వాహ్.. విన్యాసం
విశాఖపట్నం: మల్లకంబ విన్యాసాలు, రోప్ స్కిప్పింగ్ చాతుర్యాలకు విశాఖ తొలిసారిగా వేదికైంది. సాగరతీరంలో శుక్రవారం జరిగిన ఈ పోటీల ప్రారంభ కార్యక్రమాన్ని నగరవాసులు ఆస్వాదించారు. జిల్లా రోప్ స్కిప్పింగ్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న దక్షిణ మండల మల్లకంబ పోటీల్లో ఏడు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ప్రతిభ పాటవాలు ప్రదర్శించనుండగా రాష్ట్రస్థాయి రోప్‌స్కిప్పింగ్‌లో పదమూడు జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు.
ఈ పోటీలను ఆంధ్రా క్రికెట్ సంఘం కార్యదర్శి గోకరాజు గంగరాజు ప్రారంభించారు. విశాఖ సాగరతీరంలోని సీఎంఆర్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న ఇసుక తిన్నెలపై జరుగుతున్న ఈ పోటీల్లో మల్లకంబ విన్యాసాలను క్రీడాకారులు ప్రదర్శించారు. రోప్ స్కిప్పింగ్‌పై అవగాహన ప్రదర్శన జరిగింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, గోవా, మహారాష్ట్రలతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మల్లకంబ క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు శుక్రవారం పోల్‌పైనా, వేలాడుతున్న తాడుతోనూ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు రోప్‌తో స్కిప్పింగ్ చేస్తూ ఇచ్చిన ప్రదర్శన అబ్బురపరిచింది. పోటీలు శని, ఆదివారాల్లో జరుగుతాయి. ప్రారంభ కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, ది ఒలింపిక్ సంఘం, విశాఖ అధ్యక్షుడు టి.ఎస్.ఆర్.ప్రసాద్, కార్యదర్శి ఎం.శాంబాబు, రోప్ స్కిప్పింగ్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.