ఉద్యోగులెవరైనా ఆఫీసు వేళల్లో గుర్రుపెట్టి నిద్రపోతే ఏం జరుగుతుంది? ఏముంది.. ఆ పనేదో ఇంటికెళ్లి చేసుకోండంటూ సంస్థ వారిని ‘సాగనంపుతుంది’. కానీ అలాంటి వారే తమకు కావాలని ఏదైనా కంపెనీ ముందుకొస్తే?! అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన క్యాస్పర్ అనే పరుపుల కంపెనీ నిద్రపోవడంలో అసాధారణ ప్రతిభ చూపగల ఔత్సాహికులకు రెడ్‌కార్పెట్ పరుస్తోంది.
నిద్రా నిపుణుల కోసం ఉద్యోగ ప్రకటన సైతం జారీ చేసింది. ‘వీలైనంత సేపు నిద్రపోవాలన్న కోరిక ఉండటంతోపాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిద్రాభంగం కలగని సామర్థ్యం ఉన్న వారి కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ ఆన్‌లైన్ ప్రకటనలో పేర్కొంది. ‘మా స్టోర్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రాంతాల్లో నిద్రపోండి. మీ నిద్రానుభవాన్ని టిక్‌టాక్ తరహా కంటెంట్ ద్వారా మా సోషల్ మీడియా చానళ్ల ద్వారా ఇతరులతో పంచుకోండి’ అని సూచించింది.
నిద్రకు సంబంధించిన అన్ని రకాల అంశాలను ఇతరులతో పంచుకోగలగడం, నిద్ర గురించి మాట్లాడే జిజ్ఞాస కలిగి ఉండటం అభ్యర్థులకు అదనపు అర్హత అవుతుందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు తగిన జీతంతోపాటు కంపెనీ ఉత్పత్తులను ఉచితంగా అందిస్తామని మరో ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగులు పైజామాల్లో ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిస్తామని పేర్కొంది. నిద్రకు నిద్ర, జీతానికి జీతం కావాలనుకొనే ఔత్సాహికులు దరఖాస్తులు సమర్పించేందుకు గురువారమే చివరి రోజు.. త్వరపడండి మరి.
Comments
Please login to add a commentAdd a comment