సాక్షి, అమరావతి: పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే... సహజ ఇంధన వనరులను వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలనేది వాటి లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన (విద్యుత్) ఉత్పత్తికి ప్రాధాన్యత పెరుగుతోంది.
స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగించాల్సిన ఆవశ్యకతపై ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇప్పటికే ఒక తీర్మానాన్ని కూడా చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సౌర విద్యుత్‌తోపాటు పవన విద్యుత్ ఉత్పత్తి, వినియోగంలో సరికొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు కొండలు, మైదాన ప్రాంతాల్లోనే పవన విద్యుత్ ప్లాంట్లు ఉండగా.. కొద్దికాలంగా సముద్రంలోనూ పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
2026 నాటికి దాదాపు 20 గిగావాట్లు
పవన విద్యుత్ సామర్థ్యం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంది. గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్ల్యూసీ) తాజా నివేదిక ప్రకారం... 2021లో ప్రపంచ పవన విద్యుత్ పరిశ్రమ కొత్తగా 93.6 గిగావాట్లు వృద్ధిని నమోదు చేసింది. దీంతో మొత్తం పవన విద్యుత్ పరిశ్రమ సామర్థ్యం 837 గిగావాట్లకు చేరింది. ఇది ఏటా 1.2 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను నివారించడంలో సహాయపడుతోంది.
మన దేశంలో మొత్తం విద్యుత్ డిమాండ్ సగటు వృద్ధి రేటు 6 %గా ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 40 గిగావాట్ల ఆన్‌షోర్ విండ్ కెపాసిటీ ఉన్నప్పటికీ, గాలి విస్తరణ వేగం మందగించడంతో ఉత్పత్తి ఆశించినంతగా ఉండటం లేదు. 2012–2016 మధ్య 13 శాతంగా ఉన్న వార్షిక పవన విద్యుత్ సగటు వృద్ధి రేటు... 2016–21 మధ్య 5 శాతానికి తగ్గింది.
గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ విశ్లేషణ ప్రకారం ఈ వృద్ధి రేటు రానున్న దశాబ్దంలో 15శాతానికి పెరగాలి. ఇందుకోసం పవన విద్యుత్ ప్లాంట్ల స్థాపన పెరగాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో సముద్రతీరంలో 2026 నాటికి దాదాపు 20 గిగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్లను స్థాపించే ప్రయత్నం జరుగుతోంది.
నిర్వహణకు సెన్సార్ సిస్టమ్
భూమి మీద కంటే సముద్రంలో గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆఫ్‌షోర్ విండ్ పవర్ ప్లాంట్లతో అధికంగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సముద్రంలో ఏర్పాటు చేసే విండ్ పవర్ టరై్బన్లను బ్లేడ్‌లు, ఫైబర్ గ్లాస్ మిశ్రమంతో తయారు చేస్తారు. వందల అడుగుల పొడవు, అనేక టన్నుల బరువు ఉంటాయి. బ్లేడ్‌ల అంచులలో పగుళ్లు, రంద్రాల వల్ల టరై్బన్ విఫలమై, విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంటుంది.
ఈ నేపథ్యంలో వాటిని పర్యవేక్షించడానికి ధ్వని ఆధారిత సెన్సార్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. దీనిలో భాగంగా బ్లేడ్‌లో వైర్‌లెస్ మైక్రోఫోన్‌లను ఆమర్చుతారు. దీనివల్ల సమస్యను వెంటనే గుర్తించి బాగుచేసే వీలు కలుగుతుంది. అంతేకాదు ఈ టరై్బన్లు తీరానికి దూరంగా ఉంటాయి. కాబట్టి రిమోట్ మానిటరింగ్ టెక్నాలజీని వాడతారు. ఇతర దేశాల్లో ఈ విధానం ఇప్పటికే ప్రాచుర్యంలోకి రాగా, మన దేశంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది.
దేశంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, డీకార్బనైజేషన్ లక్ష్యాలను చేరుకోవడానికి శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛమైన, చవకైన సహజ వనరులను వినియోగించుకోవాల్సిన అసవరం ఉంది. అందులో సముద్రతీర గాలి మన దేశ విద్యుత్ వ్యవస్థకు ప్రధానమైనదిగా మారుతోంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అయ్యే ఖర్చు కంటే తక్కువకే పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పవచ్చు. ఈ విద్యుత్‌కు ఓపెన్ యాక్సెస్, ఇంటర్–స్టేట్ ట్రాన్స్‌విుషన్ సిస్టమ్ చార్జీల మినహాయింపులు వంటి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment