German scientists
-
ఈ యాంటీబాడీలతో కరోనా వైరస్ ఫట్!
బెర్లిన్: కరోనా వైరస్‌పై అత్యధిక సామర్థ్యంతో పనిచేయగల యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ యాంటీబాడీలతో కోవిడ్ వైరస్ నియంత్రణకు పరోక్ష టీకాను తయారు చేయవచ్చునని అంచనా. ప్రస్తుతం వేర్వేరు కంపెనీలు అభివృద్ధి చేస్తున్న టీకా శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించిన యాంటీబాడీల ద్వారా తయారయ్యే టీకా నేరుగా శరీరంలోకి ప్రవేశించి వైరస్‌ను అడ్డుకుంటుంది. ‘సెల్’జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం కొన్ని కరోనా వైరస్ యాంటీబాడీలు వేర్వేరు అవయవాల తాలూకూ కణజాలానికి అతుక్కుపోతాయి. ఫలితంగా అనవసరమైన దుష్ప్రభావాలు కనిపించే అవకాశం ఉంటుంది. జర్మన్ సెంటర్ ఫర్ న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ శాస్త్రవేత్తలు సుమారు 600 యాంటీబాడీలను రోగుల నుంచి సేకరించి పరిశోధనలు చేపట్టా్టరు. వీటిల్లో వైరస్‌కు బాగా అతుక్కుపోగల వాటిని కొన్నింటిని గుర్తించారు. పోషక ద్రావణాల సాయంతో ఈ యాంటీబాడీలను కృత్రిమంగా వృద్ధి చేసి ప్రయోగించినప్పుడు వైరస్ కణంలోకి ప్రవేశించడం అసాధ్యంగా మారుతుందని తెలిసింది. దీంతోపాటు వైరస్ నకళ్లు ఏర్పరచుకోవడం కూడా వీలు కాదు. యాంటీబాడీలు వైరస్‌ను గుర్తిస్తున్న కారణంగా రోగ నిరోధక వ్యవస్థ తాలూకూ కణాలు కూడా వీటిపై దాడి చేసేందుకు వీలేర్పడుతుంది. జంతు ప్రయోగాల్లో ఈ యాంటీబాడీలు బాగా పనిచేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ యాంటీబాడీలు మిగిలిన వాటికంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఇవి చికిత్స, రక్షణలు రెండింటికీ ఉపయోగించవచ్చునని వివరించారు. -
అప్పట్లో అనర్థం... ఇప్పుడు ఆమోదం
అరవయ్యేళ్ల కిందట కనుగొన్న ఒక మందు అప్పట్లో అనర్థం సృష్టించింది. ఫలితంగా ఆంక్షలకు గురైంది. అప్పట్లో ఆ మందు సృష్టించిన అనర్థం ఔషధ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా పేరుమోసింది. కొన్నాళ్లకు అదే మందుకు మళ్లీ ఆమోదం లభించింది. జర్మన్ శాస్త్రవేత్తలు కనుగొన్న ‘థలిడోమైడ్’ అనే మందు 1957లో తొలిసారిగా మార్కెట్లోకి విడుదలైంది. అప్పట్లో దీనిని గర్భిణుల్లో తలెత్తే వేవిళ్ల బాధను నయం చేయడానికి వాడేవారు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండానే దీనిని మందుల దుకాణాల్లో యథేచ్ఛగా అమ్మేవారు. అమ్మకాలు జోరందుకున్న కొద్ది నెలలకే దీని వల్ల తలెత్తిన అనర్థాలు వెలుగులోకి వచ్చాయి. ‘థలిడోమైడ్’ వాడిన మహిళలకు పుట్టిన శిశువులు అవయవ లోపాలతో పుట్టారు. అలా పుట్టిన వాళ్లలో అరవై శాతం మంది నెలల పసికందులుగా ఉన్నప్పుడే కన్నుమూశారు. ఈ మందు దుష్ప్రభావాల ఫలితంగా అవయవ లోపాలతో పుట్టిన శిశువుల్లో దాదాపు పదివేల మంది మాత్రమే బతికి బట్ట కట్టగలిగారు. శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ అనర్థాలన్నింటికీ కారణం థలిడోమైడేనని తేలడంతో అంతర్జాతీయ ఔషధ నియంత్రణ సంస్థలు దీనిపై నానా ఆంక్షలు విధించాయి. తర్వాతి కాలంలో జరిపిన పరిశోధనల్లో ఈ మందు కొన్ని రకాల క్యాన్సర్‌ను సమర్థంగా నయం చేయగలదని నిర్ధారించడంలో ఈ ఔషధానికి మళ్లీ ఆమోదం లభించింది. -
మనుషుల ముక్కులోనే యాంటీబయాటిక్!
కొత్త కొత్త కెమికల్ కాంబినేషన్స్‌తో కొత్త యాంటీబయాటిక్స్ కనుగొనడం... వాటిని తట్టుకొని మనుగడ కొనసాగించేలా బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నిరోధకత సాధించడం... ఇది ఒక పరుగుపందెంలా సాగింది. వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా క్రిములు కొత్త యాంటీబయాటిక్స్‌కు లొంగకపోవడంతో మరింత శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ కోసం వెతుకులాట చాలాకాలంగానే సాగుతోంది. పైగా ఇది కొంత శక్తికి మించిన పనే అయ్యింది. అయితే మనుషుల ముక్కు రంధ్రాల్లోనే శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ ఉన్నట్లు ఇటీవల జర్మన్ శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది. ఇది అందరిలోనూ ఉండదు. ఏ పదిమందిలోనో ఒకరి ముక్కు రంధ్రాల్లో ఇది ఉంటుందట. ఈ కొత్త యాంటీబయాటిక్ సేరు ‘లుగ్డునిన్’. ఎన్నెన్నో యాంటీబయాటిక్స్ నిరోధకత సాధించిన ‘మెథిసిలిన్ రెసిస్టెన్స్ స్టెఫాలోకోకస్ ఆరియస్’ (ఎమ్ఆర్ఎస్ఏ) అనే బ్యాక్టీరియాను సైతం ఇది సమర్థంగా నిర్మూలించగలదంటున్నారు శాస్త్రజ్ఞులు. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ట్యూబిజెన్కు చెందిన శాస్త్రవేవత్త బృందం ఈ తరహా యాంటీబయాటిక్ కోసం మానవ శరీరంలోనే కాస్తంత మురికిగా ఉండే ప్రాంతాల్లోనే వెతికిందట. అప్పుడు ముక్కు రంధ్రాల్లో ఉండే ‘లుగ్డునిన్’ బయటపడ్డట్లు ఈ శాస్త్రవేత్తలో బృందంలో ఒకరైన యాండ్రియస్ పెష్చెల్ తెలిపారు. తాము తమ వెతుకులాటలో విజయం సాధించామని ఆ శాస్త్రజ్ఞుడు పేర్కొన్నారు. ప్రస్తుతం ‘ఎమ్ఆర్ఎస్ఏ’ను ఎదుర్కొంటున్న ‘లుగ్డునిన్’... పారిశ్రామికంగా ఉత్పత్తి చేశాక కూడా ఇంతే సమర్థంగా నిర్మూలించగలదని నిరూపితమైతే ఇది కొత్త శకానికి నాంది పలుకుతుందంటున్నారు పరిశోధకులు. అయితే ‘లుగ్డునిన్’ను ఉత్పత్తి చేసేది కూడా ఒక బ్యాక్టీరియా కావడం విశేషం. దీని పేరు ఎస్ లుగ్డునెసిస్. ఇది ఒకింత ప్రమాదకారి అనీ, ఒకవేళ ఉత్పత్తి కోసం తాము వెతుకుతున్న ఇదే బ్యాక్టీరియా ఒకవేళ మానవులకు ప్రమాదకారిగా మారితే ఎలా అని కూడా శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కాకపోతే ఒక ఆశాకిరణం ఏమిటంటే... అది ప్రమాదకరంగా మారడాన్ని నిలువరించగలిగితే... చాలాకాలంగా కొత్త యాంటీబయాటిక్స్ లేని లోటు తీరుతుంది. ప్రస్తుతం తాము తెలుసుకున్న అంశాన్ని ఉపయోగించుకొని... ఆ బ్యాక్టీరియా ప్రమాదకరంగా కాని రీతిలోనే కొత్త యాంటీబయాటిక్‌ను సృష్టించే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. -
10 సెకన్లలో 60 జీబీని పంపారు!
బెర్లిన్: వైర్లెస్ సమాచారాన్ని రేడియో తరంగాల ద్వారా వేగంగా పంపించడంలో జర్మన్ శాస్త్రవేత్తలు కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. జర్మనీలోని స్టట్గార్ట్ వర్సిటీ, ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్కు చెందిన అప్లయిడ్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధక బృందం ఈ రికార్డును సాధించారు. జర్మనీలోని వాచ్బెర్గ్ టౌన్‌కు కొలొగ్నె కు మధ్య దూరం 36.7 కి.మీటర్లు. ఈ బృందం రెండుప్రాంతాలకు 60 గిగాబైట్ల సమాచారాన్ని రేడియో తరంగాల ద్వారా కేవలం 10 సెకన్లలో పంపింది. అంటే సెకనుకు 6 గిగాబైట్లా సమాచారాన్ని పంపించారు. ఇందుకు ఈ-బ్యాండుగా పిలిచే 71-76 గిగా హెట్జ్ రేడియో ఫ్రిక్వెన్సీలో ఈ సమాచారాన్ని అందించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. భవిష్యత్తులో పల్లెల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావచ్చని పరిశోధకులంటున్నారు. 250 ఇంటర్నెట్ కనెక్షన్లు ఒక సెకనుకు 24 మెగాబైట్ల సమాచారాన్ని పంపగల్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. -
రుతుపవనాలపై కచ్చిత సమాచారం
కొత్త విధానం రూపొందించిన జర్మన్ శాస్త్రవేత్తలు బెర్లిన్: భారత్‌లో రుతుపవనాల ఆగమనం, నిష్ర్కమణాన్ని ముందుగానే కచ్చితంగా అంచనా వేసే కొత్త పద్ధతిని జర్మనీ వాతావరణ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ సరికొత్త విధానం భారత ఉపఖండంలో ఆహారోత్పత్తితో పాటు జల విద్యుత్‌ను పెంచేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు చె బుతున్నారు. ప్రాంతీయ వాతావరణ సమాచారం సమగ్ర విశ్లేషణ ఆధారంగా ఈ విధానం పనిచేస్తుందని, దీన్ని ఉపయోగిస్తే భారత వాతావరణ విభాగం మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు. రుతుపవనాల రాకపై 70 శాతం సరైన సమాచారం ఇచ్చిందని, నిష్ర్కమణంపై 80 శాతం కచ్చితంగా ఫలితం వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే ఎల్ నినో, లా నినా సమయాల్లో రుతుపవనాల అంచనాపై మెరుగైన సమాచారం ఇస్తుందని జర్మన్ పరిశోధకులు అంటున్నారు. జర్మనీలో పోట్సడామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్(పీఐకె) చెందిన వెరోనికా స్టొల్బోవా మాట్లాడుతూ... కొత్త పద్ధతితో భారత్‌లో రుతుపవనాల రాకను రెండు వారాల ముందుగానే అంచనా వేయగలమని, నిష్ర్కమణను ఆరు వారాల ముందుగానే చెప్పవచ్చన్నారు. ఉత్తర పాకిస్తాన్, తూర్పు కనుమలు, హిందూ మహాసముద్రానికి సమీపంలోని పర్వత ప్రాంతాలు, కేరళల్లో ఉష్ణోగ్రతల్లో మార్పు, తేమ రుతుపవనాల విషయంలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించామన్నారు.