చిన్న చేపను పెద్ద చేప.. పెద్ద చేపను సొర చేప మింగడం కామనే.. కానీ నీటిలోని చేపను నీరే కబళిస్తే? చేపలు సహా అక్కడి జలచరాలనే ‘మింగేస్తే’? విచిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజమేనని శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు. దీని వెనకున్న మిస్టరీని బయటపెట్టారు. అదేమిటంటే...
ఈజిప్ట్, సౌదీ అరేబియా మధ్యన ఉన్న ఎర్ర సముద్రానికి ఉత్తరాన ఉన్న గల్ఫ్ ఆఫ్ అకాబాలో శాస్త్రవేత్తలు అరుదైన ‘డెత్ పూల్’ను గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ మయామీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు రిమోట్ ద్వారా నడిచే అండర్‌వాటర్ వెహికల్ ద్వారా సముద్ర గర్భాన్ని పరిశీలించే క్రమంలో 1,770 మీటర్ల లోతున దీన్ని కనుగొన్నారు. సుమారు 100 అడుగుల పొడవున ఈ మడుగు ఉంది. సాంకేతికంగా బ్రైన్‌పూల్స్ అని పిలిచే ఈ నీటిలో లవణత అత్యంత ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా అందులో ఆక్సిజన్ శాతం ఏమాత్రం ఉండదని పేర్కొన్నారు.
చదవండి: ఆ చేప చిక్కడమే విషాదం ... హఠాత్తుగా మీదకు దూకి...
అందువల్ల చేపలు సహా మరే జలచరాలైనా ఈ మడుగులోకి ప్రవేశించగానే మరణిస్తాయని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ శామ్ పుర్కిస్ తెలిపారు. కానీ విచిత్రంగా ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సూక్ష్మజీవులు ఈ మడుగులో జీవిస్తున్నాయని... ఈ నీటిలోకి వచ్చి మరణించే జలచరాలను ఆహారంగా తీసుకుంటున్నాయని వివరించారు. భూమిపై లక్షల ఏళ్ల కిందట సముద్రాలు ఎలా ఏర్పడ్డాయనే విషయంలో చేపట్టబోయే భావి పరిశోధనలకు తాజా పరిణామం దోహదపడుతుందని చెప్పారు. భూమిపై జీవం మనుగడకు ఉన్న పరిమితులు ఏమిటో అర్థం చేసుకోనిదే ఇతర గ్రహాలపై జీవం ఉనికిని అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన వివరాలను ప్రముఖ జర్నల్ ‘నేచర్’ ప్రచురించింది.
Comments
Please login to add a commentAdd a comment