ఒక్కరోజు నిద్రకు దూరమైతే చాలు.. మర్నాడు మనం ముఖం వేలాడేసుకుని, నిస్సత్తువలో కూరుకుపోతాం. అదే ఏవో కారణాలతో రెండు రోజుల పాటు నిద్రకు దూరమయ్యామంటే ఇక ఎక్కడపడితే అక్కడ పడుకుండిపోతాం. మరి 60 ఏళ్లకుపైబడి నిద్రకు దూరమైన వ్యక్తి గురించి తెలిస్తే ఏమంటారు?
థాయ్ అంజోక్.. ప్రపంచంలో 62 ఏళ్లకు పైగా నిద్రపోని వ్యక్తి. వియత్నాంకు చెందిన ఈ మహాశయుడు తనకు 62 ఏళ్లుగా నిద్ర పట్టడం లేదని మీడియాకు తెలియజేశాడు. 1962 నుంచి తన జీవితం నుంచి నిద్ర అనేది శాశ్వతంగా మాయమైందని థాయ్ అంజోక్ తెలిపాడు. ఆయన నిద్రపోవడాన్ని అయన భార్యాపిల్లలు ఎన్నడూ చూడలేదట. ప్రముఖ యూట్యూబర్ డ్రూ బిన్స్కీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో థాయ్ అంజోక్ తన కథను వివరంగా చెప్పాడు. దీనికి ముందు కూడా థాయ్ అంజోక్ నిద్రలేమి కథలు పలు మీడియా నివేదికలలో కనిపించాయి.
80 ఏళ్లుదాటిన థాయ్ అంజోక్‌కు 1962లో ఒక రోజు రాత్రి జ్వరం వచ్చిందట. అప్పటి నుంచి ఒక్కరోజు కూడా నిద్రపోలేనని అంజోక్ చెప్పాడు. అయితే అంజోక్‌కు హాయిగా నిద్రపోవాలనే కోరిక తీరనిదిగా మిగిలిపోయిందట. వైద్య నిపుణులు ఈ రకమైన వ్యాధిని నిద్రలేమి అని చెబుతారు. దీని కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది. అయితే నిద్రలేమి అనేది థాయ్ అంజోక్ ఆరోగ్యంపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం వైద్యశాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
థాయ్ అంజోక్ ఈ వయసులోనూ పొలంలో పనిచేస్తుంటాడు. థాయ్ అంజోక్‌కు గ్రీన్ టీ, రైస్ వైన్ అంటే ఇష్టం. తాను రోజూ కళ్ళు మూసుకుని నిద్రపోయేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని థాయ్ అంజోక్ తెలిపాడు. వేలాది రోజుల పాటు నిద్రకు దూరమైన థాయ్ అంజోక్ ఒక దేశీ మద్యం తయారీ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాత్రి మూడు గంటల వరకు డ్యూటీలో ఉంటాడు. విదేశాల నుంచి పలువురు వైద్య శాస్త్రవేత్తలు తనను పరీక్షించేందుకు వస్తుంటారని ఆయన తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment