తెలంగాణ ఒకనాటి ‘పండోరా’.. చిన్నపాటి సముద్రాలు.. లావా ప్రవాహాలు | GSI Retired Deputy Director Venugopal Rao Said Interesting Things On Oceans Lava Flows | Sakshi
Sakshi News home page

చిన్నపాటి సముద్రాలు.. లావా ప్రవాహాలు

Published Sun, Dec 12 2021 2:17 AM | Last Updated on Sun, Dec 12 2021 10:08 AM

GSI Retired Deputy Director Venugopal Rao Said Interesting Things On Oceans Lava Flows - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చుట్టూ చిన్నపాటి సముద్రాలు.. లావా ప్రవాహాలు.. వాటితో ఏర్పడిన కొండలు, గుట్టలు.. భారీ వృక్షాలు.. జీవరాశులు.. వీటన్నింటి మధ్య ఉప్పొంగి ప్రవహించే పెద్ద నది.. ఇవన్నీ ఏదో హాలీవుడ్‌ సినిమాలో సీన్లు కాదు. అచ్చంగా ఒకప్పుడు తెలంగాణ భూభాగంలో నెలకొన్న పరిస్థితులు. ఊహించుకోవడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇవన్నీ వాస్తవాలే. ఇప్పుడున్న ఖండాలు, భూభాగాలు అప్పట్లో కలిసి ఉండేవి.

కోట్ల ఏళ్ల పరిణామక్రమంలో కొన్ని విడిపడి, కొంత కలిసిపోయి ఇప్పుడున్న రూపానికి వచ్చాయి. ఆ మార్పులను చూడటానికి మన జీవితకాలం సరిపోదు. కానీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో అలనాటి పరిస్థితులను గుర్తించారు. ఈ క్రమంలో జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ చకిలం వేణుగోపాలరావును ‘సాక్షి’పలకరించగా.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 


చకిలం వేణుగోపాలరావు 

సున్నపురాతి గనులు వాటి చలవే.. 
తెలంగాణ ప్రాంతంలో ఇటు ఉమ్మడి నల్గొండ, అటు తాండూరు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో సున్నపురాతి నిల్వలకు కారణం నాటి సముద్ర భాగాలే. అప్పట్లో సముద్ర తీరం నుంచి తక్కువ లోతుండే భాగం వరకు భారీగా సున్నపురాతి నిల్వలు ఏర్పడ్డాయి. ఆ సముద్రాలు అంతం కాగా.. సున్నపురాయి నిల్వలు ఇప్పుడు మనకు పనికొస్తున్నాయి. 

ఈ బొగ్గు నిల్వలు 30 కోట్ల ఏళ్లవి.. 
తెలంగాణ భూభాగం, దీని పరిసరాల్లోని బొగ్గు పొరలు దాదాపు 30 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయి. ఈ ప్రాంతాన్ని జియోలజిస్టులు గోండ్వానా బేసిన్‌గా పేర్కొంటారు. అప్పట్లో ఈ ప్రాంతాల మీదుగా అమెజాన్‌ కంటే భారీ మంచినీటి నది ప్రవహించేది. ఆ నది ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖండం (అప్పట్లో ఈ భూభాగాలన్నీ కలిసి ఉండేవి) వరకు విస్తరించి ఉండేది. నది పరీవాహకంలో ఏకంగా ఆరేడు మీటర్ల చుట్టుకొలతతో కాండం ఉండే భారీ వృక్షాలు పెద్ద సంఖ్యలో ఉండేవి.

అప్పట్లో ఏర్పడిన ప్రకృతి విపత్తులతో ఆ వృక్షాలన్నీ కూలిపడి.. పైన మట్టిపొరలు పేరుకుపోయాయి. లక్షల ఏళ్లు ఒత్తిడికి, ఉష్ణోగ్రతలకు గురై బొగ్గుగా మారాయి. ఇప్పుడా బొగ్గు నిల్వలనే మనం తవ్వి వినియోగించుకుంటున్నాం. అలనాటి భారీ నదితో సంబంధం లేకున్నా.. ఇప్పుడా పరిధిలోనే గోదావరి నది ప్రవహిస్తుండటం విశేషం. 

అవన్నీ లావా గుట్టలే.. 
ఒకప్పుడు తెలంగాణ భూభాగంలోని కొంత ప్రాం తంలో అగ్నిపర్వతాల లావా ప్రవహించింది. దాదాపు 15 లక్షల చదరపు కిలోమీటర్ల మేర ఘనీభవించి పీఠభూమి ఏర్పడింది. ఈ పరిధిని డెక్కన్‌ వల్కానిక్‌ ప్రావిన్స్‌ (డీవీపీ)గా పేర్కొంటారు. శంకర్‌పల్లి, చేవెళ్ల, వికారాబాద్, జహీరాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో మహారాష్ట్రవైపున్న కొన్ని ప్రాంతాలు దాని పరిధిలో ఉంటాయి.

ఈ ప్రాంతంలోని గుట్టలన్నీ సుమారు ఆరున్నర కోట్ల ఏళ్ల కింద ఉబికివచ్చిన లావాతో ఏర్పడినవే. మిగతా తెలంగాణలో గ్రానైట్, డోలరైట్‌ రాళ్ల గుట్టలు ఏర్పడ్డాయి. హైదరాబాద్‌కు కొంత దూరం చేవెళ్ల సమీపంలోని ముడిమ్యాల గ్రామం వద్ద ఆ లావా అవశేషాలను జియోలజిస్టులు గుర్తించారు. ఆ లావా ప్రవాహాల సమయంలోనే ఇక్కడి డైనోసార్లు అంతరించాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా, మహారాష్ట్ర సరిహద్దు గోదావరి తీర ప్రాంతాల్లో ఆ డైనోసార్ల శిలాజాలు లభిస్తున్నాయి. 

సముద్రాల మధ్య.. 
ఒకప్పుడు ప్రస్తుతమున్న తెలంగాణ పీఠభూమి ప్రాంతానికి పక్కన రెండు సముద్రాలు ఉండేవి. దిగువన ఉన్నదానికి కడప బేసిన్‌ అని, ఎగువన ఉన్నదానికి పాకాల బేసిన్‌ అని జియోలజిస్టులు పేరుపెట్టారు. శేషాచలం కొండలు, నగరి జగ్గయ్యపేట మొదలు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్, మహబూబ్‌నగర్‌–ఖమ్మం జిల్లాల్లోని కొంత ప్రాంతంలో కడప బేసిన్‌ విస్తరించి ఉండేది. ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల పరిధి అంతా పాకాల బేసిన్‌ పరిధిలో ఉండేది.

ఈ రెండు సముద్ర బేసిన్లు కూడా.. ఖమ్మం జిల్లా చిరునోముల గ్రామం వద్ద 10–12 మీటర్ల పాయతో అనుసంధానమై ఉండేవని గుర్తించారు. పాకాల బేసిన్‌లో సులువాయి, పెన్‌గంగ అన్న రెండు సబ్‌బేసిన్లను.. కడప బేసిన్‌లో కర్నూల్, పల్నాడు అనే రెండు సబ్‌ బేసిన్లను గుర్తించారు. ఇవన్నీ 160 కోట్ల ఏళ్ల నుంచి 55 కోట్ల ఏళ్ల కిందటి వరకు ఉండేవని అంచనా. 

ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలుడు.. తెలంగాణలో బూడిద 
సుమారు 75 వేల ఏళ్ల కింద ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ఉన్న టోబా అనే అగ్నిపర్వతం భారీ స్థాయిలో బద్దలైంది. దాని నుంచి వెలువడిన బూడిద వేల కిలోమీటర్ల దూరం విస్తరించింది. అలా పడిన బూడిద నీటి ప్రవాహాలతో కొట్టుకుపోయి కొన్నిచోట్ల కుప్పగా చేరింది. అదే తరహాలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఆ అగ్నిపర్వతం బూడిద కుప్పలు మేటవేసి ఉన్నాయి.

కొత్తగూడెం సమీపంలోని ముర్రేరు వద్ద, మంజీరా లోయలోని కొన్ని ప్రాంతాల్లో సదరు బూడిద కుప్పలను జియోలజిస్టులు ఇప్పటికే గుర్తించారు. ఏపీలోని బనగానపల్లి సమీపంలో జ్వాలాపురం గ్రామంలో మెరుగుసుద్దగా పిలుచుకునే బూడిద కుప్పలు వీటిలో భాగమే. ఆ బూడిదనే కొన్ని కంపెనీలు గిన్నెలు తోమేందుకు వినియోగించే పౌడర్‌గా తయారు చేసి అమ్ముతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement