మనుషుల ముక్కులోనే యాంటీబయాటిక్! | New antibiotic capable of killing superbugs discovered inside the human nose | Sakshi
Sakshi News home page

మనుషుల ముక్కులోనే యాంటీబయాటిక్!

Published Sat, Sep 10 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

మనుషుల ముక్కులోనే యాంటీబయాటిక్!

మనుషుల ముక్కులోనే యాంటీబయాటిక్!

కొత్త కొత్త కెమికల్ కాంబినేషన్స్‌తో కొత్త యాంటీబయాటిక్స్ కనుగొనడం... వాటిని తట్టుకొని మనుగడ కొనసాగించేలా బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నిరోధకత సాధించడం... ఇది ఒక పరుగుపందెంలా సాగింది. వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా క్రిములు కొత్త యాంటీబయాటిక్స్‌కు లొంగకపోవడంతో మరింత శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ కోసం వెతుకులాట చాలాకాలంగానే సాగుతోంది. పైగా ఇది కొంత శక్తికి మించిన పనే అయ్యింది. అయితే మనుషుల ముక్కు రంధ్రాల్లోనే శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ ఉన్నట్లు ఇటీవల జర్మన్ శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది.

ఇది అందరిలోనూ ఉండదు. ఏ పదిమందిలోనో ఒకరి ముక్కు రంధ్రాల్లో ఇది ఉంటుందట. ఈ కొత్త యాంటీబయాటిక్ సేరు ‘లుగ్డునిన్’. ఎన్నెన్నో యాంటీబయాటిక్స్ నిరోధకత సాధించిన ‘మెథిసిలిన్ రెసిస్టెన్స్ స్టెఫాలోకోకస్ ఆరియస్’ (ఎమ్‌ఆర్‌ఎస్‌ఏ) అనే బ్యాక్టీరియాను సైతం ఇది సమర్థంగా నిర్మూలించగలదంటున్నారు శాస్త్రజ్ఞులు. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ట్యూబిజెన్‌కు చెందిన శాస్త్రవేవత్త బృందం ఈ తరహా యాంటీబయాటిక్ కోసం మానవ శరీరంలోనే కాస్తంత మురికిగా ఉండే ప్రాంతాల్లోనే వెతికిందట. అప్పుడు ముక్కు రంధ్రాల్లో ఉండే ‘లుగ్డునిన్’ బయటపడ్డట్లు ఈ శాస్త్రవేత్తలో బృందంలో ఒకరైన యాండ్రియస్ పెష్చెల్ తెలిపారు. తాము తమ వెతుకులాటలో విజయం సాధించామని ఆ శాస్త్రజ్ఞుడు పేర్కొన్నారు.

ప్రస్తుతం ‘ఎమ్‌ఆర్‌ఎస్‌ఏ’ను ఎదుర్కొంటున్న ‘లుగ్డునిన్’... పారిశ్రామికంగా ఉత్పత్తి చేశాక కూడా ఇంతే సమర్థంగా నిర్మూలించగలదని నిరూపితమైతే ఇది కొత్త శకానికి నాంది పలుకుతుందంటున్నారు పరిశోధకులు. అయితే ‘లుగ్డునిన్’ను ఉత్పత్తి చేసేది కూడా ఒక బ్యాక్టీరియా కావడం విశేషం. దీని పేరు ఎస్ లుగ్డునెసిస్. ఇది ఒకింత ప్రమాదకారి అనీ, ఒకవేళ ఉత్పత్తి కోసం తాము వెతుకుతున్న ఇదే బ్యాక్టీరియా ఒకవేళ మానవులకు ప్రమాదకారిగా మారితే ఎలా అని కూడా శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కాకపోతే ఒక ఆశాకిరణం ఏమిటంటే... అది ప్రమాదకరంగా మారడాన్ని నిలువరించగలిగితే... చాలాకాలంగా కొత్త యాంటీబయాటిక్స్ లేని లోటు తీరుతుంది. ప్రస్తుతం తాము తెలుసుకున్న అంశాన్ని ఉపయోగించుకొని... ఆ బ్యాక్టీరియా ప్రమాదకరంగా కాని రీతిలోనే కొత్త యాంటీబయాటిక్‌ను సృష్టించే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement