Casper
-
రూడ్, జబర్లకు షాక్!
మెల్బోర్న్: ఈ సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. సీడెడ్ స్టార్లు రెండో రౌండే దాటలేకపోతున్నారు. నాలుగో రోజు పోటీల్లో రెండో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే), 12వ సీడ్, ఒలింపిక్ చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) ఇంటిదారి పట్టారు. నాదల్ ఇది వరకే అవుటైన ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా మారిన సెర్బియన్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో నిరుటి వింబుల్డన్, యూఎస్ ఓపెన్ రన్నరప్, రెండో సీడ్ అన్స్ జబర్ (ట్యూనిషియా), తొమ్మిదో సీడ్ వెరొనికా కుడెర్మెతొవ (రష్యా), 16వ సీడ్ అనెట్ కొంటావిట్ (ఈస్టోనియా)లు కంగు తిన్నారు. ఈ విభాగంలో నాలుగో సీడ్ కరొలిన్ గార్సియా (ఫ్రాన్స్), ఐదో సీడ్ అరిన సబలెంక (బెలారస్), 12వ సీడ్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) ముందంజ వేశారు. బ్రూక్స్‌బి ‘హీరో’చితం పురుషుల సింగిల్స్‌లో గురువారం జరిగిన రెండో రౌండ్లో 22 ఏళ్ల యువ అమెరికన్ జెన్సన్ బ్రూక్స్‌బి సంచలన ప్రదర్శనతో రూడ్‌ను కంగుతినిపించాడు. దీంతో గతేడాది ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్లలో రన్నరప్‌గా నిలిచిన రూడ్ ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్‌లో అనూహ్యంగా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. 3 గంటల 55 నిమిషాల సమరంలో బ్రూక్స్‌బి 6–3, 7–5, 6–7 (4/7), 6–2తో రూడ్‌ను ఓడించాడు. 8వ సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) అయితే వైల్డ్‌కార్డ్ ప్లేయర్ అలెక్సీ పాపిరిన్ (ఆస్ట్రేలియా) చేతిలో చేతులెత్తేశాడు. ఫ్రిట్జ్ 7–6 (7/4), 6–7 (2/7), 4–6, 7–6 (8/6), 2–6తో 23 ఏళ్ల అలెక్సీ పోరాటానికి తలవంచాడు. నాలుగో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–1, 6–7 (5/7), 6–2, 6–0తో క్వాలిఫయర్ ఎంజో కౌకాడ్ (మారిషస్)పై గెలుపొందగా, జ్వెరెవ్‌కు 7–6 (7/1), 4–6, 3–6, 2–6తో మైకేల్ మో (అమెరికా) చేతిలో చుక్కెదురైంది. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 6–2, 6–4, 6–7 (2/7), 6–3తో ఎమిల్ రుసువురి (ఫిన్లాండ్)పై నెగ్గాడు. మూడో రౌండ్లో గార్సియా, సబలెంక మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో నాలుగో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 7–6 (7/5), 7–5తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై, ఐదో సీడ్ సబలెంక (బెలారస్) 6–3, 6–1తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై వరుస సెట్లలో విజయం సాధించారు. అయితే గతేడాది సూపర్ ఫామ్‌లో ఉన్న రెండో సీడ్ జబర్ (ట్యూనిషియా) 1–6, 7–5, 1–6తో మర్కెట వొండ్రొసొవా (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయం పాలైంది. 9వ సీడ్ కుడెర్మెతొవ (రష్యా) 4–6, 6–2, 2–6తో అమెరికాకు చెందిన క్వాలిఫయర్ కేటీ వొలినెట్స్ చేతిలో ఇంటిదారి పట్టింది. 12వ సీడ్ బెన్సిచ్ 7–6 (7/3), 6–3తో క్లెయిర్ లియూ (అమెరికా)పై గెలుపొందగా, 16వ సీడ్ కొంటావిట్ (ఈస్టోనియా) 6–3, 3–6, 4–6తో మగ్ద లినెట్ (పోలాండ్) చేతిలో కంగుతింది. 30వ సీడ్ కరోలినా ప్లిస్కొవా (చెక్ రిపబ్లిక్) 6–0, 7–5తో పుతినెత్సవ (రష్యా)పై గెలిచింది. -
Davis Cup 2022: తొలి సింగిల్స్‌లో ప్రజ్నేశ్ పరాజయం
లిల్లీహ్యామర్ (నార్వే): డేవిస్‌కప్ టీమ్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1లో భాగంగా నార్వేతో శుక్రవారం మొదలైన పోటీలో భారత్‌కు శుభారంభం లభించలేదు. యూఎస్ ఓపెన్ రన్నరప్, ప్రపంచ రెండో ర్యాంకర్ కాస్పర్ రూడ్‌తో జరిగిన తొలి సింగిల్స్‌లో ప్రపంచ 335వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కనీస పోరాట పటిమ కనబర్చకుండానే చేతులెత్తేశాడు. కేవలం 62 నిమిషాల్లో ముగిసిన తొలి సింగిల్స్‌లో 23 ఏళ్ల కాస్పర్ రూడ్ 6–1, 6–4తో 32 ఏళ్ల ప్రజ్నేశ్ను ఓడించి నార్వేకు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ నాలుగు ఏస్‌లు సంధించినా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. రెండో సింగిల్స్ విక్టర్ దురాసోవిచ్, రామ్‌కుమార్ రామనాథన్ మధ్య జరుగుతుంది. నేడు డబుల్స్ మ్యాచ్‌తోపాటు రెండు రివర్స్ సింగిల్స్ జరుగుతాయి. -
US Open 2022: ‘నంబర్‌వన్’ సమరం
న్యూయార్క్: పురుషుల టెన్నిస్ చరిత్రలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో ఇద్దరు క్రీడాకారులు ఏకకాలంలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌నూ సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్), ఏడో ర్యాంకర్ కాస్పర్ రూడ్ (నార్వే) పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. ఫైనల్లో గెలిచిన ప్లేయర్‌కు తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ లభిస్తుంది. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి ఒంటి గంట 30 నిమిషాలకు ఈ ఫైనల్ మొదలవుతుంది. సెమీఫైనల్స్‌లో ఏడో సీడ్ కాస్పర్ రూడ్ 7–6 (7/5), 6–2, 5–7, 7–2తో 27వ సీడ్ ఖచనోవ్ (రష్యా)పై... మూడో సీడ్ అల్కరాజ్ 6–7 (6/8), 6–3, 6–1, 6–7 (5/7), 6–3తో 22వ సీడ్ టియాఫో (అమెరికా)పై గెలిచారు. 23 ఏళ్ల కాస్పర్ రూడ్ తన కెరీర్లో రెండో సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరగా... 19 ఏళ్ల అల్కరాజ్ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఈ ఏడాది కాస్పర్ రూడ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచాడు. పక్కా ప్రణాళికతో... నాన్న క్రిస్టియాన్ శిక్షణలో రాటుదేలిన కాస్పర్ పక్కా ప్రణాళికతో ఆడి రష్యా ఆజానుబాహుడు ఖచనోవ్ ఆట కట్టించాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 87 కేజీల బరువున్న ఖచనోవ్ శక్తివంతమైన సర్వీస్‌లను రిటర్న్ చేయడానికి కాస్పర్ బేస్‌లైన్ వెనుక నిల్చోని రిటర్న్ చేశాక సుదీర్ఘ ర్యాలీలు ఆడాడు. తొలి సెట్ టైబ్రేక్‌లో కాస్పర్, ఖచనోవ్ మధ్య 12వ పాయింట్ కోసం ఏకంగా 55 షాట్ల ర్యాలీ జరగడం విశేషం. మూడు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కాస్పర్ పది ఏస్‌లు సంధించాడు. నెట్ వద్దకు 23 సార్లు దూసుకొచ్చి 20 సార్లు పాయింట్లు గెలిచాడు. 53 విన్నర్స్ కొట్టిన కాస్పర్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఖచనోవ్ 41 అనవసర తప్పిదాలు చేశాడు. వరుసగా మూడో మ్యాచ్‌లో... ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అల్కరాజ్ ఈ టోర్నీలో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఐదు సెట్ల పోరాటంలో విజయాన్ని దక్కించుకున్నాడు. 4 గంటల 19 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 59 విన్నర్స్ కొట్టిన అల్కరాజ్ నెట్ వద్దకు 42 సార్లు దూసుకొచ్చి 32 సార్లు పాయింట్లు గెలిచాడు. మరోవైపు టియాఫో 15 ఏస్‌లు సంధించి ఆరు డబుల్ ఫాల్ట్‌లు, 52 అనవసర తప్పిదాలు చేశాడు. 7: ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో వరుసగా మూడు ఐదు సెట్ల మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ చేరిన ఏడో ప్లేయర్‌గా అల్కరాజ్ గుర్తింపు పొందాడు. గతంలో అగస్సీ (అమెరికా; 2005 యూఎస్ ఓపెన్), ఎడ్బర్గ్ (స్వీడన్; 1992 యూఎస్ ఓపెన్), బన్గెర్ట్ (జర్మనీ; 1967 వింబుల్డన్), టోనీ రోచ్ (ఆస్ట్రేలియా; 1967 ఫ్రెంచ్ ఓపెన్), రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా; 1962 ఫ్రెంచ్ ఓపెన్), అలెక్స్ ఒల్మెడో (పెరూ/అమెరికా; 1959 ఆస్ట్రేలియన్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. రాజీవ్–సాలిస్బరీ జోడీకి డబుల్స్ టైటిల్ పురుషుల డబుల్స్‌లో రాజీవ్ రామ్ (అమెరికా)–జో సాలిస్బరీ (బ్రిటన్) జోడీ టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఫైనల్లో రాజీవ్ రామ్–సాలిస్బరీ ద్వయం 7–6 (7/4), 7–5తో వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్)–నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్) జోడీపై గెలిచింది. వరుసగా 22వ ఏడాది యూఎస్ ఓపెన్‌లో ఆడిన రాజీవ్ 11 వేర్వేరు భాగస్వాములతో బరిలోకి దిగాడు. వుడ్ఫర్డ్–వుడ్‌బ్రిడ్జ్ (ఆస్ట్రేలియా; 1995, 1996) ద్వయం తర్వాత యూఎస్ ఓపెన్‌లో వరుసగా రెండేళ్లు డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి జోడీగా రాజీవ్–సాలిస్బరీ ద్వయం గుర్తింపు పొందింది. -
‘బాగా నిద్రపోగలరా..జాబిస్తాం! జీతంతోపాటు మరో ఆఫర్ కూడా!
ఉద్యోగులెవరైనా ఆఫీసు వేళల్లో గుర్రుపెట్టి నిద్రపోతే ఏం జరుగుతుంది? ఏముంది.. ఆ పనేదో ఇంటికెళ్లి చేసుకోండంటూ సంస్థ వారిని ‘సాగనంపుతుంది’. కానీ అలాంటి వారే తమకు కావాలని ఏదైనా కంపెనీ ముందుకొస్తే?! అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన క్యాస్పర్ అనే పరుపుల కంపెనీ నిద్రపోవడంలో అసాధారణ ప్రతిభ చూపగల ఔత్సాహికులకు రెడ్‌కార్పెట్ పరుస్తోంది. నిద్రా నిపుణుల కోసం ఉద్యోగ ప్రకటన సైతం జారీ చేసింది. ‘వీలైనంత సేపు నిద్రపోవాలన్న కోరిక ఉండటంతోపాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిద్రాభంగం కలగని సామర్థ్యం ఉన్న వారి కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ ఆన్లైన్ ప్రకటనలో పేర్కొంది. ‘మా స్టోర్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఊహించని ప్రాంతాల్లో నిద్రపోండి. మీ నిద్రానుభవాన్ని టిక్‌టాక్ తరహా కంటెంట్ ద్వారా మా సోషల్ మీడియా చానళ్ల ద్వారా ఇతరులతో పంచుకోండి’ అని సూచించింది. నిద్రకు సంబంధించిన అన్ని రకాల అంశాలను ఇతరులతో పంచుకోగలగడం, నిద్ర గురించి మాట్లాడే జిజ్ఞాస కలిగి ఉండటం అభ్యర్థులకు అదనపు అర్హత అవుతుందని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు తగిన జీతంతోపాటు కంపెనీ ఉత్పత్తులను ఉచితంగా అందిస్తామని మరో ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగులు పైజామాల్లో ఆఫీసుకు వచ్చేందుకు అనుమతిస్తామని పేర్కొంది. నిద్రకు నిద్ర, జీతానికి జీతం కావాలనుకొనే ఔత్సాహికులు దరఖాస్తులు సమర్పించేందుకు గురువారమే చివరి రోజు.. త్వరపడండి మరి. -
ట్రైనర్ కోసం బుల్లెట్‌కు ఎదురెళ్లింది
విధి నిర్వహణలో ప్రాణాలను లెక్కచేయని పోలీస్ డాగ్ హూస్టన్: శిక్షణ పొందిన పోలీస్ కుక్క క్రమశిక్షణలో సైనికుడికి ఏమాత్రం తీసిపోదని మరోమారు నిరూపితమైంది. అమెరికాలోని హూస్టన్ నగరంలో కె9 కాస్పర్ అనే ఈ జాగిలం ఉంది. ఇది గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణ విభాగంలో విధులు నిర్వహించింది. పామ్ బీచ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో గాయపడిన ఈ జాగిలం ప్రస్తుతం కోలుకుంటోంది. ఫిలిప్ ఓషియా అనే వ్యక్తి శుక్రవారం ఫ్లోరిడాలోని జుపిటర్‌లో దోపిడీకి పాల్పడి అడ్డొచ్చినవారిపై కాల్పులకు దిగాడు. మరుసటిరోజు తనని వెతుక్కుంటూ వచ్చిన పోలీసులపై కాల్పులకు దిగాడు. ఈ క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో కాస్పర్ తన ట్రైనర్‌ను రక్షించే క్రమంలో తీవ్రంగా గాయపడిందని, ప్రస్తుతం కోలుకుంటోందని పోలీస్ కార్యాలయం అధికారిక ఫేస్బుక్ పేజీలో వెల్లడించారు. చికిత్స పొందుతున్న జాగిలం ఫొటోలను కూడా అందులో పెట్టారు.