
'బడ్జెట్'.. ఈ పదం చాలాసార్లు వినిపిస్తూనే ఉంటుంది. నిజానికి దీనికి ఓ గొప్ప చరిత్రే ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అయితే కాలక్రమంలో వచ్చిన కొన్ని మార్పుల కారణంగా బడ్జెట్ సమర్పించే సమయంలో మార్పు వచ్చింది. ఇంగ్లీష్ భాషలో మాత్రమే ముద్రితమవుతున్న బడ్జెట్ హిందీలో ముద్రితమైంది. నిర్మలా సీతారామన్ పేపర్‌లెస్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు.
ఎప్పుడు చూసినా.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న బడ్జెట్, బడ్జెట్ అంటూ ఉంటారు. ఇంతకీ బడ్జెట్ అంటే ఏంటని కొందరికి సందేహం కలిగి ఉండొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే.. బడ్జెట్ అనేది ఆదాయాలు, వ్యయాలతో సహా ప్రభుత్వ ఆర్థిక స్థితికి సంబంధించిన వివరణాత్మక ప్రకటన. అయితే ఈ బడ్జెట్ మొదటిసారి ఎప్పుడు, ఎవరు ప్రవేశపెట్టారనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

ఇండియన్ కౌన్సిల్ ఫైనాన్స్ సభ్యుడు, ది ఎకనామిస్ట్ వార్తాపత్రిక స్థాపకుడు జేమ్స్ విల్సన్ 1860 ఏప్రిల్ 7న భారతదేశ మొదటి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఆ సమయంలో భారత్ బ్రిటిష్ పాలనలో ఉండేది. అప్పట్లో ప్రతిపాదించిన ఈ బడ్జెట్ 1857 సిపాయిల తిరుగుబాటు తరువాత బ్రిటిష్ పరిపాలన ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులకు ప్రతిస్పందన.

తిరుగుబాటు తరువాత దేశ ఆర్ధిక నిర్మాణాన్ని సంస్కరించడానికి, కొత్త పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టడానికి 'జేమ్స్ విల్సన్'ను క్వీన్ విక్టోరియా భారతదేశానికి పంపింది. అంతకంటే ముందు ఉన్న అధికారులు ప్రత్యక్ష పన్నులను ప్రవేశపెట్టాలని యోచించారు. కానీ దాన్ని ఎలా అమలు చేయాలనేది తెలియలేదని సబ్యసాచి భట్టాచార్య రచించిన 'ది ఫైనాన్షియల్ ఫౌండేషన్ ఆఫ్ ది బ్రిటీష్ రాజ్' అనే పుస్తకంలో పేర్కొన్నారు.

జేమ్స్ విల్సన్ భారతదేశానికి వచ్చిన తరువాత ఆ బిల్లును రద్దు చేసి.. ఇన్‌కమ్ ట్యాక్స్, లైసెన్స్ ట్యాక్స్ ప్రవేశపెట్టారు. అప్పట్లో వార్షిక ఆదాయం 200 రూపాయలకంటే తక్కువ ఉన్నవారు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తన మొదటి ఆర్ధిక ప్రకటనలో పేర్కొన్నారు. జేమ్స్ విల్సన్ కోల్‌కతాలో మొదటి బడ్జెట్‌ను సమర్పించిన తరువాత కొన్ని నెలలకే కన్నుమూశారు.

భారతదేశానికి స్వాతంత్యం వచ్చిన తరువాత 1947 నవంబర్ 26న మొదటి ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముఖం చెట్టి సమర్పించారు. ఆ తరువాత పి చిదంబరం, యశ్వంత్ సిన్హా, జస్వంత్ సింగ్, అరుణ్ జైట్లీ వంటి ఆర్థిక మంత్రులు బడ్జెట్‌ను సమర్పించారు. నిర్మలా సీతారామన్ 2019 నుంచి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మరోమారు నిర్మలా సీతారామన్ 2024-25 కేంద్ర బడ్జెట్‌ను జూలై 23న సమర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment