
వాట్సాప్‌లో వాతావరణ సమాచారం
వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా రైతులకు వాతావరణ సమాచారం అందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా రైతులకు వాతావరణ సమాచారం అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవ పథకం (జీకేఎంఎస్) ద్వారా ప్రణాళిక రచించింది.
దీనిపై వర్సిటీలో బుధవారం వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలపై రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు సామాజిక మా ధ్యమాలను వాడుకోవాలని సమావేశంలో పిలుపునిచ్చినట్లు వ్యవసాయశాఖ కమిషనర్ ఎం.జగన్‌మోహన్ తెలిపారు. ఇప్పటికే స్వయం సేవా సంఘాల ద్వారా మహిళా రైతులు వాట్సాప్ గ్రూపులుగా సమాచారాన్ని అందిపుచ్చుకుంటున్నారు. దాన్ని మరింత విస్తృతపరిచాలనేది వ్యవసాయ శాఖ ఉద్దేశం.