పుణె: మహారాష్ట్రలోని పుణేకు చెందిన 12 సంవత్సరాల బాలుడు వినూత్న ఆవిష్కరణతో ఔరా అనిపించాడు. సముద్రంలో కాలుష్యాన్ని తగ్గించి, సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు ఎర్విస్ పేరుతో నౌకను రూపొందించిన బాలుడు హజీక్ ఖాజీ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. సముద్ర జీవజాలంపై వ్యర్థాల ప్రభావం ఎలా ఉంటోందో పలు డాక్యుమెంటరీల ద్వారా తెలుసుకున్న ఖాజీ.. ఎలాగైనా సముద్ర జీవులను కాపాడాలని, అందుకోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు.
ప్లాస్టిక్ ప్రధాన కారణంగా గుర్తించి..
సముద్ర జీవుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న కారకాల్లో ప్రధానమైనది ప్లాస్టిక్ అని తెలుసుకున్న ఖాజీ.. ఆ ప్లాస్టిక్‌ను నిర్మూలించేలా ఓ నౌకను డిజైన్ చేశాడు. దానికి ఎర్విస్ అని పేరు పెట్టాడు. ఖాజీ రూపొందించిన ఈ నౌక సముద్ర జలాల్లో వ్యర్థాలను వేరుచేసి, శుద్ధ జలాలను సముద్రంలోకి తిరిగి పంపుతుంది.
మేధావుల నుంచి ప్రశంసలు..
టెడ్‌ఎక్స్, టెడ్ 8 వంటి పలు అంతర్జాతీయ వేదికలపై ఈ నౌక గురించి ఖాజీ వివరించడంతో శాస్త్రవేత్తలు, మెరైన్ నిపుణులు, మేధావుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. వారంతా ఖాజీ ప్రతిభకు అబ్బురపడ్డారు. ఇక ఎర్విస్ నౌక కింది భాగంలో ఉండే మెషీన్ సముద్రంలోని ప్లాస్టిక్‌ను సంగ్రహించి, దాని పరిమాణం ఆధారంగా దాన్ని విడగొడుతుంది.
హాట్సాఫ్ ఖాజీ..
సముద్ర జీవజాలాన్ని పరిరక్షిస్తూ, వ్యర్థాలను ఏరివేస్తూ సముద్రం నలుచెరుగులా ఈ నౌక సంచరిస్తుంది. సముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యం వల్ల జరిగే అనర్థాలు, ముప్పుపై ఖాజీ ప్రస్తుతం పలురంగాలకు చెందిన వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. సముద్ర జీవజాలాన్ని కాపాడేందుకు పన్నెండేళ్ల బాలుడు హజీక్ ఖాజీ చేస్తున్న ప్రయత్నానికి అంతా హాట్సాఫ్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment