Importance Of The World's Oceans In Telugu: భూమ్మీద మరో మహా సముద్రం.. ఇది చాలా డిఫరెంట్‌! - Sakshi
Sakshi News home page

భూమ్మీద మరో మహా సముద్రం.. ఇది చాలా డిఫరెంట్‌!

Published Tue, Jun 15 2021 10:48 AM | Last Updated on Tue, Jun 15 2021 5:07 PM

World With Ocean History And Importance - Sakshi

సాక్షి సెంట్రల్‌ డెస్క్‌: భూమి ఉపరితలంపై 70% నీళ్లేనని, నాలుగు మహా సముద్రాలు ఉన్నాయని చిన్నప్పుడు బడిలో వల్లెవేసే ఉంటాం. వాటి పేర్లు బట్టీపట్టే ఉంటాం. మరి ఆ నాలుగు మహా సముద్రాలకు తోడుగా ఇప్పుడు ఇంకో మహా సముద్రం వచ్చి కలిసింది తెలుసా? ఆ నాలుగింటికి భిన్నంగా ఉండే ఈ కొత్త మహా సముద్రానికి ఎన్నో ప్రత్యేకతలు, దానితో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ మహా సముద్రం విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? 

ఇప్పటిదాకా  ఆ నాలుగే.. 
మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నట్టు పసిఫిక్, హిందూ, అట్లాంటిక్, ఆర్కిటిక్‌.. ఈ నాలుగూ మహా సముద్రాలు. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య నిలువుగా ఉండేది అట్లాంటిక్‌ మహా సముద్రం.. ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల మధ్య హిందూ మహా సముద్రం.. ఆసియా, ఆస్ట్రేలియాలకు, ఉత్తర, దక్షిణ అమెరికాలకు మధ్య అత్యంత భారీగా ఉండేది పసిఫిక్‌ మహా సముద్రం.. పైన ఉత్తర ధ్రువం ప్రాంతంలో ఉండేది ఆర్కిటిక్‌ మహా సముద్రం.. ఇప్పుడు కొత్తగా గుర్తించినది దక్షిణ (సదరన్‌) మహా సముద్రం. భూమి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అంటార్కిటిక్‌ ఖండానికి చుట్టూ ఆవరించి ఉంది. ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీనే నేషనల్‌ జియోగ్రఫిక్‌ సొసైటీ దీనిని కొత్త మహా సముద్రంగా గుర్తిస్తూ.. మ్యాప్‌లో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆమోదం రావాల్సి ఉంది.

ఈ మహా సముద్రం.. చాలా డిఫరెంట్‌.. 
నిజానికి వివిధ ఖండాల మధ్య సువిశాల నీటి భాగాలను మహా సముద్రాలుగా గుర్తించారు. ఉత్తర ధ్రువంలోని ఆర్కిటిక్‌ మహా సముద్రం కూడా భూభాగాల మధ్యనే ఉంటుంది. కానీ దక్షిణ ధ్రువ ప్రాంతంలోని సదరన్‌ మహా సముద్రానికి మాత్రం సరిహద్దులుగా భూభాగాలు లేవు. చుట్టూ సముద్రాలే సరిహద్దులు. ఇదేగాక మరో ప్రత్యేకత కూడా ఉంది. ఏ మహా సముద్రానికి కూడా మధ్యలో చిన్నా, పెద్ద దీవులు తప్ప ఖండాల వంటి భారీ భూభాగాలు లేవు. కానీ సదరన్‌ మహా సముద్రానికి మధ్యలో అంటార్కిటిక్‌ ఖండం ఉంటుంది.

కొత్త సముద్రం.. సరిహద్దులు ఎలా?
ప్రతి మహా సముద్రాన్ని ఖండాల మధ్య సరిహద్దులతో గుర్తిస్తే.. సదరన్‌ మహా సముద్రాన్ని దాని చుట్టూ ఉండే భారీ సముద్ర ప్రవాహాం (ఓసియన్‌ కరెంట్‌)తో నిర్ధారించారు. అంటార్కిటిక్‌ ఖండానికి రెండు, మూడు వేల కిలోమీటర్ల దూరంలో చుట్టూ.. పైన ఉపరితలం నుంచి సముద్రం అడుగు వరకు అత్యంత భారీ ప్రవాహం తిరుగుతూ ఉంటుంది. దానిని ‘అంటార్కిటిక్‌ సర్కమ్‌పోలార్‌ కరెంట్‌ (ఏసీసీ)’అంటారు. పసిఫిక్, హిందూ, అట్లాంటి మహా సముద్రాల నుంచి చిన్న ప్రవాహాలు దీనిలో కలిసిపోతాయి. ఈ భారీ ప్రవాహం నుంచి మధ్యలో పాయలు పాయలుగా చిన్న ప్రవాహాలు ఏర్పడి బయటికి వెళతాయి. ఈ ఏసీసీ మాత్రం కిలోమీటర్ల కొద్దీ వెడల్పుతో.. వేల కిలోమీటర్ల పొడవున తిరుగుతూనే ఉంటుంది.

భూమ్మీద వేడి, చలువ సమస్థితికి కారణమిదే..

ఏసీసీ ప్రవాహానికి బయట పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహా సముద్రాల్లో నీళ్లు బాగా ఉప్పగా, కాస్త వేడిగా, తేలికగా ఉంటే.. ప్రవాహానికి లోపల సదరన్‌ మహా సము ద్రంలో నీళ్లు తక్కువ ఉప్పగా, బాగా చల్లగా, కాస్త మందంగా ఉంటాయి. 

  • భూమ్మీద ఎక్కువ ఉపరితలాన్ని ఆక్రమించిన మూడు సముద్రాల నుంచి వేర్వేరు ఉష్ణోగ్రతలు ఉన్న నీళ్లు ఏసీసీ ప్రవాహంలో కలిసిపోతాయి. ప్రవాహంలో సమాన ఉష్ణోగ్రతకు చేరిన నీళ్లు.. మధ్యలో చిన్న పాయలుగా ఈ సముద్రాల్లోనే కలుస్తాయి. దీనివల్ల వేడిగా ఉన్న నీళ్లు చల్లగా, చల్లగా ఉన్న నీళ్లు వేడిగా మారుతూ.. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల ఉష్ణోగ్రత స్థిరంగా ఉండటానికి కారణమవుతాయి. దీనిద్వారా మొత్తం భూమి మీద ఉష్ణోగ్రతల్లో స్థిరత్వం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఈ ప్రవాహం లేకుంటే.. ప్రమాదమే.. 
అంటార్కిటిక్‌ కరెంట్‌ సముద్రాల్లో స్థిర ఉష్ణోగ్రతలకు తోడ్పటమే కాకుండా.. భూవాతావరణంపై చాలా ప్రభావం చూపుతుందని, అది లేకుంటే చాలా సమస్యలు ఏర్పడుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. 

  • ఏసీసీ మిగతా సముద్రాల్లోని వేడి నీళ్లు అం టార్కిటికా ఖండానికి చేరకుండా ఆపు తుంది. అది లేకుంటే వేడి నీళ్లు చేరి అం టార్కిక్‌ మంచు వేగంగా కరిగిపోతుంది. 
  • అంటార్కిక్‌ ప్రాంతంలోని మంచు, నీటి సాంద్రత ఎక్కువగా ఉండటం వంటివి అక్కడి సముద్రపు లోతుల్లో భారీ స్థాయిలో కార్బన్‌ నిక్షేపం అవడానికి కారణమయ్యా యి. అలాకాకుండా ఉంటే భూవాతావరణంలో కార్బన్‌ వాయువుల శాతం పెరిగి.. గ్లోబల్‌ వార్మింగ్‌ మరింత పెరుగుతుంది. 
  • మంచు కరగడం, గ్లోబల్‌ వార్మింగ్‌ పెరిగితే.. వరదలు, తుఫాన్లు, లోతట్టు ప్రాం తాలు మునిగిపోవడం, అధిక ఉష్ణోగ్రతలు వంటి సమస్యలకు కారణమవుతాయి.

‘గుర్తింపు’పై  గొడవలెన్నో.. 
నిజానికి దక్షిణ మహా సముద్రానికి 1937లోనే ఈ గుర్తింపు ఇచ్చారు. కానీ ప్రపంచ దేశాల మధ్య కొన్ని వివాదాలు తలెత్తడంతో 1953లో ఆ హోదా తొలగించారు. కేవలం ఓ సముద్ర భాగంగానే పరిగణించారు. దీనికి ఉన్న ప్రత్యేకతల నేపథ్యంలో మహా సముద్రంగా గుర్తించాలని, ఆ ప్రాంతంలోని జీవజాతుల రక్షణ, ఇతర అంశాలకు అది తోడ్పడుతుందని చాలా కాలంగా శాస్త్రవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

అమెరికాకు చెందిన జియోగ్రఫిక్‌ నేమ్స్‌ బోర్డ్‌.. 1999లో దీనికి మహా సముద్రంగా గుర్తింపు ఇచ్చింది. తాజాగా నేషనల్‌ జియోగ్రఫిక్‌ సొసైటీ మ్యాప్‌లలో చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, ఇతర జల భాగాలకు గుర్తింపు ఇచ్చే ‘ఇంటర్నేషనల్‌ హైడ్రోఫోనిక్‌ ఆర్గనైజేషన్‌ (ఐహెచ్‌ఓ)’ఓకే చేయాల్సి ఉంది.
చదవండి: చైనాలో మరో విపత్తు!
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement