Human nose
-
మనుషుల ముక్కులోనే యాంటీబయాటిక్!
కొత్త కొత్త కెమికల్ కాంబినేషన్స్‌తో కొత్త యాంటీబయాటిక్స్ కనుగొనడం... వాటిని తట్టుకొని మనుగడ కొనసాగించేలా బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు నిరోధకత సాధించడం... ఇది ఒక పరుగుపందెంలా సాగింది. వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా క్రిములు కొత్త యాంటీబయాటిక్స్‌కు లొంగకపోవడంతో మరింత శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ కోసం వెతుకులాట చాలాకాలంగానే సాగుతోంది. పైగా ఇది కొంత శక్తికి మించిన పనే అయ్యింది. అయితే మనుషుల ముక్కు రంధ్రాల్లోనే శక్తిమంతమైన యాంటీబయాటిక్స్ ఉన్నట్లు ఇటీవల జర్మన్ శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది. ఇది అందరిలోనూ ఉండదు. ఏ పదిమందిలోనో ఒకరి ముక్కు రంధ్రాల్లో ఇది ఉంటుందట. ఈ కొత్త యాంటీబయాటిక్ సేరు ‘లుగ్డునిన్’. ఎన్నెన్నో యాంటీబయాటిక్స్ నిరోధకత సాధించిన ‘మెథిసిలిన్ రెసిస్టెన్స్ స్టెఫాలోకోకస్ ఆరియస్’ (ఎమ్ఆర్ఎస్ఏ) అనే బ్యాక్టీరియాను సైతం ఇది సమర్థంగా నిర్మూలించగలదంటున్నారు శాస్త్రజ్ఞులు. జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ ట్యూబిజెన్కు చెందిన శాస్త్రవేవత్త బృందం ఈ తరహా యాంటీబయాటిక్ కోసం మానవ శరీరంలోనే కాస్తంత మురికిగా ఉండే ప్రాంతాల్లోనే వెతికిందట. అప్పుడు ముక్కు రంధ్రాల్లో ఉండే ‘లుగ్డునిన్’ బయటపడ్డట్లు ఈ శాస్త్రవేత్తలో బృందంలో ఒకరైన యాండ్రియస్ పెష్చెల్ తెలిపారు. తాము తమ వెతుకులాటలో విజయం సాధించామని ఆ శాస్త్రజ్ఞుడు పేర్కొన్నారు. ప్రస్తుతం ‘ఎమ్ఆర్ఎస్ఏ’ను ఎదుర్కొంటున్న ‘లుగ్డునిన్’... పారిశ్రామికంగా ఉత్పత్తి చేశాక కూడా ఇంతే సమర్థంగా నిర్మూలించగలదని నిరూపితమైతే ఇది కొత్త శకానికి నాంది పలుకుతుందంటున్నారు పరిశోధకులు. అయితే ‘లుగ్డునిన్’ను ఉత్పత్తి చేసేది కూడా ఒక బ్యాక్టీరియా కావడం విశేషం. దీని పేరు ఎస్ లుగ్డునెసిస్. ఇది ఒకింత ప్రమాదకారి అనీ, ఒకవేళ ఉత్పత్తి కోసం తాము వెతుకుతున్న ఇదే బ్యాక్టీరియా ఒకవేళ మానవులకు ప్రమాదకారిగా మారితే ఎలా అని కూడా శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కాకపోతే ఒక ఆశాకిరణం ఏమిటంటే... అది ప్రమాదకరంగా మారడాన్ని నిలువరించగలిగితే... చాలాకాలంగా కొత్త యాంటీబయాటిక్స్ లేని లోటు తీరుతుంది. ప్రస్తుతం తాము తెలుసుకున్న అంశాన్ని ఉపయోగించుకొని... ఆ బ్యాక్టీరియా ప్రమాదకరంగా కాని రీతిలోనే కొత్త యాంటీబయాటిక్‌ను సృష్టించే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. -
తుమ్మితే రాలిపోని విషయాలు
ట్రివియా ⇒ ముక్కు. ఊపిరి తీసుకోవడానికి, వాసన చూడటానికి ఉపయోగపడుతుంది. ముఖసౌందర్యంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మనుషుల ముక్కుల్లో ప్రధానంగా పదిహేడు రకాలు ఉన్నట్లు ఒక తాజా సర్వేలో తేలింది. ⇒ మనుషుల్లో పదేళ్ల వయసు వచ్చేసరికి ముక్కు తన పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది. అయితే, పురుషుల్లో 17-19 ఏళ్లు, మహిళల్లో 15-17 ఏళ్ల వరకు ముక్కు ఎదుగుదల కొనసాగుతుంది. ⇒ మనుషులు కనీసం పదివేలకు పైగా వాసనలను గుర్తించగలరు. ⇒ మనుషుల ముక్కులో ఆఘ్రాణశక్తిని ఇచ్చే కణాలు దాదాపు 1.20 లక్షల వరకు ఉంటాయి. అయితే, అందరి ఘ్రాణశక్తి ఒకేలా ఉండదు. ⇒ ఎలాంటి వాసనలను గుర్తించలేని పరిస్థితిని ‘అనోస్మియా’ అని, స్వల్పస్థాయిలోని వాసనలను సైతం గుర్తించగల శక్తిని ‘హైపరోస్మియా’ అని అంటారు. ⇒ పురుషుల కంటే మహిళల్లోనే ఘ్రాణశక్తి ఎక్కువ. పసిపిల్లల్లోనూ ఘ్రాణశక్తి ఎక్కువగానే ఉంటుంది. పసిపిల్లలు వాసన ఆధారంగా తల్లులను గుర్తించగలుగుతారు. అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ మనుషుల్లో ఘ్రాణశక్తి క్రమంగా క్షీణిస్తుంది.. ⇒ కేవలం ముక్కుతోనే ఉపాధి పొందే వాళ్లు కూడా ప్రపంచంలో లేకపోలేదు. ఘనమైన ఘ్రాణశక్తి గల వారికి మద్యం ఉత్పత్తి సంస్థలు, పరిమళ ద్రవ్యాల ఉత్పత్తి సంస్థల్లో ప్రత్యేకమైన ఉద్యోగాలు ఉంటాయి. అలాంటి ఉద్యోగులు తమ ముక్కులకు బీమా చేయించుకుంటారు. ఇల్జా గోర్ట్ అనే డచ్ వైన్మేకర్ తన ముక్కును 80 లక్షల డాలర్లకు ఇన్సూర్ చేయించాడు. ⇒ ముక్కుకు ఎంతటి ఆఘ్రాణశక్తి ఉన్నా, ఇంధనంగా వాడే సహజ వాయువు ఉనికిని పసిగట్టలేదు. దీనివల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉండటంతో గ్యాస్ కంపెనీలు ఇందులో వాసన కలిగించే పదార్థాన్ని కలుపుతారు.