ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 48 ఏళ్లు. నెల రోజుల క్రితం నుంచి నా కాళ్ల ఎముకల్లో రాత్రివేళల్లో నొప్పి ఎక్కువగా వస్తోంది. దాంతో డాక్టర్‌ను సంప్రదించి యాంటీబయాటిక్ మందులు తీసుకున్నాను. అయినా ఎలాంటి ఫలితమూ లేదు. దీనికి చికిత్స సూచించండి.
- రఘునందన్‌రావు, ఆదిలాబాద్
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే ఇది అంత తేలికగా తీసుకునే విషయం కాదు. రాత్రివేళల్లో ఎముకల నొప్పి రావడం అంత మంచి సూచన కాదు. దీన్ని ఎముక క్యాన్సర్‌గా అనుమానించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎముక క్యాన్సర్లు నొప్పితో గాని, నొప్పి లేకుండా గాని కణుతులను గుర్తిస్తారు. అయితే మృదుకణజాలంలో క్యాన్సర్ సోకినప్పుడు ఆ కణితిలో నొప్పి ఉండకపోవచ్చు. కానీ గట్టిగా ఉండే ఎముక కణజాలంలో క్యాన్సర్ ఉంటే మాత్రం అది నొప్పి, వాపుతో కనిపించవచ్చు. ఎముక క్యాన్సర్ సాధారణంగా రక్తం ద్వారా ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది. క్యాన్సర్ ట్యూమర్ ఏర్పడినప్పుడు దాని చుట్టూ కొంత భాగం వరకు వాపు ఉంటుంది. అది వ్యాపించకుండా ఉండటం కోసం శరీరంలోని రక్షణ వ్యవస్థ దాని చుట్టూ ఒక చిన్న పొరను ఏర్పరుస్తుంది. అలాగే ఆ చుట్టూ ఉన్న భాగాన్ని రియాక్టివ్ జోన్ అంటారు. క్యాన్సర్ మొదటి స్థాయిలో ఉన్నవారికి శస్త్రచికిత్స చేసి ఆ భాగాన్ని తీసివేసే సమయంలో ఈ రియాక్టివ్ జోన్ వరకు ఉన్న కణాలను తొలగిస్తారు. కాబట్టి క్యాన్సర్ దుష్ర్పభావాలు మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. కొన్నిసార్లు ఎముకను పూర్తిగా తొలగించి ప్రోస్థెసిస్... అంటే కృత్రిమ ఎముక లేదా రాడ్‌ను అమర్చాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎముకను పూర్తిగా శుభ్రం చేసి, అక్కడికక్కడే ఎముకకు రేడియేషన్ అందించి, తిరిగి దాన్ని అమర్చుతారు. దాన్ని ఎక్స్‌ట్రా కార్పోరియల్ రేడియేషన్ థెరపీ అంటారు. చాలామంది ఎముకల్లో నొప్పి, వాపు అనగానే మసాజ్ చేయిస్తుంటారు. అది చాలా ప్రమాదకరం. ఇలా మసాజ్ చేయించడం వల్ల రక్తసరఫరా పెరిగి క్యాన్సర కణాలు మరింత త్వరగా ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి. నొప్పి, వాపు కనిపించగానే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి
కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
న్యూరాలజీ కౌన్సెలింగ్
నా వయసు 40 ఏళ్లు. నాకు కుడి అరచేయి, మణికట్టు భాగాల్లోనూ, వేళ్లలోనూ చాలా నొప్పిగా ఉంది. కొన్ని సందర్భాల్లో చేయి తిమ్మిర్లుగా కూడా ఉంటోంది. కొన్నిసార్లు నా చేత్తో ఏదీ ఎత్తలేకపోతున్నాను. దాంతో జీవితం దుర్భరమవుతోంది. నాకు థైరాయిడ్ సమస్య, డయాబెటిస్ కూడా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి.
- పి. సుధారాణి, విశాఖపట్నం
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనే రుగ్మతతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. చాలామంది దీన్ని కంప్యూటర్‌ను విస్తృతంగా వాడటం వల్ల వచ్చిన సమస్యగా భావిస్తుంటారు. అయితే దీని దాఖలాలు 20వ శతాబ్దారంభం నుంచీ కనిపిస్తున్నాయి.
కార్పల్ టన్నెల్ అనేది మణికట్టులో ఉండే ఒక సన్నటి ద్వారం. దీని నుంచే అరచేతిలోకి వేళ్లలోకి మీడియన్ నెర్వ్ అనే నరం ప్రవేశిస్తుంది. ఇక మన వేళ్లను వంచడానికి ఉపయోగపడే టెండన్స్‌కు కూడా ఇదే ద్వారం నుంచి వెళ్తాయి. ఈ టన్నెల్ మన బొటనవేలి అంత వైశాల్యంతో ఉంటుంది. దీని చుట్టూరా కార్పల్ అనే ఎముకలూ, ఫెక్సార్ రెటినాకులమ్ అనే లిగమెంట్లు ఉంటాయి. మణికట్టులో మీడియన్ నర్వ్ మీద ఒత్తిడి పడితే అది చెయ్యి బలహీనంగా అనిపించడానికీ, తిమ్మిర్లకూ కారణమవుతుంది. మీడియన్ నర్వ్ అటు స్పర్శజ్ఞానంతో పాటు కదలిలకూ ఉపయోగపడుతుంది. అది బొటనవేలు, చూపుడువేలు, మధ్యవేలితో పాటు కొంతవరకు ఉంగరపు వేలికీ వెళ్తుంది. ఆయావేళ్ల కదలికలకు అది తోడ్పడుతుంది. అందుకే దాని మీద మణికట్టు భాగంలో ఒత్తిడి పడితే ఈ వేళ్ల పైనా ప్రభావం పడుతుంది. టన్నెల్‌ను రూపొందించేలా మణికట్టులోని ఎముకల పైపొరతో పాటు కందెన (లూబ్రికేషన్)లా పనిచేయాల్సిన సైనోవియమ్ పొర వాపు వల్ల మీడియన్ నరంపై ఒత్తిడి పడుతుంది.
ప్యాకేజీ పరిశ్రమల్లో పనిచేసే వారిలో ఇది చాలాఎక్కువ. రోగిని పరిశీలించడంతో ఎలక్ట్రోఫిజియాలజీ పరీక్షల ద్వారా కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేయవచ్చు. మణికట్టు ఎముకలను కదలకుండా పట్టి ఉంచే పట్టీలు వేయడం లేదా కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. పని మధ్యలో అప్పుడప్పుడూ మణికట్టుకు విశ్రాంతి ఇస్తుండటం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.
డాక్టర్ ఆనంద్
బాలసుబ్రహ్మణ్యం,
సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్
ఆయుర్వేద కౌన్సెలింగ్
నా వయసు 57 ఏళ్లు. రెండు నెలల నుంచి నా చర్మం మీద పొలుసులు పొలుసులుగా పొట్టురాలుతూ, దురదతో కూడిన తెలుపు, ఎరుపు రంగు మచ్చలు, దద్దుర్లు వస్తున్నాయి. డాక్టర్లు సోరియాసిస్ అన్నారు. మందులు వాడినా ఫలితం చాలా తక్కువ. సంపూర్ణంగా నయమవడానికి ఆయుర్వేద మందులు తెలియజేయగలరు.
- రామచంద్రయ్య, విజయవాడ
ఆయుర్వేదంలో చర్మరోగాలన్నీ ‘కుష్ఠ’ అనే పేరు మీద వర్ణితమయ్యాయి. మీ లక్షణాలను బట్టి చూస్తే అది ‘కిటిభ’కుష్ఠం అనే చర్మరోగంగా కనిపిస్తోంది. ఈ కింది సలహాలు పాటిస్తూ, సూచించిన మందుల్ని ఒక నెల పాటు వాడి పరిస్థితిని సమీక్షించుకోండి.
ఉప్పు, పులుపు, కారాలని త్యజిస్తూ తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని, విశేషంగా ద్రవాహారాన్ని తీసుకోవాలి డయాబెటిస్ వంటి ఇతర వ్యాధులుంటే వాటిని అదుపులోకి తెచ్చుకోవాలి మద్యం, పొగతాగే అలవాట్లను విసర్జించాలి ఎలాంటి మానసిక ఉద్వేగాలకూ తావీయకూడదు. రెండుపూటలా పదేసి నిమిషాలు ప్రాణాయామం విధిగా చెయ్యాలి అతిశీతల వాతావరణానికి దూరంగా ఉండాలి.
ఔషధాలు : త్రిఫలాచూర్ణం 5 నుంచి 10 గ్రాములు ప్రతిరాత్రి నీళ్లతో గంధక రసాయనం (మాత్రలు): ఉదయం 2, సాయంత్రం 2 (ఖాళీ కడుపున)లఘుసూతశేఖర రస (మాత్రల) రెండేసి మూడు పూటలా ఖదిరారిష్ఠ, మహామంజిష్టాద్యరిష్ట ద్రావకాలు: రెండేసి చెంచాలు ఒక గ్లాసుతో కలిపి, సమానంగా నీళ్లు కలిపి మూడుపూటలా తాగాలి మహామరీచాది తైలంకానీ దూర్వాది తైలంగానీ, పైపూతకు మూడు పూటలా వాడాలి.
గృహవైద్యం : ఉసిరికాయ (ఆమలకీ) రసం రెండు చెంచాలు + పసుపు ఒక గ్రాము కలిపి తేనెతో, రెండుపూటలా సేవించాలి.
డాక్టర్ వృద్ధుల
లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్ హుమాయూన్‌నగర్, హైదరాబాద్
అది అంత మంచి సూచన కాదు..!
Published Fri, Mar 11 2016 11:12 PM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM
Advertisement
Advertisement