ప్రత్యేక యాప్‌లు రూపొందించిన కేంద్ర ప్రభుత్వం
రాయవరం: ఈ మధ్యకాలంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా ఒకరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరోరోజు ఈదురు గాలులతో కూడిన అకాలవర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్నదాతలు అయోమయానికి గురయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌లు రూపొందించింది. డామిని, మేఘ్‌దూత్, రెయిన్ అలారం.. యాప్‌లు ఆవిష్కరించింది. వీటిద్వారా వాతావరణ పరిస్థితులను అంచనా వేయవచ్చని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రధానంగా వర్షాకాలం మొదలుకానున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతల వివరాలు, వర్షాల రాక సమాచారాన్ని కూడా యాప్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఉరుములు, మెరుపుల నుంచి రక్షించుకోవడం, వర్షం పరిస్థితులను అంచనా వేయడం సులభమవుతంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ శాఖ రూపొందించిన ఈ యాప్‌లు రైతులకు సాగులో తోడ్పడనున్నాయి. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా వీటిని డౌన్లోడ్ చేసుకుంటే చాలు. వాతావరణ సమాచారం మొత్తం మన అరచేతిలో ఉన్నట్టే.
‘డామిని’లో ఉరుములు, మెరుపుల హెచ్చరిక
ఒక్కోసారి వాతావరణంలో అప్పటికప్పుడు మార్పులు సంభవించి ఉరుములు, మెరుపులు వస్తాయి. పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ఇలాంటి హెచ్చరికలను తెలిపేందుకు డామిని యాప్ ప్రయోజనకరంగా ఉంటుంది. మెరుపు ఎప్పుడు వస్తుంది? మెరిసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అప్రమత్తంగా ఉండాల్సిన తీరును ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. లొకేషన్ ఆధారంగా మెరుపులు వచ్చే అవకాశం ఉందో? లేదో? కూడా తెలుస్తుంది. పిడుగు పడినప్పుడు తోటివారికి అందించాల్సిన వైద్యసహాయం వంటి ప్రాథమిక సమాచారాన్ని తెలియజేస్తుంది. రైతులకు, రైతుకూలీలకు బయటి ప్రాంతాల్లో పనిచేసేవారికి ఈ యాప్ ఎంతో తోడ్పడుతుంది.
వాతావరణ సమగ్ర వివరాలతో ‘మేఘదూత్’
మేఘదూత్ యాప్‌లో వాతావరణానికి సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది. వర్షపాతం వివరాలు, గాలిలో తేమ, గాలి వేగం, గాలి వీచే దిశ, నమోదైన ఉష్ణోగ్రతలు, రానున్న 24 గంటల్లో వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుంది. గడిచిన వారం రోజులు, రానున్న మరో నాలుగు రోజుల వాతావరణ వివరాలు కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
వర్ష సూచనకు ‘రెయిన్ అలారం’
వర్షం ఎప్పుడు పడుతుంది. వర్షపాతం వివరాలు, రానున్న కాలంలో వర్ష సూచనలను రెయిన్ అలారం యాప్ తెలియజేస్తుంది. మనం నివసిస్తున్న ప్రాంతంలో వాతావరణ, వర్ష సూచనలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయో తెలియజేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment