ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడిన పాకిస్తాన్ నెమ్మదిగా కోలుకుంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అక్కడి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మెరుగైన భద్రత, హోలోగ్రామ్ ఫీచర్‌ల కోసం ఇప్పటికే ఉన్న అన్ని కరెన్సీ నోట్లను రీడిజైన్ చేస్తూనే పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీ నోటుతో ప్రయోగాలు చేస్తుంది.
ఇస్లామాబాద్‌లోని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెనేట్ కమిటీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ గవర్నర్ జమీల్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రస్తుతమున్న అన్ని పేపర్ కరెన్సీ నోట్లను కొత్త భద్రతా ఫీచర్లతో రీడిజైన్ చేయనున్నట్లు తెలిపారు. రూ.10, 50, 100, 500, 1000, 5000 డినామినేషన్లలో కొత్తగా రీడిజైన్ చేసిన నోట్లను డిసెంబర్‌లో విడుదల చేస్తామని ఆయన అన్నారు.
కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చిన తరువాత, పాత నోట్లు ఐదు సంవత్సరాలు చెలామణిలో ఉంటాయని చెబుతున్నారు. మొదట్లో ప్రజల కోసం ఒక డినామినేషన్ పాలిమర్ ప్లాస్టిక్ నోట్‌ను విడుదల చేస్తామని.. ఆ తరువాత వచ్చే స్పందనను బట్టి ఇతర డినామినేషన్లలో ప్లాస్టిక్ కరెన్సీని అందిస్తామని స్టేట్ బ్యాంక్ గవర్నర్ సెనేట్ కమిటీ సభ్యులకు తెలియజేశారు.
పాలిమర్ ప్లాస్టిక్ నోట్లు కొత్త కాదు
పాలిమర్ ప్లాస్టిక్ నోట్లను ఇప్పటికే 40 దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఈ నోట్లను డూప్లికేట్ చేయడం అసాధ్యం. నిజానికి పాలిమర్ ప్లాస్టిక్ నోట్లను 1998లో ఆస్ట్రేలియా మొదటిసారి ప్రవేశపెట్టింది. ఆ తరువాత ఇతర దేశాలు ప్లాస్టిక్ కరెన్సీ విడుదల చేయడం మొదలుపెట్టాయి. ఈ జాబితాలోకి ఇప్పుడు పాకిస్తాన్ చేరనుంది. అయితే ఇండియాలో ప్లాస్టిక్ కరెన్సీ ఎప్పుడు మొదలవుతుందనే విషయం మీద ప్రస్తుతానికి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడి కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment