మేల్కొని ఉండండి | Stay awake in our life | Sakshi
Sakshi News home page

మేల్కొని ఉండండి

Published Mon, Dec 31 2018 5:50 AM | Last Updated on Mon, Dec 31 2018 5:55 AM

Stay awake in our life - Sakshi

గడిచిపోయిన కాలం క్షణమైనా తిరిగి రాదు. కానీ అనంతత్వంలో మేలుకొన్నవారికి, కాలం కదలకుండా స్థిరమై నిలిచిపోతుంది!

కాలం పరమేశ్వర స్వరూపం అంటారు. అందుకే కాబోలు. తనలో తాను లయమైపోతుంది. కాలానికి ఉన్న గొప్ప గుణం గాయాలను మాన్పడం. అదేంటి, గాయాలు చేయడం కూడా కదా అంటారా? అవును. గాయాలు అవుతాయి. కానీ, వాటిని చేసేది కాలం కాదు. మనం, మనలోని కోరికలు. 2018 ఎందరికో ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలు, సుఖం, సంతోషం, బాధ, దుఃఖం వంటి అనుభూతులను మిగిల్చి ఉంటుంది. కొందరికి పదవీ యోగం, కొందరికి పదవీ‘వియోగం’, కొందరికి కాసుల పంట, ఇంకొందరికి కాసుల తంట. కొన్ని జననాలు, మరెన్నో మరణాలు.

ఈ ఏడాది కాలం కొందరికి కల్యాణ యోగం కలిగించితే, ఇంకొకరి కాపురంలో కలతలు రేపి ఉండవచ్చు. కొందరు వాహనాలు కొనుక్కుని ఉంటే, ఇంకొందరు తామెంతో ఆశపడి కొనుక్కున్న వాహనాలను, ఇతర ఆస్తులను అయినకాడికి అమ్మేసుకుని ఉండవచ్చు. కొందరికి ఏళ్ల తరబడి ఉన్న గండాలనుంచి గట్టెక్కించి ఉంటే, ఇంకొందరిని సుడిగండంలోకి నెట్టి ఉండవచ్చు. ఈ కాలం కలకాలం ఇలాగే నిలిచిపోనీ అని కొందరు కోరుకుంటే, ‘అబ్బబ్బ.. చేటుకాలం దాపురించిందిరా నాయనా! తొందరగా గడిచి పోతే బాగుండు’ అని మరికొందరు దండాలు పెట్టుకుంటూ ఉండచ్చు.

మనం ఏమనుకుంటేనేం, ఎన్ననుకుంటేనేం.. గడిచిపోయిన కాలం క్షణమైనా తిరిగి రాదు. రాలేదు. అది సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడికి కూడా సాధ్యం కాదు. ఈ విషయాన్ని ఎరుకలో ఉంచుకుని, అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇంతవరకు కోట్ల సంవత్సరాలు వచ్చిపోయాయి. లెక్కలేనన్ని సంఘటనలు జరిగిపోయాయి, లెక్కించలేనంతమంది మానవులు వచ్చి, వెళ్లిపోయారు. ఈ రోజు ఇప్పుడు.. ఇక్కడ మనం ఉన్నాం. ఏదో ఒకరోజు మనమూ వెళ్లిపోతాం.. ఒకసారి మేలుకోండి! గాఢంగా నిద్రపోతున్నవారు పండుగ జరుపుకోలేరు.

కాలం ఎవరికోసమూ ఆగదని అంటారు. కాని, అనంతత్వంలో మేలుకొన్నవానికి, కాలం కదలకుండా స్థిరమై నిలిచిపోతుంది. రాబోయే నూతన సంవత్సరం కొత్త కలలు కనండి.  అయితే, కొత్తగా ఆలోచించాలంటే పాతవాటిని మరచిపోవాలి. అప్పుడే కొత్తదనంచ దాని మంచీ చెడ్డా తెలుస్తాయి. కొత్త సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలు ఆచరణయోగ్యంగా, నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా విజయాలు వరిస్తాయి. కొత్త కలలను  నెరవేర్చుకునేందుకు నిర్విరామంగా శ్రమ చేయండి.
– డి.వి.ఆర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement