Orientation
-
ప్రసంగాల్లో సామెతలు.. ఉపన్యాసాల్లో నుడి‘కారాలు’!
సాక్షి, తెలంగాణ: కేసీఆర్‌కు భాష మీదా, సామెతల మీద పట్టెక్కువ. మొన్ననే జడ్చర్ల, మేడ్చల్ సభల్లో ‘కాంగ్రెస్ వస్తే కాటగలుస్తం’, ‘గోల్మాల్ చేసేటోళ్లతోని గోసవడ్తం’, ‘రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జైభీం అంటరు’.. అంటూ ప్రసంగించారు. సామెతల్తో చెప్పే మాట చట్టుక్కున ఎక్కుతది. అదే ధోరణి అన్ని పార్టీలు అనుసరించినప్పుడు.. కారు సారు కేసీయారు మాట తీరు.. ఈ కాంగ్రెసోళ్లు ఎట్లాంటోళ్లంటే..‘ముచ్చటపెట్టేటాయన బిచ్చం బెట్టడు. ఊరబిస్కెను గోసి ఊరంత పంచుతనంటడు’. ఈళ్ల పనితీరు ఎట్లుంటదంటే..‘పప్పుల ఉప్పేసెటప్పుడు చెప్పెయ్యే కోడలా అంటే.. కాళ్ల ఏసుకునే చెప్పేసి అత్తకు ఇస్తర్ల అంచుకుపెడతరు’. ఇగ ఈళ్ల కత ఎట్లుంటదో తెలుసా? కర్ణాటకల 20 గంటలు కరెంటిస్తనన్నరు. ఇప్పుడు కటకట బడ్తున్నరు. ‘ఏం లేనోనికి ఎచ్చులెక్కువ..చిన్నకుండలో అన్నానికి పొంగులెక్కువ’. ఇంగ వాళ్ల పార్టీలో సీఎమ్ములెక్కువై.. ’సచ్చినపామును కొట్టడానికి అందరూ సిపాయిలే’. ఇగ ఈ పువ్వుపార్టీవోళ్లయితే ఏ రాష్ట్రంల ఎవడు ఏ పార్టీల గెలిసినా వాళ్లు కొని.. ‘ఎక్కడ మేస్తె ఏంది, మా ఇంట్లె ఈన్తె సాలు, మా సావిట్లె పాలిస్తె సాలు’ అంటరు. మా ఎమ్మెల్యేలను కూడా కొనబోయిన్రు కదా. ‘ఆగబోగాలు అంకాళమ్మవైతే.. పొలికేకలు పోలేరమ్మవి’ అన్నట్టు ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తరు. ఆ కొనుడు కూడా ‘ఎర్రను చూపిచ్చి, చాపను పట్కపోతరు’. వీళ్లకంతా ఆస్తులు అమ్ముకోవడమే పని. ‘కతలమారి మొగుడు కమ్మలు జేయిస్తె.. అప్పుల గల మొగుడు అమ్ముకుతింటడు’ బాపతు ఈ పార్టీ. ఇసొంటోళ్లను ఎన్నుకోకండి. ‘సంకకు ఎక్కిన పిల్ల సచ్చినా దిగద’ని గుర్తుంచుకోండి. ఇదే స్టైల్లో... కాంగ్రెస్‌వాళ్ల సభల మాటల తీరు.. తెలంగాణ మేమే ఇచ్చినా.. ఇప్పిచ్చినాయనే మీకు ముద్దొచ్చిండు. ఏమైంది? ‘ఎద్దును చూస్తె ముద్దొస్తదీ, దున్నబోతె దుక్కమొస్తది’ అన్నట్టయింది. ఇచ్చిన మమ్మల్నే ఇడిసిపెట్టి ‘నవ్వుకుంట తిడితిరి.. నరకాన బడ్తిరి’. అందుకే ‘ఊరికి పొయ్యేటోన్ని ఇడిసిపెట్టి, నిద్రపొయ్యేటోనికి సద్దిగట్టకున్రి’. వాళ్లను ఎన్నుకున్రా.. ఏమైతది? ‘జీవి ఇడిసిందాక మంచినీళ్లూగూడ పొయ్యజాలనోళ్లు.. సచ్చింతర్వాత మీ బొందమీద పాలిచ్చే బర్రెను కట్టేస్తా’ అన్నట్టే ఉంటది. దీనికి నిదర్శనమే రూ. 400కు సిలండరు. మరి అంతగనం ఇచ్చేటోళ్లు మేము రూ.500 అన్నదాక ఎందుకియ్యలే. ఇప్పుడు వీళ్లైనా, ఆ పువ్వు పార్టీవోళ్లైనా ‘తాత సంపాయించిన ఆస్తి.. మనవడితో మట్టిపాలు’ అన్నట్టుగా అమ్ముకుని తింటున్నది మా హయాంలో జరిగిన అభివృద్ధినే కదా. ఇగ పువ్వు పార్టీలోళ్లు అచ్చం సంప్రదాయాలే మాట్లాడతరు. ‘ఆకు ఇస్తే అన్నం పెట్టినంత పున్నెం’ అనుకుంట ఆకే ఇస్తరు గని అన్నం పెట్టరు. మనమేదన్న మర్యాద జెయ్యబోతె..‘అల్లుడొచ్చిండని కల్లు దెస్తె నీసులేదని కేసుపెట్టినట్టు’ సీబీఐ, ఈడీలతోని కేసులు పెట్టిస్తరు. అన్నింటికి ట్యాక్సులేసి ‘ఇంటి ఎద్దుకు కూడ కిరాయికట్టమంటరు’. ‘ఆటాపాటా మా ఇంట్ల... మాపటి బువ్వ మీ ఇంట్ల’ అంటరు. ఇప్పుడు పువ్వుపార్టీవాళ్ల ప్రసంగాలు.. మాది పువ్వు గుర్తు. మేము ఆవు పార్టీ. ‘ఆవు పాలల్ల అరవైఆరు పిండివంటలు’ ఉంటయి. అందుకే ఎవడన్న ‘ఆవును ఇచ్చి.. పలుపు దాచుకుంటడా?’ అట్లాంటి పని ఎప్పుడూ చేయకండి. ‘ఆవులేని ఇంట అన్నమే తినవద్దు’ అంటరు. ఆట్లాంటిది మన సొంత రాష్ట్రంలో ఆవు పార్టీని లేకుండా చేసుకుంటరా.. మీరే చెప్పండి. అప్పుడు జనాలు.. మా బతుకులన్నీ ‘ఎంత పెరిగినా గానీ.. గొర్రెకు బెత్తెడే తోక’ అన్నట్టు. ప్రతిపూటా మా ‘గతిలేనోళ్లకు గంగే పాయసం’. ఎంత చెడ్డా మీరంత ఒక్కటే. ‘ఈత కాయ ఇచ్చినట్టే ఇచ్చి.. తాటికాయ తీసుకుంటరు’. ‘అన్నం పెడితే అరిగిపోతది.. చీరె ఇస్తె చినిగిపోతది.. వాత పెడ్తె కలకాలం ఉంటది’ అని మాకు వాతలు బెడతరు. మీ ధోరణంతా ‘ఆశ గలమ్మ దోషమెరగదూ.. పూటకూళ్లమ్మ పుణ్ణెమెరగదు’లా అందరూ అందరే. అందరూ ఒక్కటే. అందుకే ‘కర్రుగాల్చి వాత పెట్టాలె’. అది ఎవరికి పెడతామో చూద్దురుగానీ. -
రేపు ఉపాధ్యాయులకు ఓరియంటేషన్
విద్యారణ్యపురి : వరంగల్ డివిజన్లో ఇన్‌సె్పౖర్ అవార్డుకు ఎంపికైన అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల విద్యార్థులు, గైడ్ టీచర్లకు శుక్రవారం కాజీపేటలోని బిషప్ బెరట్టా స్కూల్ లో ఓరియంటేషన్ నిర్వహించనున్నట్లు డీఈఓ పి.రాజీవ్ తెలిపారు. ఉదయం 9–30 గంటల నుంచి జరిగే కార్యక్రమానికి ఆయా విద్యార్థులు, గైడ్ టీచర్లను పంపాలని హెచ్ఎంల ను ఆయన ఆదేశించారు. -
పుచ్చుకునేది మాత్రమే కాదు
గౌరవం సముద్రాలు మేఘాలకు ఆవిరి రూపంలో జలాన్ని అందిస్తాయి. ప్రతిగా మేఘాలు జల నిధులను ధారబోస్తాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రకృతిలోనే ఉంది. గౌరవం కూడా ఇచ్చిపుచ్చుకునే ఓ సద్గుణమని మానవుడు ప్రకృతి నుండి నేర్చుకోవాలి. ప్రతి వ్యక్తీ తనను ఎదుటివారు గౌరవించాలని, తనకు ఇతరుల కన్నా ఎక్కువ ప్రాముఖ్యం లభించాలని కోరుకుంటాడు. తనకు తోటివారిని గౌరవించే అలవాటు ఉన్నా లేకపోయినా అతడి ఆలోచన ఇందుకు భిన్నంగా ఉండదు! ప్రస్తుత సమాజంలో గౌరవించడానికి సంపద, హోదా అవసరమౌతున్నాయి. నిజానికి తోటి మానవుల పట్ల ప్రేమ చూపడం అనే సుగుణం అలవరచుకుంటే గౌరవం దానికదే సాధ్యమౌతుంది. ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకోవాలనుకున్నాడు ఏకలవ్యుడు. శూద్రుడు అన్న ఒకే ఒక కారణంతో విలువిద్య నేర్పించడానికి నిరాకరించాడు ద్రోణుడు. అప్పుడు ద్రోణుని మట్టిబొమ్మను ఎదురుగా పెట్టుకుని విలువిద్య సాధన చేశాడు ఏకలవ్యుడు. శ్రద్ధ, ఏకాగ్రతలతో అర్జునుణ్ని మించిన విలుకాడిగా రూపొందాడు. ద్రోణుడి కాపట్యం వల్ల గురుదక్షిణగా బొటనవేలు సమర్పించిన ఏకలవ్యుడు విలువిద్యకు దూరం కావడం వేరే సంగతి. ‘గురు’ శబ్దం పట్ల గురి, గౌరవం, అచంచల విశ్వాసం వల్లనే ఏకలవ్యుడికి మాత్రమే విలువిద్యా రహస్యాలన్నీ కూలంకషంగా బోధపడ్డాయన్నది వాస్తవం. శ్రీరమణులు జంతువులను కూడా ‘వారు’, ‘వీరు’ అని సంబోధించేవారట! ఎదుటి వారిని గౌరవించడం వల్ల మనకు గౌరవం లభిస్తుంది. సముద్రాలు మేఘాలకు ఆవిరి రూపంలో జలాన్ని అందిస్తాయి. ప్రతిగా మేఘాలు జల నిధులను ధారబోస్తాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రకృతిలోనే ఉంది. గౌరవం కూడా ఇచ్చిపుచ్చుకునే ఓ సద్గుణమని మానవుడు ప్రకృతి నుండి నేర్చుకోవాలి. మన ఆత్మగౌరవాన్ని మనకై మనం పోగొట్టుకుంటే తప్ప ఎవరూ మనల్ని గౌరవించకుండా ఉండలేరు అనేవారు గాంధీజీ. అనేక కారణాల వల్ల, గౌరవానికి యోగ్యత కలిగి ఉండికూడా కొందరు గౌరవాన్ని పొందలేరు అన్నది అల్ఫ్రెడ్ నోబెల్ సూత్రీకరణ. ఎదుటి వారిని గౌరవించే గుణం వల్ల మనం కోల్పోయేదేమీ ఉండదు. బదులుగా ఇబ్బడి ముబ్బడిగా మనకూ గౌరవాభిమానాలు లభిస్తాయి. సమాజం గౌరవించే వ్యక్తి నాయకుడి గా పరిణతి చెందుతాడు. తల్లిదండ్రులను పిల్లలు గౌరవించడంలో ప్రేమ, ఆత్మీయబంధం అంతర్లీనంగా ఉంటాయి. పెద్దలు వాత్సల్య రూపంలో పిన్నలకు గౌరవాభిమానాలు అందిస్తారు. మనిషి ఆత్మగౌరవం కలిగి ఉండడం మంచిదే, కానీ నశ్వరమైన దేహానికి అమిత ప్రాధాన్యం ఇవ్వడం వలన కొత్త సమస్యలు తలెత్తవచ్చు. సూర్యవంశ చక్రవర్తి త్రిశంకుడు తన అందమైన దేహాన్ని ఎంతో ప్రేమించేవాడు. ఎంతగానంటే మరణం వల్ల ఆత్మదేహాన్ని వీడటం ఊహించలేకపోయాడు. అందుకే సశరీరంగా స్వర్గానికి వెళ్లాలని ఉబలాట పడి కడకు విశ్వామిత్రుడిని ఆశ్రయించి అంతిమంగా చతికిల పడడం మనం కథగా చదువుకున్నదే. ఆత్మగౌరవం కలిగి ఉండడం మంచి లక్షణమే గానీ, తన గురించి తాను చెప్పుకోవడం అహంకారానికి చిహ్నం. మంధర మాటలు విని రాముడిని అరణ్యవాసానికి పంపి, భరతుడికి పట్టాభిషేకం చేయాలనే కోరికను భర్త దశరథ మహారాజు ముందు వ్యక్తపరచిన కైకేయిని కన్నకొడుకు భరతుడు కూడా మన్నించలేకపోయాడు. స్వార్థ చింతన, ఇంద్రియ వ్యామోహం వలన మనిషి గౌరవ మర్యాదలు కోల్పోతాడు. అహంకారాన్ని ఆత్మగౌరవంగా పొరపడిన మనిషికి పతనం తప్పదు. తనను, తన కుటుంబాన్ని ప్రేమించడం వ్యక్తి స్వవిషయం. అయితే సమాజాన్ని గౌరవించడం వ్యక్తి బాధ్యత. నోరు మంచిదైన వాడిని సమాజం గౌరవిస్తుంది. అక్కున చేర్చుకుంటుంది. ఎదలోని దైవాన్ని ఎదుటి మనిషిలో చూడగల సత్పురుషుడికి సంఘ గౌరవం అప్రమేయంగా లభిస్తుంది. - శొంఠి. విశ్వనాథం -
40 ప్లస్ లోనూ... కండలు పెంచుతున్నారు...
ధోరణి వయసు పై బడుతున్న కొద్దీ చాలామంది పురుషులు వ్యాయామాలు తగ్గిస్తారు. జిమ్‌కు అరుదుగా మాత్రమే వెళుతుంటారు. కొందరిలో అయితే జిమ్‌కు వెళ్లడం-శరీరాకృతి మీద దృష్టి పెట్టడం అనేది యవ్వనకాలానికి మాత్రమే పరిమితమైన వ్యవహారంగా మారింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. మన దేశంతో సహా చాలా దేశాల్లో నలభై దాటిన పురుషులు శరీరాకృతిపై దృష్టి పెట్టి కండలు పెంచుతున్నారు. కొంతమంది అయితే బాడీ బిల్డర్లుగా కూడా తయారై ఆశ్చర్యపరుస్తున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి 40 ప్లస్ పురుషులలో కండలు పెంచే ధోరణి బాగా పెరిగింది. తానేమిటో, తన ఆఫీసేమిటో... అన్నట్లుగా ఉండేది బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే భార్గవ్ జీవనశైలి. నలభై రెండు సంవత్సరాల భార్గవ్ ఉన్నట్టుండి జిమ్ ప్రేమలో పడడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఉండబట్టలేక ఎవరో కారణం కూడా అడిగారు. ‘‘హాలివుడ్ నటుడు హగ్ జాక్మన్ నటించిన ఒక సినిమా చూశాక...అతని నటన కంటే శరీరాకృతి ఎంతో ఆకట్టుకుంది. ఆయన వయసు నలభై అయిదు అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. నలభై రెండు సంవత్సరాల నేను మాత్రం బొజ్జ పెరిగి, లావుగా ఉంటాను. నన్ను చూస్తే హగ్ కంటే కనీసం రెండు సంవత్సరాలు పెద్ద అనుకునేలా ఉంటాను. శరీరాకృతి అనేది వయసును ప్రభావితం చేస్తుందనే విషయాన్ని కాస్త ఆలస్యంగానైనా తెలుసుకోగలిగాను. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాను. దీనివల్ల నేను హగ్లా కండలు తిరిగి కనిపించకపోవచ్చు. కానీ ఎంతో కొంత మార్పుతో చూడముచ్చటగా కనిపిస్తున్నాను’’ అని చెప్పాడు భార్గవ్. ఇక లండన్ నివాసి డేవిడ్సన్ ఇలా అంటున్నాడు. ‘‘టీనేజ్‌లో వ్యాయామం చేసే వాడిని కానీ...పెద్ద సీరియస్‌గా చేసేవాడిని కాదు. ఒకానొక దశలో ఉత్సాహం తగ్గి పోయి జిమ్‌కు దూరమయ్యాను. చాలా విరామం తరువాత మళ్లీ వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తున్నాను. కండలు తిరిగిన శరీరంతో నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను’’ ‘‘నలభై దాటిన వాళ్లు వ్యాయామం పట్ల ఆకర్షితులు కావడం అనేది మంచి పరిణామం. వ్యాయామం వల్ల కండలు పెరగడం ఒక్కటే కాదు...చాలా ప్రయోజనాలు ఉన్నాయి’’ అంటూ ‘టాప్ బెనిఫిట్స్’ జాబితాను చదవడం మొదలుపెట్టాడు న్యూయార్క్‌లోని ‘రిజల్ట్స్ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్’ డెరైక్టర్ రిచ్ స్టర్ల్. హగ్ జాక్మన్ నటించిన ఒక సినిమా చూశాక... అతని నటన కంటే శరీరాకృతి ఎంతో ఆకట్టుకుంది. ఆయన వయసు నలభై అయిదు అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. - భార్గవ్ సాఫ్ట్వేర్ ఉద్యోగి -
వాహ్.. విన్యాసం
విశాఖపట్నం: మల్లకంబ విన్యాసాలు, రోప్ స్కిప్పింగ్ చాతుర్యాలకు విశాఖ తొలిసారిగా వేదికైంది. సాగరతీరంలో శుక్రవారం జరిగిన ఈ పోటీల ప్రారంభ కార్యక్రమాన్ని నగరవాసులు ఆస్వాదించారు. జిల్లా రోప్ స్కిప్పింగ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న దక్షిణ మండల మల్లకంబ పోటీల్లో ఏడు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ప్రతిభ పాటవాలు ప్రదర్శించనుండగా రాష్ట్రస్థాయి రోప్స్కిప్పింగ్లో పదమూడు జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీలను ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యదర్శి గోకరాజు గంగరాజు ప్రారంభించారు. విశాఖ సాగరతీరంలోని సీఎంఆర్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఇసుక తిన్నెలపై జరుగుతున్న ఈ పోటీల్లో మల్లకంబ విన్యాసాలను క్రీడాకారులు ప్రదర్శించారు. రోప్ స్కిప్పింగ్‌పై అవగాహన ప్రదర్శన జరిగింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గోవా, మహారాష్ట్రలతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మల్లకంబ క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు శుక్రవారం పోల్పైనా, వేలాడుతున్న తాడుతోనూ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు రోప్‌తో స్కిప్పింగ్ చేస్తూ ఇచ్చిన ప్రదర్శన అబ్బురపరిచింది. పోటీలు శని, ఆదివారాల్లో జరుగుతాయి. ప్రారంభ కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, ది ఒలింపిక్ సంఘం, విశాఖ అధ్యక్షుడు టి.ఎస్.ఆర్.ప్రసాద్, కార్యదర్శి ఎం.శాంబాబు, రోప్ స్కిప్పింగ్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.