ప్రసంగాల్లో సామెతలు.. ఉపన్యాసాల్లో నుడి‘కారాలు’! | KCR Speaking Style In Telangana Language Orientation | Sakshi
Sakshi News home page

ప్రసంగాల్లో సామెతలు.. ఉపన్యాసాల్లో నుడి‘కారాలు’!

Published Fri, Oct 20 2023 10:42 AM | Last Updated on Fri, Oct 20 2023 2:46 PM

KCR Speaking Style In Telangana Language Orientation - Sakshi

సాక్షి, తెలంగాణ: కేసీఆర్‌కు భాష మీదా, సామెతల మీద పట్టెక్కువ. మొన్ననే జడ్చర్ల, మేడ్చల్‌ సభల్లో ‘కాంగ్రెస్‌ వస్తే కాటగలుస్తం’, ‘గోల్‌మాల్‌ చేసేటోళ్లతోని గోసవడ్తం’, ‘రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జైభీం అంటరు’.. అంటూ ప్రసంగించారు.

సామెతల్తో చెప్పే మాట చట్టుక్కున ఎక్కుతది. అదే ధోరణి అన్ని పార్టీలు అనుసరించినప్పుడు..
కారు సారు కేసీయారు మాట తీరు..
ఈ కాంగ్రెసోళ్లు ఎట్లాంటోళ్లంటే..‘ముచ్చటపెట్టేటాయన బిచ్చం బెట్టడు. ఊరబిస్కెను గోసి ఊరంత పంచుతనంటడు’. ఈళ్ల పనితీరు ఎట్లుంటదంటే..‘పప్పుల ఉప్పేసెటప్పుడు చెప్పెయ్యే కోడలా అంటే.. కాళ్ల ఏసుకునే చెప్పేసి అత్తకు ఇస్తర్ల అంచుకుపెడతరు’. ఇగ ఈళ్ల కత ఎట్లుంటదో తెలుసా? కర్ణాటకల 20 గంటలు కరెంటిస్తనన్నరు. ఇప్పుడు కటకట బడ్తున్నరు. ‘ఏం లేనోనికి ఎచ్చులెక్కువ..చిన్నకుండలో అన్నానికి పొంగులెక్కువ’. ఇంగ వాళ్ల పార్టీలో సీఎమ్ములెక్కువై..  ’సచ్చినపామును కొట్టడానికి అందరూ సిపాయిలే’.

ఇగ ఈ పువ్వుపార్టీవోళ్లయితే ఏ రాష్ట్రంల ఎవడు ఏ పార్టీల గెలిసినా వాళ్లు కొని.. ‘ఎక్కడ మేస్తె ఏంది, మా ఇంట్లె ఈన్తె సాలు, మా సావిట్లె పాలిస్తె సాలు’ అంటరు. మా ఎమ్మెల్యేలను కూడా కొనబోయిన్రు కదా. ‘ఆగబోగాలు అంకాళమ్మవైతే.. పొలికేకలు పోలేరమ్మవి’ అన్నట్టు ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలతో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తరు. ఆ కొనుడు కూడా ‘ఎర్రను చూపిచ్చి, చాపను పట్కపోతరు’. వీళ్లకంతా ఆస్తులు అమ్ముకోవడమే పని. ‘కతలమారి మొగుడు కమ్మలు జేయిస్తె.. అప్పుల గల మొగుడు అమ్ముకుతింటడు’ బాపతు ఈ పార్టీ. ఇసొంటోళ్లను ఎన్నుకోకండి. ‘సంకకు ఎక్కిన పిల్ల సచ్చినా దిగద’ని గుర్తుంచుకోండి.

ఇదే స్టైల్లో... కాంగ్రెస్‌వాళ్ల సభల మాటల తీరు.. 
తెలంగాణ మేమే ఇచ్చినా.. ఇప్పిచ్చినాయనే మీకు ముద్దొచ్చిండు. ఏమైంది?  ‘ఎద్దును చూస్తె ముద్దొస్తదీ, దున్నబోతె దుక్కమొస్తది’ అన్నట్టయింది. ఇచ్చిన మమ్మల్నే ఇడిసిపెట్టి ‘నవ్వుకుంట తిడితిరి.. నరకాన బడ్తిరి’. అందుకే ‘ఊరికి పొయ్యేటోన్ని ఇడిసిపెట్టి, నిద్రపొయ్యేటోనికి సద్దిగట్టకున్రి’. వాళ్లను ఎన్నుకున్రా.. ఏమైతది? ‘జీవి ఇడిసిందాక మంచినీళ్లూగూడ పొయ్యజాలనోళ్లు.. సచ్చింతర్వాత మీ బొందమీద పాలిచ్చే బర్రెను కట్టేస్తా’ అన్నట్టే ఉంటది. దీనికి నిదర్శనమే రూ. 400కు సిలండరు. మరి అంతగనం ఇచ్చేటోళ్లు మేము రూ.500 అన్నదాక ఎందుకియ్యలే. ఇప్పుడు వీళ్లైనా, ఆ పువ్వు పార్టీవోళ్లైనా ‘తాత సంపాయించిన ఆస్తి.. మనవడితో మట్టిపాలు’ అన్నట్టుగా అమ్ముకుని తింటున్నది మా హయాంలో జరిగిన అభివృద్ధినే కదా.

ఇగ పువ్వు పార్టీలోళ్లు అచ్చం సంప్రదాయాలే మాట్లాడతరు. ‘ఆకు ఇస్తే అన్నం పెట్టినంత పున్నెం’ అనుకుంట ఆకే ఇస్తరు గని అన్నం పెట్టరు. మనమేదన్న మర్యాద జెయ్యబోతె..‘అల్లుడొచ్చిండని కల్లు దెస్తె నీసులేదని కేసుపెట్టినట్టు’ సీబీఐ, ఈడీలతోని కేసులు పెట్టిస్తరు. అన్నింటికి ట్యాక్సులేసి ‘ఇంటి ఎద్దుకు కూడ కిరాయికట్టమంటరు’. ‘ఆటాపాటా మా ఇంట్ల... మాపటి బువ్వ మీ ఇంట్ల’ అంటరు.

ఇప్పుడు పువ్వుపార్టీవాళ్ల ప్రసంగాలు..
మాది పువ్వు గుర్తు. మేము ఆవు పార్టీ. ‘ఆవు పాలల్ల అరవైఆరు పిండివంటలు’ ఉంటయి. అందుకే ఎవడన్న ‘ఆవును ఇచ్చి.. పలుపు దాచుకుంటడా?’ అట్లాంటి పని ఎప్పుడూ చేయకండి. ‘ఆవులేని ఇంట అన్నమే తినవద్దు’ అంటరు. ఆట్లాంటిది మన సొంత రాష్ట్రంలో ఆవు పార్టీని లేకుండా చేసుకుంటరా.. మీరే చెప్పండి.
అప్పుడు జనాలు..
మా బతుకులన్నీ ‘ఎంత పెరిగినా గానీ.. గొర్రెకు బెత్తెడే తోక’ అన్నట్టు. ప్రతిపూటా మా ‘గతిలేనోళ్లకు గంగే పాయసం’. ఎంత చెడ్డా మీరంత ఒక్కటే. ‘ఈత కాయ ఇచ్చినట్టే ఇచ్చి.. తాటికాయ తీసుకుంటరు’. ‘అన్నం పెడితే అరిగిపోతది.. చీరె ఇస్తె చినిగిపోతది.. వాత పెడ్తె కలకాలం ఉంటది’ అని మాకు వాతలు బెడతరు. మీ ధోరణంతా ‘ఆశ గలమ్మ దోషమెరగదూ.. పూటకూళ్లమ్మ పుణ్ణెమెరగదు’లా అందరూ అందరే. అందరూ ఒక్కటే. అందుకే ‘కర్రుగాల్చి వాత పెట్టాలె’. అది ఎవరికి పెడతామో చూద్దురుగానీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement