Weather information
-
అరచేతిలో వాతావరణ సమాచారం
రాయవరం: ఈ మధ్యకాలంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా ఒకరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరోరోజు ఈదురు గాలులతో కూడిన అకాలవర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు అయోమయానికి గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌లు రూపొందించింది. డామిని, మేఘ్‌దూత్, రెయిన్ అలారం.. యాప్‌లు ఆవిష్కరించింది. వీటిద్వారా వాతావరణ పరిస్థితులను అంచనా వేయవచ్చని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.ప్రధానంగా వర్షాకాలం మొదలుకానున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతల వివరాలు, వర్షాల రాక సమాచారాన్ని కూడా యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఉరుములు, మెరుపుల నుంచి రక్షించుకోవడం, వర్షం పరిస్థితులను అంచనా వేయడం సులభమవుతంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ శాఖ రూపొందించిన ఈ యాప్‌లు రైతులకు సాగులో తోడ్పడనున్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా వీటిని డౌన్లోడ్ చేసుకుంటే చాలు. వాతావరణ సమాచారం మొత్తం మన అరచేతిలో ఉన్నట్టే. ‘డామిని’లో ఉరుములు, మెరుపుల హెచ్చరిక ఒక్కోసారి వాతావరణంలో అప్పటికప్పుడు మార్పులు సంభవించి ఉరుములు, మెరుపులు వస్తాయి. పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఇలాంటి హెచ్చరికలను తెలిపేందుకు డామిని యాప్ ప్రయోజనకరంగా ఉంటుంది. మెరుపు ఎప్పుడు వస్తుంది? మెరిసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తంగా ఉండాల్సిన తీరును ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. లొకేషన్ ఆధారంగా మెరుపులు వచ్చే అవకాశం ఉందో? లేదో? కూడా తెలుస్తుంది. పిడుగు పడినప్పుడు తోటివారికి అందించాల్సిన వైద్యసహాయం వంటి ప్రాథమిక సమాచారాన్ని తెలియజేస్తుంది. రైతులకు, రైతుకూలీలకు బయటి ప్రాంతాల్లో పనిచేసేవారికి ఈ యాప్ ఎంతో తోడ్పడుతుంది. వాతావరణ సమగ్ర వివరాలతో ‘మేఘదూత్’ మేఘదూత్ యాప్‌లో వాతావరణానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. వర్షపాతం వివరాలు, గాలిలో తేమ, గాలి వేగం, గాలి వీచే దిశ, నమోదైన ఉష్ణోగ్రతలు, రానున్న 24 గంటల్లో వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంది. గడిచిన వారం రోజులు, రానున్న మరో నాలుగు రోజుల వాతావరణ వివరాలు కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. వర్ష సూచనకు ‘రెయిన్ అలారం’ వర్షం ఎప్పుడు పడుతుంది. వర్షపాతం వివరాలు, రానున్న కాలంలో వర్ష సూచనలను రెయిన్ అలారం యాప్ తెలియజేస్తుంది. మనం నివసిస్తున్న ప్రాంతంలో వాతావరణ, వర్ష సూచనలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయో తెలియజేస్తుంది. -
తెలంగాణ: మరో నాలుగు రోజులు వర్షాలే!
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి మరట్వాడ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ద్రోణి కొనసాగుతోంది. దీనికితోడు దక్షిణ ఛత్తీస్‌ఘడ్ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనము కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం తెలిపింది. దీంతో రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాగల నాలుగు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో)తో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదు అయినప్పటికీ.. ఒక్కసారిగా మేఘావృతమైన వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. కాగా, గత 24 గంటల్లో వనపర్తి జిల్లా ఆత్మకూర్‌లో అత్యధికంగా 8 సెంటీమీటర్లు, పెబ్బేరులో 7 సెంటీమీటర్లు, వీపనగండ్లలో 6 సెంటీమీటర్లు, కామారెడ్డి, నవీపేట్, గాంధారి, బోధన్‌లలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఇదీ చదవండి: ట్రోలింగ్.. సామాజిక జబ్బు! -
అయ్యయ్యో.. టీవీ చానెల్ ఎంత పనిచేసింది!
వాషింగ్టన్: ఉన్నట్టుండి అమెరికాలోని ఒక టీవీ చానల్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. వాతావరణ వివరాలను ప్రసారం చేస్తున్న బులిటెన్‌లో ఏకంగా పోర్న్ కంటెంట్‌ను ప్రసారం చేసింది. దీంతో వీక్షకులు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఈవినింగ్ న్యూస్కాస్ట్లో ఈ వీడియోను ప్రసారం చేసింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. (kidney transplantation: సంచలనం) స్థానిక వార్తా ఛానెల్ అశ్లీల క్లిప్‌ను ప్రసారం చేయడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. సాయంత్రం వార్తల బులిటెన్‌లో భాగంగా వాతావరణ నిపుణురాలు మిషెల్ బాస్ వాతావరణ అప్డేట్ ఇస్తున్నారు. ఇంతలో పోర్న్క్లిప్ టెలికాస్ట్ కావడం ప్రారంభమైంది. 13 సెకన్ల స్పష్టమైన వీడియో టెలికాస్ట్ అవుతోంటే..యాంకర్, కో యాంకర్, కోడి ప్రోక్టర్ గానీ దీన్ని గమనించనేలేదు. వివరాల అనంతరం బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రాఫిక్ వీడియో వచ్చేదాకా ఇది ప్రసారమైంది. అయితే దీనిపై సంబంధిత టీవీ ఛానెల్ స్పందించింది. పొరపాటు జరిగిందంటూ ఛానెల్ క్షమాపణలు తెలిపింది. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూసుకుంటామని ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై వీక్షకుల నుండి ఫిర్యాదులు రావడంతో సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేస్తోంది. -
ఏపీలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: జార్ఖండ్ నుంచి ఒడిశా వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇప్పటివరకు నైరుతి నుంచి వాయువ్యం మీదుగా వీచిన గాలులు.. నేటి నుంచి దిశ మార్చుకొని నైరుతి నుంచి ఈశాన్యం మీదుగా వీచే అవకాశాలున్నాయి. ఫలితంగా.. వాతావరణంలో మార్పులు రానున్నాయి. ఎండ తీవ్రత క్రమంగా తగ్గనుంది. బుధవారం మాత్రం ఎండలు ఠారెత్తించాయి. అనేక చోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం కూడా ఎండలు ఇదే రీతిలో ఉండే అవకాశముంది. ఇదిలా ఉండగా.. ఈ నెల 16న కోస్తా తీరంలో అల్పపీడనం ఏర్పడి ఉత్తరాంధ్ర మీదుగా తెలంగాణ వైపు పయనించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 16 నుంచి వర్షాలు జోరందుకునే సూచనలున్నట్లు తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. -
భానుడి భగ భగలు..
-
తెలంగాణలో భానుడి భగ భగలు.. కారణం ఇదేనా!
హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదే సమయంలో వడగాడ్పులు, ఉక్కపోత పెరగడంలో జనం విలవిల్లాడుతున్నారు. బుధవారం భద్రాచలంలో రాష్ట్రంలోనే అధికంగా 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని.. ప్రస్తుత సీజన్లో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో 38.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా.. ఇప్పుడు ఏకంగా 3.9 డిగ్రీలు ఎక్కువగా నమోదుకావడం గమనార్హం. హైదరాబాద్, వరంగల్, దుండిగల్, హకీంపేట కేంద్రాల్లో మినహా రాష్ట్రమంతటా 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఆదిలాబాద్‌లో తక్కువగా 19.2 డిగ్రీలు నమోదైంది. మిగతా అంతటా 20 డిగ్రీల కంటే ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వడగాడ్పులు రాష్ట్రానికి ఉత్తర దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. ఎత్తు తక్కువగా ఉండడం, వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఇవి వడగాడ్పులుగా మారుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ గ్రామీణం, వరంగల్ పట్టణం, జనగామ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరో నాలుగు రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. జాగ్రత్తగా ఉండాలి.. మండుతున్న ఎండలు, వడగాడ్పుల ప్రభావం నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలో ఎక్కువ సమయం గడిపేవారు వడదెబ్బ బారినపడే అవకాశం ఉందని పేర్కొంది. వడదెబ్బ తగిలిన వారికి తక్షణమే చికిత్స అందించాలని.. చల్లటి గాలి తగిలే ప్రదేశంలో ఉంచి విశ్రాంతి ఇవ్వాలని సూచించింది. ఉప్పు, పంచదార కలిపిన చల్లటి నీళ్లను తాగించాలని.. వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలని పేర్కొంది. ఎండల తీవ్రతను తట్టుకొనేందుకు.. నూలు దుస్తులు ధరించడం, కళ్లజోడు పెట్టుకోవడం, బయటికి వెళ్లినప్పుడు గొడుగుని ఉపయోగించడం, చర్మానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం వంటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరిక ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో తుపాను ప్రభావం కారణంగా వాతావరణంలో పలు మార్పులు జరుగుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఏప్రిల్ 2, 3, 5 తేదీల్లో కోస్తా ఆంధ్ర, యానాంలలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయిని.. 30, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. -
మళ్లీ గండం.. బంగాళాఖాతంలో ద్రోణి..
సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. నివర్ తుపాన్ రూపంలో కుండపోతగా కురిసిన వర్షాలకు ఇప్పటికే అనేక జిల్లాల్లో జలాశయాలు, చెరువులు పూర్తిగా నిండాయి. ఉబరి నీటి విడుదల సాగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. చెన్నై శివార్లలో అనేక చోట్ల నీటిని తొలగించినా, కొన్ని చోట్ల మాత్రం కష్టతరంగా మారింది. దీంతో తాంబరం పరిసరవాసులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి. ఇక్కడికి భారీ మోటార్ల ద్వారా నీటిని తరలించేందుకు చర్యల్ని అధికారులు చేపట్టారు. నివర్ రూపంలో రైతులకు నష్టాలు ఎక్కువే. చేతికి పంట అంది వచ్చే సమయంలో వరదలు ముంచెత్తడంతో కన్నీళ్లు తప్పడం లేదు. దీంతో నష్ట పరిహారం చెల్లింపునకు తగ్గ చర్యల్ని వేగవంతం చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పనిలో పడ్డాయి. ఇందుకు తగ్గ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టే పనిలో పడింది. ప్రస్తుతం నీట మునిగిన ప్రాంతాలలో భవిష్యత్తులో మరో ముప్పు ఎదురుకాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని శనివారం ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎం పళనిస్వామి ఆదేశించారు. ప్రధానంగా తాంబరం పరిసరాలపై తొలుత దృష్టి పెట్టనున్నారు. నివర్ ప్రభావం కారణంగా మరణించిన కుటుంబాలకు రూ. 12 లక్షలు సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో, సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయో అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. వరద బాధిత ప్రాంతాల్లో పోలీసుల పాత్రపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నైలో కొన్ని ప్రాంతాల్లో వెయ్యి మందిని తమ భుజాలపై వేసుకుని మరీ సురక్షిత ప్రాంతాలకు పోలీసులు తరలించడం అభినందనీయం. చదవండి: (బుల్లెట్‌కి బలయ్యే అవకాశమివ్వండి) సాగరంలో ద్రోణి.. నివర్ సహాయక చర్యలు సాగుతున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం శనివారం మధ్యాహ్నం బయలుదేరింది. దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో నెలకొన్న ఈ ద్రోణి వాయుగుండంగా మారి, తుపాన్‌గా అవతరించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ద్రోణి పశ్చిమ దిశలో పయనిస్తుండడంతో రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లో ఆదివారం నుంచి వర్షాలు పడనున్నాయి. ఇది తుపాన్‌గా మారనున్న దృష్ట్యా, దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ద్రోణి తుపాన్‌గా మారినానంతరం డెల్టా జిల్లాల వైపు లేదా, దక్షిణ తమిళనాడు వైపు దూసుకొచ్చేనా అన్నది వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి దక్షిణ తమిళనాడు, సముద్రతీర జిల్లాల్లో ఆదివారం నుంచి తేలిక పాటి వర్షం మొదలై, క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్ ఒకటి, రెండు, మూడు తేదీల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అధికారయంత్రాంగం సిద్ధమైంది. జాలర్లు వేటకు దూరంగా ఉండాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రంలో గాలి వేగం గంటకు 55 కి.మీ వరకు ఉండవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మేట్టుపట్టిలో 9 సె.మీ, అవినాశిలో 8 సె.మీ, చోళవందాన్, వాడి పట్టిలో 7 సె.మీ మేరకు వర్షం పడింది. బురేవి తర్వాత మరో తుపాన్‌కు అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. చదవండి: (మానవత్వంతో ఆదుకోండి) రూ. వంద కోట్లు ఇవ్వండి.. పుదుచ్చేరి, రాష్ట్రంలోని నివర్ బాధిత ప్రాంతాల్లో ఏ మేరకు నష్టం జరిగిందో పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు ఢిల్లీ నుంచి సోమ వారం ప్రత్యేక బృందం చెన్నైకు రానుంది. దీంతో నష్టం నివేదిక తయారీకి అధికారులు పరుగులు తీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నివర్ రూపంలో పుదుచ్చేరికి రూ. 400 కోట్లు నష్టం జరిగినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి శనివారం ప్రకటించారు. అధికారులతో సమావేశానంతరం నష్టం తీవ్రతను పరిగణించి, సహాయక చర్యల కోసం రూ. 100 కోట్లు తక్షణం కేటాయించాలని ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేస్తూ ఆయన లేఖ రాశారు. -
అల్ప పీడనం: మరో రెండు రోజుల పాటు వర్షాలు
సాక్షి, అమరావతి: తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్ జోన్ 20 °N అక్షాంశం వెంబడి సెంట్రల్ ఇండియా మీదుగా ఉపరితల ద్రోణి 4.5 కిమీ నుంచి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతున్న అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉండటం వల్ల ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఆగష్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేగాక తదుపరి 42 గంటల్లోగా ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడి క్రమంగా పడమర వైపుకు కదిలే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీకి రాగల మూడు రోజుల పాటు వర్ష సూచన తూర్పు-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఇవాళ, రేపు(బుధవారం) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు చాలా చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో చాల చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
ఏపీలో మరో 3 రోజులపాటు వర్షాలు
సాక్షి, అమరావతి: తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్ జోన్ 20 °N అక్షాంశం వెంబడి సెంట్రల్ ఇండియా మీదుగా ఉపరితల ద్రోణి 4.5 కిమీ నుంచి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోందని ఏపీ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉండటం వల్ల ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఆగష్టు 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తదుపరి 42 గంటల్లో ఈ ఉపరితల ద్రోణి మరింత బలపడి క్రమంగా పడమర వైపుకు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల వాతావరణ సూచన తూర్పు-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాంధ్ర, యానం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే రెండు రోజులు(మంగళవారం, బుధవారం) ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పాటు చాలా చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో చాల చోట్ల తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
ఉపరితల ద్రోణి: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
సాక్షి, అమరావతి: తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్ జోన్ 13 °N అక్షాంశం వెంబడి ఉపరితల ద్రోణి 3.1 కిమీ నుంచి 5.8 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోందని ఏపీ వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నట్లు ప్రేర్కొంది. దీనివల్ల దక్షిణ కోస్తా ఆంధ్ర, దాని పక్కనే ఉన్న ఉత్తర తమిళనాడు ప్రాంతాలలో 3.1కిమీ నుంచి 5.8కిమీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎత్తుకు వెళ్లే కొలది ఇది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి, కోత జోన్‌తో కలసినట్లు వాతావారణ కేంద్రం వెల్లడించింది. దీంతో మరట్వాడ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మూడు రోజుల వరకు వాతావరణ సూచన: ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, యానాం,రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు(శుక్రవారం) ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అదే విధంగా రేపు ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక ఆదివారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. -
కోస్తా ఆంధ్ర, తెలంగాణ మీదుగా అల్పపీడన ద్రోణి
సాక్షి, అమరావతి: నైఋతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడులకు 5.8 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తం ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర, తెలంగాణ మీదుగా 1.5 కిమీ ఎత్తు వద్ద అల్పపీడన ద్రోణి ఏర్పడినట్లు వాతావారణ కేంద్ర అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన: ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, యానాం,రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు(బుధవారం) ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అదే విధంగా రేపు ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక శుక్రవారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. -
ఈ ప్రాంతాలకు 3 రోజుల పాటు వర్ష సూచన
సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతాలలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని మంగళవారం అమరావతి వాతావణ కేంద్రం ప్రకటించింది. ఈ ఉపరితల ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నదని వాతావారణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు: ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం పాటు దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేగాక భారీ నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు(బుధవారం) ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. గురువారం రోజున మూడు జిల్లాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ కేంద్రం వెల్లడించింది. -
ఈ జిల్లాలో 3 రోజుల పాటు వర్షాలు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసిమ జిల్లాలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావారణ కేంద్రం సోమవారం ప్రకటించింది. ఇవాళ ఉరుములు, మెరుపులుతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేగాక భారీ నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు(మంగళవారం) మూడు జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. బుధవారం రోజున మూడు జిల్లాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. -
మే మొదటివారంలో అల్పపీడనం..
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు వెల్లడించారు.. దీని ఫలితంగా కోస్తాంధ్రలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. రాగల 48 గంటలు రాయలసీమలో 41-43 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు, కూలీలు, పశు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు సూచించారు. -
అంతు చిక్కని రహస్యాల ఛేదనకు...
సముద్ర లోతుల్లో నిక్షిప్తమైన అంశాలతో పాటు, ఇంకా వెలుగు చూడని ఎన్నో కొత్త రహస్యాలను ఛేదించేందుకు శాస్త్రజ్ఞులు సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయా ప్రాంతాల్లో విస్తృత పరిశోధనలతో నూతన ఆవిష్కరణలకు తెరతీయనున్నారు. చైనా, చిలీ, ఇండియా, కోస్టారికా, మెక్సికో, బ్రెజిల్, ఇజ్రాయెల్, ఉగాండా, ఇండోనేషియా, ఇంగ్లండ్, ద వర్జిన్ ఐలాండ్స్, ద సౌత్పసిఫిక్, ద ఆర్కిటిక్ ఇలా ప్రపంచంలోని ప్రతీ మూలలో పరిశోధనలు మొదలవుతాయి. సమ్మర్ ఫీల్డ్ రీసెర్చిలో భాగంగా అమెరికాలోని ఐదో పెద్ద పరిశోధనా విశ్వవిద్యాలయానికి (యూసీ శాన్ డియాగో) చెందిన పరిశోధకులతో పాటు, శాన్ డియాగో స్టేట్ యూనివర్సిటీ, కాల్ స్టేట్ శాన్ మార్కోస్, ది యూనివర్సిటీ ఆఫ్ ది శాన్ డియాగో, లోమా నజరెన్ యూనివర్సిటీ, తాజొల్లాలోని సౌత్‌వెస్ట్ ఫిషరీస్ సైన్స్ సెంటర్ శాస్త్రవేత్తలు సైతం పాలుపంచుకుంటున్నారు. ఈ విస్తృత పరిశోధనలో భాగంగా మనకు ఇప్పటివరకు తెలియని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ప్రపంచంలోనే అత్యంత పొడిబారిన చిలీ అటకామా ఎడారి, బ్రెజిల్‌లోని అడవులు మొదలుకుని మెక్సికోలో ఇంద్రధనస్సులోని రంగులతో కూడిన పగడపు దిబ్బలు (రీఫ్) చేరుకుని సముద్ర లోతులకు సంబంధించిన విభిన్న తరహా పరిశోధనలకు పదును పెడతారు. వారేం చేస్తారంటే... ఈ పరిశోధనలో భాగంగా 30కు పైగా చోట్ల వివిధ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. వాటిలో కొన్ని... భారత్‌కు ఆనుకునే ఉన్నా బంగాళాఖాతం, ఈ ప్రాంతంలో రుతుపవనాల ప్రవేశ సమయంపై, వర్షాలపై ఎలాంటి పాత్ర నిర్వహిస్తుందన్న దానిపై యూసీ శాన్ డియాగో సముద్రశాస్త్రవేత్త డ్రూ లూకాస్ బృందం అధ్యయనం చేస్తుంది. మూడు వారాల పరిశీలనలో భాగంగా ఈ విశ్వవిద్యాలయ స్క్రిప్స్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఓషియనోగ్రఫీ సైంటిస్ట్‌ల బృందం అత్యాధునిక పరికరాలు ఉపయోగించి సముద్ర ఆటుపోట్లు, లవణ నీటి లక్షణాలు (సెలైనిటీ), సముద్ర ఉపరితలంలోని ఉష్ణోగ్రతల్లో సంభవిస్తున్న మార్పుచేర్పులు, ఇంకా మరెన్నో అంశాలపై దృష్టి సారిస్తారు. దక్షిణాసియా వ్యాప్తంగా వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలు, మనుషుల ఆరోగ్యాలతో ముడిపడిన నీటివనరులకు కీలకంగా మారిన రుతుపవనాలు, వాతావరణ మార్పుల్లో ముందస్తు సూచనలు మరింత మెరుగుపరిచేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడ నున్నాయి. ఆర్కిటిక్ మహాసముద్రంలోని స్వాల్బార్డ్ ద్వీపసమూహంలో యూసీ శాన్‌డియాగోకు చెందిన గ్రాంట్ డీన్, డేల్ స్టోక్స్ శాస్త్రవేత్తలు మంచులోని నీటిబుడగలు కరిగిపోతున్న శబ్దాన్ని పర్యవేక్షించే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా ఎంత వేగంగా హిమనీనదాలు (మంచుపర్వతాలు) కరిగిపోతున్నాయో అంచనా వేయనున్నారు. విస్తృత పరిధిలో వాతావరణ మార్పులపై చేస్తున్న పరిశోధనలో భాగంగా దీనిని చేపట్టారు. క్రీస్తు పూర్వం 1200 ఏళ్ల ప్రాంతంలో తూర్పు మధ్యధరాప్రాంతంలోని నాగరికతల పతనానికి వాతావరణ, పర్యావరణ మార్పు ఏ విధంగా ప్రభావం చూపిందన్న దానిపై మానవ పరిణామశాస్త్రవేత్త టామ్ లెవీ (యూసీ శాన్ డియాగో) బృందం ఇజ్రాయెల్‌లో పరిశోధనలు నిర్వహిస్తుంది. కాలిఫోర్నియాకు ఆవల కొకొనాడో ద్వీపాల్లోని అతి పురాతన కాలం నాటి రెండు ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టడం ద్వారా ఆదిమకాలం నుంచి మానవులు ఒకచోట నుంచి మరోచోటికి ఏ విధంగా మారుతూ స్థిరనివాసాలు ఏర్పరు చుకుంటూ వచ్చారన్న దానిపై, వారు సాగించిన యాత్రా క్రమాన్ని వివరించేందుకు శాన్‌డియాగో స్టేట్ యూని వర్సిటీకి చెందిన టాడ్ బ్రేజ్, మెక్సికో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ పరిశోధకులు ప్రయోగాలు నిర్వహిస్తారు. ఈ శాస్త్రవేత్తల బృందాలు నిర్వహించే పరిశోధనల ఫలితంగా ఎన్నో విశ్వరహస్యాలు వెలుగులోకి వస్తాయని మేథోలోకం ఎదురుచూస్తోంది. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
వాట్సాప్‌లో వాతావరణ సమాచారం
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా రైతులకు వాతావరణ సమాచారం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవ పథకం (జీకేఎంఎస్) ద్వారా ప్రణాళిక రచించింది. దీనిపై వర్సిటీలో బుధవారం వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలపై రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు సామాజిక మా ధ్యమాలను వాడుకోవాలని సమావేశంలో పిలుపునిచ్చినట్లు వ్యవసాయశాఖ కమిషనర్ ఎం.జగన్మోహన్ తెలిపారు. ఇప్పటికే స్వయం సేవా సంఘాల ద్వారా మహిళా రైతులు వాట్సాప్ గ్రూపులుగా సమాచారాన్ని అందిపుచ్చుకుంటున్నారు. దాన్ని మరింత విస్తృతపరిచాలనేది వ్యవసాయ శాఖ ఉద్దేశం. -
ఇప్పట్లో వర్షాల్లేవ్
అనంతపురం అగ్రికల్చర్: రాగల నాలుగు రోజుల్లో వర్షం కురిసే సూచనలు లేవని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్ అధికారి డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 24 డిగ్రీలు నమోదవుతాయన్నారు. గాలిలో తేమ ఉదయం 81 నుంచి 86, మధ్యాహ్నం 69 నుంచి 73 శాతం మధ్య ఉండవచ్చని తెలిపారు. గంటకు 15 నుంచి 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కాగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో తుంపర్లు పడ్డాయి. సెప్టెంబర్‌లో 118.4 మి.మీ గానూ ప్రస్తుతానికి 3.8 మి.మీ నమోదైంది. -
ఎల్‌నినో ఎల్లిపాయె.. లానినా రాకపాయె!
తటస్థ స్థితిలో వాతావరణం ఉపరితల ఆవర్తనం ఏర్పడితేనే రుతుపవనాలకు ఊపు: శాస్త్రవేత్తలు సాక్షి, హైదరాబాద్: తీవ్రమైన ఎండలతో హోరెత్తించిన ఎల్‌నినో కనుమరుగైంది. వాన లతో ముంచెత్తాల్సిన లానినా రాకకు మాత్రం ఇంకాస్త సమయం పడుతుందంటున్నారు వాతావరణ నిపుణులు! ప్రస్తుతం లానినా దశలోకి వెళ్లడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎల్‌నినో కానీ లానినా కానీ లేదని... తటస్థ స్థితి మాత్రమే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే లానినా రావాల్సి ఉన్నా.. తటస్థ స్థితి నుంచి నెల రోజుల్లో లానినా ఏర్పడుతుందని తెలిపింది. రుతుపవనాలపై ఎల్‌నినో, లానినాల ప్రభావం ఉంటుంది. రుతుపవనాలు వచ్చాక అవి వేగంగా ముందుకు కదలడానికి, వర్షాలు కురవడానికి లానినా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లానినా ఏర్పడ్డాక జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. జూలై, ఆగస్టు నాటికి లానినా 26% నుంచి 52%నికి చేరుకోనుంది. ఆగస్టు, సెప్టెంబర్ మధ్యలో లానినా 67%నికి, అక్టోబర్ చివరకు 71%నికి చేరుకోనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆవర్తనం లేకే ఆలస్యం.. నైరుతి రుతుపవనాలు కేరళను తాకి వారం రోజులు కావస్తున్నా ఇంకా తెలంగాణలోకి ప్రవేశించలేదు. ఈ నెల 15 నాటికే రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఏపీని రుతుపవనాలు తాకినా బలహీనపడడంతో అక్కడ కూడా వర్షాలు కురవడం లేదు. కేరళ, కర్ణాటకలోని కోస్తా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో రుతుపవనాల కారణంగా విసృ్తతంగా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు ఊపందుకోలేదు. ఉపరితల ఆవర్తనం ఏర్పడితేనే తప్ప రుతుపవనాలు రావని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెల 17-18 తేదీల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఫలితంగా నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. మరో 4 రోజులు వర్షాలు మరో నాలుగు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. బుధవారం రామగుండంలో 41 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 40.3, హన్మకొండ 39.7, నల్లగొండ 39.4, నిజామాబాద్ 39.3, ఖమ్మం 39.2, భద్రాచలంలో 39.0, హైదరాబాద్ 37.3, మెదక్ 37.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
దోబూచులాడుతున్న నైరుతి..
రాష్ట్రంలోకి రావడానికి మరో నాలుగైదు రోజులు సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు రాష్ట్రంలోకి రావడానికి దోబూచులాడుతున్నాయి. వారం కిందట కేరళను తాకిన ‘నైరుతి’ రాష్ట్రంలోకి రావడానికి ఆలస్యం చేస్తోంది. వాస్తవానికి బుధవారం నాటికల్లా రాష్ట్రంలోకి వస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని తాజాగా ప్రకటించింది. వాతావరణంలో గంట గంటకూ వేగంగా మార్పులు చోటు చేసుకుంటాయని, దాంతో రుతు పవనాలు ఒక్కోసారి వేగంగా ముందుకు కదులుతాయని, ఒక్కోసారి స్థిరంగా ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడితే రుతు పవనాలు వేగంగా ప్రవేశిస్తాయని చెబుతున్నారు. గతేడాది తెలంగాణలోకి రుతు పవనాలు జూన్ 13వ తేదీనే ప్రవేశించాయి. ఈ ఏడాది 15న వస్తాయని అనుకున్నా రాలేదు. ఎంత ఆలస్యమైనా జులై నుంచి మాత్రం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. పినపాక, మణుగూరుల్లో భారీ వర్షం.. రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం జిల్లా పినపాకలో 7, మణుగూరులో 6 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలోనే అనేకచోట్ల, వరంగల్ జిల్లాలో కొన్నిచోట్ల వర్షాలు కురిశాయి. మంగళవారం రామగుండంలో అత్యధికంగా 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 40.8, హన్మకొండ, నిజామాబాద్‌ల్లో 39.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయింది. ఖమ్మం లో 38.6, హైదరాబాద్‌లో 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.