40 ప్లస్ లోనూ... కండలు పెంచుతున్నారు...
ధోరణి
వయసు పై బడుతున్న కొద్దీ చాలామంది పురుషులు వ్యాయామాలు తగ్గిస్తారు. జిమ్‌కు అరుదుగా మాత్రమే వెళుతుంటారు. కొందరిలో అయితే జిమ్‌కు వెళ్లడం-శరీరాకృతి మీద దృష్టి పెట్టడం అనేది యవ్వనకాలానికి మాత్రమే పరిమితమైన వ్యవహారంగా మారింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. మన దేశంతో సహా చాలా దేశాల్లో నలభై దాటిన పురుషులు శరీరాకృతిపై దృష్టి పెట్టి కండలు పెంచుతున్నారు. కొంతమంది అయితే బాడీ బిల్డర్‌లుగా కూడా తయారై ఆశ్చర్యపరుస్తున్నారు.
గత రెండు సంవత్సరాల నుంచి 40 ప్లస్ పురుషులలో కండలు పెంచే ధోరణి బాగా పెరిగింది. తానేమిటో, తన ఆఫీసేమిటో... అన్నట్లుగా ఉండేది బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే భార్గవ్ జీవనశైలి. నలభై రెండు సంవత్సరాల భార్గవ్ ఉన్నట్టుండి జిమ్ ప్రేమలో పడడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఉండబట్టలేక ఎవరో కారణం కూడా అడిగారు.
‘‘హాలివుడ్ నటుడు హగ్ జాక్‌మన్ నటించిన ఒక సినిమా చూశాక...అతని నటన కంటే శరీరాకృతి ఎంతో ఆకట్టుకుంది. ఆయన వయసు నలభై అయిదు అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. నలభై రెండు సంవత్సరాల నేను మాత్రం బొజ్జ పెరిగి, లావుగా ఉంటాను. నన్ను చూస్తే హగ్ కంటే కనీసం రెండు సంవత్సరాలు పెద్ద అనుకునేలా ఉంటాను. శరీరాకృతి అనేది వయసును ప్రభావితం చేస్తుందనే విషయాన్ని కాస్త ఆలస్యంగానైనా తెలుసుకోగలిగాను. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాను. దీనివల్ల నేను హగ్‌లా కండలు తిరిగి కనిపించకపోవచ్చు. కానీ ఎంతో కొంత మార్పుతో చూడముచ్చటగా కనిపిస్తున్నాను’’ అని చెప్పాడు భార్గవ్.
ఇక లండన్ నివాసి డేవిడ్‌సన్ ఇలా అంటున్నాడు.
‘‘టీనేజ్‌లో వ్యాయామం చేసే వాడిని కానీ...పెద్ద సీరియస్‌గా చేసేవాడిని కాదు. ఒకానొక దశలో ఉత్సాహం తగ్గి పోయి జిమ్‌కు దూరమయ్యాను. చాలా విరామం తరువాత మళ్లీ వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తున్నాను. కండలు తిరిగిన శరీరంతో నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను’’
‘‘నలభై దాటిన వాళ్లు వ్యాయామం పట్ల ఆకర్షితులు కావడం అనేది మంచి పరిణామం. వ్యాయామం వల్ల కండలు పెరగడం ఒక్కటే కాదు...చాలా ప్రయోజనాలు ఉన్నాయి’’ అంటూ ‘టాప్ బెనిఫిట్స్’ జాబితాను చదవడం మొదలుపెట్టాడు న్యూయార్క్‌లోని ‘రిజల్ట్స్ హెల్త్ అండ్ పెర్‌ఫార్‌మెన్స్’ డెరైక్టర్ రిచ్ స్టర్ల్.
హగ్ జాక్‌మన్ నటించిన ఒక సినిమా చూశాక... అతని నటన కంటే శరీరాకృతి ఎంతో ఆకట్టుకుంది. ఆయన వయసు నలభై అయిదు అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను.
- భార్గవ్
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి