పుచ్చుకునేది మాత్రమే కాదు
గౌరవం
సముద్రాలు మేఘాలకు ఆవిరి రూపంలో జలాన్ని అందిస్తాయి. ప్రతిగా మేఘాలు జల నిధులను ధారబోస్తాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రకృతిలోనే ఉంది. గౌరవం కూడా ఇచ్చిపుచ్చుకునే ఓ సద్గుణమని మానవుడు ప్రకృతి నుండి నేర్చుకోవాలి.
ప్రతి వ్యక్తీ తనను ఎదుటివారు గౌరవించాలని, తనకు ఇతరుల కన్నా ఎక్కువ ప్రాముఖ్యం లభించాలని కోరుకుంటాడు. తనకు తోటివారిని గౌరవించే అలవాటు ఉన్నా లేకపోయినా అతడి ఆలోచన ఇందుకు భిన్నంగా ఉండదు! ప్రస్తుత సమాజంలో గౌరవించడానికి సంపద, హోదా అవసరమౌతున్నాయి. నిజానికి తోటి మానవుల పట్ల ప్రేమ చూపడం అనే సుగుణం అలవరచుకుంటే గౌరవం దానికదే సాధ్యమౌతుంది. ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకోవాలనుకున్నాడు ఏకలవ్యుడు.
శూద్రుడు అన్న ఒకే ఒక కారణంతో విలువిద్య నేర్పించడానికి నిరాకరించాడు ద్రోణుడు. అప్పుడు ద్రోణుని మట్టిబొమ్మను ఎదురుగా పెట్టుకుని విలువిద్య సాధన చేశాడు ఏకలవ్యుడు. శ్రద్ధ, ఏకాగ్రతలతో అర్జునుణ్ని మించిన విలుకాడిగా రూపొందాడు. ద్రోణుడి కాపట్యం వల్ల గురుదక్షిణగా బొటనవేలు సమర్పించిన ఏకలవ్యుడు విలువిద్యకు దూరం కావడం వేరే సంగతి. ‘గురు’ శబ్దం పట్ల గురి, గౌరవం, అచంచల విశ్వాసం వల్లనే ఏకలవ్యుడికి మాత్రమే విలువిద్యా రహస్యాలన్నీ కూలంకషంగా బోధపడ్డాయన్నది వాస్తవం.
శ్రీరమణులు జంతువులను కూడా ‘వారు’, ‘వీరు’ అని సంబోధించేవారట! ఎదుటి వారిని గౌరవించడం వల్ల మనకు గౌరవం లభిస్తుంది. సముద్రాలు మేఘాలకు ఆవిరి రూపంలో జలాన్ని అందిస్తాయి. ప్రతిగా మేఘాలు జల నిధులను ధారబోస్తాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రకృతిలోనే ఉంది. గౌరవం కూడా ఇచ్చిపుచ్చుకునే ఓ సద్గుణమని మానవుడు ప్రకృతి నుండి నేర్చుకోవాలి.
మన ఆత్మగౌరవాన్ని మనకై మనం పోగొట్టుకుంటే తప్ప ఎవరూ మనల్ని గౌరవించకుండా ఉండలేరు అనేవారు గాంధీజీ. అనేక కారణాల వల్ల, గౌరవానికి యోగ్యత కలిగి ఉండికూడా కొందరు గౌరవాన్ని పొందలేరు అన్నది అల్‌ఫ్రెడ్ నోబెల్ సూత్రీకరణ. ఎదుటి వారిని గౌరవించే గుణం వల్ల మనం కోల్పోయేదేమీ ఉండదు. బదులుగా ఇబ్బడి ముబ్బడిగా మనకూ గౌరవాభిమానాలు లభిస్తాయి. సమాజం గౌరవించే వ్యక్తి నాయకుడి గా పరిణతి చెందుతాడు. తల్లిదండ్రులను పిల్లలు గౌరవించడంలో ప్రేమ, ఆత్మీయబంధం అంతర్లీనంగా ఉంటాయి. పెద్దలు వాత్సల్య రూపంలో పిన్నలకు గౌరవాభిమానాలు అందిస్తారు.
మనిషి ఆత్మగౌరవం కలిగి ఉండడం మంచిదే, కానీ నశ్వరమైన దేహానికి అమిత ప్రాధాన్యం ఇవ్వడం వలన కొత్త సమస్యలు తలెత్తవచ్చు. సూర్యవంశ చక్రవర్తి త్రిశంకుడు తన అందమైన దేహాన్ని ఎంతో ప్రేమించేవాడు. ఎంతగానంటే మరణం వల్ల ఆత్మదేహాన్ని వీడటం ఊహించలేకపోయాడు. అందుకే సశరీరంగా స్వర్గానికి వెళ్లాలని ఉబలాట పడి కడకు విశ్వామిత్రుడిని ఆశ్రయించి అంతిమంగా చతికిల పడడం మనం కథగా చదువుకున్నదే.
ఆత్మగౌరవం కలిగి ఉండడం మంచి లక్షణమే గానీ, తన గురించి తాను చెప్పుకోవడం అహంకారానికి చిహ్నం. మంధర మాటలు విని రాముడిని అరణ్యవాసానికి పంపి, భరతుడికి పట్టాభిషేకం చేయాలనే కోరికను భర్త దశరథ మహారాజు ముందు వ్యక్తపరచిన కైకేయిని కన్నకొడుకు భరతుడు కూడా మన్నించలేకపోయాడు.
స్వార్థ చింతన, ఇంద్రియ వ్యామోహం వలన మనిషి గౌరవ మర్యాదలు కోల్పోతాడు. అహంకారాన్ని ఆత్మగౌరవంగా పొరపడిన మనిషికి పతనం తప్పదు. తనను, తన కుటుంబాన్ని ప్రేమించడం వ్యక్తి స్వవిషయం. అయితే సమాజాన్ని గౌరవించడం వ్యక్తి బాధ్యత. నోరు మంచిదైన వాడిని సమాజం గౌరవిస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. ఎదలోని దైవాన్ని ఎదుటి మనిషిలో చూడగల సత్పురుషుడికి సంఘ గౌరవం అప్రమేయంగా లభిస్తుంది.
- శొంఠి. విశ్వనాథం