కాలుష్య భూతాలు మన నగరాలు | Sekhar Gupta Article On Polluted Cities In India | Sakshi
Sakshi News home page

కాలుష్య భూతాలు మన నగరాలు

Published Sat, Jul 20 2019 1:01 AM | Last Updated on Sat, Jul 20 2019 1:02 AM

Sekhar Gupta Article On Polluted Cities In India - Sakshi

ప్రపంచంలోని 20 కాలుష్యకారక నగరాల్లో 15 వరకు భారత్‌లోనే ఉంటున్నాయని అంతర్జాతీయ సంస్థల నివేదికలు చెబుతున్నాయి. అటు నగరాలూ ఇటు పల్లెలు కూడా మౌలిక వసతులు అనే భావనకే దూరంగా ఉంటున్న దుస్థితే ఈ విధ్వంసానికి కారణం. ప్రణాళికాబద్ధ నిర్మాణాలకు ఎంతో దూరంలో ఉన్న భారతీయ నగరాలు ప్రజా జీవన నాణ్యతకు ఆమడదూరంలో మనుగడ సాగిస్తున్నాయి. నగరాలు చెడుకు, పల్లెలు మంచితనానికీ ప్రతీకలు అనే పురాతన విశ్వాసం పాలకుల్లో, ప్రణాళికా కర్తల్లో, ప్రజల్లో కూడా బలంగా సాగుతున్నంత కాలం భారత్‌లో నగరాలూ, పల్లెలు కూడా నాణ్యతకు దూరంగానే ఉంటాయి. ఇలాగా సాగితే నగరకాలుష్యంలో ఎప్పటికీ మనమే నంబర్‌ వన్‌గా ఉండటం ఖాయం.

మన నగరాలు అక్షరాలా మనుషుల ప్రాణాలను తోడేస్తున్నాయి. ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్యకారక నగరాల్లో 15వరకు భారత్‌లోనే ఉన్నాయని అంతర్జాతీయ సంస్థలు మనకు గుర్తు చేస్తున్నాయి. మనం ఎంత వేగంగా నగరీకరణ పాలబడుతూ మన పరిస్థితిని ఇంకా దుర్భరం చేసుకుంటున్నామంటే ప్రపంచంలోని 30 అత్యంత కాలుష్య కారకనగరాల్లో 25వరకు భారత్‌లోనే ఉన్నాయనే పేరు తెచ్చుకోవడానికి కూడా ఎంతో కాలం పట్టదు. మన మహానగరాల్లో ట్రాఫిక్‌ నత్తనడక నడుస్తోంది. ముంబైలో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగం మాత్రమే సాధ్యం. ఇక బెంగళూరు అయితే మరీ దుర్భరం. హైదరాబాద్‌ కాస్త ఉత్తమంగా ఉండవచ్చు. తన ఆర్థిక పతనం కారణంగా కోల్‌కత్తా నగర కాలుష్యం కాస్త మెరుగ్గా ఉండవచ్చు. ముంబై, బెంగళూరుతో పోలిస్తే కాలుష్యం విషయంలో ఢిల్లీ పోటీపడలేకపోవచ్చు కానీ దాని పయనం కూడా అదే దారిలో నడుస్తోంది. ప్రత్యేకించి దాని జంటనగరాలైన గుర్గావ్, నోయిడాల్లో ప్రయాణిస్తే మీకు సులభంగా అర్థమవుతుంది. 

మన దేశ అతిపెద్ద మహానగరాల కేసి చూస్తే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లలో 9 కోట్లమంది జీవిస్తున్నారు. ముంబైలో 60 నుంచి 80 శాతం మంది అర్ధ–మురికివాడల్లో నివసిస్తున్నారు. మనకంటే న్యూజిలాండ్‌ వంటి చిన్న దేశం 20 రెట్లు మిన్నగా అద్భుత జాతిగా పేరొందింది. మన వాణిజ్య రాజధానిలో న్యూజిలాండ్‌ కంటే రెండున్నర రెట్లమంది జనం అమానుషమైన జీవన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. భారత్‌లోని ఏ ఇతర నగరంలోనూ చివరకు సర్కారీ ఊహాస్వర్గమైన చండీగఢ్‌ కూడా మురికివాడలు లేకుండా మనటం లేదు. ముంబైలో మురికివాడగా పిలుస్తుంటే ఢిల్లీలో అనధికారికమైన లేక అక్రమ కాలనీగా పిలుస్తున్నారు.

ఢిల్లీ కాలనీని చూస్తే జీవితం ముంబై అంత అధోగతిలో కనిపించకపోవచ్చు కానీ ముంబైకంటే ఉత్తమంగా మాత్రం లేదు. కేన్‌ విలియమ్స్‌ వంటి అత్యుత్తమ క్రికెట్‌ కేప్టెన్‌ని కన్న న్యూజిలాండ్‌ కంటే మన జాతీయ రాజధానిలో రెండు రెట్లు అధిక జనాభా ఉంటున్నారు. స్పష్టంగా చెప్పాలంటే వీరిది అక్రమ, అనధికారిక జీవితమే. మన ప్రజా ఆస్పత్రులు, వైద్య సంరక్షణ వ్యవస్థలు, విద్య, కళాశాలలు మొత్తంగా కునారిల్లిపోయి ఉన్నాయి. ఎక్కడకు వెళ్లి చూసినా పోటెత్తుతున్న జనమే. ఇక్కడ చాలామంది జీవితం సబ్‌ సహారా దేశాల కంటే నాణ్యత కలిగి మాత్రం లేదు. మన నగరాలు ఇంత పాడైపోతూంటే, కోట్లాదిమంది ప్రజలు గ్రామాలు వదిలి ఇప్పటికీ నగరాలకు ఎందుకు పరిగెత్తి వస్తున్నారు? ఎందుకంటే మన గ్రామాలు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. గాలి నాణ్యతతో సహా జీవితానికి సంబంధించిన ప్రతి పరామితిలోనూ అవి మన నగరాల కంటే ఘోరంగా మారిపోతున్నాయి. 

ప్రపంచంలోనే భారతదేశం అయిదో లేక మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చు కానీ మన నగరాల పట్ల మన ఆలోచనా విధానం మాత్రం మనం గొప్పగా పెంచిపోషిస్తున్న గాంధియన్‌ కపటత్వంతో కొట్టుమిట్టాడుతోంది. నగరాలు చెడుకు, గ్రామాలు మంచితనానికీ ప్రతీక అనేది మన పురాతన నమ్మిక. భారతదేశం గ్రామాల్లోనే జీవి స్తోందని చెప్పిన గాంధీకి సమాధానంగా అంబేడ్కర్‌ వేసిన ప్రశ్నను చూడాలి. మన గ్రామాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలా అన్నారాయన. కేంద్ర మంత్రివర్గంలో గ్రామీణ అభివృద్ధి శాఖ ఉండటం అనవాయితీగా ఉంటోంది. కాని స్వాతంత్య్రం వచ్చాక దాదాపు అయిదు దశాబ్దాల వరకు కేంద్రంలో పట్టణాభివృద్దికి పూర్తి మంత్రిత్వ శాఖ లేకపోయింది. కారణం.. భారతదేశం గ్రామాల్లోనే జీవిస్తోంది అనే కాల్పనికభావనకు పాలకులు ప్రభావితులు కావడంతో భారతీయ నగరాలు, పట్టణాల అభివృద్ధికి వాటిలోని పేదల అభ్యున్నతికి తీవ్ర హాని జరిగింది. 

రాష్ట్రపతి భవన్‌లో డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ఉన్న కాలంలో కూడా ఒకసారి అయన ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌కు సభికులు హర్షధ్వానాలు చేశారు. ఆయన కూడా ఆ సందర్బంలో పురా అనే పదాన్ని ఉపయోగించారు. ఇంగ్లీషులో దీన్ని ప్రొవైడింగ్‌ అర్బన్‌ ఆమెనిటీస్‌ ఇన్‌ రూరల్‌ ఏరియాస్‌ అంటారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల్లోని సౌకర్యాలను అందించడమని దీనర్థం. మొట్టమొదట,  భారతీయ గ్రామం అని మనం చెబుతున్నది పట్టణ స్థాయి మౌలిక వ్యవస్థల నిర్మాణానికి తగిన ఆర్థిక స్థాయిని కలిగి లేదు. ప్రత్యేకించి నీరు, విద్యుత్తు, లేదా మరే ఇతర సౌకర్యాలనైనా కల్పిస్తున్నప్పుడు గ్రామీణులనుంచి రుసుము వసూలు చేయడం భారతీయ రాజకీయ వర్గం ఇష్టపడదు.

పైగా మన నగరాలు, పట్టణాలు ఇంత వినాశనకరంగా ఉంటున్నప్పుడు నగర సదుపాయాలు అనే పదాన్ని కలామ్‌ ఏ అర్థంతో ఉపయోగించినట్లు? నగరాలు, గ్రామాలపట్ల మన ఆలోచనా విధానం ఎంతగా దెబ్బతినిపోయిందంటే దానివల్ల దారుణ ఫలితాలు ఎదురయ్యాయి. నగరాలు చెడుకు, గ్రామాలు మంచికి ప్రతీకలని మనం ఆలోచిస్తుండటంతో భారతీయ నగరాలు ఎన్నడు కూడా ప్రణాళికాబద్ధ నిర్మాణానికి నోచుకోలేదు. నిజానికి అవి తమకు తాముగా స్వయంపాలిత మురికివాడలు, వ్యక్తిగత భవననిర్మాతలు సృష్టించిన భవన ద్వీపాలుగా వృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ నగరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, మాఫియా మాత్రమే మొత్తం వ్యవస్ధను నడిపిస్తున్నాయి.

కాబట్టే మన నగరాలు మౌలిక వసతుల కల్పన లేకుండానే పెరుగుతూ వచ్చాయి. దాదాపు మూడు తరాల తర్వాత మాత్రమే మన నగరాలకు మౌలిక వసతులు వచ్చాయి. అప్పటికే వాటిలో జీవిస్తున్న కోట్లాది, లక్షలాది ప్రజలకు నీరు, విద్యుత్, రోడ్లు, రైళ్లు, మెట్రోలు అవసరమయ్యాయి. దాంతో నగరాల కింద తవ్వాల్సి వచ్చింది. నగరంపైన నిర్మాణాలు చేయాల్సి వచ్చింది. ఇవి చాలక సముద్రాలపైన వంతెనలు కూడా కట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ మన నగరాల్లోని లక్షలాది కార్లకు, టూ వీలర్లకు సరైన పార్కింగ్‌ స్థలం నేటికీ ఉండటం లేదు. రహదారుల పక్కన, బహిరంగ స్థలాల్లో మాత్రమే వాటిని పార్క్‌ చేయాల్సి వస్తోంది.

దీనివల్ల ఒక్కోసారి మొత్తం రోడ్డు జామ్‌ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల పేదలు మాత్రమే కాదు.. సంపన్నులు కూడా బాధితులే అవుతున్నారు. ఉదాహరణకు ముంబైలోని వర్లి–పారెల్‌ అభివృద్ధిలోని తమాషాను ఒకసారి చూడండి. ఈ ప్రాంతంలో గత రెండు దశాబ్దాలుగా ఫ్యాన్సీ అపార్ట్‌మెంట్లు, బిజినెస్‌ టవర్ల నిర్మాణం జరి గింది. ఈ ప్రాంతంలోని పాత టెక్స్‌టైల్‌ మిల్‌ భూముల్లో వీటిని నిర్మిం చారు. కానీ ఇక్కడ సైతం ఒక పద్దతిలేకుండా నీటి వసతి నుంచి పార్కింగ్, సెక్యూరిటీ దాకా ఈ నిర్మాణాలన్నీ తమ తమ సొంత మౌలిక వసతులనే నిర్మిస్తూ వచ్చాయి. 

ఈ కాసిన్ని సౌకర్యాలతో కూడిన నిర్మాణాల మధ్యనే అత్యంత నిరుపేదలతో  కూడిన ప్రజారాసులు ఇరుకు జీవితం గడుపుతుంటారు. దీంతో ఆర్థిక స్థితి రీత్యా మాత్రమే కాకుండా, నగరవాసులందరికీ సమాన స్థాయి కల్పించే తరహా అభివృద్ధికి బదులుగా అత్యంత అసమాన జీవిత స్థాయితో కూడిన ఇరుగుపొరుగు జనాలతో ఇలాంటి పట్టణ ప్రాంతాలు నిండిపోయాయి. మరోవైపున అత్యంత విలాసంగా, ఆకర్షణీయంగా కనిపించే గుర్గావ్‌ భవంతుల కేసి చూడండి. ఇవి భారీ సెప్టిక్‌ ట్యాంకులు, డీజిల్‌ రిజర్వాయర్లమీద తేలియాడుతున్నాయి. ఎందుకంటే భారతదేశంలోనే సంస్కరణల తర్వాత అత్యంత ఆకర్షణీయమైన అభివృద్ధిని కనబరుస్తున్న ఈ ప్రాంతంలోనూ ఒక క్రమపద్ధతితో కూడిన మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్మించుకోవాలనే ఆలోచనే ఎవరికీ లేకుండా పోయింది.

ఇక రెండోది ఏమిటంటే ప్రభుత్వ విద్యుత్‌ వ్యవస్థను ఎవరూ ఇక్కడ విశ్వసించలేదు. అందుకే ఎక్కడ చూసినా డీజెల్‌ నిల్వలు కనబడుతుంటాయి. ఇదెంత వింతగొలుపుతుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఈ వారం జాతి హితం లక్ష్యం ముంబై ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కోస్టల్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ ను హైకోర్టు అడ్డుకోవడంపై స్పందన. ప్రధాన న్యాయమూర్తి ప్రదీప్‌ నంద్రజోగ్, న్యాయమూర్తి ఎన్‌.ఎం. జందార్‌ ఇచ్చిన 219పేజీల నివేదిక ఈ మధ్యకాలంలో నేను చదివిన అద్భుతమైన తీర్పుల్లో ఒకటి. చట్టానికి లోబడి పర్యావరణానికీ, అభివృద్ధికీ మద్య వివాదం తలెత్తకుండా న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారు.

వాళ్లు కేవలం ఆ ప్రాజెక్ట్‌ సాధ్యాసాధ్యాలు, పర్యావరణ హాని అంశాలపై కాకుండా సాంకేతిక అంశాలను దృష్టిలో పెట్టుకుని తిరస్కరించారు. నగరాభివృద్ధి ప్రాజెక్ట్‌ కోణంలో మరిన్ని అనుమతులు తీసుకుని ప్రభుత్వం మళ్లీ ముందుకు రావచ్చు. ఈ విషయంలో ఆందోళనకారులపై ఆగ్రహిం చాల్సిన అవసరం లేదు. వాళ్లదే విజయం. తీర్పును క్షుణ్ణంగా చదివితే మీకు బాధ కలుగవచ్చు. అది చట్టంలో లోపం అని నేను చెప్పడం లేదు. ఈ ప్రాజెక్టుకు వన్యప్రాణి సంరక్షణకు సంబంధించిన అనుమతి కూడా అవసరం. ఎందుకంటే, సముద్రం తీరం వెంబడి వున్న అనేక పగడాలు అదృశ్యమైపోతాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయాల్సిందే. ఇంకో ఏడాది గడిస్తే దీని ఖరీదు వేలకోట్లు పెరుగుతుంది. బస్తీల్లో, మురికివాడల్లో నివసించేవారు దీని కోసం ఎదురు చూస్తున్నారు. ‘నాలుగు అడుగుల ఎత్తు ఉండే పగడాలు 2 కోట్ల మంది మానవుల కంటే ఉత్తమమైనవి’ అనే రకం భ్రమలు మనలో పోనంతవరకు మన నగరాలు ఇలాగే కునారిల్లుతూ ఉంటాయి. వాటికంటే దుర్భర స్థితిలో ఉంటున్న మన గ్రామాలనుంచి లక్షలాది జనం నిత్యం అదే నగరాలు, పట్టణాలకు వలస వస్తూనే ఉంటారు.


శేఖర్‌ గుప్తా 
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement