problems ..
-
చిరునవ్వుతో ‘స్పందన’
నిత్యం ఏదో ఒక సమస్యతో ప్రజలు కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటారు. అయితే సమస్యలకు మాత్రం పరిష్కారం దొరకని దుస్థితి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని స్పందన అనే పేరుతో నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీకి జవాబుదారీతనంతో పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేటితో ప్రారంభం కానున్న స్పందన కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు, తదితర వివరాలపై సాక్షి కథనం.. సాక్షి, చిత్తూరు కలెక్టరేట్: రేషన్ కార్డు లేదని.. పాఠశాల, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని.. పింఛన్లు, తాగునీరు, రోడ్లు, భూ ఆక్రమణలు.. ఇలా ఏదో ఒక సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. మండల స్థాయిలో ఉన్న అధికారులను కలిసి వారి సమస్యలను విన్నవించుకుంటారు. అయితే ఆ స్థాయిలో వారి సమస్యలకు పరిష్కారం దొరకకపోవడంతో ప్రతి సోమవారమూ కలెక్టరేట్‌కు వస్తుంటారు. కలెక్టర్‌కు తమ సమస్యలను విన్నవించుకుంటే పరిష్కారం దొరుకుతుందని ఆశపడుతుంటారు. గత సర్కారు పాలనలో ప్రజల అర్జీల పరిష్కారానికి కృషి చేసిన పాపానపోలేదు. వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రలో ప్రజలు ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే స్పందన పేరుతో ప్రజల అర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేడు మొదటి కార్యక్రమం.. జిల్లా స్థాయిలో స్పందన పేరుతో గ్రీవెన్స్ కార్యక్రమం సోమవారం మొదటిసారి జరగనుంది. ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. నలుమూలల నుంచి వచ్చే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి ఎదుటే వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టనున్నారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో ప్రత్యేకంగా ప్రజల కోసం కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. అర్జీదారులను కూర్చోబెట్టి ఆయా శాఖల అధికారుల ఎదుట తక్షణమే సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరికొన్ని రోజుల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసి ప్రజల అర్జీలను నమోదు చేయనున్నారు. అర్జీదారులందరికీ స్పందన పేరుతో రశీదు ఇవ్వనున్నారు. జిల్లా అధికారులందరూ హాజరుకావాల్సిందే స్పందన కార్యక్రమానికి జిల్లాలోని ఆయా శాఖల హెచ్ఓడీలు హాజరుకావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో పలు శాఖల అధికారులు తమ కింది స్థాయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకునేవారు. ఇకపై అలాంటి విధానం ఉండకుండా ప్రతి శాఖ జిల్లా అధికారే స్పందన కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాల్సి ఉంటుంది. గైర్హాజరైతే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. అన్ని ఏర్పాట్లు చేశాం.. స్పందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. అర్జీదారులను చిరునవ్వుతో పలకరించి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నాం. స్పందన కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రి సూచనలను తూచా తప్పకుండా పాటిస్తాం. అర్జీ దారులను కూర్చోబెట్టి అప్పటికప్పుడే వారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. – డాక్టర్ నారాయణ భరత్ గుప్త, కలెక్టర్ -
తాగునీరు కలుషితం
మల్కాపురం : యారాడ గ్రామంలోకి వచ్చే తాగునీటిని సేవించాలంటేనే గ్రామస్తులు ఆలోచించాల్సి వస్తోంది. పైపులైన్ ద్వారా వచ్చే నీటిని తాగితే ఎలాంటి రోగాలు దరిచేరుతాయోనన్న బెంగ వారిలో కనిపిస్తోంది. జీవీఎంసీ 45వ వార్డు యారాడ గ్రామ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు ఐదేళ్ల క్రితం పలు చోట్ల పైపులైన్లు వేశారు. అయితే పీఎస్సార్ కాలనీ, స్థానిక జెడ్పీ పాఠశాల ప్రాంతాల్లో వేసి న పైపులైన్లు మాత్రం అక్కడున్న మురుగు కాలువలకు ఆనుకొని వేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో మురుగు నిలిచిపోతున్నప్పుడల్లా తాగు నీటిపై అనుమా నం వస్తోంది. ఆ మురుగు పైపులైన్ వాల్వ్‌ల వద్ద ఉన్న ప్లాంజ్ ద్వారా లోపలికి ప్రవేశించి నీటి సరఫరా జరిగే సమయంలో తాగునీటితో కలిసిపోతోంది. ఒక్కోసారి తాగునీరు మురుగు వాస న వస్తోందని గ్రామస్తులు చెబుతుండడమే ఇం దుకు ఉదాహారణ. మురుగుతో కలిసిపోయే నీటితే సేవించినందుకు గతంలో ఆయా ప్రాంత వాసులకు జ్వరాలు, వాంతులు వచ్చాయి. సమ స్య పరిష్కారం కోసం గ్రామస్తులు జీవీఎంసీ జోన్–4 జెడ్సీతో పాటు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు కూడా ఎన్నోమార్లు వివరించారు. అయినా స్పందన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు. మురుగునీరే వస్తోంది ఇక్కడకొచ్చే తాగునీరు మురుగునీటిలా వస్తోంది. ఆ నీరు తాగలేని పరిస్థితి ఉంది. గతేడాది వర్షాకాలంలో కాలువల్లో మురు గు అధికంగా నిల్వ ఉండిపోవడంతో వారం రోజుల పాటు ఆ నీటి నే పట్టాల్సి వచ్చింది. పిల్లలకు అనారోగ్యం వచ్చింది. -
చందనపు చల్లన
వేసవి ఊపు మీద ఉంది. సూరన్న శివాలూగుతున్నాడు. రానున్న రెండు మూడు వారాలు కీలకమైనవి. జాగ్రత్త పడాల్సినవి. సూర్యుడి వేడి ప్రకృతికి ఒక సహజ అవసరం. ఈ సహజ అవసరంలోని తీవ్ర క్షణాలను సహజ రక్షణ కవచాలతోనే మనం ఎదుర్కోవాలి. అందుకు ఏం చేయాలి. వినండి.ఇంట్లోనే ఉన్నాం కదా అని సరిగా నీళ్లు తాగకుండా ఉండకూడదు. నీళ్లు తాగకపోవడం వలన డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. తగినన్ని నీళ్లు తాగకపోతే నిద్ర లేమి, అజీర్తి సమస్యలు కూడా తలెత్తుతాయి. కీర దోస, పుచ్చకాయ, నిమ్మరసం, కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, రాగి జావ వంటివి తీసుకుంటూ, కాఫీ, టీలను తగ్గించాలి. నిల్వ ఉన్న ఆహారం కాకుండా తాజాగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యమివ్వాలి. ఎండగా ఉన్నప్పుడు చల్లని పండ్ల రసాలు గొంతులోకి దిగుతుంటే, చల్లగా హాయిగా అనుభూతి కలుగుతుంది. అలాగని ఏవి పడితే అవి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. సోడా నీరు, శీతల పానీయాలు, ఐస్‌క్రీముల జోలికి పోకూడదు. పండ్లు కొనేటప్పుడు వాటి మీద క్రిమిసంహారక మందు ఎంత ఉందో పరిశీలించాలి. ఉదాహరణకు ద్రాక్ష పండ్ల వంటివి. తినడానికి ముందు వాటిని ఉప్పు నీటిలో రెండు సార్లు నానబెట్టి, శుభ్రపరచుకోవాలి. ప్రకృతి సహజసిద్ధంగా ప్రసాదించిన శీతల పానీయం కొబ్బరిబొండం. కొబ్బరి నీళ్లలో చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే డీ హైడ్రేషన్ సమస్య ఉండదు. ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చాక, ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుని కొబ్బరి నీళ్లతో ముఖం కడుక్కుంటే, ఎండవల్ల నల్లగా మారిన చర్మం తాజాదనాన్ని పొందుతుంది. గ్లాసుడు నీళ్లలో టీ స్పూను నిమ్మరసం, టీ స్పూను తేనె వేసి బాగా కలిపి తాగడం వల్ల శరీర వేడి తగ్గుతుంది.నారింజ లేదా కమలాపండ్ల రసం తీసి, అందులో కొద్దిగా పంచదార, తేనె కలిపి తాగితే కడుపు చల్లగా అవుతుంది. వేడి వాతావరణంలో కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. కీర దోసకాయ రసం తీసి, చెంచాడు తేనె, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే మంచిది.గుప్పెడు పుదీనా ఆకులు, చెంచాడు తేనె, రెండు చెంచాల నిమ్మరసం కలిపి మెత్తగా చేసి స్మూతీలా తీసుకుంటే మంచిది. నాలుగు పుచ్చకాయ ముక్కలను జ్యూస్‌గా తీసి అలాగే తాగడం మంచిది. ∙ జామకాయ రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల దీనిని వేసవికాలంలో తీసుకోవడం మంచిది. రసం తీసేటప్పుడు విత్తనాలను తొలగించడం మంచిది. ∙ అన్నిటి కంటె మంచినీళ్లు తాగడం చాలా ముఖ్యం. రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. జీవనశైలిని బట్టి, మరింత ఎక్కువగా నీళ్లు తాగాలని ఆయుర్వేదం చెబుతోంది. వేసవిని ఆయుర్వేదం ఆదాన కాలం అంటుంది. ఈ కాలంలో సూర్యుడు ప్రాణుల నుంచి శక్తిని తీసుకుంటాడు కాబట్టి దానికి ఆ పేరు. ఈ శక్తిని మళ్లీ సమకూర్చుకోవడం ఎలాగో ఆయుర్వేదం చెబుతుంది. ఈ కాలంలో వచ్చే మూత్రంలో మంట, అతిసారం లాంటి అనేక వ్యాధుల్ని వాటి నివారణను సూచిస్తుంది.పళ్లరసాలు తాగిన వెంటనే వాటి దోషాల నివారణగా కొద్దిగా వేడి నీళ్లలో శొంఠి, మిరియాల పొడి (ఒక్కొక్కటి చిటికెడు) కలిపి తాగాలి. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. ఒకవేళ బయటకు వెళ్లవలసి వస్తే టోపీ కాని గొడుగు కాని వాడాలి.షడంగ పానీయంచందనం (మంచి గంధం), ముస్తా (తుంగ ముస్తలు), ఉశీరం (వట్టి వేరు) ఉదీచ్య (కురువేరు) నాగర (శొంఠి), పర్పాటక... వీటిని దంచి కషాయం కాచుకోవాలి. ఇలా తయారు చేసుకున్నకషాయాన్ని 30 మి.లీ. తీసుకుని అందులో కొంచెం పటికబెల్లం (మిశ్రి) కలిపి రోజూ తాగాలి.జంబీర పానీయం: గ్లాసుడు నీటిలో (300 మి.లీ.) చెంచాడు అల్లం రసం, ఒక చెంచాడు నిమ్మరసం, నాలుగు చెంచాల శర్కర, చిటికెడు ఉప్పు కలిపి తాగాలి.తక్ర పానీయం: పులుపు లేని మజ్జిగను పలుచగా చేసి కొద్దిగా నిమ్మరసం, అల్లం, ఉప్పు, కరివేపాకు, పుదీనా కలిపి వడగొట్టి రోజుకి రెండు మూడుసార్లు తాగాలి. – వి. ఎల్. ఎన్. శాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు -
జగన్నాథునికి నిద్రాహారాలు కరువు
భువనేశ్వర్ : విశ్వవిఖ్యాత జగన్నాథునికి కూడా కష్టాలు తప్పడం లేదు. ఆధ్యాత్మిక, ధార్మిక వ్యవహారాల్లో న్యాయ, అధికారిక సంస్కరణలు జగన్నాథుని దేవస్థానం శ్రీ మందిరంలో తీవ్ర అలజడిని రేకెత్తించాయి. శ్రీ మందిరం రత్న వేదికపై జగన్నాథునితో కొలువు దీరిన బలభద్రుడు, దేవీ సుభద్ర, సుదర్శనుడు గత రెండురోజులుగా నిద్రాహారాలు లేకుండా ఉపవాసంతో జాగారం చేయాల్సి వచ్చింది. వరుసగా సోమ, మంగళవారాల్లో ఇదే పరిస్థితి తారసపడింది. జగతి నాథునికి కష్టాలు తెచ్చిపెడుతున్న శ్రీ మందిరం దేవస్థానం సేవాయత్‌లు, అధికార వర్గాలు, రాష్ట్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ తీరు పట్ల సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. భగవంతుడు ఒక వైపు ఉపవాసం, జాగారాలతో నిరీక్షిస్తుండగా శ్రీ మందిరం ఆలయ వైకుంఠం (కొయిలి వైకుంఠొ) ప్రాంగణంలో అమూల్యమైన జగన్నాథుని అన్న ప్రసాదాల్ని పాతిబెట్టారు. దీంతో ఈ ప్రసాదాల కోసం పరితపించే భక్త జనానికి తీవ్ర మనస్తాపం ఎదురైంది. జగమోహన మండపం వివాదమే కారణమా! దాదాపు 2 ఏళ్లుగా మూతబడిన శ్రీ మందిరం ప్రాంగణంలోని జగ మోహన మండపాన్ని ఈ నెల 16వ తేదీన పునఃప్రారంభించారు. రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ కార్యాచరణ చేపట్టారు. దైనందిన సేవలకు నియమితులైన వర్గీయులు మినహా ఇతరుల్ని గర్భగుడిలోకి అనుమతించ రాదని హై కోర్టు ఆంక్షలు విధించింది. తరతరాలుగా కొనసాగుతున్న ఆచారానికి ఈ ఉత్తర్వులు కళంకమంటూ సేవాయత్ వర్గం ఆక్షేపించింది. గర్భగుడిలోకి ప్రవేశించడంపట్ల ఆంక్షలు నివారించాలని పట్టుబట్టింది. ఈ మేరకు హైకోర్టు నుంచి సానుకూల స్పందన కొరవడింది. దీంతో సేవాయత్ వర్గం ఎదురు దాడికి పరోక్షంగా సిద్ధమైంది. గర్భగుడి రత్నవేదికపై సేవల్ని నిర్వహించాల్సిన సింఘారి సేవాయత్ వర్గీయులకు అనివార్య కారణాలతో గర్భగుడిలోకి అడుగిడే అవకాశం లేదు. ప్రత్యామ్నాయంగా సేవల్ని నిర్వహించేందుకు నియమితులైన వర్గీయులు మినహా ఇతరుల్ని రాష్ట్ర హై కోర్టు నివారించినందున అనుబంధ సేవల్ని నిర్వహించేందుకు ఇతర వర్గాల సేవాయత్‌లు కూడా నిరాకరించారు. ఇలా సోమవారం శ్రీ మందిరంలో జగమోహన మండపం పునఃప్రారంభాన్ని పురస్కరించుకుని వివాదం తలెత్తడంతో నిత్యసేవలకు గండి పడింది. ప్రభావితమైన నిత్యసేవలు సోమవారం మంగళహారతి నుంచి ఇతర సేవలన్నీ ప్రభావితమయ్యాయి. ప్రాతఃకాల ధూపాదుల కార్యక్రమాన్ని సోమ వారం మధ్యాహ్నం ఆలస్యంగా నిర్వహించారు. ఈ క్రమంలో అపరాహ్న సేవలు విపరీతంగా ప్రభావితమయ్యాయి. నిత్య కార్యకలాపాల్లో భాగంగా స్వామి వారి నివేదన కోసం వండిన అన్న ప్రసాదాలు పోటు ప్రాంగణంలోనే మగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో గర్భగుడి రత్నవేదికపై జగన్నాథునికి భోజనం లేకుండా పోయింది. నిత్య సేవల్లో క్రమం తప్పడంతో సోమవారం రాత్రి స్వామి వారికి ఏకాంత సేవ కూడా జరగలేదు. దీంతో స్వామి సోమవారం రాత్రి జాగారం చేయాల్సి వచ్చింది. భక్తులకూ దక్కని స్వామి ప్రసాదం మొత్తంమీద స్వామి వారికి అన్న ప్రసాదాల నివేదన జరగనందున నివేదనకు నోచుకోని అన్న ప్రసాదాల్ని శ్రీ మందిరం సముదాయంలో ఉన్న కోవెల వైకుంఠం (మూల విరాట్ల స్మశాన వాటిక)లో మట్టిలో పాతి బెట్టి చేతులు దులిపేసుకున్నారు. నిత్యం 56 రకాల వంటకాలతో అన్న ప్రసాదాల్ని సేవించాల్సిన స్వామికి వరుసగా రెండు రోజులపాటు వీటి నివేదన జరగకపోవడంతో జాతీయ, అంతర్జాతీయ జగన్నాథుని భక్తులు తీవ్ర మనస్తాపం చెందారు. స్వామి ఉపవాసం పాలు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే అశేష సంఖ్య భక్తులు, యాత్రికులకు జగన్నాథుని మహా ప్రసాదం లభ్యం కాలేదు. -
లచ్చిగాని కల
‘‘ఎందిరా తమ్మి, లచ్చిగాని ఇంటికాడ ఇంతమంది గుమిగూడిండ్రు?’’ గుంపును చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు రాజన్న.‘‘అయ్యో! నీకు తెల్వదు గాదే!! లచ్చిగానికి దేవుడు పూనిండంట. సాధక బాధకాలు చెప్పుకుంటే చాలు రాత్రి నిద్రలో కలగని తెల్లారి పొద్దునకల్లా సమస్యకు కారణంతో పాటు పరిష్కారం చెప్తుండంట. చానా మందికి అచ్చొస్తుందంటన్న.’’‘‘ఇదేం శిత్రం రా?’’‘‘అవునంటన్నా రోజుకు ఒక్కలికి మాత్రమే చెప్తుండంట. కలలోనే కోరుకున్న దేవుణ్ణి కలిసొచ్చీ, దేవుడేమంటున్నడో కూడా చెప్తుండంటనే!’’‘‘అన్ని మాయలు తీర్రా..ఈడు గూడా మాయమాటలు చెప్పి, ఏ బాబాలాగానో మారి గుడి కట్టించుకుందాం అనుకుంటుండేమో. ఇలాంటోళ్లను భూమ్మీద ఎంతమందిని చూస్తలేం?’’‘‘మాయనో, మర్మమో తెల్వదన్నా, అన్నేలం మాట వాడు డబ్బూ, దస్కం మాత్రం తీస్కుంటలేడన్న పాపం’’ ఆ మాటల్లో దయ ధ్వనించింది.రాజన్న నర్సిగాని కళ్లల్లోకి చూశాడు శాంతంగా!‘‘శానా రోజుల నుంచి చూస్తున్న.. నువ్వు దిగులుగా కనబడుతున్నావు. ఒక్కసారి నీ బాధగూడా చెప్పి చూద్దాం అన్నా, ఏమన్నా జాడ దొరుకుద్దేమో మరీ’’ అని సలహా ఇచ్చాడు నర్సిగాడు. ‘‘నిజమా, కాదా అన్నది తర్వాత ముచ్చట. ఒక్కసారైతే చెప్పి సూద్దామన్నా’’ రాజన్న మౌనాన్ని దాటుకుంటు మళ్లీ నర్సిగాడు. ‘‘నాదేంది నీదేందిరా తమ్మి! మనందరిది ఒక్కటే బాధగాదురా? టైంకు వానలు పడక పంటలు పండుతలేవాయే. ఏశిన సేండ్లెమో ఎండకు మాడిపోతుండే. కరువు, పురుగులు కలిసి మింగగ మిగిలిన పంట కోతకొచ్చేవరకు వడగళ్ల పాలయితుండే. ప్రతియేడు గిదే వరసాయే మనకు..’’ అని తన బాధనంతా రాజన్న గద్గద స్వరంతో చెప్పాడు.రాజన్న మాటలు మౌనంగా వింటున్నాడు నర్సిగాడు.‘‘అన్నదాత, దేశానికి వెన్నుముక అనే పొగడ్తలు తప్ప రైతుగా పుట్టినందుకు ఏం సుఖంరా? నైఋతి కాలమొచ్చి రెండు కార్తులు దాటిపాయే. తొలకరికి ఏశిన ఇత్తులు మొలిశినయ్ గని ఏం లాభం! కూలిపనికి పోయిన తల్లికోసం సాయంకాలం ఆశావరణంతో ఎదురు చూసే పల్లె పిల్లలాగేచెలకల్లో మొలకలు మొయిలు కోసం ఎదురుచూస్తూ మాడిపోతున్నాయి.’’ ఆవేదన వెళ్లగక్కాడు రాజన్న.‘‘అవునన్నా ఈ ఎవుసాయం చేసుడుకంటే, ఏడూర్లు దాటి వలసపోవడం మేలనిపిస్తుందే.’’‘‘గిట్ల ఋతుపవన కాలమొచ్చినా వానలేందుకొస్తలేవో? కాలానికి తగ్గట్టుగా వానదేవుడేందుకు కరుణిస్తలేడో? ఏ పాపం చేయ్యని రైతుల మీద వరుణ దేవుడెందుకు కక్ష కట్టిండోనని ఆ వరుణ దేవుణ్ణేతెలుస్కోని రమ్మందాంరా తమ్మీ’’ ఆశతో అన్నాడు రాజన్న. సరే అనుకుని ఇద్దరూ కలిసి లచ్చిగాని ఇంటికి వెళ్లారు. రాజన్న అంటే ఊరంతా చాలా గౌరవం. ఏ కార్తెకు ఏ పంట బలమో చెప్పగల సమర్థుడు. ఇప్పటకీ ఎడ్లతోనే వ్యవసాయం చేస్తున్న బలవంతుడు. సలహా అయినా, సహాయం అయినా ముందుగా గుర్తొచ్చేది రాజన్నే. ఏదైన మన అంటడు గానీ మధ్యలో ఒదిలేసిపోయే రకం కాదు. అందుకే ఈ రాత్రి కల రాజన్నకే అని లచ్చిగాడు బహిరంగంగా ప్రకటించి అందరికి సెలవు చెప్పాడు.‘‘చెప్పే రాజన్న నీకేం రందే?’’ గౌరవంగా అడిగాడు లచ్చిగాడు.‘‘నా ఒక్కందేం కాదురా తమ్మీ! ఈ లోకంలో ఉన్న మనందరి రందే నా రంది. కరువుకోరల్లో చిక్కి, అప్పుల బాధతో బలైపోతున్న రైతన్నల ప్రాణాల గురించి ఈ లోకానికి తెల్వంది కాదు. కాలం దాటిపోతున్న కార్తులకు తగ్గట్టు ఎనకటిలెక్క వానలెందుకొస్తలేవో ఆ వరుణదేవుణ్ణి అడిగిరా. రైతులంగే ఎందుకంతా కక్ష కట్టిండో నిలదీసి రారా!’’ ముచ్చటలాగా వివరించిండు రాజన్న.‘‘తప్పకుండ తెలుసుకొస్తనే... రేపు పొద్దునకల్లా ఏ సంగతైందీ నీకు చెప్త.’’ అని బదులిచ్చి లచ్చిగాడు సెలవు తీసుకున్నాడు.రాత్రి పడుకున్న తర్వాత వరుణదేవుడి గురించి ఆలోచించసాగాడు లచ్చిగాడు. కన్నంటుకోగానే కల మొదలైంది లచ్చిగానికి. తలచుకోగానే రెక్కలొచ్చాయి కలలో!ఆహా.. అనుకుంటూ ఆనందంగా ఆకాశానికి ఎగిరాడు. ఎక్కడ చూసినా అనంతమైన నీలాకాశం. చుట్టూ్ట శూన్యం. ఆకాశం కళ్లకందినట్టే అనిపిస్తూ, సాగేకొద్దీ దూరమైపోతుంది. ఇది నైరుతి ఋతుపవన కాలమని నైఋతి దిక్కు తన ప్రయాణం కొనసాగించాడు.‘‘వర్ష ఋతువే అయినా ఎండ దంచుతోంది. వేడికి చెమట ఆవిరై ఒళ్లు బొగ్గయిపోతోంది. అయినా ఒక్క మబ్బు ముక్కా కనపడి చావాదేం?’’ అని మనసులో అసహనంతో గుణుక్కొన్నాడు లచ్చిగాడు.నైఋతి దిక్కుకు వేగంగా కదులుతున్నాడు. కంటికి అలుపొచ్చే సమయానికి కొంచెం దూరంలో కంటికి మసక మసకగా నల్లని ఒక మేఘమాలిక కనబడింది. గాలి ఉలిలా మారి మబ్బు మాలికను ఇంకా అందంగా చెక్కడానికి విఫల ప్రయత్నం చేస్తోంది. మేఘమాలికను చూడగానే ఒళ్లంతా ప్రకంపించి, ప్రాణం లేసొచ్చినట్టయింది. వేగంగా మేఘమాలికకు ఎదురెళ్లి నమస్కరించాడు లచ్చిగాడు.వెంటనే ఆ మేఘమాలిక దేవకన్యలా మారి ‘‘ఎవరు మీరు?’’ అని లచ్చిగాన్ని సౌమ్యంగా ప్రశ్నించింది. ‘‘నేను భూలోక మానవుణ్ణి! నన్నందరూ లచ్చిగాడు అని పిలుస్తారు.’’ అని వినయంగా పరిచయం చేసుకున్నాడు.‘‘ఇలా ఎందుకొచ్చావ్ నాయానా? ఆకాశ దేశంలో నీకేం పని?’’‘‘మీ రాజు వరుణదేవుణ్ణి కలవడానికి వచ్చాను తల్లీ! ఎంతో దూరం నుంచి వస్తున్నాను. ఎక్కడా కనబడడేం? అలసి సొలసి మాడి మసి బొగ్గయి వచ్చానమ్మా. నా యందు దయుంచి కొంచెం వరుణదేవుని చిరునామా చెప్పు’’ అని చేతులు జోడించి వేడుకున్నాడు.‘‘మీరు సరైన దిశలోనే వచ్చారు మానవా! ఈ నైఋతి మూలవైపే వెళ్లు. దగ్గర్లోనే వజ్ర కాంతులతో మెరిసే రాజమందిరం కనబడుతుంది’’ తన బాధ్యత నిర్వర్తించడానికి త్వరితగతిన వెళ్లాలని మేఘమాలిక చెప్పింది. మరోసారి చేతులు జోడించి నమస్కరించి, కృతజ్ఞతాభావంతో మేఘమాలిక నుంచి సెలవు తీసుకున్నాడు.ఆనందంగా రెట్టించిన వేగంతో రెక్కలు జాడించి, పెద్ద పెద్ద కొండల్ని దాటి, సముద్రాల మీదుగా పైపైకి ఎగిరాడు. తొందర్లోనే వరుణదేవుని విశాల భవనం ముందు వాలాడు.వజ్ర వైడుర్యాలతో నిర్మించబడిన ఆ కోట తళతళలాడుతోంది. ఆ రాజభవనపు కాంతికి కళ్లు సొమ్మసిల్లిపోతున్నాయి. వరుణుడు, అతిథి దేవతలు మబ్బు శయ్యలపై సభమందిరంలో ఆసీనులైనారు. ఉరుముల సంగీత హోరులో, మెరుపు తీగల్లాంటి అప్సరసల నాట్యాన్ని సురపానకాన్ని సేవిస్తూ ఆనంద డోలికల్లో తిలకిస్తున్నారు. ఇంతలో కళల సమయం ముగిసింది.ఇది సభా సమయం. సభ ప్రారంభమైంది. వరుణుడు వివిధ మేఘాలతో సమావేశమై ఏదో సంభాషిస్తున్నాడు. వరుణుడి ముఖంలో జలకళ ఉట్టిపడుతోంది. సూర్యకాంతికి అతని దేహంపై నీటి బిందువులు వజ్రహారాల్లా మెరుస్తున్నాయి. మబ్బు సింహాసనంపై కూర్చొన్న వరుణిడి కళ్లకు కరుణ అలంకారమైంది.వరుణుడికి చెమట పట్టకుండా పిల్లగాలులు పరిచారికల్లా సేవ చేస్తున్నాయి.ఇన్ని సౌఖ్యాలనుభవిస్తూ రైతుల గోడును పట్టించుకోవడానికి ఏమైందని మనసులో అనుకుంటు కోపంతో ‘‘వరుణ దేవా!’’ అని గద్దించి పిలిచాడు. ‘‘ఎవరక్కడ? మీకేం కావాలి?’’ అని గట్టిగా ఉరిమాడు వరణుడు.ఇంతలో ద్వారపాలకులు వెళ్లి లచ్చిగాన్ని పట్టుకొచ్చి వరుణుడి ముందు ప్రవేశపెట్టారు.‘‘నేనవరినైతే నీకెందుకు? భూలోకంలో రైతన్నలు కన్నీటిలో మునిగి, ఉరిపోసుకుని యమపురికి చేరుకుంటుంటే, రైతు రక్షకుడిగా నియమింపబడిన నీవు మాత్రం అవేమి పట్టించుకోకుండా, కర్తవ్యం మరిచి నీ దర్బారులో జల్సాలు చేస్తున్నావు!’’ గట్టిగా అరిచాడు లచ్చిగాడు.‘‘హా..హా..హా...’’ పెదవులపై మెరుపులు చిల్లుతుండగా ఉరిమినట్టు నవ్వాడు వరుణుడు.‘‘నా ఆవేదన మీకు హాస్యంగా తోస్తుందా? వానదేవా?’’ అని లచ్చిగాడు కళ్లు ఎర్రచేసి పిడికిలి బిగబట్టాడు.‘‘ముందు ఆసీనులుకండీ మానవా!’’ వరుణుడు మర్యాదగా చెప్పటంతో, నిలబడే తేల్చుకుందామనకున్న లచ్చిగాడికి కూర్చోక తప్పలేదు.‘‘చెప్పు మానవా నీ ఆవేదన.. ఆలకించి, ఆదుకోవడానికి మేం సిద్ధం’’ అన్నాడు. అతిథిని గౌరవించడం దైవకార్యం.‘‘కాలమైన చినుకుపడదు. ఖరీఫ్ వచ్చిన కరువు పోదు. కరువూ, పురుగూ కబళించగా మిగిలిన కాసింత పంటను మీ వడగళ్లు బలితీసుకుంటాయి. కాలచక్రంతో పాటే నీ వాన చక్రం తిప్పవచ్చుకదా? తొలకరికి విత్తిన విత్తనాలు అనాథల్లా రోదిస్తోంటే మీకు కనపడటం లేదా స్వామి? రైతుపట్ల దళారులకూ, ప్రభుత్వానికీ, తినేవాడికీ ఎవ్వరికి కనికరం లేదు.మీరు కూడా మాపై దయలేకుండా పగపడితే మేమైపోవాలి దేవా? కాలానికి తగ్గట్టుగా మీరెందుకు కురవడం లేదు?’’ అని ఆపకుండా గుండెల్లో బాధనంతా ప్రశ్నల్లా కక్కేశాడు.‘‘మంచి ప్రశ్నలే సంధించావు మానవా! ఇప్పుడు మేము చెప్పేది కూడా విను. మాకూ వర్షించాలనే ఉంటుంది. మట్టికప్పుకుని పడుకున్న ప్రతివిత్తును స్పృశించి ప్రాణం పోసి విముక్తి కలిగించాలనే ఉంటుంది. మబ్బుల నుంచి జారే ప్రతి చినుకూ చిగురులా రూపాంతరం చెంది మోక్షం పొందాలనుకుంటాయి. ప్రతి ప్రాణి దాహం తీర్చడం మా కర్తవ్యం. మానవుల్లా మాకు స్వార్థ గుణం లేదుగనుకే కవులచేత కీర్తింపబడ్డాము! అందుకే మబ్బుల సైన్యాన్ని నలుమూలలా వర్షించుటకు పంపిస్తున్నాము..’’ అని చెప్తుంటే మధ్యలో ఈశాన్య సేనాని రొప్పుతూ వచ్చాడు. ‘‘వాన దేవుడికి జయము...జయము..’’ అని పలికి సభా ప్రవేశం చేశాడు. ‘‘చెప్పండి ఈశాన్య సేనాధిపతి.. వెళ్లిన పని విజయవంతం అయిందా? మీరు తెచ్చిన తీపి కబురు వినాలని నా హృదయం ఉవ్విళ్లూరుతోంది!’’ సంతోషంతో గంభీరంగా అడిగాడు వరుణుడు.‘‘క్షమించండి వరుణదేవా! ఈశాన్యం వైపు చినుకు కొరకు పరితపిస్తున్న అమాయక రైతులపై జాలితో వెళ్లిన మన మేఘసైన్యం ఈసారి కూడా ఓడిపోయింది. ఆ పొలాల పక్కనున్న విషబాణల్లాంటి కర్మాగారాల పొగతో పోటిపడి పోరాడలేక మన మబ్బులన్నీ ముక్కలు ముక్కలుగా విడిపోయి చినుకు జారవిడచకుండానే చెల్లా్లచెదురయ్యాయి ప్రభూ!’’ అని బాధతో దీనంగా చెప్పాడు సేనాధిపతి.లచ్చిగానికి అప్పటికే సగం సంగతి బోధపడింది.‘‘చూశావుగా మానవా? మా కర్తవ్యంలో ఏమైనా లోపముందా? మా నిరంతర ప్రయత్నం ఇలాగే ప్రతిసారి వృథా ప్రయాస అవుతోంది’’లచ్చగాడి గుండెల్లో బాధ కమ్ముకుంది.‘‘అటు చూడు మానవా! ప్రతి పవనం కురవలేకపోతున్నామనే బాధ, నిరాశల బరువును ఎలా మోస్తున్నాయో?’’లచ్చిగానికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మళ్లీ వరుణుడే అందుకొని ‘‘భూలోకంలో వలే లంచానికి పనిచేసే వారు ఇక్కడెవ్వరూ లేరు. ప్రతి మేఘం తమ కర్తవ్యానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి.’’ అన్నాడు. మౌనం కాటేసినట్టయింది లచ్చిగానికి. ఏం మాట్లడలేకపోయాడు.‘‘లేగలు లేకుండా ఆవులు పాలిస్తాయా నాయనా? ఓ మరిచిపోయాను మీరు మానవులు కదా? సైన్స్‌తో అద్భుతాలు చేసిన మర సృష్టి కర్తలు కదా! మరుగు మందు పెట్టయినా బలవంతంగా పాలు పితుక్కొగల తెలవిమంతులు! కానీ ఎన్నాళ్లు?’’తలదించుకున్నాడు లచ్చిగాడు మానవుడైనందుకు. మళ్లీ అందుకుంటూ వరుణుడు...‘‘అలాగే మేఘాలు కూడా లేగల్లాంటి చెట్లు లేకుండా వర్షించలేవు. కొమ్మలు రమ్మని పిలిచినప్పుడు మేం తప్పకుండా కురుస్తాం! మీ మానవులు చెట్లను నరకడం ఆపకుండా మేదోమథనం చేసినా, మేఘమథనం చేసినా మేఘాలు వర్షించలేవు’’ అని వరుణుడు స్పష్టం చేశాడు.లచ్చిగాడు అపరాధ భావంతో బాధగా చేతులు జోడించి వరుణదేవుడికి మొక్కివినసాగాడు. ‘‘స్వార్థబుద్ధితో ఇలాగే కాలుష్యం చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తూ కృత్రిమ జీవనం సాగిస్తూ పోతామంటే శ్మశానం అయ్యేది మీ మనుగడే!’’ అని వరుణుడు బో«ధించాడు.ఇంతలో లచ్చిగాడు కళ్లు తెరిచాడు!! - తండ గణేశ్ -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..
న్యాయవాదులతో హైకోర్టు జడ్జి నవీన్‌రావు కోర్టు ప్రాంగణంలో హరితహారం న్యాయమూర్తులకు వర్క్‌షాప్ వరంగల్ లీగల్ : తెలంగాణ హైకోర్టు సాధన ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులకు సంబంధించిన సమస్యలు, కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, కక్షదారులకు కనీస సౌకర్యాల కల్పన కోసం తన వంతు కృషి చేస్తానని జిల్లా పోర్టు ఫోలియో జడ్జి, హైకోర్టు జడ్జి పి.నవీన్‌రావు తెలిపారు. జిల్లాకు శనివారం వచ్చిన ఆయన తొలుత కోర్టు ప్రాంగణంలో హరితహారంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి ఎం.లక్ష్మణ్, మహాæనగరపాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పోలీసు కమీషనర్ సుధీర్‌బాబుతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక్కడ చదువుకున్న తనకు వరంగల్‌పై ప్రత్యేక గౌరవం ఉందని తెలిపారు. ఆ తర్వాత జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో న్యాయమూర్తులకు ‘సాక్ష్యాధారాల నమోదు’పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో కూడా నవీన్‌రావు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో వివిధ అంశాలపై రిటైర్ జిల్లా జడ్జి యస్.మాధవరావు, సీబీఐ కోర్టు జడ్జి చక్రవర్తి, జనగాం కోర్టు సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు, సీనియర్ జూనియర్ సివిల్ జడ్జిలు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు సహోదర్‌రెడ్డి, జయాకర్, టీ.వీ.రమణ, అల్లం నాగరాజు, కవిత తదితరులు పాల్గొన్నారు.