
లండన్ : పగటిపూట కునికిపాట్లు భవిష్యత్‌లో అల్జీమర్స్ వ్యాధి చుట్టుముట్టేందుకు సంకేతమని ఓ పరిశోధన హెచ్చరించింది. పదవీవిరమణ చేసిన 300 మందిపై చేసిన అథ్యయనంలో పగటిపూట నిద్రించిన వారి మెదడులో అల్జీమర్‌కు దారితీసే కారకాలు ప్రేరేపితమయ్యాయని వెల్లడైంది. దీంతో రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టని వారు పగటిపూట కునికిపాట్లతో సతమతమైతే అల్జీమర్ ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. వృద్ధులు పగలు అతిగా నిద్రించడం మంచిది కాదని అథ్యయనం చేపట్టిన మయో క్లినిక్‌కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు.
2009 నుంచి 2016 వరకూ 70 ఏళ్లు పైబడిన దాదాపు 300 మందిని పరిశీలించిన శాస్త్రవేత్తలు పగటిపూట వారు నిద్రించే సమయాన్ని విశ్లేషించారు. వారి బ్రెయిన్ స్కాన్స్‌ను పరిశీలించగా పగటిపూట నిద్రించని వారితో పోలిస్తే బాగా నిద్రపోయిన వారి మెదడులో అల్జీమర్స్ కారకాలు పెరిగాయని స్పష్టం చేశారు. జామా న్యూరాలజీ జర్నల్‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది.