పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా పాప వయసు ఐదేళ్లు. ఈమధ్య చాలా ఎక్కువగా నిద్రపోతోంది. రోజుకు దాదాపు 17 గంటలు పడుకునే ఉంటోంది. తినడానికి లేపినా కూడా లేవడం లేదు. డాక్టర్‌ను సంప్రదించాం. మందులు ఇచ్చినా ప్రయోజనం కనిపించలేదు. పాప ఇలా అతిగా నిద్రపోవడానికి కారణాలు ఏమిటి? తగిన సలహా ఇవ్వండి.
– వనజ, పాడేరు
మీరు చెప్పిన లక్షణాలను బట్టి పాప నిద్రపోవాల్సిన సమయం కంటే చాలా ఎక్కువ సేపు పడుకుంటోందని చెప్పవచ్చు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు తక్కువే. పెద్దల్లోనైనా, పిల్లల్లోనైనా నిద్రపోవడానికి తగినంత వ్యవధి, నిద్రలో తగినంత నాణ్యత ఉండటం చాలా ముఖ్యం. ఇక తగినంత నిద్రలేకపోయినా, చాలా ఎక్కువగా నిద్రపోతున్నా మనం ఆ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.
సాధారణంగా పగటిపూట ఎక్కువసేపు పడుకునే పిల్లలను సోమరులుగా, ప్రవర్తనల్లో తేడాలు ఉన్నవారుగా చిత్రీకరిస్తుంటారు. ఇది సరికాదు. పిల్లలకు ఎంత నిద్ర అవసరం అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో పిల్లల్లో ఎక్కువసేపు నిద్రపోతూ ఉండే సమస్యను డయాగ్నోజ్ చేయడం కూడా ఒకింత కష్టమే.
అతి నిద్రకు కారణాలు
పిల్లలు అతిగా నిద్రపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిద్రలో తగినంత నాణ్యత లేకపోవడం ఒక కారణం కావచ్చు. దానితో పాటు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు కూడా మరొకి కారణం కావచ్చు. రాత్రి సరైన వేళకు నిద్రపట్టేలా, వేకువజామున వెలుగు రాగానే నిద్రలేచేలా నియంత్రించేందుకు మెదడులో ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. అది ఇలా క్రమబద్ధంగా నిద్రపుచ్చుతూ, నిద్రలేపుతూ ఉంటుంది. దీన్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ రిథమ్‌లో వచ్చిన మార్పులు కూడా నిద్ర సమస్యలకు దారి తీస్తాయి. ఇక అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే నార్కోలెప్సీ అనే జబ్బు వల్ల కూడా సమస్యలు రావచ్చు. దీనికి తోడు మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. అవి...
∙మన వ్యాధి నిరోధక శక్తి మనపైనే ప్రతికూలంగా పనిచేసే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ∙నరాలకు సంబంధించిన సమస్యలు స్థూలకాయం ∙థైరాయిడ్ సమస్యలు ∙ఇన్‌ఫ్లుయెంజా ∙మోనోన్యూక్లియాసిస్ ∙ఫైబ్రోమయాల్జియా ∙సీలియాక్ డిసీజ్ వంటివి కూడా నిద్రకు సంబంధించిన రుగ్మతలకు కారణాలని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం వాడే మందుల వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవచ్చు, దానితో రోజంతా నిద్రమత్తుగా అనిపించే అవకాశం ఉంది.
ఇక మీరు మీ లేఖలో మీ పాపకు పైన పేర్కొన్న లక్షణాలేమీ వివరించలేదు. మీరు లేఖలో చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ పాపకు తగినంత నాణ్యత లేని నిద్ర (పూర్ క్వాలిటీ ఆఫ్ స్వీప్) లేదా పూర్ స్లీప్ హైజీన్ వంటి సాధారణ సమస్య మాత్రమే ఉందని అనిపిస్తోంది. అయినప్పటికీ మీరు మీ పాపకు ఒకసారి థైరాయిడ్ ఇవాల్యుయేషన్, డీటెయిల్‌డ్ స్లీప్ ఇవాల్యుయేషన్ వంటి పరీక్షలు చేయించడం ముఖ్యం.
ఈ రోజుల్లో నార్కోలెప్సీ వంటి అరుదైన, తీవ్రమైన నిద్రసంబంధమైన జబ్బులకూ మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా న్యూరోఫిజీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోగలరు.
రంగులరంగుల ఆహారం తీసుకోవచ్చా?
మా పాప బాగా ఆకర్షణీయమైన రంగులు ఉండే స్వీట్లు, ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకుంటుంటాడు. ఇది మంచిదేనా?
– కె. దీక్ష, హైదరాబాద్
ఆహారపదార్థాల్లో కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, పెరుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలు తీసుకోవడమే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు అతిగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా వాటి దుష్ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ఇక ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అది దీర్ఘకాలం నిల్వ ఉండటానికి ఉపయోగపడే ప్రిజర్వేటివ్స్‌లో సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణలు (హైపర్‌యాక్టివిటీ) పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. సోడియం బెంజోయేట్ వంటి రసాయనాలు విటమిన్ ’సి’తో కలిసినప్పుడు అది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం భవిష్యత్తులో లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్‌సన్ డిసీజ్‌లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయ్యింది. అందుకే అతిగా రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లలను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి.
- డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్,
విజయనగర్ కాలనీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment