‘‘ఎందిరా తమ్మి, లచ్చిగాని ఇంటికాడ ఇంతమంది గుమిగూడిండ్రు?’’ గుంపును చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు రాజన్న.‘‘అయ్యో! నీకు తెల్వదు గాదే!! లచ్చిగానికి దేవుడు పూనిండంట. సాధక బాధకాలు చెప్పుకుంటే చాలు రాత్రి నిద్రలో కలగని తెల్లారి పొద్దునకల్లా సమస్యకు కారణంతో పాటు పరిష్కారం చెప్తుండంట. చానా మందికి అచ్చొస్తుందంటన్న.’’‘‘ఇదేం శిత్రం రా?’’‘‘అవునంటన్నా రోజుకు ఒక్కలికి మాత్రమే చెప్తుండంట. కలలోనే కోరుకున్న దేవుణ్ణి కలిసొచ్చీ, దేవుడేమంటున్నడో కూడా చెప్తుండంటనే!’’‘‘అన్ని మాయలు తీర్రా..ఈడు గూడా మాయమాటలు చెప్పి, ఏ బాబాలాగానో మారి గుడి కట్టించుకుందాం అనుకుంటుండేమో. ఇలాంటోళ్లను భూమ్మీద ఎంతమందిని చూస్తలేం?’’‘‘మాయనో, మర్మమో తెల్వదన్నా, అన్నేలం మాట వాడు డబ్బూ, దస్కం మాత్రం తీస్కుంటలేడన్న పాపం’’ ఆ మాటల్లో దయ ధ్వనించింది.రాజన్న నర్సిగాని కళ్లల్లోకి చూశాడు శాంతంగా!‘‘శానా రోజుల నుంచి చూస్తున్న.. నువ్వు దిగులుగా కనబడుతున్నావు. ఒక్కసారి నీ బాధగూడా చెప్పి చూద్దాం అన్నా, ఏమన్నా జాడ దొరుకుద్దేమో మరీ’’ అని సలహా ఇచ్చాడు నర్సిగాడు.
‘‘నిజమా, కాదా అన్నది తర్వాత ముచ్చట. ఒక్కసారైతే చెప్పి సూద్దామన్నా’’ రాజన్న మౌనాన్ని దాటుకుంటు మళ్లీ నర్సిగాడు. ‘‘నాదేంది నీదేందిరా తమ్మి! మనందరిది ఒక్కటే బాధగాదురా? టైంకు వానలు పడక పంటలు పండుతలేవాయే. ఏశిన సేండ్లెమో ఎండకు మాడిపోతుండే. కరువు, పురుగులు కలిసి మింగగ మిగిలిన పంట కోతకొచ్చేవరకు వడగళ్ల పాలయితుండే. ప్రతియేడు గిదే వరసాయే మనకు..’’ అని తన బాధనంతా రాజన్న గద్గద స్వరంతో చెప్పాడు.రాజన్న మాటలు మౌనంగా వింటున్నాడు నర్సిగాడు.‘‘అన్నదాత, దేశానికి వెన్నుముక అనే పొగడ్తలు తప్ప రైతుగా పుట్టినందుకు ఏం సుఖంరా? నైఋతి కాలమొచ్చి రెండు కార్తులు దాటిపాయే. తొలకరికి ఏశిన ఇత్తులు మొలిశినయ్ గని ఏం లాభం! కూలిపనికి పోయిన తల్లికోసం సాయంకాలం ఆశావరణంతో ఎదురు చూసే పల్లె పిల్లలాగేచెలకల్లో మొలకలు మొయిలు కోసం ఎదురుచూస్తూ మాడిపోతున్నాయి.’’ ఆవేదన వెళ్లగక్కాడు రాజన్న.‘‘అవునన్నా ఈ ఎవుసాయం చేసుడుకంటే, ఏడూర్లు దాటి వలసపోవడం మేలనిపిస్తుందే.’’‘‘గిట్ల ఋతుపవన కాలమొచ్చినా వానలేందుకొస్తలేవో? కాలానికి తగ్గట్టుగా వానదేవుడేందుకు కరుణిస్తలేడో? ఏ పాపం చేయ్యని రైతుల మీద వరుణ దేవుడెందుకు కక్ష కట్టిండోనని ఆ వరుణ దేవుణ్ణేతెలుస్కోని రమ్మందాంరా తమ్మీ’’ ఆశతో అన్నాడు రాజన్న.
సరే అనుకుని ఇద్దరూ కలిసి లచ్చిగాని ఇంటికి వెళ్లారు. రాజన్న అంటే ఊరంతా చాలా గౌరవం. ఏ కార్తెకు ఏ పంట బలమో చెప్పగల సమర్థుడు. ఇప్పటకీ ఎడ్లతోనే వ్యవసాయం చేస్తున్న బలవంతుడు. సలహా అయినా, సహాయం అయినా ముందుగా గుర్తొచ్చేది రాజన్నే. ఏదైన మన అంటడు గానీ మధ్యలో ఒదిలేసిపోయే రకం కాదు. అందుకే ఈ రాత్రి కల రాజన్నకే అని లచ్చిగాడు బహిరంగంగా ప్రకటించి అందరికి సెలవు చెప్పాడు.‘‘చెప్పే రాజన్న నీకేం రందే?’’ గౌరవంగా అడిగాడు లచ్చిగాడు.‘‘నా ఒక్కందేం కాదురా తమ్మీ! ఈ లోకంలో ఉన్న మనందరి రందే నా రంది. కరువుకోరల్లో చిక్కి, అప్పుల బాధతో బలైపోతున్న రైతన్నల ప్రాణాల గురించి ఈ లోకానికి తెల్వంది కాదు. కాలం దాటిపోతున్న కార్తులకు తగ్గట్టు ఎనకటిలెక్క వానలెందుకొస్తలేవో ఆ వరుణదేవుణ్ణి అడిగిరా. రైతులంగే ఎందుకంతా కక్ష కట్టిండో నిలదీసి రారా!’’ ముచ్చటలాగా వివరించిండు రాజన్న.‘‘తప్పకుండ తెలుసుకొస్తనే... రేపు పొద్దునకల్లా ఏ సంగతైందీ నీకు చెప్త.’’ అని బదులిచ్చి లచ్చిగాడు సెలవు తీసుకున్నాడు.రాత్రి పడుకున్న తర్వాత వరుణదేవుడి గురించి ఆలోచించసాగాడు లచ్చిగాడు. కన్నంటుకోగానే కల మొదలైంది లచ్చిగానికి. తలచుకోగానే రెక్కలొచ్చాయి కలలో!ఆహా.. అనుకుంటూ ఆనందంగా ఆకాశానికి ఎగిరాడు. ఎక్కడ చూసినా అనంతమైన నీలాకాశం. చుట్టూ్ట శూన్యం. ఆకాశం కళ్లకందినట్టే అనిపిస్తూ, సాగేకొద్దీ దూరమైపోతుంది.
ఇది నైరుతి ఋతుపవన కాలమని నైఋతి దిక్కు తన ప్రయాణం కొనసాగించాడు.‘‘వర్ష ఋతువే అయినా ఎండ దంచుతోంది. వేడికి చెమట ఆవిరై ఒళ్లు బొగ్గయిపోతోంది. అయినా ఒక్క మబ్బు ముక్కా కనపడి చావాదేం?’’ అని మనసులో అసహనంతో గుణుక్కొన్నాడు లచ్చిగాడు.నైఋతి దిక్కుకు వేగంగా కదులుతున్నాడు. కంటికి అలుపొచ్చే సమయానికి కొంచెం దూరంలో కంటికి మసక మసకగా నల్లని ఒక మేఘమాలిక కనబడింది. గాలి ఉలిలా మారి మబ్బు మాలికను ఇంకా అందంగా చెక్కడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. మేఘమాలికను చూడగానే ఒళ్లంతా ప్రకంపించి, ప్రాణం లేసొచ్చినట్టయింది. వేగంగా మేఘమాలికకు ఎదురెళ్లి నమస్కరించాడు లచ్చిగాడు.వెంటనే ఆ మేఘమాలిక దేవకన్యలా మారి ‘‘ఎవరు మీరు?’’ అని లచ్చిగాన్ని సౌమ్యంగా ప్రశ్నించింది. ‘‘నేను భూలోక మానవుణ్ణి! నన్నందరూ లచ్చిగాడు అని పిలుస్తారు.’’ అని వినయంగా పరిచయం చేసుకున్నాడు.‘‘ఇలా ఎందుకొచ్చావ్ నాయానా? ఆకాశ దేశంలో నీకేం పని?’’‘‘మీ రాజు వరుణదేవుణ్ణి కలవడానికి వచ్చాను తల్లీ! ఎంతో దూరం నుంచి వస్తున్నాను. ఎక్కడా కనబడడేం? అలసి సొలసి మాడి మసి బొగ్గయి వచ్చానమ్మా. నా యందు దయుంచి కొంచెం వరుణదేవుని చిరునామా చెప్పు’’ అని చేతులు జోడించి వేడుకున్నాడు.‘‘మీరు సరైన దిశలోనే వచ్చారు మానవా! ఈ నైఋతి మూలవైపే వెళ్లు. దగ్గర్లోనే వజ్ర కాంతులతో మెరిసే రాజమందిరం కనబడుతుంది’’ తన బాధ్యత నిర్వర్తించడానికి త్వరితగతిన వెళ్లాలని మేఘమాలిక చెప్పింది.
మరోసారి చేతులు జోడించి నమస్కరించి, కృతజ్ఞతాభావంతో మేఘమాలిక నుంచి సెలవు తీసుకున్నాడు.ఆనందంగా రెట్టించిన వేగంతో రెక్కలు జాడించి, పెద్ద పెద్ద కొండల్ని దాటి, సముద్రాల మీదుగా పైపైకి ఎగిరాడు. తొందర్లోనే వరుణదేవుని విశాల భవనం ముందు వాలాడు.వజ్ర వైడుర్యాలతో నిర్మించబడిన ఆ కోట తళతళలాడుతోంది. ఆ రాజభవనపు కాంతికి కళ్లు సొమ్మసిల్లిపోతున్నాయి. వరుణుడు, అతిథి దేవతలు మబ్బు శయ్యలపై సభమందిరంలో ఆసీనులైనారు. ఉరుముల సంగీత హోరులో, మెరుపు తీగల్లాంటి అప్సరసల నాట్యాన్ని సురపానకాన్ని సేవిస్తూ ఆనంద డోలికల్లో తిలకిస్తున్నారు. ఇంతలో కళల సమయం ముగిసింది.ఇది సభా సమయం. సభ ప్రారంభమైంది. వరుణుడు వివిధ మేఘాలతో సమావేశమై ఏదో సంభాషిస్తున్నాడు. వరుణుడి ముఖంలో జలకళ ఉట్టిపడుతోంది. సూర్యకాంతికి అతని దేహంపై నీటి బిందువులు వజ్రహారాల్లా మెరుస్తున్నాయి. మబ్బు సింహాసనంపై కూర్చొన్న వరుణిడి కళ్లకు కరుణ అలంకారమైంది.వరుణుడికి చెమట పట్టకుండా పిల్లగాలులు పరిచారికల్లా సేవ చేస్తున్నాయి.ఇన్ని సౌఖ్యాలనుభవిస్తూ రైతుల గోడును పట్టించుకోవడానికి ఏమైందని మనసులో అనుకుంటు కోపంతో ‘‘వరుణ దేవా!’’ అని గద్దించి పిలిచాడు.
‘‘ఎవరక్కడ? మీకేం కావాలి?’’ అని గట్టిగా ఉరిమాడు వరణుడు.ఇంతలో ద్వారపాలకులు వెళ్లి లచ్చిగాన్ని పట్టుకొచ్చి వరుణుడి ముందు ప్రవేశపెట్టారు.‘‘నేనవరినైతే నీకెందుకు? భూలోకంలో రైతన్నలు కన్నీటిలో మునిగి, ఉరిపోసుకుని యమపురికి చేరుకుంటుంటే, రైతు రక్షకుడిగా నియమింపబడిన నీవు మాత్రం అవేమి పట్టించుకోకుండా, కర్తవ్యం మరిచి నీ దర్బారులో జల్సాలు చేస్తున్నావు!’’ గట్టిగా అరిచాడు లచ్చిగాడు.‘‘హా..హా..హా...’’ పెదవులపై మెరుపులు చిల్లుతుండగా ఉరిమినట్టు నవ్వాడు వరుణుడు.‘‘నా ఆవేదన మీకు హాస్యంగా తోస్తుందా? వానదేవా?’’ అని లచ్చిగాడు కళ్లు ఎర్రచేసి పిడికిలి బిగబట్టాడు.‘‘ముందు ఆసీనులుకండీ మానవా!’’ వరుణుడు మర్యాదగా చెప్పటంతో, నిలబడే తేల్చుకుందామనకున్న లచ్చిగాడికి కూర్చోక తప్పలేదు.‘‘చెప్పు మానవా నీ ఆవేదన.. ఆలకించి, ఆదుకోవడానికి మేం సిద్ధం’’ అన్నాడు. అతిథిని గౌరవించడం దైవకార్యం.‘‘కాలమైన చినుకుపడదు. ఖరీఫ్ వచ్చిన కరువు పోదు. కరువూ, పురుగూ కబళించగా మిగిలిన కాసింత పంటను మీ వడగళ్లు బలితీసుకుంటాయి. కాలచక్రంతో పాటే నీ వాన చక్రం తిప్పవచ్చుకదా? తొలకరికి విత్తిన విత్తనాలు అనాథల్లా రోదిస్తోంటే మీకు కనపడటం లేదా స్వామి? రైతుపట్ల దళారులకూ, ప్రభుత్వానికీ, తినేవాడికీ ఎవ్వరికి కనికరం లేదు.మీరు కూడా మాపై దయలేకుండా పగపడితే మేమైపోవాలి దేవా? కాలానికి తగ్గట్టుగా మీరెందుకు కురవడం లేదు?’’ అని ఆపకుండా గుండెల్లో బాధనంతా ప్రశ్నల్లా కక్కేశాడు.‘‘మంచి ప్రశ్నలే సంధించావు మానవా! ఇప్పుడు మేము చెప్పేది కూడా విను. మాకూ వర్షించాలనే ఉంటుంది. మట్టికప్పుకుని పడుకున్న ప్రతివిత్తును స్పృశించి ప్రాణం పోసి విముక్తి కలిగించాలనే ఉంటుంది. మబ్బుల నుంచి జారే ప్రతి చినుకూ చిగురులా రూపాంతరం చెంది మోక్షం పొందాలనుకుంటాయి. ప్రతి ప్రాణి దాహం తీర్చడం మా కర్తవ్యం. మానవుల్లా మాకు స్వార్థ గుణం లేదుగనుకే కవులచేత కీర్తింపబడ్డాము! అందుకే మబ్బుల సైన్యాన్ని నలుమూలలా వర్షించుటకు పంపిస్తున్నాము..’’ అని చెప్తుంటే మధ్యలో ఈశాన్య సేనాని రొప్పుతూ వచ్చాడు. ‘‘వాన దేవుడికి జయము...జయము..’’ అని పలికి సభా ప్రవేశం చేశాడు.
‘‘చెప్పండి ఈశాన్య సేనాధిపతి.. వెళ్లిన పని విజయవంతం అయిందా? మీరు తెచ్చిన తీపి కబురు వినాలని నా హృదయం ఉవ్విళ్లూరుతోంది!’’ సంతోషంతో గంభీరంగా అడిగాడు వరుణుడు.‘‘క్షమించండి వరుణదేవా! ఈశాన్యం వైపు చినుకు కొరకు పరితపిస్తున్న అమాయక రైతులపై జాలితో వెళ్లిన మన మేఘసైన్యం ఈసారి కూడా ఓడిపోయింది. ఆ పొలాల పక్కనున్న విషబాణల్లాంటి కర్మాగారాల పొగతో పోటిపడి పోరాడలేక మన మబ్బులన్నీ ముక్కలు ముక్కలుగా విడిపోయి చినుకు జారవిడచకుండానే చెల్లా్లచెదురయ్యాయి ప్రభూ!’’ అని బాధతో దీనంగా చెప్పాడు సేనాధిపతి.లచ్చిగానికి అప్పటికే సగం సంగతి బోధపడింది.‘‘చూశావుగా మానవా? మా కర్తవ్యంలో ఏమైనా లోపముందా? మా నిరంతర ప్రయత్నం ఇలాగే ప్రతిసారి వృథా ప్రయాస అవుతోంది’’లచ్చగాడి గుండెల్లో బాధ కమ్ముకుంది.‘‘అటు చూడు మానవా! ప్రతి పవనం కురవలేకపోతున్నామనే బాధ, నిరాశల బరువును ఎలా మోస్తున్నాయో?’’లచ్చిగానికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మళ్లీ వరుణుడే అందుకొని ‘‘భూలోకంలో వలే లంచానికి పనిచేసే వారు ఇక్కడెవ్వరూ లేరు. ప్రతి మేఘం తమ కర్తవ్యానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి.’’ అన్నాడు. మౌనం కాటేసినట్టయింది లచ్చిగానికి. ఏం మాట్లడలేకపోయాడు.‘‘లేగలు లేకుండా ఆవులు పాలిస్తాయా నాయనా? ఓ మరిచిపోయాను మీరు మానవులు కదా? సైన్స్‌తో అద్భుతాలు చేసిన మర సృష్టి కర్తలు కదా! మరుగు మందు పెట్టయినా బలవంతంగా పాలు పితుక్కొగల తెలవిమంతులు! కానీ ఎన్నాళ్లు?’’తలదించుకున్నాడు లచ్చిగాడు మానవుడైనందుకు.
మళ్లీ అందుకుంటూ వరుణుడు...‘‘అలాగే మేఘాలు కూడా లేగల్లాంటి చెట్లు లేకుండా వర్షించలేవు. కొమ్మలు రమ్మని పిలిచినప్పుడు మేం తప్పకుండా కురుస్తాం! మీ మానవులు చెట్లను నరకడం ఆపకుండా మేదోమథనం చేసినా, మేఘమథనం చేసినా మేఘాలు వర్షించలేవు’’ అని వరుణుడు స్పష్టం చేశాడు.లచ్చిగాడు అపరాధ భావంతో బాధగా చేతులు జోడించి వరుణదేవుడికి మొక్కివినసాగాడు. ‘‘స్వార్థబుద్ధితో ఇలాగే కాలుష్యం చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తూ కృత్రిమ జీవనం సాగిస్తూ పోతామంటే శ్మశానం అయ్యేది మీ మనుగడే!’’ అని వరుణుడు బో«ధించాడు.ఇంతలో లచ్చిగాడు కళ్లు తెరిచాడు!!
- తండ గణేశ్
లచ్చిగాని కల
Published Sun, Apr 1 2018 1:39 AM | Last Updated on Sun, Apr 1 2018 1:39 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment