులకు అలవాటుపడిపోవడం వల్ల యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతాయని ఆయన వివరించారు. బ్యాక్టీరియాను మళ్లీ మందులకు సున్నితంగా మారిస్తే అవి వాటి ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు. గాఢత ఎక్కువగా ఉండే విషంలా పనిచేసే కార్బన్ మోనాక్సైడ్‌ను అతి తక్కువ సాంద్రతల్లో వాడినప్పుడు మాత్రం చికిత్సకు ఉపయోగపడుతుందని తాము గుర్తించినట్లు చెప్పారు. శరీరంలో సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే ఈ వాయువు వాపును తగ్గించడమే కాకుండా.. బ్యాక్టీరియా, వైరస్‌లకు కణాలు ప్రతిస్పందించే గుణాన్ని కూడా పెంచుతాయని చెప్పారు. కూల్‌డ్రింక్స్‌తో కేన్సర్ ముప్పు... చక్కెరలు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉన్న వారికి ఊబకాయ సంబంధిత కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని మెల్బోర్న్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ఒకటి తెలిపింది. దాదాపు 35 వేల మంది అలవాట్లను పరిశీలించి జరిపిన విశ్లేషణ ద్వారా కూల్‌డ్రింక్స్ 11 రకాల కేన్సర్లపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. ఇవన్నీ ఊబకాయానికి సంబంధించినవే అయినప్పటికీ అధ్యయనంలో పాల్గొన్న వారు మాత్రం ఊబకాయులు కాకపోవడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిత్యం కూల్‌డ్రింక్స్ తాగేవారితో పోలిస్తే కృత్రిమ చక్కెరలతో కూడిన డైట్ కూల్‌డ్రింక్స్ తాగే వారికి వ్యాధి ముప్పు తక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనం ద్వారా తెలిసిందని అలిసన్ హాడ్జ్ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు. అధిక చక్కెర... ఊబకాయానికి, మధుమేహానికి దారితీయవచ్చునని ఇప్పటికే అనేక పరిశోధనలు స్పష్టం చేస్తూండగా.. కేన్సర్ కారకమన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గత ఏడాది జరిగిన ఒక పరిశోధనలో చక్కెరలు కేన్సర్ కణాలను ఎలా ప్రేరేపితం చేస్తాయో స్పష్టం అవడమే కాకుండా.. చక్కెరలు కణతి ఎదుగుదలకు తోడ్పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ యూనివర్శిటీ జరిపిన అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది. కేన్సర్ల నివారణకు చక్కెరలను పూర్తిస్థాయిలో త్యజించడమూ అంత మంచిదేమీ కాదని, కణాలకు అవసరమైన శక్తి గ్లూకోజ్ ద్వారానే లభిస్తుందన్న విషయం మరువరాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
నయం చేసే మిరియం
గుడ్‌ఫుడ్ మిరియాలు ఆహారానికి రుచిని మాత్రమే కాదు... ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వాటితో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో. మిరియాలలో యాంటీబయాటిక్ గుణాలు ఉండటం వల్ల హానికరమైన ఇన్ఫెక్షన్స్ను నిరోధిస్తాయి. ∙మిరియాలు ఉన్న ఆహారం తిన్న వెంటనే అవి జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములను, రసాయనాలను పుష్కలంగా స్రవింపజేసేలా చూస్తాయి. అందుకే మిరియాలతో కూడిన ఆహారం తీసుకునేవారిలో కడుపు సంబంధిత సమస్యలు చాలా తక్కువ. అంతేకాదు మలబద్దకాన్ని, డయేరియా ను సైతం నివారిస్తాయి. ∙జలుబు, దగ్గు వంటి సమస్యలకు తొలుత స్ఫురించే ఇంటి చిట్కా మిరియాలే. ఇలా అవి జలుబు, దగ్గులను నివారించడానికి కారణం వాటిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణమే. మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను మిరియాలు అరికడతాయి. తద్వారా ఎన్నో రకాల క్యాన్సర్ల నివారణకు తోడ్పడతాయి. నిత్యం మిరియాలతో కూడిన ఆహారం తీసుకునే వారిలో పొట్ట పెరగదని పరిశోధనలలో తేలింది. ∙మిరియాలు చుండ్రును నివారిస్తాయి. ఛాతీ పట్టేసినట్లు ఉన్నా, ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడం కష్టమైనా మిరియాలు ఆ సమస్యను తక్షణం ఉపశమింపజేస్తాయి. సైనసైటిస్ సమస్యకు మిరియాలు మంచి ఉపశమనం. -
ఆ జీవుల పాలు... అద్భుతమైన యాంటీబయాటిక్...
టాస్మేనియన్ డెవిల్స్ అనే జీవులు పేరుకు మాత్రమే భయంకరంగా ఉంటాయి. కానీ చాలా అమాయకమైన జీవులవి. అయితే పేరులోని ఆ డెవిల్స్ అనే మాట ఎంతకూ లొంగని బ్యాక్టీరియా పాలిట నిజంగా డెవిలే. అలా మానవులకు ఒక వరప్రదాయనులు ఆ డెవిల్స్. మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టెఫాలోకాకస్ ఆరియస్ (ఎమ్ఆర్ఎస్ఏ) అనేది ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా ఏ యాంటీబయాటిక్స్‌కూ లొంగదు. దీన్ని కూడా లొంగదీయగల సామర్థ్యం టాస్మేనియన్ డెవిల్స్ పాలలో ఉంటుందంటున్నారు సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు. ఈ క్షీరదాలలో ఉండే పాలలోని ‘క్యాథెలిసిడిన్స్’ అనే పదార్థాల్లో ఎంతకీ లొంగని బ్యాక్టీరియాను సైతం ఎదుర్కొనే శక్తి ఉంటుందంటున్నాడు కనుగొన్నారు ఎమ్మా పీల్ అనే పరిశోధకురాలు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ అధ్యయనం వివరాలను ఆమె వెల్లడించారు. ఈ పాల మహత్యం నేచర్ జర్నల్ అనే సైంటిఫిక్ మ్యాగజైన్లో ప్రచురితమైంది. -
మనుషుల ముక్కులోనే యాంటీబయాటిక్!
కొత్త కొత్త కెమికల్ కాంబినేషన్స్‌తో కొత్త యాంటీబయాటిక్స్ కనుగొనడం... వాటిని తట్టుకొని మనుగడ కొనసాగించేలా బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నిరోధకత సాధించడం... ఇది ఒక పరుగుపందెంలా సాగింది. వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా క్రిములు కొత్త యాంటీబయాటిక్స్‌కు లొంగకపోవడంతో మరింత శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ కోసం వెతుకులాట చాలాకాలంగానే సాగుతోంది. పైగా ఇది కొంత శక్తికి మించిన పనే అయ్యింది. అయితే మనుషుల ముక్కు రంధ్రాల్లోనే శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ ఉన్నట్లు ఇటీవల జర్మన్ శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది. ఇది అందరిలోనూ ఉండదు. ఏ పదిమందిలోనో ఒకరి ముక్కు రంధ్రాల్లో ఇది ఉంటుందట. ఈ కొత్త యాంటీబయాటిక్ సేరు ‘లుగ్డునిన్’. ఎన్నెన్నో యాంటీబయాటిక్స్ నిరోధకత సాధించిన ‘మెథిసిలిన్ రెసిస్టెన్స్ స్టెఫాలోకోకస్ ఆరియస్’ (ఎమ్ఆర్ఎస్ఏ) అనే బ్యాక్టీరియాను సైతం ఇది సమర్థంగా నిర్మూలించగలదంటున్నారు శాస్త్రజ్ఞులు. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ట్యూబిజెన్కు చెందిన శాస్త్రవేవత్త బృందం ఈ తరహా యాంటీబయాటిక్ కోసం మానవ శరీరంలోనే కాస్తంత మురికిగా ఉండే ప్రాంతాల్లోనే వెతికిందట. అప్పుడు ముక్కు రంధ్రాల్లో ఉండే ‘లుగ్డునిన్’ బయటపడ్డట్లు ఈ శాస్త్రవేత్తలో బృందంలో ఒకరైన యాండ్రియస్ పెష్చెల్ తెలిపారు. తాము తమ వెతుకులాటలో విజయం సాధించామని ఆ శాస్త్రజ్ఞుడు పేర్కొన్నారు. ప్రస్తుతం ‘ఎమ్ఆర్ఎస్ఏ’ను ఎదుర్కొంటున్న ‘లుగ్డునిన్’... పారిశ్రామికంగా ఉత్పత్తి చేశాక కూడా ఇంతే సమర్థంగా నిర్మూలించగలదని నిరూపితమైతే ఇది కొత్త శకానికి నాంది పలుకుతుందంటున్నారు పరిశోధకులు. అయితే ‘లుగ్డునిన్’ను ఉత్పత్తి చేసేది కూడా ఒక బ్యాక్టీరియా కావడం విశేషం. దీని పేరు ఎస్ లుగ్డునెసిస్. ఇది ఒకింత ప్రమాదకారి అనీ, ఒకవేళ ఉత్పత్తి కోసం తాము వెతుకుతున్న ఇదే బ్యాక్టీరియా ఒకవేళ మానవులకు ప్రమాదకారిగా మారితే ఎలా అని కూడా శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కాకపోతే ఒక ఆశాకిరణం ఏమిటంటే... అది ప్రమాదకరంగా మారడాన్ని నిలువరించగలిగితే... చాలాకాలంగా కొత్త యాంటీబయాటిక్స్ లేని లోటు తీరుతుంది. ప్రస్తుతం తాము తెలుసుకున్న అంశాన్ని ఉపయోగించుకొని... ఆ బ్యాక్టీరియా ప్రమాదకరంగా కాని రీతిలోనే కొత్త యాంటీబయాటిక్‌ను సృష్టించే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. -
అది అంత మంచి సూచన కాదు..!
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 48 ఏళ్లు. నెల రోజుల క్రితం నుంచి నా కాళ్ల ఎముకల్లో రాత్రివేళల్లో నొప్పి ఎక్కువగా వస్తోంది. దాంతో డాక్టర్‌ను సంప్రదించి యాంటీబయాటిక్ మందులు తీసుకున్నాను. అయినా ఎలాంటి ఫలితమూ లేదు. దీనికి చికిత్స సూచించండి. - రఘునందన్‌రావు, ఆదిలాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే ఇది అంత తేలికగా తీసుకునే విషయం కాదు. రాత్రివేళల్లో ఎముకల నొప్పి రావడం అంత మంచి సూచన కాదు. దీన్ని ఎముక క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎముక క్యాన్సర్లు నొప్పితో గాని, నొప్పి లేకుండా గాని కణుతులను గుర్తిస్తారు. అయితే మృదుకణజాలంలో క్యాన్సర్ సోకినప్పుడు ఆ కణితిలో నొప్పి ఉండకపోవచ్చు. కానీ గట్టిగా ఉండే ఎముక కణజాలంలో క్యాన్సర్ ఉంటే మాత్రం అది నొప్పి, వాపుతో కనిపించవచ్చు. ఎముక క్యాన్సర్ సాధారణంగా రక్తం ద్వారా ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. క్యాన్సర్ ట్యూమర్ ఏర్పడినప్పుడు దాని చుట్టూ కొంత భాగం వరకు వాపు ఉంటుంది. అది వ్యాపించకుండా ఉండటం కోసం శరీరంలోని రక్షణ వ్యవస్థ దాని చుట్టూ ఒక చిన్న పొరను ఏర్పరుస్తుంది. అలాగే ఆ చుట్టూ ఉన్న భాగాన్ని రియాక్టివ్ జోన్ అంటారు. క్యాన్సర్ మొదటి స్థాయిలో ఉన్నవారికి శస్త్రచికిత్స చేసి ఆ భాగాన్ని తీసివేసే సమయంలో ఈ రియాక్టివ్ జోన్ వరకు ఉన్న కణాలను తొలగిస్తారు. కాబట్టి క్యాన్సర్ దుష్ర్పభావాలు మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొన్నిసార్లు ఎముకను పూర్తిగా తొలగించి ప్రోస్థెసిస్... అంటే కృత్రిమ ఎముక లేదా రాడ్‌ను అమర్చాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎముకను పూర్తిగా శుభ్రం చేసి, అక్కడికక్కడే ఎముకకు రేడియేషన్ అందించి, తిరిగి దాన్ని అమర్చుతారు. దాన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ రేడియేషన్ థెరపీ అంటారు. చాలామంది ఎముకల్లో నొప్పి, వాపు అనగానే మసాజ్ చేయిస్తుంటారు. అది చాలా ప్రమాదకరం. ఇలా మసాజ్ చేయించడం వల్ల రక్తసరఫరా పెరిగి క్యాన్సర కణాలు మరింత త్వరగా ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి. నొప్పి, వాపు కనిపించగానే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 40 ఏళ్లు. నాకు కుడి అరచేయి, మణికట్టు భాగాల్లోనూ, వేళ్లలోనూ చాలా నొప్పిగా ఉంది. కొన్ని సందర్భాల్లో చేయి తిమ్మిర్లుగా కూడా ఉంటోంది. కొన్నిసార్లు నా చేత్తో ఏదీ ఎత్తలేకపోతున్నాను. దాంతో జీవితం దుర్భరమవుతోంది. నాకు థైరాయిడ్ సమస్య, డయాబెటిస్ కూడా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - పి. సుధారాణి, విశాఖపట్నం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనే రుగ్మతతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. చాలామంది దీన్ని కంప్యూటర్ను విస్తృతంగా వాడటం వల్ల వచ్చిన సమస్యగా భావిస్తుంటారు. అయితే దీని దాఖలాలు 20వ శతాబ్దారంభం నుంచీ కనిపిస్తున్నాయి. కార్పల్ టన్నెల్ అనేది మణికట్టులో ఉండే ఒక సన్నటి ద్వారం. దీని నుంచే అరచేతిలోకి వేళ్లలోకి మీడియన్ నెర్వ్ అనే నరం ప్రవేశిస్తుంది. ఇక మన వేళ్లను వంచడానికి ఉపయోగపడే టెండన్స్కు కూడా ఇదే ద్వారం నుంచి వెళ్తాయి. ఈ టన్నెల్ మన బొటనవేలి అంత వైశాల్యంతో ఉంటుంది. దీని చుట్టూరా కార్పల్ అనే ఎముకలూ, ఫెక్సార్ రెటినాకులమ్ అనే లిగమెంట్లు ఉంటాయి. మణికట్టులో మీడియన్ నర్వ్ మీద ఒత్తిడి పడితే అది చెయ్యి బలహీనంగా అనిపించడానికీ, తిమ్మిర్లకూ కారణమవుతుంది. మీడియన్ నర్వ్ అటు స్పర్శజ్ఞానంతో పాటు కదలిలకూ ఉపయోగపడుతుంది. అది బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలితో పాటు కొంతవరకు ఉంగరపు వేలికీ వెళ్తుంది. ఆయావేళ్ల కదలికలకు అది తోడ్పడుతుంది. అందుకే దాని మీద మణికట్టు భాగంలో ఒత్తిడి పడితే ఈ వేళ్ల పైనా ప్రభావం పడుతుంది. టన్నెల్‌ను రూపొందించేలా మణికట్టులోని ఎముకల పైపొరతో పాటు కందెన (లూబ్రికేషన్)లా పనిచేయాల్సిన సైనోవియమ్ పొర వాపు వల్ల మీడియన్ నరంపై ఒత్తిడి పడుతుంది. ప్యాకేజీ పరిశ్రమల్లో పనిచేసే వారిలో ఇది చాలాఎక్కువ. రోగిని పరిశీలించడంతో ఎలక్ట్రోఫిజియాలజీ పరీక్షల ద్వారా కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేయవచ్చు. మణికట్టు ఎముకలను కదలకుండా పట్టి ఉంచే పట్టీలు వేయడం లేదా కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. పని మధ్యలో అప్పుడప్పుడూ మణికట్టుకు విశ్రాంతి ఇస్తుండటం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రహ్మణ్యం, సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 57 ఏళ్లు. రెండు నెలల నుంచి నా చర్మం మీద పొలుసులు పొలుసులుగా పొట్టురాలుతూ, దురదతో కూడిన తెలుపు, ఎరుపు రంగు మచ్చలు, దద్దుర్లు వస్తున్నాయి. డాక్టర్లు సోరియాసిస్ అన్నారు. మందులు వాడినా ఫలితం చాలా తక్కువ. సంపూర్ణంగా నయమవడానికి ఆయుర్వేద మందులు తెలియజేయగలరు. - రామచంద్రయ్య, విజయవాడ ఆయుర్వేదంలో చర్మరోగాలన్నీ ‘కుష్ఠ’ అనే పేరు మీద వర్ణితమయ్యాయి. మీ లక్షణాలను బట్టి చూస్తే అది ‘కిటిభ’కుష్ఠం అనే చర్మరోగంగా కనిపిస్తోంది. ఈ కింది సలహాలు పాటిస్తూ, సూచించిన మందుల్ని ఒక నెల పాటు వాడి పరిస్థితిని సమీక్షించుకోండి. ఉప్పు, పులుపు, కారాలని త్యజిస్తూ తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని, విశేషంగా ద్రవాహారాన్ని తీసుకోవాలి డయాబెటిస్ వంటి ఇతర వ్యాధులుంటే వాటిని అదుపులోకి తెచ్చుకోవాలి మద్యం, పొగతాగే అలవాట్లను విసర్జించాలి ఎలాంటి మానసిక ఉద్వేగాలకూ తావీయకూడదు. రెండుపూటలా పదేసి నిమిషాలు ప్రాణాయామం విధిగా చెయ్యాలి అతిశీతల వాతావరణానికి దూరంగా ఉండాలి. ఔషధాలు : త్రిఫలాచూర్ణం 5 నుంచి 10 గ్రాములు ప్రతిరాత్రి నీళ్లతో గంధక రసాయనం (మాత్రలు): ఉదయం 2, సాయంత్రం 2 (ఖాళీ కడుపున)లఘుసూతశేఖర రస (మాత్రల) రెండేసి మూడు పూటలా ఖదిరారిష్ఠ, మహామంజిష్టాద్యరిష్ట ద్రావకాలు: రెండేసి చెంచాలు ఒక గ్లాసుతో కలిపి, సమానంగా నీళ్లు కలిపి మూడుపూటలా తాగాలి మహామరీచాది తైలంకానీ దూర్వాది తైలంగానీ, పైపూతకు మూడు పూటలా వాడాలి. గృహవైద్యం : ఉసిరికాయ (ఆమలకీ) రసం రెండు చెంచాలు + పసుపు ఒక గ్రాము కలిపి తేనెతో, రెండుపూటలా సేవించాలి. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
ప్రాణాధార మందుల పవర్ తగ్గుతోందా?
బలం పుంజుకుంటున్న వ్యాధి కారకాలు.. మందులకు లొంగని జబ్బులు ♦ యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకంతో ముంచుకొస్తున్న ముప్పు ♦ నిర్మూలనకు వాడాల్సిన ఔషధాలు నివారణ కోసం వినియోగం ♦ మరి మొండి జబ్బులకు, కొత్తగా వచ్చే రోగాలకు మందేది? ♦ వైద్య రంగం ముందు అతిపెద్ద సవాలు చిన్న పిల్లల్లో సాధారణంగా వచ్చే సెగగడ్డలు మునుపు మామూలు యాంటీబయాటిక్స్ వాడితే తగ్గిపోయేవి! కానీ ఇప్పుడు ఏమాత్రం లొంగడం లేదు. గొంతు, చర్మానికి వచ్చే మామూలు ఇన్ఫెక్షన్లు ఇంతకుముందు చిన్నచిన్న మందులతోనే మటుమాయమయ్యేవి. ఇప్పుడు ఎంత ఖరీదైన మందులు వాడినా తగ్గనంటున్నాయి! హైదరాబాద్: ప్రాణాలు నిలబెట్టాల్సిన ఔషధాలన్నీ పదును కోల్పోతున్నాయి. వ్యాధికారక క్రిములు జడలు విచ్చుకుంటున్నాయి. వైరస్లు, బ్యాక్టీరియాలు మరింత శక్తిమంతం అవుతున్నాయి. వీటి బలం ముందు మందుల ‘పవర్’ దూదిపింజలా తేలిపోతోంది. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగంతో వ్యాధి కారకాలు 'డ్రగ్ రెసిస్టెన్స్' పెంచుకొని ఏ మందుకూ లొంగని స్థాయికి చేరుకున్నాయి. ఈ విపత్కర పరిణామం ఇప్పుడు వైద్య రంగానికే పెనుసవాలు విసురుతోంది! యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగం ఇకనైనా ఆపకుంటే మానవాళి మనుగడే ప్రమాదంలో పడిపోతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదో నిశ్శబ్ద విధ్వంసం దాదాపు 60 ఏళ్ల క్రితం యాంటీబయాటిక్స్ కనుగొనడం ఒక విప్లవం. ఇప్పుడు వాటి దుర్వినియోగం ఒక నిశ్శబ్ద విధ్వంసంలా సాగిపోతోంది. మామూలు గాయాలు, జబ్బులు, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గని పరిస్థితి ఎవరో తెచ్చింది కాదు. ఇది మనకు మనం చేసుకుంటున్న కీడు. వ్యాధి నిర్మూలన కోసం వాడాల్సిన మందుల్ని నివారణ కోసమే యథేచ్ఛగా వాడుతున్నందున బ్యాక్టీరియా, వైరస్లు మొండిగా తయారై కూర్చుంటున్నాయి. బ్రహ్మాస్త్రంలాంటి యాంటీబయాటిక్స్‌ను పిచ్చుక వంటి చిన్నచిన్న వ్యాధులపై ప్రయోగించడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే యాంటీబయాటిక్స్ ఉన్నవన్నీ వాడేశాం. గత కొంతకాలంగా కొత్తగా కనుగొన్న యాంటీబయాటిక్స్ ఏమీ లేవు. మున్ముందు కొత్తగా రాబోతున్నవీ కనిపించడం లేదు. దీంతో రాబోయే తరానికి యాంటీబయాటిక్స్ కొరత తీవ్రంగా ఏర్పడబోతోంది. తేలిగ్గా తగ్గిపోయే జబ్బులకు సైతం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అష్టకష్టాలు పడుతూ, ఖరీదైన మందులు వాడడం, వాడినా లొంగని, నయం కాని దుస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఐదేళ్లలో గడ్డం గీసుకుంటే అయ్యే గాయాలూ కూడా మానవేమోనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న జబ్బుకూ యాంటీబయాటిక్సే.. జలుబుకు మందు లేదు. ఎందుకంటే అది వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే తాత్కాలిక అసౌకర్యం. ఆవిరిపట్టడం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. కానీ చాలామంది అది కూడా తట్టుకోవడం లేదు. మరికొందరు స్వైన్‌ఫ్లూ కావచ్చేమోనన్న భయంతో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. దీంతో ట్యూబర్క్యులోసిస్ (టీబీ), క్లెబిసియెల్లా నిమోనియా కార్బపేనిమేజ్, సూడోమొనాస్ వంటి యాంటీబయాటిక్స్‌కు మామూలుగానే లొంగిపోయే సూక్ష్మక్రిములు మరింత మొండిగా మారుతున్నాయి. బలం పుంజుకుంటున్నాయిలా.. ఇ-కొలి అనే బ్యాక్టీరియా నీళ్ల విరేచనాలు కలగజేస్తుంది. సాధారణ యాంటీబయాటిక్స్‌తో ఈ బ్యాక్టీరియాతో తగ్గిపోయేది. కానీ ఆ మందులకు లొంగకపోగా ఏటేటా మరింత విస్తరిస్తోంది. 2010లో మన దేశంలో 5 శాతం మంది ఈ బ్యాక్టీరియాతో సతమతమైతే.. 2014 నాటికి వారి సంఖ్య 12 శాతానికి పెరిగింది. అలాగే నిమోనియాకు కారణమయ్యే క్లెబిసియెల్లా నిమోనియా కార్భపేనిమేజ్ ఇన్ఫెక్షన్తో... 2008లో మనదేశంలో 29 శాతం మంది బాధపడగా.. 2014కల్లా వారి సంఖ్య 57 శాతానికి చేరింది. ఇక హాస్పిటల్స్‌లో కనిపించే ఎమ్ఆర్ఎస్ఏ ఇన్ఫెక్షన్లు 2009లో 29 శాతం ఉంటే.. 2014కల్లా 47 శాతానికి పెరిగాయి. ఎందుకంత ప్రమాదమంటే.. మన దేహాన్ని ఆవాసం చేసుకొని అనేక రకాల బ్యాక్టీరియాలు జీవిస్తుంటాయి. అవేవీ మనిషికి హాని చేయవు. అయితే విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడేవారిలో ఈ హానిరహితమైన బ్యాక్టీరియా తగ్గిపోవడమేగాకుండా హానికారక బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుంది. అవి చర్మం, మూత్ర వ్యవస్థను దెబ్బతీస్తాయి. యాంటీబయాటిక్స్‌ను నిర్ణీతకాలం వాడాలి. అలా కాకుండా మధ్యలోనే వదిలేయడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా నిర్మూలన జరగదు.. సరికదా వ్యాధి కారక సూక్ష్మజీవులు నిరోధకతను పెంచుకుంటాయి. ఉదాహరణకు టీబీ సోకిన వ్యక్తులు తమ లక్షణాలు తగ్గగానే పూర్తి కోర్సు వాడకుండా మందులు మానేస్తుంటారు. దాంతో ఆ క్రిములు మరింత శక్తిమంతం అవుతాయి. కొన్నిసార్లు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. క్లాస్ట్రీడియమ్ డిఫిసైల్ అనే బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్‌కు నిరోధకత పెంచుకొని పెద్ద వయసువారిలో నీళ్ల విరేచనాలు కలగజేస్తుంది. ఇది చివరికి ప్రాణాలకే ముప్పు తేవొచ్చు. విచ్చలవిడిగా వాడుతున్న యాంటీబయాటిక్స్ ఇవే... దగ్గుకూ, జలుబుకూ అజిథ్రోమైసిన్, సెఫాక్సిమ్, సెపడోక్సిమ్, నీళ్ల విరేచనాలకు నార్ఫ్లాక్స్ట్, ఇంజెక్షన్ల ద్వారా తీసుకునే సెఫ్ట్రియాక్సోన్తోపాటు అఫ్లాక్సోసిన్, సిప్రోఫ్లాక్సిన్, సిఫ్రాన్, సెప్ట్రాన్, మోనోసెఫ్, పైపర్‌సిలిన్, టాజోబ్యాక్టమ్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనేక రకాల యాంటీబయాటిక్ కాంబినేషన్లను వాడొద్దు. వైద్యుడు చెప్పిన మోతాదులోనే వాడాలి. కొందరు నేరుగా మెడికల్ షాపులకు వెళ్లి యాంటీబయాటిక్స్ తీసుకుంటారు. డాక్టర్ సలహా లేకుండా ఇవి వాడొద్దు. యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకాన్ని తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. ఈ పరిస్థితికి అందరూ కారణమే ఈ పరిస్థితికి సొంత వైద్యం చేసుకునే రోగులు, ఔషధాల అమ్మకాలు పెంచుకునే కంపెనీలు, తెలిసీ తెలియక మందులు రాసే వైద్యులూ.. అందరూ కారణమే! ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఇప్పటికి తెలిసిన వైద్యం యాంటీబయాటిక్స్ వినియోగం మాత్రమే. వాటిని మన దేహానికి ఉన్న సహజ రోగ నిరోధక శక్తి దెబ్బతినకుండా అవసరమైన మోతాదులోనే వాడాలి. విచ్చలవిడిగా వాడితే అనేక దుష్పరిణామాలు తప్పవు. సూక్ష్మజీవులు నిరోధకతను పెంపొందించుకుంటే... వ్యాధులు తగ్గడానికి చాలా రోజులు పడుతుంది. మామూలుగా తగ్గాల్సిన జబ్బులూ ముదిరిపోతాయి. దీంతో రోగులు హాస్పిటల్లో ఉండాల్సిన వ్యవధితోపాటు వాడాల్సిన మందులు అనేక రెట్లు పెర గవచ్చు. కొన్నిసార్లు మందులు పనిచేయక మృత్యువాత పడే ప్రమాదం ఉండవచ్చు. - డాక్టర్ కె.శివరాజు, సీనియర్ ఫిజీషియన్, కిమ్స్, సికింద్రాబాద్ -
సమయం వృథా చేయొద్దు
పోచమ్మమైదాన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఓపీని పరీక్షించే సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్త పడాలని, లేనిపక్షంలో రోగులు బారులు తీరుతారని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీ సురేష్‌చందా అన్నారు. స్థానిక కేఎంసీలో శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐఎంఏ ప్రతినిధులు, కేఎంసీ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్, వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు యాంటీ బయాటిక్ మందులు రాయడం వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుంది తప్ప తగ్గదని సూచించారు. సాధ్యమైనంత వరకు జనరిక్ మందులు రాయాలని సూచించారు. డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ కంప్యూటరైజ్ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం కేఎంసీ బాలికల హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. హెల్త్ హబ్‌గా వరంగల్‌ను మార్చొచ్చు వరంగల్‌ను హెల్త్ హబ్‌గా మార్చొచ్చని ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ విజయచందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేఎంసీ పరిధిలో 120 ఎకరాలు, సెంట్రల్ జైలు పరిధి లో 80 ఎకరాలు, ఎంజీఎం పరిధిలో 30 ఎకరాల భూ మి ఉంది. ఈ నేపథ్యంలో హెల్త్ హబ్ ఏర్పాటుకు భూ సమస్య లేదని తెలుపగా స్పందించిన ఇన్చార్జ్ వీసీ ఆ విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని అన్నారు. పాత బ్యాంకు భవనంలో యూనివర్సిటీ కార్యకలాపాలు ఎంజీఎం : హెల్త్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగించేందుకు పాత ఆంధ్రబ్యాంకు భవనం అనువుగా ఉంటుందని ఎంజీఎం సూపరింటెండెంట్ మనోహర్, కేఎంసీ ప్రిన్సిపాల్ రమేశ్‌కుమార్ సూచన మేరకు సురేష్‌చందా ఆ భవనాన్ని పరిశీలించారు. భవనంలో మెరుగైన సౌకర్యాలు, యూనివర్సిటీ నూతన భవన నిర్మాణాలకు సంబంధించి ప్రణాళిక తయారు చేసి హైదరాబాద్‌కు తీసుకురావాలని ఎంపీఎస్‌ఐడీసీ ఈఈని ఆదేశించారు. ఆయన వెంట దేవేందర్‌రెడ్డి, కేఎంసీ పీడీ తుమ్మ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘అనారోగ్య’ కేంద్రాలు
సాక్షిప్రతినిధి, నల్లగొండ :నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రి లో మందుల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 7 లక్షలు వెచ్చించి మందులు కొనుగోలు చేస్తున్నా సరిపోవడం లేదు. చివరికి రోగులకు గ్లూకోజ్ బాటిళ్లు కూడా పెట్టడం లేదు. ఆస్పత్రికి ప్రతి రోజూ ఔట్‌పేషెంట్లుగా 350 నుంచి 400 మంది వస్తున్నారు. 250 పడకలున్న జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సుమారు 350 మంది ఇన్పేషెంట్లుగా ఉన్నారు. యాంటిబయాటిక్, యాంటీ రేబిస్, ఏఆర్వీ, ఇన్సులిన్, గ్లూకోజ్ బాటిళ్ల కొరత ఉంది. సెప్టెంబర్ నాటికి ఇవ్వాల్సిన కోటా మందులు కూడా ముందే వాడుకున్నారు. ఆస్పత్రి స్థాయికి తగినట్లుగానే డాక్టర్లున్నా సమయపాలన పాటించక రోగులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నల్లగొండ మండలం రాములబండలోని పీహెచ్సీలో కేవలం జ్వరాలకు మాత్రమే మందులు అందజేస్తున్నారు. తిప్పర్తి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లకు గాను ఒక్కరూ లేరు. దీంతో ఇక్కడ రోగులకు ఏఎన్ఎంలే దిక్కవుతున్నారు. ఆలేరులోని 30 పడకల ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలు అంతంతమాత్రమే. డిప్యూటీ సివల్ సర్జన్ పోస్టు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంది. ఆస్పత్రికి 24 గంటలు కరెం టు సరఫరా చేయాల్సి ఉన్నా అమలు కావడం లేదు. జనరేటర్ పని చేయటం లేదు. స్కానింగ్ మిషన్ పని చేయ టం లేదు. మార్చురీ గదిలో శవాలను భద్రపరిచేందుకు ఉపయోగించే రెండు ఏసీలు చెడిపోయాయి. శారాజీపేట పీహెచ్సీలో ఎక్స్‌రే, స్కానింగ్ మిషన్లు లే వు. గుండాల పీహెచ్సీలో సిబ్బంది సమయపాలన పాటించరు. సిబ్బంది స్థానికంగా నివాసం ఉండక హైదరాబాద్, నల్లగొండ నుంచి రావడం వల్ల సమయానికి చేరుకోవడం లేదు. బొమ్మలరామారంలో రోగులకు వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. వైద్యాధికారి, సిబ్బంది మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. యాదగిరిగుట్ట పీహెచ్సీలో పాముకాటు మందు అందుబాటులో లేదు. వరండాలో తాత్కాలికంగా ల్యాబ్ ఏర్పాటు చేశారు. రాజాపేట లో 24 గంటల వైద్య సదుపాయం ఉన్నా సిబ్బంది కొరత ఉంది. తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రం పేరుకే 24 గంటల ఆసుపత్రి. సేవలు మాత్రం నిల్. భువనగిరి నియోజకవర్గంలోని ఏరియా ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లు , మెడికల్ సిబ్బంది కొరత ఉంది. చేయి తడపనిదే కింది స్థాయి సిబ్బంది పనులు చేయడంలేదు. చిన్నరోగానికి కూడా సికింద్రాబాద్‌కు రెఫర్ చేయడం ఆనవాయితీగా మారింది. మందుల కోసం డాక్టర్లు బయటకు చీటీలు రాస్తున్నారు. పోచంపల్లి పీహెచ్సీలో రెగ్యులర్ ల్యాబ్ టెక్నీషియన్ లేడు. బీబీనగర్ మండలం కొండమడుగు పీహెచ్సీలో పని చేస్తున్న స్టాఫ్ నర్సు రోగులకు వైద్యం చేయడం లేదు. బీబీనగర్ పీహెచ్‌సీలోని ఒక పారా మెడికల్, హెల్త్ సూపర్వైజర్, ఒక హెల్త్ అసిస్టెంట్, ఏఎన్ఎమ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వలిగొండ వైద్యశాలలో ఒక డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. భవనం శిథిలావస్థకు చేరుకుంది. పై కప్పు పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఓపీ రూం, ఆపరేషన్ థియేటర్ రూంతో సహా అన్ని గదులలో పెచ్చులూడుతున్నాయి. మరమ్మతుల్లేక జనరేటర్ మూలకు పడింది. మండలంలోని వర్కట్‌పల్లి, వేములకొండలలో వైద్యం సరిగా అందడంలేదు. చౌటుప్పల్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సమయపాలన లేదు. డిప్యూటీ సివిల్‌సర్జన్ పోస్టు ఖాళీగా ఉంది. మునుగోడు పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లకు గాను ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. చండూరులోని ఇద్దరు డాక్టర్లలో రోజుకొకరు వంతులవారీగా విధులకు హాజరవుతున్నారు. సమయపాలన ఎవరూ పాటించడం లేదు. మర్రిగూడలో రెండు డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంస్థాన్ నారాయణపురంలో ల్యాబ్ టెక్నీషియన్ లేడు. పలుచోట్ల ఆస్పత్రులలో మందులు లేక బయటికి రాస్తున్నారు. దేవరకొండ కమ్యూనిటీ వైద్యశాలలో ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఒక సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీఏపల్లి పీహెచ్‌సీకి సిబ్బంది కొతర వేధిస్తోంది. చింతపల్లి మండలం మాల్లో ఉన్న పీహెచ్సీలో ఇద్దరు వైద్యాధికారులకు గాను ఒక్కరే ఉన్నారు. డిండి పీహెచ్సీ 24 గంటల వైద్య కేంద్రమైనా సరిపోను సంఖ్యలో సిబ్బంది లేరు. జనరేటర్ పని చేయకపోవడంతో రాత్రి సమయాల్లో వైద్య సేవలకు ఇబ్బందిగా ఉంది. కొండమల్లేపల్లి పీహెచ్సీ పట్టణ కేంద్రానికి కాస్త దూరంగా ఉండటంతో రోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోదాడలోని 30 పడకల వైద్యశాలలో ఆపరేషన్ సమయంలో పేద రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక్కడ మంచినీటి కొరత తీవ్రంగా ఉంది. అంబులెన్స్ మూలనపడింది. ఇదే ఆవరణలో ఉన్న హోమియో వైద్యశాల తలుపులు తీసేవారే కరువయ్యారు. వైద్యశాల ఆవరణ కొంత ఆక్రమణకు గురయ్యింది. ఇక్కడ అత్యవసర మందులైన పాముకాటు, కుక్కకాటు మందులు అందుబాటులో లేవు. మండలంలోని కాపుగల్లులో గైనకాలజిస్టు లేకపోవడంతో మహిళా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కాపుగల్లు, అనంతగిరిలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఖాళీగా ఉంది. చిలుకూరు ఆరోగ్య కేంద్రంలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు ఉన్నా ఆపరేషన్లు మాత్రం జరగడం లేదు. నడిగూడెం మండల పరిధిలోని త్రిపురవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్‌టెక్నీషియన్, స్టాఫ్ నర్సు, ముగ్గురు హెల్త్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్, స్వీపరు, అటెండరు పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. ము నగాల మండలం రేపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుడు వారంలో రెండురోజులు మాత్రమే వస్తున్నారు. మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిలో డాక్టర్లు సమయపాలన పాటించడంలేదు. ఈ ఆస్పత్రికి ప్రతిరోజూ సుమారు 400మంది ఔట్పేషెంట్లు వచ్చివెళుతుంటారు. డాక్టర్లు సమయానికి రాక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో గైనికి సివిల్ సర్జన్ పోస్టు ఖాళీగా ఉండటంతో గర్భిణులు వైద్యం అందక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అంబులెన్స్ మూలకు పడిపోయింది. ఆస్పత్రిలో ఉన్న 300 ఎంఏ ఎక్స్‌రే మిషన్ చెడిపోయి 3 నెలలైనా మరమ్మతులు చేయించే పరిస్థితిలేదు. ఈసీజీ మిషన్లు కూడా చెడిపోయాయి. ఆలగడప , పాములపాడు, అడవిదేవులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. వేములపల్లి, దామరచర్ల పీహెచ్‌సీల్లో 24 గంటలు సేవలు అండం లేదు. అన్ని పీహెచ్సీలలో ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్లు పనిచేయక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో 30పడకల ఆస్పత్రి, 7పీ హెచ్‌సీలు ఉన్నాయి. చాలా చోట్ల వైద్య సి బ్బంది కొరత తో వైద్య సేవలు సరిగా అందడం లేదు. వై ద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండకపోవడంతో ప్రతి రోజూ ఆస్పత్రులకు ఆలస్యంగా వస్తున్నారు. తుంగతుర్తి ఆస్పత్రిలో రెండేళ్ల నుంచి ఎక్స్‌రే మిషన్ పనిచేయడం లేదు. నీటి సమస్య ఉంది. పీహెచ్సీలలో వైద్య సేవలు సరిగ్గా అందక ప్రసవాలు నామమాత్రంగా జరుగుతున్నాయి. హుజూర్‌నగర్‌లోని 100 పడకల వైద్యశాలలో ఐసీయూ, ఎన్ఐసీయూ, 320 ఎంఏ ఎక్స్‌రే ప్లాంట్, స్కానింగ్ మిషన్, అత్యాధునిక ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు, రక్తనిధి కేంద్రాలు లేవు. ప్రస్తుతం వైద్యశాలలో నలుగురు వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా సివిల్ సర్జన్లు 4, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్‌లు 5, రేడియాలజిస్ట్, గైనకాలజిస్ట్‌ల నియామకం జరగాల్సి ఉంది. ఈ వైద్యశాలకు ప్రతిరోజూ అత్యవసర కేసులు కాకుండానే సుమారు 300 నుంచి 350 మంది రోగులు వస్తున్నారు. రోగులకు పూర్తిస్థాయి వైద్యసేవలు లభించడం లేదు. నేరేడుచర్ల పీహెచ్సీలో ఇద్దరు వైద్యాధికారులకుగాను ఒక వైద్యాధికారి విధులకు హాజరు కాకుండా మిర్యాలగూడలోని ప్రైవేట్ నర్సింగ్హోమ్కే సమయాన్ని కేటాయిస్తున్నారు. గరిడేపల్లి ఆరోగ్యకేంద్రం ఊరికి దూరంగా ఉండటంతో ప్రజలు హాస్పిటల్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. మఠంపల్లి పీహెచ్సీలో ఇన్చార్జ్ వైద్యాధికారి విధు లు నిర్వహిస్తున్నారు. వారంలో కేవలం నాలుగు రోజులు మాత్రమే రోగులకు అందుబాటులో ఉండటం వల్ల మి గిలిన సమయాల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో సరిపడా వైద్యులు లేరు. మూడు సివిల్ సర్జన్ పోస్టులు ఉండగా.. ఒక్కరూ లేరు. గైనకాలజిస్టు పోస్టు మంజూరు చేయకపోవడం గర్భిణులకు ఇబ్బందిగా మారింది. ఆత్మకూర్.ఎస్ పీహెచ్సీలో డాక్టర్ వేరొక చోట ఇన్చార్జ్గా ఉండటంతో అందుబాటులో ఉండలేకపోతున్నారు. స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, పీహెచ్ఓ, హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చివ్వెంల పీహెచ్సీలో వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. నాగార్జున సాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏ చిన్న కేసు వచ్చినా నల్లగొండకు రెఫర్ చేస్తున్నారు. అవసరమైన మేర మందుల సరఫరా లేక ప్రైవేట్ మెడికల్ దుకాణాల్లో తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇక్కడ డబ్బులిస్తేనే శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండటం లేదు. త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉన్నా విధులకు సక్రమంగా రాకపోవడంతో అక్కడ పని చేసే పార్మసిస్టే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. నిడమనూరు పీహెచ్సీలో తాగునీటి సౌకర్యం లేదు. నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూరు, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాల్లోని ప్రభుత్వ వైద్యశాల, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో మందులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఉన్న సిబ్బంది సమయ పాలన పాటించక రోగులకు సరైన వైద్య సేవలు అందటం లేదు. నకిరేకల్ పట్టణంలో ఉన్న 30 పడకల వైద్యశాలలో అత్యవసర వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. రామన్నపేట ఏరియా ఆస్పత్రిలో రెండేళ్లుగా జనరేటర్ పనిచేయడంలేదు. కేతేపల్లి పీహెచ్సీలో సమయ పాలన పాటించక పోవటంతో రోగులకు సరైన వైద్య సేవలు అందటం లేదు. చిట్యాల మండలంలో చిట్యాల, వెలిమినేడు ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. నార్కట్‌పల్లి ఆరోగ్య కేంద్రంలో సీహెచ్ఓ డిప్యుటేషన్‌తో నల్లగొండలో విధులు నిర్వహిస్తున్నారు. ల్యాబ్ అసిస్టెంట్ విధులకు హాజరుకావటం లేదు. నీటి సమస్య ఉంది. రెండేళ్లుగా ఆపరేషన్లు చేయటం లేదు. -
పాపకు ఒంటిపై పులిపిరుల వంటి కాయలు...?
మా అమ్మాయికి ఏడేళ్లు. ఆమెకు ముఖంతో పాటు ఒంటిపైన అక్కడక్కడా చిన్న చిన్న పులిపిరి కాయల్లాంటివి కనిపిస్తున్నాయి. మేం గమనించిన దాని ప్రకారం అవి రోజురోజుకూ పెరుగుతున్నాయి. అవి జీవితాంతం వస్తూనే ఉంటాయని కొందరు ఫ్రెండ్స్ చెబుతున్నారు. దాంతో మాకు ఆందోళనగా ఉంది. మా పాప విషయంలో మాకు సరైన సలహా ఇవ్వండి. - ధరణి, నరసరావుపేట మీరు చెప్పిన కొద్దిపాటి వివరాలను బట్టి మీ పాపకు ఉన్న కండిషన్ ములస్కమ్ కంటాజియోజమ్ కావచ్చని అనిపిస్తోంది. ఇది వైరస్ వల్ల వచ్చే ఒక రకం చర్మవ్యాధి. ముఖ్యంగా రెండు నుంచి పన్నెండేళ్ల పిల్లల్లో దీన్ని చాలా ఎక్కువగా చూస్తుంటాం. వ్యాప్తి జరిగే తీరు : చర్మానికి చర్మం తగలడం వల్ల, తువ్వాళ్ల వంటి వాటి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వాళ్ల నుంచి వాళ్లకే వ్యాపించడం కూడా ఉంటుంది. దీన్నే సెల్ఫ్ ఇనాక్యులేషన్ అంటారు. అలర్జిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లోనూ, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారుల్లోనూ ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ లీజన్స్ (పులిపిరుల్లాంటివి) తేమ ఎక్కువగా ఉండే శరీరంలో భాగాల్లో అంటే... బాహుమూలాలు, పొత్తికడుపు కింద (గ్రోయిన్), మెడ వంటి చర్మం మడత పడే ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుండవచ్చు. చికిత్స : ఇవి తగ్గడానికి కొంతకాలం వేచిచూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు క్రయోథెరపీ, క్యూరటాజ్ వంటి ప్రక్రియలతో వీటికి చికిత్స చేయవచ్చు. ఇక దీనితో పాటు కొన్ని ఇమ్యునలాజికల్ మెడిసిన్స్‌తోనూ వీటికి చికిత్స చేయవచ్చు. ఉదాహరణకు ఇమిక్యుమాడ్ అనే క్రీమ్‌ను లీజన్స్ ఉన్న ప్రాంతంలో కొన్ని నెలల పాటు పూయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పైన పేర్కొన్న ఇతర ప్రక్రియల (ఉదా: క్రయోథెరపీ వంటివి)తో పాటు ఇమిక్యుమాడ్ వాడటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. మీరు ఒకసారి మీ చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి చికిత్సను కొనసాగించండి. మా పాప వయస్సు ఆరేళ్లు. కొన్నాళ్ల క్రితం బాగా జలుబు చేస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాం. ముక్కు నుంచి చెవికి ఉండే ఎడినాయిడ్ గ్రంథి బ్లాక్ అయిందని ఆయన చెప్పారు. జలుబు తగ్గిపోయింది గానీ... ఇప్పుడు మరో పక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. మా పాపకు ఎందుకిలా జరుగుతోంది? - సురేఖ, కొత్తగూడెం మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. చిన్న పిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. టాన్సిల్స్‌కు వచ్చినట్లే వీటికి కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. ఇలాంటప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనసైటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది (రెస్ట్‌లెస్ స్లీప్) వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు చాలా దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో మాత్రం చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్ లేదా ఈఎన్టీ సర్జన్‌ను కలిసి తగు చికిత్స తీసుకోండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
మందుల ధరలు దిగొచ్చాయోచ్..
తూప్రాన్, న్యూస్‌లైన్:అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడంతో సతమతమవుతున్న సామాన్యుడికి మందుల ధరల్లో తగ్గుదల ఊరటనిస్తోంది. ప్రాణాపాయ, దీర్ఘకాలిక జబ్బులకు ఉపయోగించే మందుల ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో దాదాపు 348 రకాల మందుల ధరలు 10 నుంచి 45 శాతం మేర తగ్గాయి. అయితే కొన్ని మందులు 60 శాతం వరకు తగ్గినట్టు సమాచారం. ప్రధానంగా ఎయిడ్స్, క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు, కొన్ని రకాల యాంటిబైటిక్, న్యూరాలజీ, శస్త్రచికిత్సలకు ముందు, తర్వాత వాడే మందుల ధరలు తగ్గాయి. గత ఆగస్టు 15న ఔషధ ధరల నియంత్రణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు 45 రోజుల గడువు ఇచ్చింది. ఇచ్చిన గడువు పూర్తి కావడంతో పక్షం రోజుల క్రితం నుంచే మందుల ధరలు అదుపులోకి వచ్చాయి. మందుల ధరలపై నియంత్రణ ఈ చట్టం ద్వారా 348 రకాల మందుల ధరలపై నియంత్రణ ఉంటుంది. జిల్లాలో 1,136 వరకు మెడికల్, 80 వరకు హోల్‌సేల్(డిస్ట్రిబూటర్ ఏజెన్సీలు) షాపులు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు కోట్లాది రూపాయల వ్యాపారం సాగుతోంది. కంపెనీలను బట్టి టాబ్లెట్ల ధరల్లో 45 శాతం వరకు తగ్గుదల కన్పిస్తుంది. బీపీకి ఉపయోగించే ఎటెనల్(14 మాత్రలు) గతంలో రూ.51 ఉండగా ప్రస్తుతం రూ.30.43కు, ఫిట్స్ కు వాడే ఎప్టైన్ (100 మాత్రలు) ధర రూ.232 నుంచి రూ.149కి త గ్గింది. కొలెస్ట్రాల్‌కు వాడే ఎటర్వాస్టాటిన్(10 మాత్రలు) రూ.104 నుంచి రూ.62కు, ఇన్ఫెక్షన్ నివారణకు వాడే ఎజిత్రాల్ (3 మాత్రలు) రూ.95.55 నుంచి రూ. 62.55కు దిగి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 1995 నుంచి ఔషధ ధరల నియంత్రణ చట్టం అమలు చేస్తున్నా పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. ఈ కొత్త చట్టాన్ని పక్కా ప్రణాళికతో అమలు చేయాలని నిర్ణయించడంతో 348 రకాల మందుల ధరలు తగ్గాయి. ఇదివరకైతే... ఇదివరకైతే ఔషధాల ధరలను కంపెనీలే నిర్ణయించేవి. వీటికి అదనంగా జోడించి హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు విక్రయిస్తూ వచ్చారు. ఈ పద్ధతికి కొత్త చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇకపై ఔషధ ఉత్పత్తి పరిశ్రమలు, మందుల దుకాణ యజమానులు తమ ఇష్టానుసారంగా ధరలు నిర్ణయించి విక్రయించే వీలు లేదు. పెద్ద కంపెనీలైనా.. చిన్నవైనా ప్రభుత్వం నిర్దేశించిన ధరకే మందులను విక్రయించాల్సి ఉంటుం దని తేల్చి చెప్పింది. అయితే వ్యాపారులకు లాభాలు కొంతమేర తగ్గనున్నాయి. ఈ విధానం వల్ల డిస్ట్రిబ్యూటర్ స్థాయిలో రెండు శాతం, రిటైల్ స్థాయిలో ఆరు శాతం లాభాలు తగ్గి వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. పాత ధరలకు విక్రయిస్తే చర్యలు.. ఔషధ ధరల నియంత్రణ కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో మందుల ధరలు తగ్గాయి. ఎవరైనా పాత ధరలకే మందులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. ఇదే విషయాన్ని ఆయా దుకాణాల నిర్వాహకులు, యూనియన్ నాయకులకు సూచించాం. పాత స్టాకు ఉంటే వెంటనే కంపెనీలకు అప్పగించాలి. - ప్రభాకర్, సిద్దిపేట డివిజన్ ఔషధ నియంత్రణ అధికారి