తుమ్మితే రాలిపోని విషయాలు
ట్రివియా
⇒ ముక్కు. ఊపిరి తీసుకోవడానికి, వాసన చూడటానికి ఉపయోగపడుతుంది. ముఖసౌందర్యంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మనుషుల ముక్కుల్లో ప్రధానంగా పదిహేడు రకాలు ఉన్నట్లు ఒక తాజా సర్వేలో తేలింది.
⇒ మనుషుల్లో పదేళ్ల వయసు వచ్చేసరికి ముక్కు తన పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది. అయితే, పురుషుల్లో 17-19 ఏళ్లు, మహిళల్లో 15-17 ఏళ్ల వరకు ముక్కు ఎదుగుదల కొనసాగుతుంది.
⇒ మనుషులు కనీసం పదివేలకు పైగా వాసనలను గుర్తించగలరు.
⇒
మనుషుల ముక్కులో ఆఘ్రాణశక్తిని ఇచ్చే కణాలు దాదాపు 1.20 లక్షల వరకు ఉంటాయి. అయితే, అందరి ఘ్రాణశక్తి ఒకేలా ఉండదు.
⇒ ఎలాంటి వాసనలను గుర్తించలేని పరిస్థితిని ‘అనోస్మియా’ అని, స్వల్పస్థాయిలోని వాసనలను సైతం గుర్తించగల శక్తిని ‘హైపరోస్మియా’ అని అంటారు.
⇒ పురుషుల కంటే మహిళల్లోనే ఘ్రాణశక్తి ఎక్కువ. పసిపిల్లల్లోనూ ఘ్రాణశక్తి ఎక్కువగానే ఉంటుంది. పసిపిల్లలు వాసన ఆధారంగా తల్లులను గుర్తించగలుగుతారు. అయితే, వయసు పెరుగుతున్న కొద్దీ మనుషుల్లో ఘ్రాణశక్తి క్రమంగా క్షీణిస్తుంది..
⇒ కేవలం ముక్కుతోనే ఉపాధి పొందే వాళ్లు కూడా ప్రపంచంలో లేకపోలేదు. ఘనమైన ఘ్రాణశక్తి గల వారికి మద్యం ఉత్పత్తి సంస్థలు, పరిమళ ద్రవ్యాల ఉత్పత్తి సంస్థల్లో ప్రత్యేకమైన ఉద్యోగాలు ఉంటాయి. అలాంటి ఉద్యోగులు తమ ముక్కులకు బీమా చేయించుకుంటారు. ఇల్జా గోర్ట్ అనే డచ్ వైన్‌మేకర్ తన ముక్కును 80 లక్షల డాలర్లకు ఇన్సూర్ చేయించాడు.
⇒ ముక్కుకు ఎంతటి ఆఘ్రాణశక్తి ఉన్నా, ఇంధనంగా వాడే సహజ వాయువు ఉనికిని పసిగట్టలేదు. దీనివల్ల ప్రమాదాలు తలెత్తే అవకాశాలు ఉండటంతో గ్యాస్ కంపెనీలు ఇందులో వాసన కలిగించే పదార్థాన్ని కలుపుతారు.