= చిరు ధాన్యాలతో ఆహార భద్రతకు భరోసా
= పోషక విలువలతో కూడిన ఆహారం
= పట్టణాల్లోనూ పెరుగుతున్న వినియోగం
అనకాపల్లి, చింతపల్లి, న్యూస్‌లైన్: పోషక విలువలతో కూ డిన తృణ, చిరు ధాన్యాలపై నేడు విస్తృత ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కలుషిత వాతావరణంలో అందరి చూపు ఆరోగ్యంపై పడింది. రుచికరమైన తిండికి ప్రాధాన్యమిస్తూనే పోషక విలువల కోసం ఎదురుచూస్తున్నారు. మన దేశంలో అధికంగా వరి, గోధుములనే ఆహారంగా స్వీకరి స్తున్నా.. ఆహార భద్రతకు సవాళ్లు ఎదురవుతున్న తరుణం లో చిరు ధాన్యాలైన రాగి, కొర్ర, సామా పంటలపై దృష్టి సారిస్తున్నారు.
దీనిలో అగ్ర స్థానం రాగి (చోడి) పంటదే. ఏజెన్సీలో ఎక్కువగా సాగు చేసే చోడి పంటను ప్రోత్సహించేందుకు ఇప్పటికే ఇన్‌సింప్, ఆత్మ, ట్రైబల్ సబ్‌ప్లాన్, పరిశోధన కేంద్రాలు పలు పథకాలను అమలు చేస్తున్నా యి. దశాబ్ద కాలం క్రితం వరకు ఆశాజనకంగా ఉన్న చిరుధాన్యల విస్తీర్ణం కొన్నాళ్లు తగ్గి మళ్లీ ఊపందుకుంటుంది. చిరు ధాన్యాలైన ఊద, వరిగా, అరికా పంటలను దాదాపు గా సాగు చేయడం మానేశారు. ఉన్నా ఆ పంటలు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లోనే. సామా పంట ఏజెన్సీకే పరిమితమైంది.
సామాతో తయారు చేసిన అంబలి, అన్నాలను ఇప్పటికీ ఏజెన్సీవాసులు ఇష్టంగా భుజిస్తారు. కొర్రలతో చేసిన జావ గిరిజనులకు బహు ప్రీతి. ఈ రెండు పంటల లోను పోషక విలువలు అద్భుతంగా ఉన్నా మైదాన ప్రాం తవాసులు సాగు చేయడం లేదు. చిరు ధాన్యాలలో అత్యం త ప్రాధాన్యం సంతరించుకున్న రాగి (చోడి)తో చేసిన అంబలిని ఇప్పుడు అన్ని ప్రాంతాల వారు ఉదయాన్నే స్వీకరిస్తున్నారు. రాగితో చేసిన బిస్కెట్లను మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్య పరిరక్షణ కోసం కొనుగోలు చేస్తున్నారు.
ఎటువంటి వాతావరణంలోనైనా...
చిరు ధాన్యాలలో అధికంగా వినియోగించే రాగిని ఎటువం టి వాతావరణంలోనైనా సాగు చేసుకోవచ్చు. పంట కాలం కనిష్టంగా 85 రోజులు నుంచి గరిష్టంగా 120 రోజుల వర కు ఉంటుంది. మన జిల్లాలో ఖరీఫ్‌లో ఏజెన్సీలోను, రబీలో అన్ని ప్రాంతాల్లోను రెండవ పంటగా సాగు చేస్తున్నారు. వేసవి కాలం సైతం సాగుకు అనుకూలం. ఇటీవల కాలం లో మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండడం సానుకూలమైన పరిణామం.
పెరిగిన విస్తీర్ణం
దేశంలో చిరుధాన్యాల విస్తీర్ణం నాలుగు లక్షల హెక్టార్లు కాగా ఒక్క మన రాష్ట్రంలోనే లక్ష హెక్టార్లు. దీనిలో అగ్ర తాంబూలం చోడి(60 వేల హెక్టార్లు)కి దక్కుతుంది. చిరుధాన్యాలను అధికంగా ఉత్తర కోస్తాలోనే సాగు చేస్తారు. కొర్రను నంద్యాల పరిసరాలలో అధికంగా పండిస్తారు. 2001-02 సీజన్‌లో విశాఖ జిల్లాలో రాగి 34 వేల హెక్టారల్లోను, సామా 22 వేల హెక్టార్లల్లోను సాగైంది. దీనికితోడు కొర్రలు, ఊద, వరిగ, అరిక పంటల విస్తీర్ణం కూడా తోడైంది. దశలవారీగా రాగి విస్తీర్ణం పడిపోయింది. 2008-09 సంవత్సరానికి 27 వేల హెక్టార్లకు రాగి విస్తీర్ణం పరిమితమైంది. 2012లో రాగి మరీ దయనీయంగా 18 వేల 458 హెక్టార్లకు పడిపోగా తాజాగా ముగిసిన ఖరీఫ్ సీజన్‌లో 23 వేల 268 హెక్టార్లల్లో రాగి పంట సాగైంది. మరో 11 వేల 312 హెక్టార్లల్లో ఇతర చిరుధాన్యాలు సాగవ్వగా జొన్న 441 హెక్టార్లలో, సజ్జ 3 వేల 37 హెక్టార్లకు చేరింది. అయితే చిరుధాన్యాల పంటల అభివృద్ధికి పలు పథకాలు తోడవ్వడంతోపాటు మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండడంతో చిరుధాన్యాల విస్తీర్ణం మరింత పెరగనుందని వ్యవసాయాధికారులు ఆశిస్తున్నారు.
చోడిలోని రకాలు...
చోడిలో ప్రస్తుతం శ్రీ చైతన్య (కాల పరిమితి 115 -120 రోజులు) రకం అత్యంత ప్రాచుర్యంలో ఉంది. ఇదే కాకుం డా గోదావరి, రత్నగిరి, భారతి, చంపావతి, తెల్లరాగులను రైతులు వినియోగిస్తున్నారు. అయితే జిల్లాలో పంటలను వేగంగా పూర్తి చేయాలని భావించే వారు బురదచోడిని ఆశ్రయిస్తున్నారు. కానీ ఇది అధికంగా పురుగులు, తెగుళ్లు దాడికి లోనవుతున్నందున రైతులు నష్టపోతున్నారు. 90 రోజులు కాలపరిమితి ఉండే బురదచోడి పంటల మధ్య విరామ సమయంలో రైతులు వినియోగిస్తున్నారు. తెల్లరాగి ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ దీనికి అధికంగా నైట్రోజన్ అవసరం ఉంటుంది.
ఆరోగ్య ప్రదాయిని
ఇనుము, కాలుష్యం వంటి ఖనిజ లవణాలు చిరు ధాన్యాలలో లభిస్తాయి. పీచు పదార్ధం కావడంతో సులభంగా జీర్ణమవుతుంది. దీంతో ఆధునిక కాలంలో ప్రతి వైద్యుడు చిరు ధా న్యాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. రాగులు, కొర్రలు, సామలు, సజ్జల వంటి చిరు ధాన్యాల్లో ఉండే ఇనుము రక్త సరఫరాను మెరుగుపర్చి శరీరంలో ఆక్సిజన్ సరఫరాకు ఉపయోగపడుతుంది.
ఈ ధాన్యాల్లో లభించే మెగ్నీషియం ఆస్తమా, లోబీపీ, మైగ్రేన్, గుం డె జబ్బులు రాకుండా నివారిస్తుంది. శరీరంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. రాజ్‌మా చిక్కుళ్లలో ఉండే మాంసకృత్తులు, అమైనోఆమ్లాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. మినుముల్లో ఉండే విటమిన్-ఎ, అమైనో ఆమ్లాలు చర్మ సౌం దర్యానికి, అంధత్వ నివారణకు, స్త్రీలలో గర్భం నిలవడానికి దోహదపడుతుంది. రుతుక్రమం సమయంలో కడుపు, నడుం నొప్పులను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
కందిపప్పులో ఉండే పోలిక్ యాసిడ్ స్త్రీలలో రక్తహీనత తగ్గిస్తుంది. మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్స్ మెదడును చురుకుగా పనిచేసేలా చేయడంతోపాటు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తా యి. పెసరపప్పులో ఉండే ఇనుప ఖనిజం స్త్రీలు, పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. మొలకెత్తిన పెసలను ఉపయోగించడం వలన త్వరగా సన్నబడతారు. శనగ పప్పులో ఉండే పీచు పదార్థం జీర్ణవ్యవస్థలో ఉండే చిన్నచిన్న సమస్యలు తొలగిస్తుంది.
పోషక విలువలతో చక్కని ఆరోగ్యం
తృణ చిరుధాన్యాలతో ఎన్నో రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. చిరుధాన్యాలు ప్రతి రోజు ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మం చిది. రాజ్‌మా, కందిపప్పు, సోయాబీన్స్, పెసలులో ఉండే పోషక పదార్ధాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వివిధ రకాల వ్యాధులకు ఈ ధాన్యాలు దివ్య ఔషధం వంటివి.
-సునీత, గృహ విజ్ఞాన శాస్త్రవేత్త,
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, చింతపల్లి
చిగురంత ఆశ
Published Sat, Dec 21 2013 2:12 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM