సాక్షి, చెన్నై: బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. నివర్ తుపాన్ రూపంలో కుండపోతగా కురిసిన వర్షాలకు ఇప్పటికే అనేక జిల్లాల్లో జలాశయాలు, చెరువులు పూర్తిగా నిండాయి. ఉబరి నీటి విడుదల సాగుతోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కగా, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
చెన్నై శివార్లలో అనేక చోట్ల నీటిని తొలగించినా, కొన్ని చోట్ల మాత్రం కష్టతరంగా మారింది. దీంతో తాంబరం పరిసరవాసులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి. ఇక్కడికి భారీ మోటార్ల ద్వారా నీటిని తరలించేందుకు చర్యల్ని అధికారులు చేపట్టారు. నివర్ రూపంలో రైతులకు నష్టాలు ఎక్కువే. చేతికి పంట అంది వచ్చే సమయంలో వరదలు ముంచెత్తడంతో కన్నీళ్లు తప్పడం లేదు. దీంతో నష్ట పరిహారం చెల్లింపునకు తగ్గ చర్యల్ని వేగవంతం చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పనిలో పడ్డాయి. ఇందుకు తగ్గ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టే పనిలో పడింది. ప్రస్తుతం నీట మునిగిన ప్రాంతాలలో భవిష్యత్తులో మరో ముప్పు ఎదురుకాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని శనివారం ఆయా జిల్లాల కలెక్టర్లను సీఎం పళనిస్వామి ఆదేశించారు.
ప్రధానంగా తాంబరం పరిసరాలపై తొలుత దృష్టి పెట్టనున్నారు. నివర్ ప్రభావం కారణంగా మరణించిన కుటుంబాలకు రూ. 12 లక్షలు సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో, సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయో అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. వరద బాధిత ప్రాంతాల్లో పోలీసుల పాత్రపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నైలో కొన్ని ప్రాంతాల్లో వెయ్యి మందిని తమ భుజాలపై వేసుకుని మరీ సురక్షిత ప్రాంతాలకు పోలీసులు తరలించడం అభినందనీయం. చదవండి: (బుల్లెట్‌కి బలయ్యే అవకాశమివ్వండి)
సాగరంలో ద్రోణి..
నివర్ సహాయక చర్యలు సాగుతున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం శనివారం మధ్యాహ్నం బయలుదేరింది. దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో నెలకొన్న ఈ ద్రోణి వాయుగుండంగా మారి, తుపాన్‌గా అవతరించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ద్రోణి పశ్చిమ దిశలో పయనిస్తుండడంతో రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లో ఆదివారం నుంచి వర్షాలు పడనున్నాయి. ఇది తుపాన్‌గా మారనున్న దృష్ట్యా, దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ద్రోణి తుపాన్‌గా మారినానంతరం డెల్టా జిల్లాల వైపు లేదా, దక్షిణ తమిళనాడు వైపు దూసుకొచ్చేనా అన్నది వేచి చూడాల్సి ఉంది.
ప్రస్తుతానికి దక్షిణ తమిళనాడు, సముద్రతీర జిల్లాల్లో ఆదివారం నుంచి తేలిక పాటి వర్షం మొదలై, క్రమంగా పెరుగుతోంది. డిసెంబర్ ఒకటి, రెండు, మూడు తేదీల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం హెచ్చరికతో దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు అధికారయంత్రాంగం సిద్ధమైంది. జాలర్లు వేటకు దూరంగా ఉండాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. సముద్రంలో గాలి వేగం గంటకు 55 కి.మీ వరకు ఉండవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో మేట్టుపట్టిలో 9 సె.మీ, అవినాశిలో 8 సె.మీ, చోళవందాన్, వాడి పట్టిలో 7 సె.మీ మేరకు వర్షం పడింది. బురేవి తర్వాత మరో తుపాన్‌కు అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. చదవండి: (మానవత్వంతో ఆదుకోండి)
రూ. వంద కోట్లు ఇవ్వండి..
పుదుచ్చేరి, రాష్ట్రంలోని నివర్ బాధిత ప్రాంతాల్లో ఏ మేరకు నష్టం జరిగిందో పరిశీలించి కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు ఢిల్లీ నుంచి సోమ వారం ప్రత్యేక బృందం చెన్నైకు రానుంది. దీంతో నష్టం నివేదిక తయారీకి అధికారులు పరుగులు తీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నివర్ రూపంలో పుదుచ్చేరికి రూ. 400 కోట్లు నష్టం జరిగినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణస్వామి శనివారం ప్రకటించారు. అధికారులతో సమావేశానంతరం నష్టం తీవ్రతను పరిగణించి, సహాయక చర్యల కోసం రూ. 100 కోట్లు తక్షణం కేటాయించాలని ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేస్తూ ఆయన లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment