నా ఉప్పు తిన్నారు | June 8 World Oceans Day | Sakshi
Sakshi News home page

నా ఉప్పు తిన్నారు

Published Sun, Jun 3 2018 12:10 AM | Last Updated on Fri, Mar 22 2019 7:19 PM

June 8 World Oceans Day - Sakshi

సముద్రాలంటే మనకు గొప్ప ఫాసినేషన్‌. సముద్రాన్ని ఒక్కసారి కూడా కళ్లతో చూడకున్నా, ఆ సముద్రాన్ని బాల్యంలోనే పరిచయం చేసుకొని ఉంటాం. దాన్ని కలలు కనుంటాం. కథలుగా వినుంటాం. కథలు కథలుగా చెప్పుకొని ఉంటాం. ఒక్కసారైనా చూసొస్తే ఇంక తెలీకుండానే ప్రేమలో పడిపోతాం. మనకు ఏకాంతాలన్నా సముద్రాలే, సమాధానాల్లేని ప్రశ్నలకైనా సముద్రాలే! అలాగని ఉల్లాసాన్నిచ్చేదిగా మాత్రమే ఉంటే అది మనం ఇంత ఇష్టపడే సముద్రం అయ్యేది కాదు. జీవి మనుగడకు కూడా సముద్రం ఒక కేంద్రం. అది లేకపోతే మన ఈ జీవితాన్ని ఇలాగే ఊహించుకోను కూడా లేం. మనకు ఇన్ని ఇచ్చి, ఇంతా చేసిన సముద్రానికి మనం తిరిగి ఏమిస్తున్నామంటే? కాలుష్యం. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల కాలుష్యం. సముద్రం ఉప్పు తిని మనం చేస్తోంది ఏంటంటే.. ఆ సముద్రాన్నే ముంచేస్తున్నాం. ఇప్పటికీ ఓ అవకాశం ఉంది, ఎప్పటికీ ఉండదు అది.. సేవ్‌ ఓషన్‌... సేవ్‌ లైఫ్‌...  

కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నామని కొందరు మనుషులు వాపోతుంటారు గాని, కడలి కష్టాల గురించి ఎవరైనా ఏనాడైనా పట్టించుకున్నారా? సముద్రాల లోతు ఎరిగిన కొద్దిమంది శాస్త్రవేత్తలు మాత్రమే వాటి కష్టనష్టాల గురించి నిష్ఠుర సత్యాలను ఎప్పటికప్పుడు లోకానికి వెల్లడిస్తున్నారు. జీవరాశుల మనుగడకు కీలకమైన సముద్రాలను కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్లేనని శాస్త్రవేత్తలు ఎంతగా గొంతు చించుకుంటున్నా, వారి గోడును ఆలకించే వారే కరువవుతున్నారు. ప్రపంచ దేశాల ప్రభుత్వాలు సైతం కడలి కష్టాలను కడతేర్చేందుకు చిత్తశుద్ధితో చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. భూమి మొత్తం విస్తీర్ణంలో దాదాపు మూడొంతులు సముద్రాలే నిండి ఉన్నాయి. మిగిలిన ఒక వంతు స్థలభాగంలో మైదానాలు, పీఠభూములు, అరణ్యాలు, ఎడారులు, నదులు, సరస్సులు వంటివి ఉన్నాయి. ఒకవంతు స్థలభాగంలో జీవిస్తున్న మనుషులు సహా మిగిలిన జీవరాశుల మనుగడకు సముద్రాల ఉనికి చాలా కీలకం. సముద్రాలను క్షేమంగా కాపాడుకుంటేనే మనుషులూ, మిగిలిన జీవులు క్షేమంగా ఉండటానికి వీలవుతుంది. నానా చెత్తను సముద్రాల్లో పారవేయకుండా నియంత్రణ పాటిస్తేనే వాటిని కాపాడుకోగలుగుతాం.

కష్టాలనేవి మనబోటి మనుషులకు ఉంటాయే తప్ప కడలికి కష్టాలేముంటాయని విసుక్కోకండి. కష్టాలు కడలికి కూడా ఉంటాయి. వాటిలో చాలా వరకు కష్టాలు మనబోటి మనుషుల వల్ల వచ్చిపడేవే. మనుషుల నిర్లక్ష్యం సముద్రాలను సమస్యల్లోకి నెట్టేస్తోంది. వాటిని కాలుష్య కాసారాలుగా మార్చేస్తోంది. తీరాల వెంబడి సంచరించే జనం ఎడాపెడా వాడి పారేసే ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాలను ముంచెత్తుతున్నాయి. ఎందులోనూ నాశనం కాని ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రజీవుల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. మితిమీరిన చేపల వేట సముద్రాల్లోని జీవ వైవిధ్యానికి విఘాతం కలిగిస్తోంది. కాలాలతో నిమిత్తం లేకుండా ఇష్టానుసారం కొనసాగించే వేట వల్ల సముద్రాల్లోని అరుదైన జీవరాశులు అంతరించిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. భూమ్మీద మితిమీరిన వాయు కాలుష్యం సముద్రాలనూ వదలడం లేదు. కార్బన్‌ డయాక్సైడ్‌ మోతాదుకు మించి సముద్రాల్లోకి చేరుతుండటంతో సముద్ర జలాల్లో ఆమ్లగాఢత పెరుగుతోంది. ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోకుంటే, సముద్రంలోని అరుదైన జీవరాశులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కలుషిత వాయువుల వల్ల భూతాపం పెరుగుతున్నందున సముద్రంలోని విలువైన పగడపు దీవులు క్రమంగా క్షీణించిపోతున్నాయి. బొగ్గు విద్యుత్‌ కేంద్రాలు, ఇతర పరిశ్రమల నుంచి వెలువడే పాదరసం వ్యర్థాలు కూడా సముద్రంలోనికి మోతాదుకు మించి చేరుతున్నాయి. సముద్రంలోకి చేరే పాదరసం చేపలు తదితర జలచరాల్లోకి చేరుతోంది. చేపలను తినే మనుషులకు ఇది ప్రమాదకరంగా పరిణమిస్తోంది. సముద్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటివల్ల సముద్రగర్భంలోని జీవరాశితో పాటు, నేల మీద నివసించే మనుషులకు వాటిల్లే ముప్పు గురించి శాస్త్రవేత్తలు చాలాకాలం నుంచే మొత్తుకుంటున్నా, ఇరవయ్యో శతాబ్ది చివరి రోజుల్లో మాత్రమే ప్రపంచ దేశాల ప్రభుత్వాల్లో కొంత చలనం వచ్చింది. తొలిసారిగా 1992 జూన్‌ 8న వివిధ దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ‘వరల్డ్‌ ఓషన్స్‌ డే’గా ప్రకటించి కెనడాలో ఒక సమావేశం నిర్వహించాయి. సముద్రాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరిపాయి. ఐక్యరాజ్య సమితి మాత్రం వరల్డ్‌ ఓషన్స్‌ డేను 2008లో అధికారికంగా గుర్తించింది. అప్పటి నుంచి వివిధ దేశాల ప్రభుత్వాలు, సముద్ర పరిశోధనలు సాగించే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు ఈ రోజున సాగరాల పరిరక్షణ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి.

కార్బన్‌ కాలుష్యంతో చేటు
భూమ్మీద మనుగడ సాగించే మనుషులు సహా సమస్త జీవరాశులకు అవసరమయ్యే ప్రాణవాయువును అందించడంలో సముద్రాల పాత్ర చాలా కీలకం. ప్రపంచంలోని జీవులకు అవసరమయ్యే ఆక్సిజన్‌లో దాదాపు సగానికి సగం సముద్రాల ద్వారానే అందుతోంది. అంతేకాదు, భూమిపై వాతావరణంలో వ్యాపించి ఉన్న దానికి యాభై రెట్ల పరిమాణంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను సముద్రాలు పీల్చుకుంటున్నాయి. సముద్రాలకు కార్బన్‌ డయాక్సైడ్‌ను ఇముడ్చుకునే శక్తి ఉన్నా, వాటి సామర్థ్యానికి మించిన పరిమాణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ సముద్రాల్లోకి చేరుతోంది. సముద్రాల్లో కార్బన్‌ డయాక్సైడ్‌ పరిమాణం పరిమితిని మించితే, సముద్ర జలాలు ఆమ్లతత్వాన్ని సంతరించుకుంటాయి. గడచిన రెండువందల సంవత్సరాల్లో సముద్రాల్లో ఆమ్లతత్వం 30 శాతం మేరకు పెరిగినట్లు ‘గ్లోబల్‌ బయో డైవర్సిటీ’ నివేదిక వెల్లడించింది. సముద్ర జలాల్లో ఆమ్లతత్వం పెరుగుతున్న ప్రాంతాల్లో జలచరాలకు ప్రధాన ఆహారమైన నాచు నశిస్తోంది. ఫలితంగా ఆ ప్రాంతాల్లో జలచరాల సంఖ్య కూడా తగ్గుతోంది. విలువైన పగడపు దీవులు సైతం 30 శాతం మేరకు క్షీణించాయి. సముద్రాల్లోకి కార్బన్‌ డయాక్సైడ్‌ మితిమీరి చేరుతున్న కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితలంపై ఆక్సిజన్‌ పరిమాణం గణనీయంగా తగ్గిపోయి ‘డెడ్‌ జోన్లు’గా తయారవుతున్నాయి. ఇలాంటి డెడ్‌జోన్ల సంఖ్య 1910 సంవత్సరం నాటికి పట్టుమని పదికి లోపే ఉంటే, 2010 నాటికి వీటి సంఖ్య 500 వరకు చేరుకుంది. ఈ డెడ్‌జోన్ల విస్తీర్ణం దాదాపు 2.50 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. గడచిన మూడు దశాబ్దాలుగా డెడ్‌జోన్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే సమీప భవిష్యత్తులోనే సముద్రాల్లోని జీవ వైవిధ్యానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

సముద్రతీరాల వెంబడి ఉండే మడ అడవులు కార్బన్‌ కాలుష్యాన్ని హరించడంలో చాలా వరకు ఉపయోగపడతాయి. మడ అడవుల విస్తీర్ణం కూడా ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గిపోతుండటం ఆందోళనకర పరిణామం. గడచిన అరవయ్యేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 శాతం మేరకు మడ అడవులు అంతరించాయి. ఫలితంగా సముద్రాల్లో కార్బన్‌ కాలుష్యం పెరుగుతోంది. కేవలం మడ అడవుల్లో మాత్రమే కనిపించే 70 రకాల అరుదైన జీవజాతుల్లో 11 జీవజాతులు పూర్తిగా అంతరించిపోయాయని ‘కన్జర్వేషన్‌ ఇంటర్నేషనల్‌’ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇకనైనా ప్రభుత్వాలు కళ్లుతెరిచి, విస్తారంగా మడ అడవుల పెంపకం చేపట్టకపోతే పసిఫిక్, అట్లాంటిక్‌ తీర ప్రాంతాల్లోని మడ అడవుల్లో మాత్రమే కనిపించే 40 రకాల అరుదైన జీవజాతులు త్వరలోనే అంతరించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించింది. సాధారణ అడవులతో పోలిస్తే, అదే విస్తీర్ణంలో సముద్ర తీరాల వెంబడి ఉండే మడ అడవులు, సముద్రపు గడ్డి, నాచు, ఉప్పుమేటలు దాదాపు యాభై రెట్లు ఎక్కువగా కార్బన్‌ డయాక్సైడ్‌ను పీల్చుకుంటాయని, వీటి విస్తీర్ణం తగ్గుతూ పోతే భూతాపం గణనీయంగా పెరిగి, భూమ్మీద చాలా అనర్థాలు వాటిల్లుతాయని యూనెస్కో ఒక నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. 

ప్లాస్టిక్‌తోనే పెనుముప్పు
మనుషుల వల్ల సముద్రాలకు చాలా రకాల సమస్యలే ఎదురవుతున్నా, వాటిలో ప్లాస్టిక్‌ కారణంగానే పెను ముప్పు కలుగుతోందని పర్యావరణ శాస్త్రవేత్తలు, సముద్ర శాస్త్రవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటి లెక్కలకు అందుతున్న అంచనాల ప్రకారం సముద్రాల్లో వాడి పారేసిన ప్లాస్టిక్‌ వస్తువుల సంఖ్య 5.25 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని, వాటి బరువు 28 కోట్ల టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2025 నాటికి సముద్రాల్లో చేరే ప్లాస్టిక్‌ వ్యర్థాల పరిమాణం మరో మూడు రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాల కారణంగా సముద్ర జీవుల సంఖ్య గణనీయంగా నశించిందని, 1970 నుంచి 2012 మధ్య కాలంలో సముద్రంలో సంచరించే వెన్నెముక గల జీవులు 49 శాతం మేరకు నశించాయని, మిగిలిన రకాల జీవరాశులను కూడా కలుపుకొని చూస్తే ఇదే కాలంలో 39 శాతం మేరకు సముద్రాల్లోని జీవ వైవిధ్యం నాశనమైందని యూకే ప్రభుత్వ నిపుణులు ఒక నివేదికలో వెల్లడించారు. ప్లాస్టిక్‌ వాడకాన్ని కనీస స్థాయికి తగ్గిస్తే తప్ప సముద్రాల్లోని జీవ వైవిధ్యాన్ని కాపాడుకోలేమని వారు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ వాడుక నియంత్రణను ఈ ఏడాది ‘వరల్డ్‌ ఓషన్స్‌ డే’ థీమ్‌గా పాటిస్తున్నారు. ‘వరల్డ్‌ ఓషన్స్‌ డే’ను ఐక్యరాజ్య సమితి అధికారికంగా గుర్తించిన తర్వాత 120 దేశాలు సముద్రాల పరిరక్షణపై అవగాహన, చైతన్యం పెంపొందించే కార్యక్రమాలను చేపడుతున్నాయి. పలు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్లాస్టిక్‌ వాడకంలో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు.

సముద్రాలకు మరిన్ని అనర్థాలు
ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా వాడే రసాయనాలు, చమురు, సహజవాయువుల కోసం సముద్రగర్భంలో జరిపే తవ్వకాలు, ‘డీప్‌ సీ మైనింగ్‌’, చేపల కోసం మితిమీరి సాగిస్తున్న వేట, సముద్ర తీర ప్రాంతాల్లో పట్టణీకరణ, పెరుగుతున్న భవన నిర్మాణాలు, తీర ప్రాంతాలకు చేరువలో వస్తూత్పత్తి కేంద్రాలు, ఔషధ తయారీ, ఎరువుల తయారీ కేంద్రాల పెరుగుదల, ఓడరేవులు, తీర ప్రాంత పర్యాటకం వంటి కార్యకలాపాలు సముద్రాల్లోకి నానా రకాల కాలుష్యాలను చేరవేస్తున్నాయి. సముద్రాల్లోకి దాదాపు లక్షకు పైగా రసాయన వ్యర్థాలు చేరుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే విషపూరితమైన లోహాలు, చమురు కూడా సముద్రాల్లోకి చేరుతున్నాయి. ఇవన్నీ అరుదైన జలచరాలను, సముద్రాల్లోని జీవ వైవిధ్యాన్ని హరించివేస్తున్నాయి. ఈ ప్రక్రియ ఇక్కడితోనే ఆగిపోవడం లేదు. సముద్రం నుంచి లభించే చేపలు, రొయ్యలు, పీతలు వంటి జలచరాల్లోకి చేరుతున్నాయి. వీటిని తినే మనుషుల ఆరోగ్యాలపై కూడా దుష్ప్రభావాలు కలిగిస్తున్నాయి. సముద్రం ఎగువ భాగంలో కాకుండా, అట్టడుగున సంచరించే అరుదైన జలచరాలు సైతం రసాయనిక కాలుష్యం బారిన పడుతున్నాయి.

సముద్రాలు మనకేమిస్తున్నాయంటే..!
మనం రోజూ ఆహారంలో వాడే ఉప్పు, మాంసాహారులు తినే చేపలు, రొయ్యలు, పీతలు వంటి జలచరాలు సముద్రాల నుంచే లభిస్తున్నాయనే సంగతి తెలిసిందే. మనుషులు రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకునే జంతు సంబంధిత ప్రొటీన్లలో 15 శాతం ప్రొటీన్లు చేపలు వంటి జలచరాలకు చెందినవే. ఉప్పు, చేపలు వంటి జలచరాలే కాకుండా, ఆహారంలో వినియోగించే మరికొన్ని పదార్థాలు కూడా మనకు సముద్రం నుంచే దొరుకుతున్నాయి. సముద్రపు పాచి, నాచు నుంచి సేకరించే అగర్, కరాజీనాన్‌ ఆల్గిన్‌ వంటి పదార్థాలు ఐస్‌క్రీమ్‌లు, పెరుగు, సలాడ్లు, కేక్‌ మిక్స్‌ల తయారీలో ఉపయోగపడుతున్నాయి. సముద్రంలో దొరికే స్పాంజ్, ‘సీ విప్‌ కోరల్స్‌’ అనే ఒక రకమైన పగడాల నుంచి సేకరించిన పదార్థాలు పెయిన్‌ కిల్లర్స్, యాంటీ అలెర్జిక్‌ ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతున్నాయి. సముద్ర తీరాల్లో విస్తారంగా లభించే ఇసుక భవన నిర్మాణాల్లో ఉపయోగపడుతోంది. సముద్రంలో లభించే శంఖాలు, నత్త గుల్లలు వంటివి అలంకరణల కోసం, ఇతర ప్రయోగాల కోసం చిరకాలంగా వాడుకలో ఉన్నాయి. 

సముద్రాల గురించి అవీ ఇవీ..
సముద్రాల సగటు లోతు 12,400 అడుగులు. సూర్యుని నుంచి వెలువడే కాంతి కిరణాలు సముద్రాల్లో 330 అడుగుల లోతును దాటి ముందుకు సాగలేవు. అందువల్ల సముద్రాల్లో 330 అడుగులు దాటిన తర్వాత దిగువన ఉండే ప్రాంతమంతా నిరంతరం చీకట్లోనే ఉంటుంది.ప్రపంచంలోనే అతి పొడవాటి పర్వతపంక్తులు ఉన్నది నేల మీద ఎక్కడో కాదు, ఆ పర్వత పంక్తులు సముద్రం అట్టడుగున ఉన్నాయి. ‘మిడ్‌–ఓషియానిక్‌ రేంజ్‌’ అనే ఈ పర్వత పంక్తులు అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల అడుగున 56 వేల కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి.

సముద్రాల గురించి మనుషులు తెలుసుకున్నది చాలా తక్కువ. ఇప్పటి వరకు సముద్రాల్లోని కేవలం 5 శాతం మేరకు మాత్రమే మనుషులు అన్వేషణలు కొనసాగించగలిగారు. మిగిలిన 95 శాతం ఏమేమి వింతలు ఉంటాయో ఇంకా తెలుసుకోవాల్సి ఉంది.ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియం సముద్ర గర్భమే. పెద్దపెద్ద మ్యూజియంలలో కనిపించే వాటి కంటే సముద్రం అట్టడుగున పెద్ద సంఖ్యలో పురాతన వస్తువులు, కళాఖండాలు దాగి ఉన్నాయి. సముద్రం అడుగున కొన్ని చోట్ల అగ్నిపర్వతాలు, వేడినీటి బుగ్గలు ఉంటాయి. సముద్రగర్భంలోని అగ్నిపర్వతాలు లావాను కాకుండా, వేడి బురదను, మిథేన్‌ వాయువును వెదజల్లుతూ ఉంటాయి. సముద్రం అడుగున కొన్నిచోట్ల ఉండే వేడి నీటి బుగ్గలు ఏకంగా 3600 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతతో వేడినీటిని పైకి ఎగజిమ్ముతుంటాయి. వాటి నుంచి వెలువడే నీటి వేడికి సీసం లాంటి లోహాలు కరిగిపోతాయి.

ఆస్ట్రేలియా తీరానికి ఆవల పసిఫిక్‌ మహాసముద్రం అడుగున ఉండే ‘గ్రేట్‌ బ్యారీర్‌ రీఫ్‌’ పగడపు దీవి విస్తీర్ణం దాదాపు 2575 చదరపు కిలోమీటర్లు. భూ గ్రహంలోని అతిపెద్ద సజీవ నిర్మాణం ఇదే కావడం విశేషం.సముద్రంలో జీవించే భారీ జలచరాల్లో భయంకరమైన షార్క్‌ల గురించి అందరికీ తెలిసిందే. షార్క్‌ జాతుల్లో దాదాపు 99 శాతం రకాలు ఇప్పటికే అంతరించాయి. కేవలం ఒక్క శాతం జాతులకు చెందిన షార్క్‌లు మాత్రమే ప్రస్తుతానికి మిగిలి ఉన్నాయి.

సముద్రం అట్టడుగున దాదాపు 2 కోట్ల టన్నుల బంగారం నిక్షిప్తమై ఉన్నట్లు నిపుణుల అంచనా. నేల మీద మనకు అందుబాటులో ఉన్న బంగారం కంటే ఇది చాలా ఎక్కువ. భూమ్మీద ఇప్పటి వరకు గనుల నుంచి తవ్వగలిగిన బంగారం 1,87,200 టన్నులు మాత్రమే.సముద్రపు నీటిలో కంటికి కనిపించని చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. ఒక మిల్లీలీటరు సముద్రపు నీటిలో దాదాపు పది లక్షల బ్యాక్టీరియా కణాలు, కోటి వరకు వైరస్‌ కణాలు ఉంటాయి. అయితే, వీటిలో చాలా వరకు హానికరమైనవి కావు.

సాహిత్యంలో సముద్రం
అనాదిగా సముద్రాలు మనుషులను అబ్బురపరుస్తూనే ఉన్నాయి. వాటి ఆటుపోట్లు, అప్పుడప్పుడు తెచ్చిపెట్టే తుపానులు, ఉప్పెనలు వంటి భయపెట్టే సందర్భాలు ఎన్ని ఉన్నా, సముద్రాలపై మనుషుల్లో తీరని కుతూహలం ఇంకా మిగిలే ఉంది. ప్రకృతిని పరిపరి విధాలుగా వర్ణించిన ప్రాచీన కవులు, సాహితీవేత్తలు తమ తమ రచనల్లో సముద్రాల గురించి కూడా విశేషంగా ప్రస్తావించారు. సముద్రాల చుట్టూ బోలెడన్ని కల్పనలను జోడించి కథలల్లారు. రామాయణంలో సముద్రం ప్రస్తావన తెలిసిందే. సీతమ్మవారిని చూడటానికి హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకుంటాడు. రామాయణంలో ఇదొక కీలక ఘట్టం. ఆ తర్వాత వానరసేన సముద్రాన్ని దాటడానికి వారధి నిర్మించడం మరో కీలక ఘట్టం. మన జానపద గాథల్లో సప్త సముద్రాలను దాటి రావడం రాకుమారుల శౌర్యానికి నిదర్శనం. అరేబియన్‌ జానపద గాథల్లో సముద్రంలో నౌకాయానానికి సంబంధించిన సాహస గాథలు అనేకంగా ఉన్నాయి. గ్రీకు మహాకవి హోమర్‌ రాసిన ‘ఒడెస్సీ’ కావ్యంలో పదేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన సముద్రయానం గురించి వర్ణన ఉంటుంది. ‘నోబెల్‌’ రచయిత ఎర్నెస్ట్‌ హెమింగ్వే రాసిన ‘ఓల్డ్‌మేన్‌ అండ్‌ సీ’ ఇంగ్లిష్‌ సాహిత్యంలో ఒక క్లాసిక్‌గా నిలిచింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్‌ నావికాదళంలో పనిచేసిన సైనికుల సాధక బాధకాలను వివరిస్తూ నికోలస్‌ మోన్సారట్‌ రాసిన ‘ది క్రూయెల్‌ సీ’ నవల కూడా ప్రసిద్ధి పొందింది.

సినిమాల్లో సముద్రం
సముద్రం చుట్టూ అల్లుకున్న కథలతో అనేక సినిమాలు కూడా వచ్చాయి. వాటిలో కొన్ని అమిత ప్రజాదరణ పొందాయి. అలాంటి వాటిలో ‘జాస్‌’, ‘టైటానిక్‌’ ‘ఫైండింగ్‌ నెమో’, ‘లైఫ్‌ ఆఫ్‌ పై’, ‘20,000 లీగ్స్‌ అండర్‌ ది సీ’, ‘పైరేట్స్‌ ఆఫ్‌ కరీబియన్‌: ది కర్స్‌ ఆఫ్‌ ది బ్లాక్‌ పెర్ల్‌’, ‘ది పెర్ఫెక్ట్‌ స్టోర్మ్‌’, ‘అట్లాంటిస్‌: ది లాస్ట్‌ ఎంపైర్‌’, ‘ది లైఫ్‌ ఆక్వాటిక్‌’ వంటివి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి.  
– పన్యాల జగన్నాథదాసు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement