నిద్రపోతున్న దొంగ
బ్యాంకాక్ : దొంగతనానికి పోయిన ఓ దొంగ అక్కడి వస్తువులు ఎత్తుకుపోవటం మానేసి ఏసీ వేసుకుని మంచంపై హాయిగా నిద్రపోయాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఈ వింత, నవ్వు తెప్పించే ఘటన థాయ్‌లాండ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌లోని ఫెట్చబూన్ ప్రావిన్స్‌కు చెందిన అతిట్ కిన్ కుంతుబ్ అనే 22 ఏళ్ల యువకుడు మార్చి 22వ తేదీన అక్కడి ఓ ఆఫీసర్ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లాడు. అప్పటికే బాగా అలసిపోయిన అతడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలని భావించాడు. వెంటనే ఆఫీసర్ కూతురి బెడ్‌రూంలోని ఏసీ ఆన్ చేసి మంచంపై నిద్రపోయాడు. అయితే గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. ఉదయం ఆఫీసర్ ఇంటికి వచ్చాడు. కూతురి బెడ్‌రూంలోని ఏపీ ఆన్ చేసి ఉండటంతో లోపలికి వెళ్లాడు.
మంచంపై ఎవరో ముసుగు తన్ని పడుకుని ఉన్నారు. ఊరికి వెళ్లిన కూతురు ఏమైనా వచ్చిందా అనుకున్నాడు. దుప్పటి తెరిచి చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు‘‘ బాబు! నిద్రపోయింది చాలు ఇక పైకిలే’’ అంటూ దొంగను నిద్ర లేపారు. నిద్రలోంచి కళ్లు తెరిచిన అతను ఎదురుగా పోలీసులను చూసి కంగుతిన్నాడు. ‘అరే! పాడు నిద్ర ఎంత పని చేసింది’ అనుకుంటూ ఆలోచనల్లో ఉండగానే పోలీసులు అతడి చేతులకు బేడీలు వేసి తీసుకుపోయారు.
చదవండి, చదివించండి : అయ్యో పాపం! క్యాబిన్‌లో ఇరుక్కుపోయి ఆర్తనాదాలు..
Comments
Please login to add a commentAdd a comment