
ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో చెలరేగుతున్న మంటలు చల్లారడం లేదు. తాజాగా అల్మోరా జిల్లాలోని అడవిలో మంటలను ఆపేందుకు 30 గ్రామాల ప్రజలు నిరంతరం శ్రమిస్తున్నారు.
7.5 హెక్టార్లలో విస్తరించి, జిల్లాకే మోడల్ ఫారెస్ట్‌గా పేరుగాంచిన శ్యాహీదేవి-శీతలఖేత్ అటవీప్రాంతాన్ని కాపాడటంతోపాటు తమ పొలాలు, గడ్డివాములను రక్షించుకునేందుకు ఆయా గ్రామాల్లోని ప్రజలంతా అటవీ ప్రాంతాన్ని చల్లార్చేపనిలో పడ్డారు. వీరు తమ తిండితిప్పలను కూడా అడవుల్లోనే కొనసాగిస్తున్నారు.
2003 నుంచి శ్యాహీదేవి-శీతలఖేత్ అడవులను అభివృద్ధి చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఆరోగ్య శాఖకు చెందిన ఫార్మసిస్ట్ గజేంద్ర కుమార్ పాఠక్ ఆధ్వర్యంలో ‘సేవ్ జంగిల్’ పేరుతో 30 గ్రామాల ప్రజలు అటవీ శాఖ సహాయంతో ఓక్, బురాన్ష్, ఫాల్యంట్ తదితర జాతుల అడవులను అభివృద్ధి చేశారు.
ప్రస్తుతం ఈ అడవుల్లో మంటలు చెలరేగుతుండటంతో గ్రామస్తులు పగలనక రాత్రనక మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. అడవిలో మంటలు తాడిఖేట్‌లోని సుదూర గ్రామానికి చేరుకున్నాయి. తమ ఇళ్లు, పొలాలు, గడ్డివాముల గురించి ఆందోళన చెందుతున్న గ్రామస్తులు అటవీ మంటలను చల్లాచ్చే పనిలో తలమునకలవుతున్నారు. గ్రామస్తులు తీవ్రంగా శ్రమించి గ్రామంలోకి మంటలు వ్యాపించకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.