జపాన్‌ను ఒక ఆర్థిక అద్భుతంగా కీర్తిస్తుంటారు. రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబుల దాడికి గురైనా అనూహ్యంగా పుంజుకున్న దేశంగా కొనియాడతారు. నిస్సారమైన భూముల నుంచి ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని ప్రశంసిస్తారు.
ఇటీవలి వరకు దాని కీర్తి అలానే కొనసాగుతూ వచ్చింది. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలో ఉన్న జపాన్ తాజా గణాంకాల ప్రకారం నాలుగోస్థానానికి చేరినట్లు తెలిసింది. ఆ దేశ జీడీపీ 2023లో జర్మనీ కంటే తక్కువగా ఉంది. గతేడాది జపాన్ నామమాత్రపు జీడీపీ 4.2 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. అదే సమయంలో జర్మనీది 4.4 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. దాంతో జపాన్ ఒక స్థానం కిందకు వెళ్లినట్లైంది.
జపాన్ వాస్తవిక జీడీపీ వృద్ధి అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 0.4 శాతం క్షీణించింది. నామమాత్రపు జీడీపీని ప్రస్తుత ధరల వద్ద, వాస్తవిక జీడీపీని స్థిర ధరల ఆధారంగా లెక్కిస్తారు. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగడం, పిల్లల సంఖ్య తగ్గడం వల్ల జపాన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పడిపోతుందని విశ్లేషకులు తెలిపారు. 2010 వరకు జపాన్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. కానీ దానితర్వాత తన స్థానాన్ని కోల్పోయింది. దాంతో చైనా ఆ స్థానాన్ని భర్తీ చేసింది.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో జపాన్, జర్మనీలు గణనీయమైన ఉత్పాదకత కోసం పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకున్నాయి. కానీ జపాన్‌తో పోలిస్తే జర్మనీ బలమైన ఆర్థిక పునాదులు నిర్మించుకుంది. ద్రవ్యోల్బణం కారణంగా జపాన్ కరెన్సీ రోజురోజు క్షీణిస్తోంది. వాహన తయారీ రంగంలో బలంగా ఉన్న జపాన్ విద్యుత్తు వాహనాలు, కొత్తగా వివిధ దేశాల్లో పుట్టుకొస్తున్న తయారీ సంస్థలతో సవాళ్లు ఎదుర్కొంటుందని నిపుణులు చెబుతున్నారు.
జపాన్ దేశంలో శ్రామికశక్తి కొరత అధికంగా ఉందని చెబుతున్నారు. దాన్ని అధిగమించడానికి వలస విధానం ఒక మార్గమని విశ్లేషకులు సూచిస్తున్నారు. కానీ తమ దేశం మాత్రం విదేశీ కార్మికులను అనుమతించడం లేదంటున్నారు. దీంతో వైవిధ్యంలేని, వివక్షాపూరిత దేశంగా విమర్శలు ఎదుర్కొంటోందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: డ్రాగన్‌మార్ట్‌కు పోటీగా ‘భారత్‌మార్ట్’.. ఎక్కడో తెలుసా..
కొంతకాలంగా జపాన్ జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొన్నేళ్లుగా క్రమంగా తగ్గుతూ వస్తోన్న దేశ జనాభా.. గతేడాది రికార్డు స్థాయిలో క్షీణించింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గతేడాది జననాల సంఖ్య దాదాపు ఐదు శాతం క్షీణించిందని ప్రభుత్వం పేర్కొంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే పరిస్థితేనని పేర్కొన్న జపాన్ ప్రభుత్వం.. వివాహాలు, జననాలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment