సముద్ర లోతుల్లో నిక్షిప్తమైన అంశాలతో పాటు, ఇంకా వెలుగు చూడని ఎన్నో కొత్త రహస్యాలను ఛేదించేందుకు శాస్త్రజ్ఞులు సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా ప్రాంతాల్లో విస్తృత పరిశోధనలతో నూతన ఆవిష్కరణలకు తెరతీయనున్నారు. చైనా, చిలీ, ఇండియా, కోస్టారికా, మెక్సికో, బ్రెజిల్, ఇజ్రాయెల్, ఉగాండా, ఇండోనేషియా, ఇంగ్లండ్, ద వర్జిన్ ఐలాండ్స్, ద సౌత్‌పసిఫిక్, ద ఆర్కిటిక్ ఇలా ప్రపంచంలోని ప్రతీ మూలలో పరిశోధనలు మొదలవుతాయి.
సమ్మర్ ఫీల్డ్ రీసెర్చిలో భాగంగా అమెరికాలోని ఐదో పెద్ద పరిశోధనా విశ్వవిద్యాలయానికి (యూసీ శాన్ డియాగో) చెందిన పరిశోధకులతో పాటు, శాన్ డియాగో స్టేట్ యూనివర్సిటీ, కాల్ స్టేట్ శాన్ మార్కోస్, ది యూనివర్సిటీ ఆఫ్ ది శాన్ డియాగో, లోమా నజరెన్ యూనివర్సిటీ, తాజొల్లాలోని సౌత్‌వెస్ట్ ఫిషరీస్ సైన్స్ సెంటర్ శాస్త్రవేత్తలు సైతం పాలుపంచుకుంటున్నారు. ఈ విస్తృత పరిశోధనలో భాగంగా మనకు ఇప్పటివరకు తెలియని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ప్రపంచంలోనే అత్యంత పొడిబారిన చిలీ అటకామా ఎడారి, బ్రెజిల్‌లోని అడవులు మొదలుకుని మెక్సికోలో ఇంద్రధనస్సులోని రంగులతో కూడిన పగడపు దిబ్బలు (రీఫ్) చేరుకుని సముద్ర లోతులకు సంబంధించిన విభిన్న తరహా పరిశోధనలకు పదును పెడతారు.
వారేం చేస్తారంటే...
ఈ పరిశోధనలో భాగంగా 30కు పైగా చోట్ల వివిధ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వాటిలో కొన్ని...
భారత్‌కు ఆనుకునే ఉన్నా బంగాళాఖాతం, ఈ ప్రాంతంలో రుతుపవనాల ప్రవేశ సమయంపై, వర్షాలపై ఎలాంటి పాత్ర నిర్వహిస్తుందన్న దానిపై యూసీ శాన్ డియాగో సముద్రశాస్త్రవేత్త డ్రూ లూకాస్ బృందం అధ్యయనం చేస్తుంది. మూడు వారాల పరిశీలనలో భాగంగా ఈ విశ్వవిద్యాలయ స్క్రిప్స్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఓషియనోగ్రఫీ సైంటిస్ట్‌ల బృందం అత్యాధునిక పరికరాలు ఉపయోగించి సముద్ర ఆటుపోట్లు, లవణ నీటి లక్షణాలు (సెలైనిటీ), సముద్ర ఉపరితలంలోని ఉష్ణోగ్రతల్లో సంభవిస్తున్న మార్పుచేర్పులు, ఇంకా మరెన్నో అంశాలపై దృష్టి సారిస్తారు. దక్షిణాసియా వ్యాప్తంగా వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలు, మనుషుల ఆరోగ్యాలతో ముడిపడిన నీటివనరులకు కీలకంగా మారిన రుతుపవనాలు, వాతావరణ మార్పుల్లో ముందస్తు సూచనలు మరింత మెరుగుపరిచేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడ నున్నాయి.
ఆర్కిటిక్ మహాసముద్రంలోని స్వాల్‌బార్డ్ ద్వీపసమూహంలో యూసీ శాన్‌డియాగోకు చెందిన గ్రాంట్ డీన్, డేల్ స్టోక్స్ శాస్త్రవేత్తలు మంచులోని నీటిబుడగలు కరిగిపోతున్న శబ్దాన్ని పర్యవేక్షించే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా ఎంత వేగంగా హిమనీనదాలు (మంచుపర్వతాలు) కరిగిపోతున్నాయో అంచనా వేయనున్నారు. విస్తృత పరిధిలో వాతావరణ మార్పులపై చేస్తున్న పరిశోధనలో భాగంగా దీనిని చేపట్టారు.
క్రీస్తు పూర్వం 1200 ఏళ్ల ప్రాంతంలో తూర్పు మధ్యధరాప్రాంతంలోని నాగరికతల పతనానికి వాతావరణ, పర్యావరణ మార్పు ఏ విధంగా ప్రభావం చూపిందన్న దానిపై మానవ పరిణామశాస్త్రవేత్త టామ్ లెవీ (యూసీ శాన్ డియాగో) బృందం ఇజ్రాయెల్‌లో పరిశోధనలు నిర్వహిస్తుంది.
కాలిఫోర్నియాకు ఆవల కొకొనాడో ద్వీపాల్లోని అతి పురాతన కాలం నాటి రెండు ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టడం ద్వారా ఆదిమకాలం నుంచి మానవులు ఒకచోట నుంచి మరోచోటికి ఏ విధంగా మారుతూ స్థిరనివాసాలు ఏర్పరు చుకుంటూ వచ్చారన్న దానిపై, వారు సాగించిన యాత్రా క్రమాన్ని వివరించేందుకు శాన్‌డియాగో స్టేట్ యూని వర్సిటీకి చెందిన టాడ్ బ్రేజ్, మెక్సికో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ పరిశోధకులు ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ శాస్త్రవేత్తల బృందాలు నిర్వహించే పరిశోధనల ఫలితంగా ఎన్నో విశ్వరహస్యాలు వెలుగులోకి వస్తాయని మేథోలోకం ఎదురుచూస్తోంది.
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment