
జనాలు సరిగ్గా నిద్ర పోకపోతే ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది! ఆశ్చర్యంగా ఉందా? నిజమే. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి మరీ ఈ విషయాన్ని చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా నిద్రలేమి అనే సమస్య ఎక్కువవుతోందని.. ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అంచనా. ఆరోగ్య సమస్యల కారణంగా కొంతమందికి తగినంత నిద్ర లభించకపోగా.. మిగిలిన వారు వృత్తిపరమైన ఒత్తిడితో, సామాజిక, కుటుంబ కార్యకలాపాల కోసం నష్టపోతున్నారని.. ఇంకొందరు తెలిసో తెలియకో నిద్రకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని శాస్త్రవేత్తలు వివరించారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగినప్పుడు దాని ప్రభావం ఉత్పాదకతపై పడటంతోపాటు ఆరోగ్యసమస్యలకూ కారణమవుతోందని వీరు అంటున్నారు.
తగినంత నిద్ర లేకపోతే త్వరగా కోపం రావడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ప్రతిస్పందించే సమయం తగ్గిపోవడం, సానుభూతి కోల్పోవడం వంటి సమస్యలు ఉంటాయని పరిశోధనలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. ఈ రకమైన సమస్యలన్నింటి పర్యవసానాలు ఆర్థికంగా ఎలా ఉంటాయని ఆక్స్‌ఫర్డ్ సైంటిస్ట్‌లు లెక్కకట్టారు. ఆరోగ్య ఖర్చులు, ప్రమాదాల వంటి వాటి వల్ల వచ్చే ఖర్చులు వంటివన్నీ లెక్కకడితే ఈ సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నష్టం 1788 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు వీరు తేల్చారు. ఈ నష్టం ఒక్క ఆస్ట్రేలియాలోనే దేశ జీడీపీలో 1.55 శాతం వరకు ఉందని అంచనా.